Monday, June 21, 2010

లంచావతారాలు





లంచమనెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే ఒప్పు
ఓ కూనలమ్మా!
అన్నారు శ్రీ ఆరుద్ర.

అప్పుడప్పుడూ మనం లంచావతారాలను వల వేసి పట్టుకున్నారని పేపర్లలో టీవీల్లో చదువుతుంటాము,చూస్తుంటాము. కళ్ళ ఎదుట నిత్యం అగుపించే దానికి ఇలా వల వేసి పట్టు కోవలసిన అవసరం వుందా అనిపిస్తుంది. లంచగాళ్ళపై ఎన్నో సినిమాలు దాదాపు అన్ని భాషల్లో వచ్చాయి. వాటికి విపరీతమైన ప్రజాదరణ లభించాయి. లంచం తీసుకొనే మహానుభావులు కూడా ఆ సినిమాలను కుటుంబ సమేతంగా చూసి ( సినిమా హాళ్ళలో ఉచితంగానే సుమా) హీరో లంచగొండి విలన్లను చితకబాదినప్పుడు చప్పట్లు కొట్టి కేరింతలు కొడతారు. ఐనా సినిమా అయిపోయాక ఏ మాత్రం మార్పు వస్తుందా? రానే రాదు. మరునాడు షరా మామూలే. మామ్మూల్లు మాములే! మరో విషయం మనం మన పిల్లలకు ఉగ్గుపాలతోనే ఈ లంచాలను నేర్పుతున్నామేమో అనిపిస్తుంటుంది.నువ్వు ఆ పని చేసి పెడితే నీకో బొమ్మ లెకపోతే ఓ చాక్లెట్ కొనిపెడతా అనో మరోటొ ఆశ చూపిస్తాం. ఇంట్లో పనికి సాయం చేయడం ఓ భాధ్యత అని ఎంతమంది తల్లితండ్రులు గుర్తిస్తున్నారు.ఓ సంఘటన ఈ సంధర్భంలోమీతో పంచుకుంటున్నాను. మా మితృడి షాపుకు వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి వచ్చి" మీరు ఠాగూర్ సినిమా చూసారా? చాలా బాగా తీసాడు కదండీ " అంటూమాట్లాడటం మొదలెట్టాడు. వెంటనే నా స్నేహితుడు కౌంటర్ నుంచి ఓ ఐదు వందల నోటు తీసి అతని
చేతిలో పెట్టాడు. ఎలా వచ్చాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు."ఇదేమిటి అలా డబ్బు ఇచ్చావు " అని
ఆశ్చర్యంగా నే నడిగితే "అదంతే, అతనో ఉద్యోగి. నెలనెలా షాపులకు వెళ్లి మామూళ్ళు కలెక్ట్ చేసుకుంటాడు"
అని జవాబివ్వగానే "ఔరా!"అని నే నోరెళ్ళబెట్టా.

No comments:

Post a Comment