Wednesday, December 19, 2012

తెలుగు తల్లికి వందనం !!

                 ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు మాట వినిపిస్తున్నది. కారణం మన ప్రభుత్వం
తెలుగు మహా సభలు నిర్వహించడానికి నిర్ణయించడమే. ఓ నాడు తెలుగు అంటూ
ఆనాటి యన్టీఆర్ తెలుగును ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రవేశ పెడుతుంటే ఈనాటి
నాయకులు కొందరు తెలుగు తెగులంటూ వేళాకోళం చేస్తే మనమూ నవ్వుకున్నాం
అవును నవ్వమా ,మనం తెలుగోళ్ళం కదా !!
        గోదారి జలాలలో
        ఆ తీయదనమేమి ?
        నన్నయ గంటమ్ము కడిగెనాడేమో !
        పినాకిని పదచాలనములో
        ఆ విలాసమేమి ?
        తిక్కన భారత విన్యాసమేమో !
        కృష్ణా తరంగాలలో
        ఆ సంగీతమేమి ?
        ఎర్రన పద్యాల ఆలాపనేమో !
        పోతన పదాలలో
        ఆ మాధుర్యమేమి ?
        అక్షరాలకమృతము అద్దినాడేమో !!
ఇంతటి తెలుగు అమ్మంటే మనకు నామోషీ
మమ్మీ అంటూ పిలిస్తే ఎంతో ఖుషీ ఖుషీ !!

        బ్రిటిష్ దేశస్తుడైన బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకొని, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
తయారు చేశాడనీ, మన వేమన పద్యాలను  తన భాషలోకి అనువాదం చేశాడని ఎంత
మంది ఈకాలం పిల్లలకు తెలుసు. వాళ్ళకు తెలియడానికి వాళ్ళ తల్లిదండ్రులకు
తెలిస్తేగదా !బ్రౌనంటే ఎవరంటే అదో రంగు అని ఈ మద్యే కాన్వేంటులో తన పిల్లల్ని
చదివిస్తున్న ఓ పెద్దమనిషి. జవాబిచ్చాడు.
     తెలుగు భాషలో వున్న అందం, మాధుర్యం మరో భాషకు లేదనే చెప్పాలి. తెలుగుతో
ఎన్నెన్నో చమత్కారాలను సృష్టించవచ్చు. ఒకే మాటకు వేరు వేరు సంధర్భాలలో
వేరు వేరు అర్ధాలు వస్తాయి. దీనితో ఎంత హాస్యానైనా పుట్టించవచ్చు. ఆనాటి తెలుగు
సినిమాలలో నటినటుల ఉచ్చారణ, రచయితలు వ్రాసిన మాటలు తెలుగు భాష
అందాన్నిచాటి చెప్పాయి. అక్కినేని అంటారు, చదువురాని నేను అంత చక్కగా మాటలు
చెప్పానంటే ఆనాటి దర్శకులు, కవులూ అని. ఈనాటి దర్శకులకు తెలిస్తేకదా నటులకు
చెప్పడానికి.

        ఇప్పుడు పొరబాటున తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళుకూడా గమ్మత్తు తెలుగు
మాట్లాడుతున్నారు. మీరు గమనించివుంటారు. ప్రతి రెండు పదాలకూ అండ్, అండ్
అంటుంటారు. దేనికో, బహుశ: అదో ఫ్యాషన్ కాబోలు. మాటలు రాని వాడెవడో
తడబడుతూ మాట్లాడితే అదే సరైనదనుకుంటుంన్నారు. ఇక మన ప్రభుత్వం
తెలుగును ఎంత ఖూనీ చేస్తున్నదో అన్న దానికి నిదర్శనం ఇటీవల ప్రత్యక్ష
మవుతున్న ప్లాస్టిక్ బోర్డులు. అవి కూడా తయారు చేయించింది ప్రభుత్వ విద్యా
శాఖ !! ఉదాహరణకు కొన్ని :-
    విద్వామా హక్కు,  సర్వశిక్షాఅభియాన్,  అంధ్రప్రదేశ్ !!
 దయచేసి తెలుగు మీ పిల్లలకి నేర్పండి. మీరూ తెలుగు పుస్తకాలు తీసు "కొని"
చదవండి. మీ పిల్లలకి తెలుగు పుస్తకాలు కానుకగా ఇవ్వటం అలవాటు చేసు
కోండి. ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు వ్రాసిన తెలుగు పర్యాయపద నిఘంటువును
ఒకసారి చూడండి. తెలుగులో ఎన్నెని పర్యాయపదాలున్నాయో తెలుస్తుంది.

3 comments:

  1. chaalaa baagaa cheppAru guruvu gaarU

    ReplyDelete
  2. పిల్లలు తెలుగులో మాట్లాడడమే పెద్ద అవమానంలాగ భావిస్తున్నరు తల్లితండ్రులు ఈ రోజుల్లో..:((
    చాలా బాగా రాసారండి..:)

    ReplyDelete
  3. కన్నాజీ రావు గారికి, ధాత్రిగారికి ధన్యవాదాలు

    ReplyDelete