Tuesday, November 10, 2009

అలనాటి ఆంధృల అభిమాన దిన పత్రిక ఆంధ్రపత్రిక




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

Monday, November 09, 2009

గోదావరి తల్లికి అందాల ఆభరణాలు



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

Wednesday, November 04, 2009

గ్రీటింగ్ కార్డుల కధ





ఈనాడు ఆ మైల్ పోయి ఈ మైల్ వచ్చాక ఒకరికి ఒకరు ఉత్తరాల ద్వారా పలుకరించుకోవడం తగ్గిపోయింది.ఇక బజారుకు వెళ్ళి మనకు నచ్చిన గ్రీటింగు కార్డులు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపిక,తీరిక ఉండటంలేదు.నెట్ నుంచి 123 అన్నంత తేలికగా 123 గ్రీటింగ్స్ రకరకాలు మితృలకి ,ఆప్తులకి క్క్షణాల్లో పమ్పిస్తున్నాము.ఐనా మొట్టమొదటి గ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకోడం,జ్ఞాపకం చేసుకుందాం! 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!విలియం తయారుచేసిన కార్డు పై భాగాన టు ... అని,అడుగున ఫ్రం...అని అచ్చువేసి పంపే వాళ్ళు పేర్లు వ్రాసుకో వడానికి వీలుగా వుండేదట.మొదటి అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడు.1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సం" వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు తరువాత పుట్టిన రోజులు మొ'' వాటికి కూడా జేర్చటం మొదలయింది.1920 అతి చిన్న కార్డు వడ్ల గింజ పై 22 మాటలతో వ్ర్రాసిన క్రిస్మస్ కార్డు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి బహుకరించారట!


ఇకనుండైనా కొందరు ఆప్త మితృలకయినా గ్రీటింగ్ కార్డులు కొనైనా లేకపోతే తయారు చేసైనా పంపిస్తారు కదూ!

Monday, November 02, 2009

ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లోని అపురూప చిత్రాలు (1950)



ఫిల్మ్ ఫేర్,ఫెమినా లాంటి పత్రికలను ఎన్నో ఏళ్ళుగా ప్రచురిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రఛురణల సంస్ద బెనెట్ కోల్మన్ కంపెనీ ఇది వరలో ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వార పత్రికను ప్రచురించేది. ఎందుకోగాని ఆ పత్రిక ప్రఛురణ చాలా ఏళ్ళ క్రితం నుంచి మాని వేసింది.ఆ పత్రికలో గొప్ప భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్,శిల్పాలు,ఫొటోలు ప్రఛురించేవారు.మా నాన్న గారు ఆ పత్రికలోని అపురూప చిత్రాలను జాగ్రత్త చేసి ఆల్బమ్ గా తయారు చేసారు.అందులోని కొన్ని బొమ్మలు మీ ముందు వుంచుతున్నాను.ఇందులో ఒక బొమ్మలో చిత్రకారుడు కవి స్త్రీ ని వర్ణించే తీరులో వుంటే ఆమె రూపం ఎలా ఉంటుందో చమత్కారం గా చూపించటం మీరు గమనించ గలరు

Sunday, November 01, 2009

అపురూపకథ - తిట్టు మాటలు



అలనాటి చందమామ లోని అపురూప కధ తిట్టు మాటలు




గాడిద,ఎద్దు,దున్నపోతు కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి "దేవా! మానవులు మా చేత ఎంతో చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ తోటి మనుషులను,"అడ్డగాడిదా అని,ఎద్దులాగున్నావు, బుద్ది లేదా అని, ఒరే దున్నపోతా!! అని మా పేర్ల తో తిడుతుంటే మాకు చాలా బాధ కలుగుతున్నది.మీరు ఆ మానవులకు చెప్పి తిట్లలో మా ప్రస్తావన లేకుండా చూడండి" అని మొరపెట్టుకున్నాయి.


అప్పుడు బ్రహ్మ దేవుడు" మీ నడవిడిని బట్టి మానవులు అలా అంటున్నారు. ముందు మీ నడవడి మార్చుకొని నా దగ్గరకు రండి. అప్పుడు చూద్దాము" అన్నాడు.అప్పుడు గాడిద "ఈ దున్నపోతు దగ్గరకు రావటం నే చేసిన తప్పు"అంది. తరువాత ఎద్దు "ఈ అడ్డగాడిద దగ్గరకు వచ్చి పొరపాటు చేసా" అంది. చివరకు దున్నపోతు"ఈ ఎద్దుగాడు మానవ పక్షపాతి వీడి దగ్గరకు వచ్చి చాలా తప్పు చేశాం"అంది.


అలనాటి చందమామ లోని ఈ ఛిన్న కధ ఎలావుంది?

Wednesday, October 28, 2009

బొమ్మల కొలువు




ఇప్పుడు బొమ్మల కొలువులు పెట్టే సాంప్రదాయం తగ్గుతున్నది. ఏమంటే ఈ రోజుల్లో లివింగ్ రూముల్లో ఓ అద్దాల కాబినెట్ కట్టించి అందులో ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ పాపం వాటిని ఊపిరాడకుండా ఉంచేస్తున్నాము.ఐనా ఇప్పటికి విజయదశమికి సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే అలవాటును కొంతమందైనా పాటిస్తున్నారు. తమిళనాడు లో బ్యాంకుల్లొ కూడా ఈ కొలువులు ఏర్పాటు చేస్తున్నారు.


మా రాజమండ్రి లో శ్రీమతి అంబరుఖానా నాగలక్ష్మి,వారి అమ్మాయి శివ దీపిక ప్రతి సంక్రాంతికి పెట్టే కొలువుకు పేరంటాళ్ళే కాదు,వివిధ టీవీ ఛానళ్ళ వారు,ప్రింట్ మీడియా వాళ్ళు తప్పక వస్తారు. క్రిందటి ఏడాది కొలువు విశేషాలను ఆంధ్రజ్యోతి ఆదివారం మాగజైన్లో వేశారు కూడా.సన్ టివి కూడా చూపించడం విశేషం!


ఇప్పటికి లక్షల రూపాయలు శ్రీమతి నాగలక్ష్మి ఖర్చు చేయింఛారు వారి శ్రీ వారు ఏజియం.గాంధి చేత. ఆ బొమ్మల కొలువు మీకూ చూపించాలనిపించింది.ఛూశాక మీకూ ఈ సారి తప్పక బొమ్మల కొలువు పెట్టాలనిపిస్తుంది!

Tuesday, October 27, 2009

పుస్తకాలే మంచి నేస్తాలు



నేను నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను,అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లొ దొరుకుతాయి కాబట్టి, అలానే నా పాత పుస్తకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వను! ఏమంటే అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి అనే నా మాటలు ఛాలా మంది మిత్రులకు కోపంతెప్పిచ్చాయి! అయినా నేను నా మాటకే కట్టుబడి ఉంటున్నాను . అదే మాట పుస్తకప్రియులందరు పాటించాలని నా కోరిక




నేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన ఏడాది) సంపాదించాను. ఒక బ్యాంకు మితృడు మా ఇంట్లో అది చూసి చదివి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు సరికదా నే పేపర్ కోసం అడిగినప్పుడల్లా "ఏమిటి?తాతల్నాటి పేపర్ కోసం గొడవ చేస్తున్నావు, నిన్నటి పేపర్కు ఈ రోజు విలువ లేదు.పాత పేపర్లతో బాటు మా వాళ్ళు అమ్మేసారు, సారీ" అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికి నా పుస్తకం కానీ పత్రికలు కానీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పంటారా?




నా దగ్గర 1914 "ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ ", 1928లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ సెక్స్ ,ఆంధ్రగ్రంధమాల (ఆంధ్రపత్రిక,1951) కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో తెలుగు సూరంపూడి సీతారాం అనువాదం, 1953 నుంచి చందమామలు, 1955 లో వెలువడిన విచిత్రకవలలు సీరియల్ నవల,బాపురమణ గార్ల పుస్తకాలు, ఆర్కేలక్ష్మన్, బాపు, జయదేవ్, ఈనాడు శ్రీధర్, సరసి, రాగతిపండరి కార్టూన్ పుస్తకాలు, 1944 రీడర్స్ డైజస్ట్ (మా నాన్నగారు మొదటి సారికొన్న ఆయన అభిమాన పత్రిక) 1954 ఆంధ్ర వార పత్రిక (దసరా పిల్లల ప్రత్యేక సంచిక,ఇందులో మా చెల్లి కస్తూరి వేసిన "నేను మా సంగీతం మేస్టారు" బొమ్మకు బహుమతి వచ్చింది),బుక్ ఆఫ్ నాలెడ్జ్ పుస్తకాలు ఎన్నో వున్నాయి.



ఎరువువెళ్ళిన పుస్తకం తమాషా: ... అమెరికాలో లొరెజొ బురోస్ 1849లో పార్లమెంట్ సభ్యుడుగా వుండగా ఒక పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకొన్నాడట! ఆయన వారసులు 140 ఏళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని జాగ్రత్త గా లైబ్రరీ కి చేర్చారట! ఎంత మంచి వాళ్ళో!!