Tuesday, November 10, 2009

అలనాటి ఆంధృల అభిమాన దిన పత్రిక ఆంధ్రపత్రిక




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

2 comments:

  1. మా నాన్నగారు, ఆంధ్రపత్రిక మూతపడే వరకు, అందులోనే పనిచేసేవారు.

    ReplyDelete
  2. కడు యాసక్తికర విషయములు చెప్పితిరి. నెనర్లు. మిక్కిలి సంతసము గలిగినది (ఆంధ్ర పత్రిక స్టైల్ లో)

    ReplyDelete