Sunday, September 12, 2010

గుర్తు కొస్తున్నాయి



ఈనాడు ఆదివారం! అతిరధమహారధులు సారధ్యం
వహించిన అలనాటి 1963 "జ్యోతి" లో వెలిగిన
జ్యోకులను ( జ్యోతి జోకులను జ్యోకులని అనటమే
సమంజసం) మరో సారి గుర్తుచేసుకొదాం! హాయిగా
నవ్వేసుకొందాం!రెడీనా!!
* * * * * * *
ఆంధ్ర రాజధానిని చూడ్డానికి వెళ్ళిన ఓ పల్లెటూరి
ఆసామీ ఒక పెద్ద హోటలుకి వెళ్ళాడు. హోటల్
మేనేజర్ గది అద్దె వివరాలు అన్నీ చెప్పి"ఉదయం
ఐదునుంచి పదకొండు వరకు కాఫీ టిఫిన్లు, పద
కొండునుంచి రెండు గంటలవరకు భోజనం, మళ్ళీ
రెండు నుంచి ఆరు గంటలవరకు కాఫీ టిఫిన్లు,రాత్రి
పదిన్నరవరకు భోజనం సప్లయి చేస్తాము" అని
చెప్పాడు.
"ఇలా ఐతే ఊరు చూడ్డమెప్పుడూ ?" అని ఆ పల్లె
టూరాయన బైటకి వచ్చేశాడు.

* * * * * * * *

మొగాళ్లతో సమానంగా జీతాలు కావాలని ఆడ
వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తారో అర్ధం కావడం
లేదు. మగవాడి జీతమంతా కావాలంటే పెళ్ళి చేసు
కుంటే సరిపోదూ ?

**************
నలుగురు స్నేహితులు కూర్చుని పేకాట ఆడుతుండగా
ఒకడు "ఇహ నే నింటికి పోవాలి" అంటూ లేచాడు.
"కూచోవోయ్,వెడుదువుగానిలే" అన్నాడు ఒక స్నేహితుడు.
"అదికాదు, మొన్న రాత్రి నిన్నపొద్దున్న ఇంటికి వెళ్ళాను.
నిన్న రాత్రి ఇవ్వాళ పొద్దున్న వెళ్ళాను. ఇహ ఇవ్వాళరాత్రి కూడా
రేప్పొద్దున వెడితే మా ఆవిడ పుట్టింటికి పోతానని వార్నింగిచ్చింది."

* * * * * * * *
ఒకడు: "సాధారణంగా మా కంపెనీలో పెళ్లయిన వాళ్లనే
గుమాస్తాలుగా వేసుకుంటారు."
మరొకడు: " ఏం, ఎందుకని?"
మొదటివాడు: "పెళ్ళయిన వాళ్ళయితే ఎంత తిట్టినా
అలవాటుకోద్దీ దులిపేసుకు పోతారు"

* * * * * * *

ఒక డాక్టరు: ఇంకానయం. టైముకి ఆపరేషను చేశాను,
లేకపోతే రోగి తనంతట తనే కోలుకొనే వాడు"
**************
ఇక్కడి కార్టూన్ శ్రీ బాపు గారు "రేఖ" కలం పేరుతో వేసింది.
ఆయన ఆ పేరుతో కూడా బొమ్మలు వేసేవారు. ఆ పేరుకు
"సు" అక్షరం చేర్చి నేను "సురేఖ" అన్న కలం పేరు పెట్టు
కున్నాను. "జ్యొతి"పత్రికకు, బాపుగారి రేఖ కు ధన్యవాదాలతో...

Saturday, September 11, 2010

శివ శివ మూర్తివి గణనాధ !



ఈ పాట మీకు గుర్తుందా ! వాహినీ వారి "పెద్దమనుషులు"
చిత్రంలో రేలంగి పాడిన ఈ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్.
వినాయకచవితి పండుగ పిల్లలకు పెద్దలకు ఇష్టమైన
వేడుక. హైదరాబాదుతో బాటు పెద్ద పెద్ద ఊర్ల దగ్గరనుంచి
చిన్న గ్రామాల దాకా గణపతి నవరాత్రులు పెద్ద ఎత్తున
జరుపుతున్నారు. పెద్ద ఎత్తునంటే నిజంగానే అతి పెద్దఎత్తు
వినాయక విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఖైరతాబాదు
వినాయకుడు భారీగా దర్శనమిస్తాడు. మా తూర్పు
గోదావరిజిల్లా తాపేశ్వరం "సురుచి ఫుడ్స్" వారు 500 కేజీల
లడ్డూను ప్రత్యేకంగా తయారు చేసి ఖైరతాబాదు గణపతికి
ఈరోజే సమర్పిస్తున్నారు.
వినాయకుని పూజలో వాడే వివిధ పత్రాలు ఔషధ
గుణాలు కలిగి వున్నాయి. మాచి పత్రి, బృహతీపత్రం,బిల్వ
పత్రం,దూర్వాయుగ్మం (గరిక),దత్తూర పత్రం,బదరీ పత్రం,
అపామార్గ పత్రం,తులసీ పత్రం, చూతపత్రం,కరవీర పత్రం,
విష్ణుక్రాంత పత్రం,దాడిమీ పత్రం,దేవదారు పత్రం,సింధువార
పత్రం,జాజి పత్రం,గండకీ పత్రం, శమీ పత్రం,అశ్వద్ధపత్రం,
అర్జున పత్రం,అర్క పత్రం ఇలా ఈ పత్రాలన్నీ భాద్రపద మాసం
లో ఎక్కువగా దొరుకుతాయి.ఈ ఆకుల్ని కోసి మూలికా
వైద్యంలో వాడుతారు. అదే ఈ పత్రం పూజయామికి
మూలకారణం గా మన పెద్దలు ఏర్పరిచారు..
వినాయకుడి మీద మా కార్టూనిస్టులు చాలా బొమ్మలు
గీశారు. ఆంధ్ర వార పత్రిక వినాయకచవితికిప్రత్యేక హాస్య
సంచికను విడుదల చేసేది. శ్రీ బాపు స్వాతి పత్రికలో చాలా
కాలం క్రితం గీసిన గణేశుని కార్టూను చూస్తున్నారుగా!
చిన్నారి గణపతితో అమ్మ పార్వతి," పొద్దోయింది,బువ్వ
తిని బజ్జుందిగాని-దామ్మా, పొద్దున్నాడుకుందూగానీ...."
అని అంటే గణపయ్య " పొద్దున్న వీడుండమ్మా" అంటున్నాడు
చందమామ కు తాడు గట్టి ఉయ్యాల ఊగుతూ!. ముస్లిమ్
సోదరుల రంజాన్ పండుగ కూడా వినాయక చవితినాడే
వచ్చింది కనుక చంద్రుడు కూడా రంజాన్ నెలవంక గా
వుండటం కాకతాలీయం! ఆహా! బాపు గారు ముందు చూపుతో
ఎప్పుడో ఆ కార్టూన్ అలా వేశారేమో అనిపిస్తుంది. పార్వతీ
దేవి స్నానం చేస్తూ కాపలాగా పసుపు ముద్దతో ఓబాలుడిని
తయారుచేసి ప్రాణం పోసిందని పురాణాల్లో వుంది.ఇక్కడ మీరు
చూస్తున్న ఫొటో Camilla Allen అనే ఆమె మట్టితో నిజం
పాపాయా అన్నట్లు బొమ్మలు సృస్ఠించింది.మానవులే తయారు
చేసినప్పుడు పార్వతీదేవి చేయడంలో ఆశ్చర్యమేంలేదు కదా!
అందరికీ వినాయక చవితి, రంజాను శుభాకాంక్షలు !!

Friday, September 10, 2010

ఇడిగిడిగో బుడుగు-మళ్ళీ నేనేరోయ్ !!





ఇడిగిడిగో బుడుగు-మళ్ళీ నేనేరోయ్ !!

1956లో ఆంధ్ర వార పత్రికలో మూళ్లఫూడి వెంకట రమణ
గారు , బాపు గారి బొమ్మలతో వ్రాసిన "బుడుగు చిచ్చుల
పిడుగు" ఆబాల గోపాలాన్నీ అలరించింది.ఈ నాటికీ తన
అల్లరితో అలరిస్తూనే ఉన్నాడు ఆ చిన్నారి బుడుగు. 1966
లో ఆంధ్రపత్రిక దినపత్రికలో శ్రీ బాపు "బుడుగు" పేరుతో
ప్రతి రోజూ కార్టూన్ స్ట్రిప్ వేసేవారు. ఈ తరం పాఠకుల కొసం
బాపు అభిమాని గంధందుర్గా ప్రసాద్ ఆ బుడుగు స్ట్రిప్
కార్టూన్లనుఏర్చి కూర్చి" బాపు ఇడిగిడిగో బుడుగు కార్టున్లు"
పేరిట ఓ పుస్తకాన్ని అందంగా అచ్చొత్తించారు.ఇందులో బాపు,
బుడుగు స్నేహితులు దీక్షితులు, సీగానపెసూనాంబ,పాపాయి,
అమ్మ రాధ, నాన్న గోపాలం అందరూ మనల్ని పలకరిస్తారు.
ఆనాటి రాజకీయాలకు (నేటికీ కొన్ని వర్తిస్తాయి) బుడుగు
ద్వారా చురుక్కులు బాపు అందంగా అందజేసారు.
సీగానపెసునాంబ ఓ ఫొటొ తాతకు చూపించి ఇదెవరని
అడిగితే , తాత, అది చిన్నప్పుడు నేనే అంటే మరిప్పుడెవరూ?
అని అడుగుతుంది. మరో బొమ్మలో సీగానపెసూనాంబ,
బుడుగు ఫ్రెండ్ దీక్షితుల్ని ఎందుకు ఏడుస్తున్నావురా అంటే
మా నాన్న నూతి దగ్గర జారి పడ్డాడు అంటే నీది ఎంత సున్నిత
హృదయంరా అని మెచ్చుకుంటే దీక్షితులు సున్నితంలేదూ-
సున్నిపిండీ లేదు-నేను నవ్వినందుకే నాన్నకి కోపం వచ్చి
కొట్టాడు అంటాడు. ఇక మరో బొమ్మలో దీక్షితులు బుడుగు
దగ్గరకు వచ్చి ఏరా నీకు ఉల్లిపాయల పకోడీలు ఇష్టమేనా
అని అడిగి, బుడుగు సయించవు అంటే , అయితే ఈ ఉల్లిపాయ
పకోడీ పొట్లం కాస్త పట్టుకుంటావూ-లాగు సరిగ్గా కట్టుకోవాలి
అంటాడు. ఇలా 154 పేజీల్లో పేజీకి రెండు కార్టూన్ స్ట్రిప్పుల
చొప్పున నవ్విస్తాయి. బుడుగు కు తోడుగా బాపు రమణలు
తయారు చేసిన విడియో పాఠాల బొమ్మలు పిల్లల్ని అలరిస్తాయి.
వాళ్లకు తెలుగు అక్షరాలు నేర్పడానికి చాలా బాగుంటాయి.
విశాలాంధ్ర వారి అన్నీ బ్రాంచీలలో ఈ పుస్తకం దొరుకుతుంది.
ఇంత మంచి కలెక్షన్ అందించిన శ్రీ గంధం దుర్గాప్రసాదును
అభినందించాలి.


Thursday, September 09, 2010

పుస్తకాల కబుర్లు


పుస్తకాల కబుర్లు

మనకు ఎన్నెన్నో పండుగలున్నాయి. అలానే
పుస్తకాలకు పండుగలు జరుగుతాయి.ముఖ్యం
గా విజయవాడలో కొత్త సంవత్సరం మొదటి
తారీఖు వచ్చిందంటే పుస్తక ప్రియులకు సంక్రాంతి
కంటే పెద్ద పండుగ వస్తుంది. జనవరి ఒకటో తేదీ
నుంచి పదకుండో తేదీ వరకు విజయవాడ బుక్
ఎగ్జిబిషన్ సొసైటీ పుస్తకాల పండుగను ఏర్పాటు
చేస్తుంది. పుస్తకాలు అమ్ముకొని లాభాలను పంచు
కోవాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజల్లో పఠనాశక్తిని
పెంచాల్నే సదుద్దేశంతో పుస్తక ప్రచురణకర్తలు,
ప్రింటింగ్ విభాగం వారు కలసి 1989లో సొసైటీగా
అవతరించి ఈ నాడు దాదాపు 280 స్టాల్లకు పైగా
ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. పెంగ్విన్,టాటా
మెక్ గ్రావెల్, పియర్సన్,టైలర్ అండ్ ఫ్రాన్సిస్ వంటి
అంతర్జాతీయ సంస్దలూ పాల్గొంటున్నాయి. పుస్తకాలను
అమ్మటమే కాదు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం,
కొత్త పుస్తకాలను విడుదలచేయటం లాటి కార్యక్రమాలు
జరుగుతాయి.
చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం
కొనటం మానుకోకు అన్న సూక్తి విన్నారుగా. పుస్తకాల
గురించి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు తమ
గిరీశం లెక్చర్లలో గిరీశం చేత ఇలా అనిపిస్తారు. "వ్వాట్ !
బయింగ్ బుక్స్ ! మై గాడ్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్......
పిల్లనమ్ముకోడం కన్నా నికృష్టం. దిస్ మై డియర్
షేక్సిపియర్,ఈజ్ బార్బేరియస్.....పుస్తకాలు కొండమా?
డబ్బు పెట్టా? నువ్వు స్టోన్ ఏజ్ మానవుడిలా ఉన్నా
వోయ్! ఇది ఆంధ్రదేశమనిన్నీ, నువ్వు టెలుగూస్ జాతి
వాడివనిన్నీ, ఇది ఫలానా యుగవనిన్నీ మర్చిపోయావా?
............" మన తెలుగువాళ్ళకు పుస్తకాలు కొని చదవడం
అలవాటులేదని, మరి కొందరికి తీసు"కొని" చదవటమే
అలవాటని సరదాగా చెప్పారు. చివరగా ముళ్ళపూడి
"పాఠకులు నా మాటలు నాకు అప్పగించేరు సుమా.
నా పుస్తకాలు మట్టుకు తప్పక కొనండి.అన్ని శాస్త్ర
నియమా లకూ అపవాదులంటూ ఉంటాయి కదూ మరి!"
అంటారు. పుస్తకాలు నిజమైన నేస్తాలు. ఒంటరిగా వున్న
ప్పుడు కాలాన్ని ఇట్టె గడిచిపోయేటట్లు చేస్తాయి.
వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ఎన్నో ఏళ్ళ
నుంచి అధ్యాత్మిక పుస్తకాలను ,మద్రాసు నుంచి ప్రచు
రిస్తున్నది. ఆ సంస్ద ప్రచురించిన 1923 నాటి శ్రీ లలితా
సహస్ర నామ స్తోత్రమ్ 87 ఏళ్ళ పుస్తకం నా దగ్గరవుంది.
ఆ పుస్తకం ఆఖరి పేజీల్లో వారి ప్రచురణల వివరాలు
వాటి ధరలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఉదాహరణకు
బాలరామాయణము, సటీక ప్రతి 1-కి 0-3-0
అధ్యాత్మక రామాయణము 1-4-0
సుందరకాండము ఆంధ్ర తాత్పరిత
సహితము 2-0-0
శ్రీ మద్రామాయణము మూలము 6-0-0
అప్పటి రోజుల్లో (1923) ఆరు రూపాయలంటే చాలా
ఖరీదన్నమాట.! రాజమండ్రిలో కొండపల్లి వీరవెంకయ్య
అండ్ సన్సు వారు భమిడిపాటి రచనలు , వివిధ సాహిత్య
పుస్తకాలను ప్రచురించే వారు. అలానే సరస్వతీ పవర్ ప్రెస్
వారు కూడా శ్రిపాద సుబ్ర హ్మణ్య శాస్త్రి గారి పుస్తకాలను
ప్రచురించేవారు, కవికొండల వెంకట్రావు గారి రచనలను
కూడా పై సంస్ధల ద్వారా ప్రచురించబడ్డాయి. ఇప్పుడు
రాజమండ్రిలో ఆ పుస్తక ప్రచురణ సంస్ధలు లేవు. సాహిత్య
కేంద్రంగా పేరుబడ్ద ఈ నగరంలో కొత్తగా విడుదలయిన
పుస్తకం కావాలంటే లోకల్ పుస్తకాల షాపు వాళ్ళకు చెప్పి
తెప్పించుకోవలసిందే. ఇక్కడ ఇప్పుడు దొరికే పుస్తకాలన్నీ
ఎక్కువ భక్తికి సంభందించినవే వుంటుంటాయి.
టీవీ ప్రాచుర్యం పెరిగినా పుస్తక ప్రచురుణ, పాఠకులు
తగ్గక పోవటం సంతోషించవలసిన పరిణామమే. ఈ ఆధునిక
యుగంలో ఆ-పుస్తకాలు రాను రాను తగ్గి ఈ-పుస్తకాలు
రావటం ప్రారంభమయింది. ఇక్కడ మీరు ఫొటొలో చూస్తున్న
BOOK OF KNOWLEDGE ఎనిమిది వాల్యూముల
పుస్తకాలు 1963 లో నేను శ్రికాకుళం SBI లో క్యాష్యర్ గా
చేరినప్పుడు కొన్నవి. ఖరీదు 425/-రూపాయలు. మొదటి
సారి STANDARD LITARATURE Co.CALACUTTA
ప్రతినిధికి రూ.15/- కట్టి తరువాత 28 నెలసరి వాయిదాలు
రూ.15/- నా సాలరీలొ డిడక్ట్ అయ్యెది. అప్పుడు నా జీతం
Rs.125/-!!
పుస్తకాలమీద ఓ జోకు!
మీ ఇంట్లో ఇన్ని పుస్తకాలున్నాయి కదా? మీకు ఏ పుస్తకం
అంటే ఇష్టం?
మా ఆయన చెక్కు పుస్తకం !!
************
పుస్తకాల పై నా కవిత ! అదేంటి ! అలా పారిపోతున్నారు!
ఆగండి ! మీరు వినాల్సిందే! నేనూరుకోను!! ఆ మీరు మంచి
వారు, చదువుతారు!!
కొందరు ప్రేమిస్తారు మొక్కలను!
మరి కొందరికి పెంచడం ఇష్టం కుక్కలను!!
నేను మాత్రం అమితంగా ప్రేమిస్తా బుక్కులను!!!
కదలకుండా కూర్చొని చూసే టెలివిజన్
కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది "తెలివి"జన్ !!!

Wednesday, September 08, 2010

రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ శత జయంతి


గోపీచంద్ (08-09-1910 : 02-11-1962)
మరణించాక కూడా చిరకాలం పాఠకులహృదయాల్లో చిరంజీవిగా
వుండే అదృష్టం రచయితలదే. అలాటి అదృష్టవంతుడు త్రిపురనేని
గోపీచంద్. చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన "ఆంధ్రజ్యొతి" మాస
పత్రిక,అటుతరువాత"యువ"లోను ఆయన వ్రాసిన "పనిలేని మంగలి" శీర్షికలో
వ్రాసిన రచనలు పాఠకుల విశేష ఆదరణ పొందాయి. గోపీచంద్
కధకునిగా, నవలా రచయితగా , సినీ దర్శకునిగా ఇలా అన్నిరంగాల్లోను
ప్రతిభను చాటారు." అసమర్ధుని జీవనయాత్ర", "పోస్టు చేయని ఉత్తరాలు",
"యమపాశం"," పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా" మొదలైన ప్రశిద్ధ
రచనలు ఆయన కలంనుంచి వెలువడిన ఆణిముత్యాలు. గోపీచంద్
శతజయంతి సంధర్భంగా "రచన" సెప్టెంబరు సంచికను విశేషసంచికగా
విడుదల చేశారు..ఈ సంచికలో శ్రీ గోపీచంద్ రచనలు కొన్నిటిని
" ఇలాజరిగేను", "చిత్తజల్లు" (పోస్ట్ చెయ్యని ఉత్తరాలు)," గోడమీది
మూడోవాడు","గల్పికలు", "ధర్మవడ్డీ"",ప్రఖ్యాతుని భార్య",""జనానా" చదివే
సదావకాశం అభిమానులకు ఈ "రచన" ద్వారా కలుగుతుంది.
గోపీచంద్ గురించి మహాకవి విశ్వనాధ సత్యనారాయణ గారు
ఇలా అన్నారు :
ఒక మర్యాదను కలిగిన కులమున పుట్టుటయె గొప్ప గోపీచంద్
ఒక మంచి వంశమందున జనియించుట మరియు గొప్ప గోపీచంద్
ఒక గొప్ప తండ్రి కడుపున పుట్టుట యింకొక్క గొప్ప గోపీచంద్
ఒక గొప్ప చదువు చదువుట మరియు నదృష్టమ్ము నువ్వె గోపీచంద్.
గోపీచంద్ గారి శతజయంతి సంధర్భంగా ఆయన సమగ్ర సాహిత్యాన్ని
"అలకనంద ప్రచురణ" సంస్ధ వారు "గోపీచంద్ సినీ రచనలు"
( రైతు బిడ్డ, గృహప్రవేశం, లక్షమ్మ) 400 పేజీల పుస్తకాన్ని,వెల.రూ.250/=
ప్రచురిస్తున్నారు. శతజయంతి ముగింపోత్సవాల నాడు (8-9-2010)
రవీంద్రభారతి ప్రాంగణం లోదొరుకుతాయి.

Tuesday, September 07, 2010

బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ



తెలుగు తారలలో చిరంజీవి శ్రిమతి పాలువాయి భానుమతీ
రామకృష్ణ. మొట్టమొదటి సారిగా వెండితెర పై భానుమతి
1939 లో కాళీంది పాత్రలో "వరవిక్రయం" చిత్రంతో అడుగు
పెట్టారు. బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ
దంపతులకు చిన్నారి భానుమతి 7 సెప్టెంబరు,1925 న
జన్మించారు.తన సినిమారంగ ప్రవేశం గురించి భానుమతి
ఇలా చెప్పేవారు." అప్పట్లో నాటకాలన్నా, సినిమాలన్నా
తక్కువగా చూసేవారు.పెళ్ళికాని పిల్లని సినిమాల్లోకి పంపటం
ఎలాగా అని మా నాన్నగారు మధనపడుతున్న సమయంలో
మైనంపాటి నరసింహారావుగారు, అంటే టంగుటూరి సూర్య
కుమారికి మేనమామ వరుసవుతారు, ఆయన "మనం
నడుచుకోవడంలో ఉంటుంది.నడుచుకొనే తీరులో ఉంటుంది.
మా అమ్మాయి కూడా సినిమాల్లో పనిచేస్తోంది కదా" అని
ప్రొత్సహించటం, నాన్నగారు ఒప్పుకోవడంతో నేను సినిమా
పరిశ్రమలోకి అడుగు పెట్టాను"
వరవిక్రయం చిత్రంలో ఆమె "పలుకవేమి నా దైవమా,
రామా" ( పూర్ణచంద్రిక రాగం) అనే త్యాగరాజకృతితో మొదటి
సినిమా పాట ఆరంభమయింది. 1943 ఆగష్ట్ 8 న దర్శకుడు
రామకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకొన్నారు. తన కుమారుడి
పేర భరణీ పిక్చర్స్ ప్రారంభించి ఆణిముత్యాలలాంటి చిత్రాలు
తీశారు. తరువాత భరణీ స్టూడియోస్ నిర్మించారు. భరణీ
చిత్రాలంటే మంచి సంగీతం వుటుందని ప్రేక్షకులకు నమ్మకం.
"లైలా-మజును", "ప్రేమ" చిత్రాలకు సి.ఆర్.సుబ్బరామన్ అద్భుతమైన
సంగీతాన్ని ఇచ్చారు.
" ప్రేమే నేరమౌనా..మాపై పగేలా"
" నిను బాసి ఫొవుదానా.."
"రోజుకు రోజు మరింత మోజు..."
"ప్రేమ డింగ్ డాంగ్ బెల్..ప్రియురాలు నైటింగేల్.." పాటలు ఎన్ని
సార్లు విన్నా కొత్తగానే వుంటాయి!
భానుమతి సంగీత దర్శకురాలుగా, చిత్ర దర్శకురాలుగా,నిర్మాతగా,
స్టూడియో అధిపతిగా, రచయిత్రి గా తన ప్రతిభను చాటిన నటీమణి.
"విజయ చిత్ర" పత్రికలో ఆమె వ్రాసిన "నాలోనేను" సీరియలు గా ప్రచు
రించ బడింది. పుస్తక రూపంలోను వెలువడటమే కాకుండా ఇంగ్లీషు
లోకి అనువాదం చేయబడింది.
అక్కినేని నాగేశ్వరరావు గారికి భరణీ మంచి పాత్రలను ఇచ్చి ఆయన
లోని నటుడిని బయటకు తీసుకొనివచ్చింది. లైలామజును,విప్రనారాయణ
లాటి పాత్రలకు అక్కినేనిని ఎన్నుకొన్నప్పుడు విమర్శలను లెక్కచేయక
భానుమతి అతనిలోని ప్రతిభను గుర్తించింది. భానుమతి నటించిన మరో
మంచి చిత్రం 1951లో బియన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "మల్లీశ్వరి".
అందులోని పాటలు దేశాన్ని పరవశింపజేశాయి..ఎందుకే నీకింత తొందర,
ఆకాశవీధిలో,(ఘంటసాల మాష్టారితో),ఎవ్వరేమని కందురు,మనసున
మల్లెల మాలలూగినే,అవునా నిజమేనా,పిలిచిన బిగువటరా,కోతీ బావకు
పెళ్ళంట, ఇందులో ఏ పాట బాగుందని చెప్పగలం. అన్నీ వీనుల విందులే!
ఆమె వ్రాసిన "అత్తగారికధలు" మరువగలమా? 2005 డిసెంబరు 24
రాత్రి ఆమె కన్ను మూసారు. తెలుగువారి తలపుల్లో ఆమె కలకాలం
జీవించే వుంటుంది. 1971 లో Gramophone Company LP Record
( No: MOCE 7001) భానుమతి పాటలతో విడుదల చేసింది. ఈ రకార్డ్
"స్వర్గసీమ" సినిమాలో నాగయ్యగారి సంగీత దర్శకత్వం లో ఆమె పాడిన
" ఒహొ ఒహొ పావురమా" పాటతో మొదలవుతుంది.

Monday, September 06, 2010

ఆచార్య దేవోభవ ! శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు




హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1922 నాటి నుండి
రాజమండ్రి వీరేశలింగమ్ హైస్కూలులో గణితాధ్యాపకులుగాను,
ఆ పాఠశాల ప్రధానోపాధ్యాలుగాను పనిచేసి 1953 లో పదవీ విరమణ
చేశారు.హాస్యప్రధానమైన నాటకాలు, నాటికలు వ్రాశారు. 1950 లో
జయపూర్ మహారాజా శ్రీ విక్రమదేవవర్మ కామేశ్వరరావు గారిని
"హాస్యబ్రహ్మ" బిరుదుతో సత్కరించారు. ఆంధ్రనాటక పద్యపఠనం,
త్యాగరాజు ఆత్మవిచారం మొదలైన పరిశోధనాత్మకమైన రచనలు
చేశారు.ప్రఖ్యాత సినీ,నాటక రచయిత కీ"శే"భమిడిపాటి రాధాకృష్ణ
వీరి కుమారులు. శ్రీ కామేశ్వరరావు 1958 ఆగష్టు 28న రాజమండ్రి
లో పరమందించారు. కాలక్షేపం పేరిట ఆయన వ్రాసిన జోకులను,
నిన్ననే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం కనుక మేష్టార్లమీద
ఆయన చెప్పిన కొన్ని జోకులు !!
****************
ఎనభై మంది పిల్లలుగల ఒకానొక క్లాసులో నలుగురు ముగ్గురు
తప్ప తక్కిన అంతా హాజరై ఉన్నట్ట్లు తోచగా, ఆ సహస్ర నామాలు
లాంటివి పిలుస్తూ కూచోడం కాలయాపనం అనుకొని,
మేష్టరు : ఆబ్సెంటు అయిన నలుగురు ముగ్గురూ ఠంగున నుంచోండి.
చట్టున రాసుగుంటానూ.
*****************
అయ్యవారు: చిట్టిగా, ఇప్పుడు దేనిమీద పాఠం?
చిట్టి : చర్మం గురించండి
అయ్యవారు: చర్మం అంటే ఏమిటి?
చిట్టి: గేదెలూ అవీ తొడుక్కునే కోటండి.
అయ్యవారు: ఓరి పశువా "కోటు" అయితే గుండీలేవిరా?
చిట్టి: లోపల వేపు నుంటాయండి.కనిపించవు.
*****************
అవధాని: ఏమండీ యల్టీమేష్టరుగారూ! మా వాడికి ప్రేవేటు
చెపుతున్నారు గందా,లెక్కల్లో ఈ కుంక ఎల్లా
వున్నట్లూ!
మేష్టారు: లెక్కల్లో మీ వాడు "గుడ్" అనివాళ్ళ క్లాసు
మేష్టారు ఈ వేళ పొద్దున్నే అన్నారండి.
అవధాని: లెక్కల్లో గుడ్డయితే నువ్వు చెప్పి చచ్చిందేమిటయ్య మరీ !
*****************
ఆయ్యవారు: నీకు కాళ్ళెందుకురా, గురవా?
గురవ: ముల్లువిరిగితేనమ్డీ, తీసుకోడానికండీ !
అయ్యవారు: చీ! నువ్వురా వెంకన్న!
వెంకన్న: బూజుసులు (బూట్లు) తొడుక్కొనేందుకండీ!
అయ్యవారు: ఏడిసినట్టుఉంది. నువ్వురా, పాపిగా!
పాపిగాడు: ఏదేనా తొక్కితేనండీ, కడుక్కోడానికండీ!
అయ్యవారు: ఓరి అప్రాచ్చపు వెధవల్లారా! ఎరక్కపోయి అడిగాను.
*****************
శరీర శాస్త్రం చెప్పుతూ
ఉపాధ్యాయుడు: హృదయము నాలుగు భాగములు. కుడి
వెంట్రికలు,ఎడమ వెంట్రికలు.......
పరధ్యానంగా వింటున్న ఓ స్టూడెంట్
"అదేమిటి మాష్టారూ హృదయంలో వెంట్రుకలుంటాయండీ?!
*****************
పంతులు: "వర్షాలు" దీనికి ఇంగ్లీషేమిటి?
విద్యార్ధి : రెయిన్సండి.
పంతులు: "అకాలపు వర్షాలు" దీనికి ?
విద్యార్ధి: అకాలీరెయిన్సండీ !
......కామేశ్వరరావుగారి కాలక్షేపం నుంచి**