Saturday, September 11, 2010

శివ శివ మూర్తివి గణనాధ !



ఈ పాట మీకు గుర్తుందా ! వాహినీ వారి "పెద్దమనుషులు"
చిత్రంలో రేలంగి పాడిన ఈ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్.
వినాయకచవితి పండుగ పిల్లలకు పెద్దలకు ఇష్టమైన
వేడుక. హైదరాబాదుతో బాటు పెద్ద పెద్ద ఊర్ల దగ్గరనుంచి
చిన్న గ్రామాల దాకా గణపతి నవరాత్రులు పెద్ద ఎత్తున
జరుపుతున్నారు. పెద్ద ఎత్తునంటే నిజంగానే అతి పెద్దఎత్తు
వినాయక విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఖైరతాబాదు
వినాయకుడు భారీగా దర్శనమిస్తాడు. మా తూర్పు
గోదావరిజిల్లా తాపేశ్వరం "సురుచి ఫుడ్స్" వారు 500 కేజీల
లడ్డూను ప్రత్యేకంగా తయారు చేసి ఖైరతాబాదు గణపతికి
ఈరోజే సమర్పిస్తున్నారు.
వినాయకుని పూజలో వాడే వివిధ పత్రాలు ఔషధ
గుణాలు కలిగి వున్నాయి. మాచి పత్రి, బృహతీపత్రం,బిల్వ
పత్రం,దూర్వాయుగ్మం (గరిక),దత్తూర పత్రం,బదరీ పత్రం,
అపామార్గ పత్రం,తులసీ పత్రం, చూతపత్రం,కరవీర పత్రం,
విష్ణుక్రాంత పత్రం,దాడిమీ పత్రం,దేవదారు పత్రం,సింధువార
పత్రం,జాజి పత్రం,గండకీ పత్రం, శమీ పత్రం,అశ్వద్ధపత్రం,
అర్జున పత్రం,అర్క పత్రం ఇలా ఈ పత్రాలన్నీ భాద్రపద మాసం
లో ఎక్కువగా దొరుకుతాయి.ఈ ఆకుల్ని కోసి మూలికా
వైద్యంలో వాడుతారు. అదే ఈ పత్రం పూజయామికి
మూలకారణం గా మన పెద్దలు ఏర్పరిచారు..
వినాయకుడి మీద మా కార్టూనిస్టులు చాలా బొమ్మలు
గీశారు. ఆంధ్ర వార పత్రిక వినాయకచవితికిప్రత్యేక హాస్య
సంచికను విడుదల చేసేది. శ్రీ బాపు స్వాతి పత్రికలో చాలా
కాలం క్రితం గీసిన గణేశుని కార్టూను చూస్తున్నారుగా!
చిన్నారి గణపతితో అమ్మ పార్వతి," పొద్దోయింది,బువ్వ
తిని బజ్జుందిగాని-దామ్మా, పొద్దున్నాడుకుందూగానీ...."
అని అంటే గణపయ్య " పొద్దున్న వీడుండమ్మా" అంటున్నాడు
చందమామ కు తాడు గట్టి ఉయ్యాల ఊగుతూ!. ముస్లిమ్
సోదరుల రంజాన్ పండుగ కూడా వినాయక చవితినాడే
వచ్చింది కనుక చంద్రుడు కూడా రంజాన్ నెలవంక గా
వుండటం కాకతాలీయం! ఆహా! బాపు గారు ముందు చూపుతో
ఎప్పుడో ఆ కార్టూన్ అలా వేశారేమో అనిపిస్తుంది. పార్వతీ
దేవి స్నానం చేస్తూ కాపలాగా పసుపు ముద్దతో ఓబాలుడిని
తయారుచేసి ప్రాణం పోసిందని పురాణాల్లో వుంది.ఇక్కడ మీరు
చూస్తున్న ఫొటో Camilla Allen అనే ఆమె మట్టితో నిజం
పాపాయా అన్నట్లు బొమ్మలు సృస్ఠించింది.మానవులే తయారు
చేసినప్పుడు పార్వతీదేవి చేయడంలో ఆశ్చర్యమేంలేదు కదా!
అందరికీ వినాయక చవితి, రంజాను శుభాకాంక్షలు !!

4 comments:

  1. మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  4. శ్వాస ఎటువంటిదో తెలుసుకున్నాను హరా
    జీవించుటకు శ్వాస చాలని కర్మతో తెలుసుకున్నాను హరా
    ఎందరో కర్మలతో ఎన్నో విధాల జీవిస్తూనే ఉన్నారు హరా
    ప్రతి జీవికి ఆహార నాళం ఉంటే చాలని శ్వాస తెలిపేను హరా
    కష్టమైనా నష్టమైనా దుఖ్ఖాన్ని అనుభవించేది శ్వాసే హరా

    Hi
    welcome to my blog
    gsystime.blogspot.com

    read for spiritual knowledge
    thanks,
    Nagaraju G

    ReplyDelete