Wednesday, November 11, 2009
తెలుగు తల్లికి వందనం: తెలుగోపనిషత్; సీ.పి.బ్రౌన్
తెలుగువారికి ఒక ప్రత్యేకత వుంది.కొన్ని కొన్ని లక్షణాలనుబట్టి ఎంత మందిలో వున్నా తెలుగువాడిని ఇట్టే పసిగట్టవచ్చు.ఉదాహరణకు :- మీ దోవన మీరు పోతుండగా,ఎవడైనావచ్చి,మీ చెయ్యి మెలిపెట్టి మీ వాచీలో టైము చూసుకొని వెళ్ళిపోతే, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయివుంటాడు. రోడ్డు కడ్డంగా నుంచుని,కార్లు,సైకిళ్ళు,రిక్షాలు,ఆవులు మొదలైన వేటినీ లెక్క చేయకుండా గంటల తరబడి రాజకీయాలు,సినిమాలు చర్చించే వాడు తెలుగువాడనటానికి సందేహం లేదు. మీరు దినపత్రికగాని,మరో పత్రికగాని కొనడంతోటే, "ఒక్క సారి చూసిస్తాను,పేపరిస్తారా?" అని అడిగి పుచ్చుకుని,తిరగేసి,నిర్లక్ష్యంగా మీమీద పడేసి చక్కా పోయేవాడు తెలుగు వాడే. బస్సులో గాని రైల్లో గాని ఆరుగురు కూర్చోవలసిన సీట్లో నలుగురికి కూడా ఇరుకయ్యేట్టు కూర్చో గల నేర్పు ఒక్క తెలుగు వాడికే వుంది.అన్నట్టు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం : తెలుగు వాళ్ళని తిట్టిపోసి,అరవ్వాళ్ళని,బెంగాలీవాళ్ళని మెచ్చుకునేవాడు కూడా తెలుగు వాడే! ఈ సోదంతా ఇప్పుడెందుకని నన్ను కోప్పడకండి.తెలుగువాడు,కనీసం భారతీయుడు కాకపోయినా సీ.పీ.బ్రౌన్ అనే బ్రిటిష్ దేశీయుడు తెలుగు నేర్చుకుని తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. ఆయన జన్మదినం నిన్ననే( నవంబర్ 10 ).ఆయన తెలుగు నిఘంటువును,వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు.అప్పయ్యదీక్షుతులు లాంటి పండితులవద్ద తెలియని విషయాలు నేర్చు కున్నాడు.రాజమండ్రి లో శ్రీ సన్నిధానమ్ నరశింహశర్మ,వారి సోదరులు శాస్త్రి వారి ఇంటికి"బ్రౌన్ మందిరం" అన్న పేరు పెట్టుకొన్నారంటీ వారిని అభినందించాలి.బ్రౌన్ జన్మ దినం రోజున స్తానిక యంయల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారి అధ్వర్యంలో సభ నిర్వహించి తెలుగు భాషాభి వృర్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేసారు.వక్తలందరూ ఎన్నోవిషయాలను చెప్పారు కాని మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు వాళ్ళకి యన్టీఆర్ తెచ్చిన గుర్తింపును ఒక్కరు జ్ఞాపకం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏమైనా మనం తెలుగు వాళ్ళం కదా!!
చివరగా ఒక మాట: తెలుగోపనిషత్ జ్యోతి బుక్స్ వారు 1964 లో ప్రఛురించిన "రసికజన మనోభిరామము" పుస్తకం లోనిది. ఆ పుస్తకంలో బాపు,రమణ ,రావి కొండలరావు మొ ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి" మాస పత్రికలోని జోకులు,కార్టూన్లతో ఆ పుస్తకం ప్రచురించారు.ఆ పుస్తకం ధర ఎంతో ఊహించండి.దాదాపు 80 పేజీల బుక్ వెల ఒక రూపాయి మాత్రమే! మీరు నమ్మాలి.ఆ పుస్తకం నా దగర వుంది!!
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు వారందరూ తెలుగు భాష ఉన్నంతవరకూ గుర్తుంచుకోవల్సిన వ్యక్తి బ్రౌన్. అలాగే ఎన్.టి. రామారావు గారు ముందు మన హైదరాబాదుని తెలుగు రాజధాని చేసారు. దానికే తెలుగు జాతి గర్వంచాలి. తెలుగు భాషోన్నతి కోసం తపిస్తున్న మన బ్లాగు మిత్రుల కృషి కూడా అభినందనీయమే ! కానీ బ్రౌన్ గురించి స్పందన చాలా తక్కువగానే ఉంది. ఎందుకో !1
ReplyDelete