Thursday, May 27, 2010

అప్పు తచ్చులు అను అచ్చు తప్పులు !

అప్పు తుచ్చులను అక్షరాలు అక్షరాలా ఖూనీ !!

అచ్చులో అక్షరాల కూర్పులో తప్పులు దొర్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి భావమే
పూర్తిగా మారిపోయి నవ్వూ తెప్పించవచ్చు , కొందరికి కోపం కలిగించవచ్చు. అచ్చయే ముందు
ప్రూఫ్ ను తీసి అందులో తప్పులులను దిద్దేవారు. వాళ్ళని ప్రూఫ్ రీడర్స్ అంటారు. అలాజాగ్రత్తగా
తప్పులను దిద్దినా ఇంకా కొన్ని తప్పులు అలానే ఉండిపోయేవి. అప్పుడు పుస్తకం చివరాఖరున
( చివర అన్నా , ఆఖరున అన్నా ఒకటే , మరి గేటు గుమ్మం లా ,అగ్గినిప్పులా చివరాఖరని తరచు
రచనలలో కనిపిస్తున్నది ! )గతంలో తప్పొప్పులు అంటూచివరి పేజీలో తప్పు దానికెదురుగా ఒప్పు అని
వేసే వారు. ఇప్పుడు కంపొజింగు అంతా కంప్యూటర్ల ద్వారా జరుగుతున్నది కనుక అక్కడే పొరబాట్లు
సరిదిద్దుతున్నారు ఐనా అక్కడక్కడా తప్పులు దొర్లుతూ వినోదాన్ని అందిస్తుంటాయి. మా రాజమండ్రి
లో ఒక స్ధానిక దిన పత్రికలో తరచు అచ్చు తప్పులు వచ్చేవి. పత్రిక మైయిన్ హెడ్డింగ్ క్రింద సంపుటి,
సంచిక ప్రక్క రెండు పేచీలు, వెల పది పెసలు అన్ని చాలా కాలం వరకు అచ్చయేది. మరో సారి వార్తలు
అచ్చేస్తూ , చైర్మన్ చే రంకు స్ధాపన (శంకు స్దాపనకు వచ్చిన ప్రమాదం అని ఈ పాటికి మీరు గ్రహించే
ఉంటారు ).బ్యాంకులో కే.వీ.శాస్త్రి అనే మా కొలీగ్ ఇలాటివి పత్రికల్లో పట్టుకొని మాకు వినొదాన్ని పంచే
వాడు. ఇన్ని చెప్పిన నేనే గత బ్లాగులో ఫేర్లగురించి వ్రాస్తూ చివర వేటూరికి ఘటిస్తూఅనడానికి
బదులు గటిస్తూ అని వ్రాసా. ఆ తప్పుని, ఇంకా నే తెలియకుండా చేసిన అక్షర ఖూనీలను మన్నించమని
కోరుతున్నాను.
అప్పు తుచ్చులతో కొన్ని వాఖ్యాలను శ్రీ ఆరుద్ర "జ్యోతి" మాస పత్రికలో వ్రాసారు. వాటిలో కొన్ని ’చెత్త
గించండి
సత్యం వధ ధర్మంచెర
ఎంతవారలైనా కొంత దాసులే
చల్ మోహనరంగా ! నీకూ నాకూ జోడు కరచెను గదరా
డబ్బిచ్చి మార్కులు వేయించుకున్నవారు చదువు కొన్న వారు
చచ్చుబుడ్డి బాగా వెలగదు
డాక్టర్లు రోగి పర్సు చూసి వైద్యం చేస్తారు.
అక్కరకు రాని చట్టము
లోకులు క్రాకుల వంటి వారు.

1 comment:

  1. శంకు స్ధాపన/శంకు స్దాపన - శంకు స్థాపన ( అయినా మీరు క్షమించమన్నారు కాబట్టి సరే :-) )

    ReplyDelete