Sunday, September 11, 2011

విచిత్రకవలలు-చందమామ సీరియల్

1952 లో అనుకుంటాను ( ఏమంటే నా దగ్గర 1953 నుండే చందమామలు
వున్నాయి ) విచిత్రకవలలు సీరియల్ చందమామలో వచ్చేది. అప్పుడు నా
వయసు 11 ఏళ్ళు. ఐనా ప్రతినెలా చందమామలోని ఆ కధ చదవడానికి
ఆతృతగా అక్కా, నేనూ ఎదురు చూసేవాళ్లం. ఆ కధలోని రాక్షసులు, బారెడు
గెడ్డంతో వుండే పొట్టివాడు, ఇలా ప్రతిదీ మమ్మల్ని , మాలాగే వేలాది మందిని
చందమామ ప్రియులుగా చేశారు. ఆ "విచిత్రకవలలు" కధకు కీ"శే" చిత్రా
అద్భుతమైన చిత్రాలు గీశారు.
1974 జూలైలో విచిత్రకవలలు చిత్రాగారి రంగుల బొమ్మలతో తిరిగి
మొదలయింది. పతాక శీర్షికకు బొమ్మను మార్చటమే కాకుండా ప్రతి
బొమ్మను చిత్ర మరింత అందంగాతిరిగి వేశారు. ప్రతి నెలా పతాక శీర్షిక
బొమ్మను ఆ నెల కధానుగుణంగా మార్చి వేశేవారు. పై బొమ్మను ఈ
బొమ్మను చూస్తే మీకు తేడా తెలుస్తుంది.
కవలలను రాక్షసుడు గ్రద్ద రూఫంలో వచ్చితన్నుకు పోయే దృశ్యాల్ని
గతంలో ప్రచురించిన బొమ్మల్ని మీరు ఇక్కడ చూడొచ్చు
అదే దృశ్యాన్ని దాదాపు ఇరవైఏళ్ళ తరువాత రంగుల్లో చిత్రా వేసిన
బొమ్మను చూడండి !! ఏదీ ఈనాటి చందమామకు ఆ వెన్నెల వెలుగు?!
1955 జూలైలో "విచిత్రకవలలు" కధను చందమామ పబ్లికేషన్స్ వారు
పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ కధ ఎంత విచిత్రంగా వుంటుందో
అలానే అప్పుడు ఈ పుస్తకం ఖరీదు ఓ రూపాయి అంటే ఇప్పుడు విచిత్రంగా
వుంటుంది. ముఖచిత్రాన్ని మాత్రం చిత్రా కాకుండా గోపి అనె చిత్రకారుడు
వేయడం మరో విచిత్రం! ఈ అపురూప పుస్తకం నా దగ్గర వుంది. ఎందు
కంటే " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి మీకిప్పుడు పుస్తకాల
షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి !! నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ
ఇవ్వను ! అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి !! "

6 comments:

  1. అప్పారావు గారూ, బాగుంది మీ టపా! చందమామలో రెండోసారి వచ్చినపుడు చదివానీ సీరియల్ ని. నాయికా నాయకుల పేర్లూ, రాక్షసుడూ, బారెడు గడ్డం జానెడు మనిషీ... ఇవన్నీ ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా అనిపించేవి.

    ‘విచిత్ర కవలలు’ సీరియల్ రచయిత రాజారావు గారు. మీ దగ్గరున్న పుస్తకంలో కూడా ఆయన పేరుండే అవకాశం లేదు, చందమామ పాలసీ ప్రకారం! పుస్తకరూపంలో వచ్చినపుడు చిత్రాతో ముఖచిత్రం వేయించకపోవటం ‘విచిత్ర’మే!

    చిత్రా గురించి గతంలో రాసిన టపాలో కూడా మీలాగే విచిత్రకవలల పాత కొత్త చిత్రాలను పోల్చాను. http://venuvu.blogspot.com/2009/10/blog-post.html

    ReplyDelete
  2. శ్రీ అప్పారావు గారూ,
    నమస్తే. పాత, కొత్త 'విచిత్ర కవలలు' నవల చిత్రాల గురించి మీ పరిచయం చాలాబావుంది. అరుదైన చరిత్ర విషయాలను హృద్యంగా తడిమారు.

    "ఏదీ ఈనాటి చందమామకు ఆ వెన్నెల వెలుగు" అన్న మీ వ్యాఖ్యకు చిన్న వివరణ. చందమామ ఆఫీసులో కనీసం అయిదారుగురు దిగ్ధంతులవంటి చిత్రకారులు కూర్చుని ప్రతిరోజూ తమ వంతు చిత్రాలను వేస్తూ పోయిన బంగారు కాలానికి చెందిన మేటి చిత్రాలవి. సర్వశ్రీ ఎంటీవీ ఆచార్య, చిత్రా, వపా వంటి చిత్రబ్రహ్మల శకం ముగిసిన తర్వాత వారికి ధీటుగా లేదా వారికి సమీప స్థాయిలో చిత్రాలు వేయగల చిత్రకారులు చందమామలో నిలబడలేకపోయారు. దీనికి కనిపించని కారణాలెన్నో.
    30, 40 సంవత్సరాల చిత్రలేఖన వారసత్వం 1980లు, 90లలో ముగిశాక, ఆ వారసత్వానికి కొనసాగింపుగా తదనంతర చిత్రకారులు చందమామలో ఇమడలేకపోవడం లేదా ఉండలేకపోవడమే చందమామ చిత్రాల ప్రస్తుత దౌర్భాగ్యానికి కారణం అని నా అభిప్రాయం. అతి తక్కువ ప్రతిఫలాలు పుచ్చుకుని నిబద్ధంగా పనిచేసిన రోజులు చందమామలో గతానికే పరిమితమయ్యాయి.

    ప్రతిభావంతులైన ప్రస్తుత చిత్రకారులకు వారు కోరుతున్న ప్రతిఫలాన్ని ఇచ్చి కొనసాగించగల పరిస్థితి ప్రస్తుత చందమామకు లేదు. శ్రీ విశ్వనాథరెడ్డి గారి హయాం నుంచే నేటి చందమామలో కనపడుతున్న పరిణామాలు మొదలయ్యాయి. 50లనుంచి 80ల వరకు చందమామ స్వర్ణయుగం రోజులకు దారి తీసిన పరిస్థితులను అంచనా వేయకుండా మీ వంటి చందమామ అభిమానులు ఎన్నిసార్లు చందమామ దుస్థితి గురించి వాపోయినా ఆ కాలాన్ని మళ్లీ ఎవ్వరూ తీసుకురాలేరు.

    శంకర్ గారు మినహా భారతీయ భాషల చందమామలకు ఇన్ హౌస్ చిత్రకారులు లేని ప్రస్తుత కాలానికి, చందమామ స్వర్ణయుగానికి పోటీ పెట్టడం ద్వారా మనం సాధించేదేమీ లేదు. రవివర్మ గారు లేని కాలంలో అలాంటి కళాకారులు లేరని వాపోవటం, చిత్రా, వపా గార్లు లేని కాలంలో అలాంటి వారి అద్భుత చిత్రాలు లేవని బాధపడటం వల్ల ఎవరికీ ఏమీ ఒరగదు.

    బొమ్మల విషయంలో మీరు చెప్పిన వెలుగులు ప్రస్తుత చందమామకు లేనప్పటికీ, చందమామను ఈ పోటీయుగంలో కూడా చదువుతూ, తమ పిల్లలచేత చదివిస్తూ లక్షలాది పాఠకులు దేశ వ్యాప్తంగా చందమామ కథలను కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రచురిస్తున్న పాత, కొత్త కథలను కూడా పాఠకులు అభిమానిస్తున్నారనటానికి నిత్యం చందమామ కార్యాలయానికి వస్తున్న లేఖలే నిదర్శనం.

    నా చిన్న అనుభవంలో కూడా బయటినుంచి చందమామను అంచనా వేసేదానికి, లోపలినుంచి చందమామ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. దీనికి ఎవరూ ఎవరినీ సమర్థించలేరు. తోసిపుచ్చలేరు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప. మీ బ్లాగ్ కథనానికి భిన్నంగా స్పందిస్తున్నట్లున్నాను. క్షమించాలి.
    మీరు అభిమానంతో ఈ లింకును పంపించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. అప్పారావు గారూ, నిజమే! ఆ మొదటి బొమ్మలో చూశారా, మనుషుల నీడలు కూడా చిత్రించారు. ఇలాంటి సూక్ష్మాంశాల్ని కూడా పరిశీలించారు చిత్రా! అద్భుతం కదా నిజంగా!

    " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి మీకిప్పుడు పుస్తకాల
    షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి !! నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ
    ఇవ్వను ! అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి !! "__________ఇది నాకు చాలా నచ్చింది.

    ReplyDelete
  4. రాజశేఖరరాజుగారు! చందమామ మీద గల అపార ప్రేమాభిమానాల వల్ల అప్పుడప్పుడు మనసు చివుక్కుమనిపించి అలా వ్రాశాను. ఇప్పటి పరిస్థితులు నాకూ తెలుసు. ఇంత వయసులో కూడా శ్రీ శంకర్
    చందమామకు చిత్రాలు అందిస్తున్నారంటే ఆయనకు చందమామపై వున్న అభిమానమే. చందమామ ఇప్పుడు ఎలా వున్నా చందమామ ఇప్పటికీ కొంటూనే వున్నా. నిన్న ఒకసారి 1974 చందమామ
    వాల్యూమ్ తిరగేస్తుంటే విచిత్రకవలలు కనిపించి ఆ విషయాలను ఆనాటి ఈనాటి చందమామ అభిమానులతో పంచుకోవాలనిపించింది. మీరు అభిమానంతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు
    ధన్యవాదాలు. Long Live our CHANDAMAMA.

    ReplyDelete
  5. శ్రీ అప్పారావు గారూ,
    నా వ్యాఖ్య ద్వారా మీరు బాధపడలేదు కదా..! అయితే క్షంతవ్యుడిని.

    మీరన్నది నిజమే. శంకర్ గారు వయోభారపు దుర్బలత కారణంగా ఏకాగ్రత నిలవని పరిస్థితుల్లో కూడా చందమామ బొమ్మలు వేయడంలో తన శక్తినంతా కూడదీసుకుంటున్నారు. ఈ రోజుకీ కూడా చందమామ కొత్త కథలకు ఆయన వేస్తున్న బొమ్మలు ఆ అద్భుత హస్తనైపుణ్యానికి, ఊహాశక్తికి నిదర్శనంగా నిలబడుతున్నాయి.

    89 సంవత్సరాల వయసులో వణుకుతున్న చేతులతో ఆయన ప్రతి ఉదయం, సాయంత్రం ఇంట్లో కూచుని బొమ్మలు వేస్తున్నప్పుడు ఈ వయసులో చందమామ ఆయన్ని ఎంత కష్టపెడుతోంది అని బాధ కలుగుతుంటుంది. అన్ని పనులూ ఆపి జీవితపు చరమదశలో -పాపం శమించుగాక- విశ్రాంతి తీసుకోవలసిన క్షణాలను ఆయన చందమామ బొమ్మలకోసం కేటాయిస్తున్నారు.

    చివరి ఊపిరి ఉన్నంతవరకు బొమ్మలు వేస్తూనే ఉండాలనే సంకల్పాన్ని ఆయన 60 సంవత్సరాలుగా మనసులో నిలుపుకుని జీవిస్తున్నారు. ఆయన వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత మేరకు ఆయన పని భారాన్ని తగ్గిస్తున్నప్పటికీ బేతాళ కథలతో పాటు ఒకటీ రెండూ కొత్త కథలకు ఆయనే అడిగి మరీ తీసుకుని బొమ్మలు వేస్తున్నారు. నిజంగా ఇది బాధాకర పరిస్థితి.

    ఆయనకు ఇప్పుడు మనసులో ఉన్నదంతా ఒకటే భయం. తను వేసిన బొమ్మ బాగా లేకుంటే, కథకు అన్యాయం జరిగితే ఎలా తట్టుకోవాలి అన్నదే ఆయన భయం. బొమ్మ వేయడంలో ఏదైనా లోపం జరిగిందని మా కనిపిస్తే ఆయన దృష్టికి తీసుకుపోకుండా చందమామ కంప్యూటర్ ఆర్టిస్ట్ ద్వారా కొద్దిగా మార్పు చేసి సరిచేసి లేఅవుట్‌లో పెట్టిస్తున్నాము.

    చందమామకు ఇంతవరకూ జరిగిన నష్టం ఒకెత్తు అయితే.. రేపు జరగబోయే నష్టం ఊహించడానికి వీలులేనంత భారీగా ఉండబోతోంది. ఆ పరిస్థితిని ఎదుర్కొవడానికి సిద్ధపడటం తప్పితే మనందరమూ ఈ విషయంలో నిస్సహాయులమే...

    ప్రత్యామ్నాయ వనరులను పెంపొందించుకోవడం, కొనసాగనివ్వడం ఏ సంస్థ మనుగడకు అయినా ప్రాణాధారమైన విషయం. ఈ విషయంలో చందమామ అత్యంత దురదృష్టవంతురాలు.

    చందమామ పాత చిత్రకారులు శ్రీ సీతారాం గారు మళ్లీ ఈ అక్టోబర్ నుంచి చందమామకు చిత్రాలు వేస్తున్నారు. అలాగే ఇప్పటికే చెన్నయ్‌లో ఉంటూ సంగీత వాయిద్య పరికరాల రంగంలో స్థిరపడిపోయిన చందమామ అలనాటి చిత్రకారులు శ్రీ జయ గారిని సంప్రదించాము కూడా. చందమామ తిరిగి తనను పిలవడం సంతోషకరమే అయినప్పటికీ, సమయ పాలనకు అనుగుణంగా చందమామకు బొమ్మలు వేసి పంపడం తనకు ఇప్పుడు సాధ్యం కాదని ఆయన తిరస్కరించారు.

    మీవంటి చందమామ వీరాభిమానులు పాత, కొత్త చందమామలపై ఎంత అభిమానంతో అంచనా వేస్తున్నారో లోపల పనిచేస్తున్న మాకందరికీ తెలుసు. కానీ మేం ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉంటున్నాము. బొమ్మల విషయంలో చందమామ ఎందుకు వెనుకబడిపోయిందో విశ్వనాధరెడ్డి గారినే అడిగి తెలుసుకోవాలని ఎప్పటినుంచో నాకనిపిస్తోంది. కాని ఇంతవరకు వారితో పరిచయం కాలేదు.

    చందమామ పట్ల మీ అభిమానానికి కృతజ్ఞతలు కాని నిజమైన అభిమానుల, సహృదయ పాఠకుల అభిమానానికి చందమామ దూరమవుతూ ఉండటమే అప్పుడప్పుడూ బాధ కలిగిస్తుంటుంది.

    మీరు అనుమతిస్తే చందమామ గురించి మీరు అప్పుడప్పుడు రాస్తున్న కథనాల లింకులను కాస్త పరిచయంతో చందమామ బ్లాగులో కూడా పెట్టి పాఠకులకు అందివ్వాలని ఉంది. మీకు అంగీకారమయితేనే..
    అభిమానంతో
    రాజు

    ReplyDelete
  6. sri apparao garu, i am a lover of chandamama. please post me vichitrakavalalu serial in pdf format.

    ReplyDelete