Tuesday, March 27, 2012

"పన్" డుగ-పంచాంగం

ఉగాది పండుగంటే పంచాంగాల పండుగ. ప్రతి వాళ్ళూ కొత్త పంచాంగం ఇంటికి తెచ్చుకుంటారు. ఈ మధ్య టివీ వార్తల్లో ఈ పంచాంగం మీద మహిళా సంఘాల వాళ్ళు ఆడవాళ్ల గురించి ఏవేవో వ్రాసారంటూ పెద్ద గొడవ చేశారు. ఇంకేం టీవీ న్యూస్ చానళ్ళ వారికి పండగే పండగ. టీవీల్లో ఓ నలుగురిని పిలిచి దీని మీద వాదోపవాదాలు ! చివరికి అది అచ్చ తెలుగులొ విపులంగా వ్రాసిన పంచాంగకర్త ఈ ఏడాది నా జాతకం బాలేదు. ఈ ఏడాదంతా దూరంగా వుంటాను బాబోయ్ అని చేతులెత్తేశాడు. ఐనా అందులో ఏదో రాశారని ఇంత గొడవ చేయకబోతే అసలు ఈ విషయం ఎవరికీ తెలిసేదే కాదు. ఎంత మంది అమ్మాయిలు పంచాంగాన్ని చదువుతారు. టీవీల్లో వచ్చే సీరియల్స్ లో ఆడవారిని పక్కా విలన్లుగా చూపిస్తే ఈ మహిళా సంఘాలవాళ్ళు నోరేళ్లబెట్టుకొని చూస్తారు. సినిమాలలో ఆడవాళ్లని ఎంత అసభ్యంగా చూపించినా , బూతు మా(పా)టలాడినా తప్పులేదు!



మా చిన్నతనంలో గుప్తావారి పంచాంగం అని పేద్ద లావుపాటి పంచాంగం వచ్చేది.అందులో శృంగార ప్రకటనలు, స్త్రీ వశీకరణకు మార్గాలు, సూత్రాలు వగైరా వుండేవి. ఆనాటి వాటితో పోల్చితే ఇప్పటి పంచాంగాలలో వున్నది అతి తక్కువ.పంచాంగమంటే గుర్తుకొచ్చింది. 1963 లో బాపు రమణల బృందం వారి "జ్యొతి" మాస పత్రికతో ఓ నవ్వుల "పన్"చాంగాన్ని ఏప్రిల్ సంచికతో విడుదల చేసింది. ఆ పంచాంగం వినోద భరితంగా తమాషా ప్రకటనలతో సహా నవ్వులు కురిపించింది.ఆ పంచాంగం ఇలా వుంటుంది!


వినోదమస్తు! వినోదమస్తు!! వినోదమస్తు
శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ జ్యోతీ పన్చాంగమ్
యంబ్రహ్మశ్రీ శ్రీమజ్జోక్కుల వినోదాచార్య సిద్ధాన్తిన : అద్వితీయ పుత్రేణ
వికటానందశాస్త్రిణా ప్రణీతమ్


ఇక ప్రకటనలు నవ్వులు కురిపించి మీపొట్టలుచెక్కలవుతాయి. అటు తరువాత నవ్వులచెక్కల్తో మీరు మీ ఇంటికి తలుపులూ గట్రా చేయించుకుంటే తలుపులు తీసినప్పుడల్లా "హాహాహీహీహొహొ " అంటూ చప్పుడు చేస్తుంటాయి. మాయాస్పెషల్ ఉంగరం ప్రకటనలో ( ఇప్పుడు టీవీల్లో వచ్చే తాయెత్తుల ప్రకటనలలా) ఉంగరాన్నిచేతికి పెట్టుకొని తలకు మందు రాసుకున్నచో తలనొప్పి పోతుందని చెబుతారు.అలా అద్భుత గారడీ సిద్ధ కళ్ళద్దాల ప్రకటన నవ్విస్తుంది. నవ్వేజనాసుఖినోభవతు ! స్వస్తి.



1 comment: