Wednesday, March 28, 2012

ఫేసు బుక్కూ , నీకు బుక్కయిపోయా......

మధ్య నా బ్లాగు అభిమాని ఒకరు "దాదాపూ ప్రతి రోజూఏదో అడ్దమైన విషయం వ్రాసేవారు, మరిప్పుడు వ్రాయటం లేదు, మీకేం అవలేదు కదా ? " అంటూ కామెంటు పెట్టారు. అందుకు "నాకు బద్ధకం ఎక్కువయి వ్రాయటంలేదు" అని అబద్ధం చెప్పా.నిజానికి అసలు కారణం నేనో వ్యసనంలో చిక్కుకోవడమే. అంతకు ముందు ఇలా కొందరు సిగరెట్లకి , త్రాగుళ్ళకీ ఎందుకు బానిసలవుతారా అని అనుకుంటూ వుండేవాడిని. ఫేసుబుక్కు అనే సోషల్ నెట్ వర్క్ వలలో పడ్డాక కొంత సేపయినా పుస్తకాన్ని చదవలేక పోతున్నాను. సిస్టమ్ ఓపెన్ చేయగానే చూడొద్దు అనుకుంటూనే వదనపుస్తకాన్ని తెరవడం అందులో నేను వుంచిన "దానికి" ( మన ముఖ్యమంత్రి తెలుగులా) ఏమి కామెంట్లు పెట్టారా అని చూడటం, నేనూ ఏదో కామెంట్ వ్రాయడం ఇలా అంతూ పొంతూ లేకుండా గంటలు గంటలు కూర్ఛోవడం అటు తరవాత నడుమునొప్పి , మెడ నొప్పి ! శ్రీమతి ఇదివరలో నేను చిన్న నొప్పి అన్నా కంగారు పడి పెయిన్ బామో రాసేది. మొన్న నొప్పి అంటే "అలా పడుకోండి ! కంప్యూటర్ తెచ్చి నడుం మీద పడేస్తా, దెబ్బకి అన్ని నొప్పులూ వదలి పోతాయి " అన్నది..

ప్రతి చెడు కీ ఓ మంచీ వుంటుంది. ఈ ఫేసుబుక్కు మూలాన నాకు ఎందరో దేశవిదేశాల మితృలు మరింత మంది దగ్గరయ్యారు.. అందులో కొంతమందిని ఇంతవరకూ నేను చూడకపోయినా అత్యంత ఆప్తులయ్యారు. ఇప్పుడు వైజాగు లాంటి ఊరికి వెళితే నన్ను బాబాయిగారూ అంటూ ఆప్యాయంగా పిలిచే జ్యోతిర్మయి లాటి అమ్మాయిలు ఎందరో. అలానే, ఎక్కడో సెటిలయిన పాతకాలం మితృలూ, మా పిల్లల స్నేహితులూ, అమెరికా, కెనడాల్లో వుండే మా మితృల పిల్లలు, ఆహా: ఎందరో ! సజ్జా నరేంద్ర అనే ఫేసుబుక్కు మితృడయితే నా ముఖాన్ని పట్టుకు చెక్కేసి ( అదే నండి చెక్కపై చెక్కి) ఇండియా వచ్చి నప్పుడు నాకు కానుకగా ఇస్తాను అన్నారు. ఆ చెక్కేసిన ముఖాన్ని ఫెసుబుక్కు లోకి ఎక్కించేశారు ! ఇక మా జయదేవ్ గారితొ, మితృలు పుక్కళ్ళరామకృష్ణ , హిందూ కార్టూనిస్టులు శ్రీ సురేంద్ర, శ్రీ కేశవ్ గార్లు రోజూ ముఖాముఖాలే !!


చికాగోలో వుంటూ విజయవాడ వచ్చిన శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారు ఫేసుబుక్కులో పరిచయమైన నన్ను కలవాలని, మధ్యలో ఆయన చిన్న నాడు చదువుకున్న చేబ్రోలు హైస్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అదే స్కూల్లో చదివిన నా శ్రీమతి అక్కగారిని కలసి రాజమండ్రి వెళుతున్నాని అంటే అక్కడమా చెల్లి పద్మ ఇంటికి వెళ్ళమని ఆమె చెబితే, విచిత్రం, ఇంతకీ ఆయన వెళుతున్నది మా ఇంటికే ! ఇక్కడకు వచ్చాక నాతో కంటే మా ఆవిడ, ఆయన తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. అప్పటి వరకు నేను కంప్యూటర్ ముందు కూర్చుంటే సనిగే మా శ్రీమతి యాభైఏళ్ల తరువాత తన చిన్న నాటి స్నేహితున్ని కలిపినందుకు ఫేసుబుక్కును పొగడడం మొదలెట్టింది .ఇక ముంబాయి, చన్నై లోని మా అమ్మాయిలు, అబ్బాయి ఫేసుబుక్కు లోనే కనబడుతున్నారు. ఏమైనా సుధామ గారు, శిష్టా రామచంద్రరావు గారు, జ్యోతి వలబోజు గారు, కంప్యూటర్ యెరా సంపాదకులు శ్రీ నల్లబోతు శ్రీధర్, శ్రీమతి రాజావరం ఉష ఇలా ఎందరమో ఫేసుబుక్కులో బుక్కయిపోయాం !!


3 comments:

  1. మీ ఫేసుబుక్కు ఐడీ చెప్పేయండి మరి . అక్కడకూడా ఫాలో ఐపోతాం

    ReplyDelete
  2. సరదా సరదా గా బాగుందండీ మీ ఫేస్ బుక్ కథ....:-)

    ReplyDelete
  3. మీ అనుమతి తో నేను ఆ కార్టూన్ బొమ్మ కాపీ చేసుకుంటాను.
    అది నిజం గా మా ఇంట్లో జరిగే గొడవే

    ReplyDelete