Wednesday, July 21, 2010

"గణపతి" సృష్ఠికర్త శ్రీ చిలకమర్తి





హాస్య రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రధమాంధ్ర
రచయితల్లో ప్రముఖవ్యక్తి. ఆయన తన ఇరవై రెండో ఏట
మొదటి రచన చేశారు. ఆయన 1889లో రచించిన "గయో
పాఖ్యానం" నాటిక వందేళ్ళు పైగా ప్రదర్శించబడింది. కందుకూరి
తో బాటు ప్రముఖులంతా ఈ నాటికలో పాత్రలను పోషించారు.
శ్రీ చిలకమర్తి గీతామంజరి, కృపాంబోనిధి, మొదలైన శతకాలు,
సరస్వతి,మనోరమ,దేశమాత పత్రికలను నిర్వహించారు. ఆయన
వ్రాసిన "గణపతి" హాస్య నవల కడుబుబ్బ నవ్విస్తుంది. 1967లొ
ఆకాశవాణి విజయవాడ కేద్రం గణపతి నవలను రేడియో నాటకంగా
మార్పుచేసి ప్రసారం చేసి నప్పటినుంచి ఎన్నోసార్లు పున ప్రసారమయింది.
ఈనాటికను ఆకాశవాణి వారు ఆడియో సిడీగా విడుదల చేశారు.
ఇందులో గణపతిగా నండూరి సుబ్బారావు,అతని తల్లి సింగమ్మగా
పి .సీతారత్నమ్మ, పంతులుగారిగా పుచ్చాపూర్ణానందం మొదలైనవారు
నటించారు. ఈ సీడీ అమ్మకానికి ఆకాశకేంద్రాల వద్ద లభిస్తుంది.
" భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏద్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి" అని చిలకమర్తి విదేశీ
పాలనపై ఓ పద్యం వ్రాశారు. ఇక్కడ హిందువులు అంటే ఒక మతం
గురించి ఆయన ప్రస్తావించడం కాదని మనం గ్రహించాలి. ఆ కాలంలో
మన దేశాన్ని హిందూదేశం అనే పిలిచేవారు. మనం తెలుగోళ్ళం కాబట్టి
ఆ మధ్య కొందరు తెలుగోళ్ళు ఈ పద్యం చిలకమర్తి స్వంతం కాదని ఓ
రగడ చేశారు. ‘ఛిలకమర్తి 1867 సెప్టెంబర్ 26న రాజమండ్రిలో జన్మించారు

Monday, July 19, 2010

టూ(టీ)త్ పేస్ట్ కబుర్లు




ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకొంటాము, సారీ, బ్రష్ చేసుకోవటమెందుకు
మనకు మార్కెట్లో ఎన్నో రకాల టూత్ బ్రష్షులు దొరుకుతున్నప్పుడు. ఐనా మనకు
అదేమిటో బ్రష్ చేసుకోవడమనే మాట అలవాటయింది. బ్రష్ ఉంటే చాలదు కదా
తోముకోడానికి పేష్ట్ కావాలి. నాకో సందేహం వస్తుంటుంది. టూత్ పేస్ట్,టూత్ బ్రష్ష్
అని అంటారు. టూత్ అంటే ఒక పన్నని అర్ధంకదా. ఆ ఒక పన్ను తోముకోడానికి
వీటవసరమే ఉండదుకదా. ప్రతి మనిషికి 32 పళ్ళుంటాయి. మరి టీత్ పేస్ట్ అని
ఎందుకనరో ! ఈ దేహానికి ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నతనం
లో GIBBS S.R.TOOTH PASTE అని వచ్చేది. ఇప్పటిలా ట్యూబ్లలోనే కాకుండా
గుండ్రని డబ్బాల్లో , ఈ నాటి ఆడవాళ్ళ మేకప్ పౌడర్ కేకుల్లా అన్న మాట. ఓక్కొక్కరికి
ఒకటి చొప్పున వాడల్సి వచ్చేది. రకరకాల బ్రాండుల్లో ఎన్నెన్నో పేస్టులు, పౌడర్లు ఇప్పుడు
వస్తున్నాయి. నీమ్,కాల్గేట్,మెక్లీన్స్,క్లోజప్,పెప్సొడెన్ట్, బినాకా ఇలా ఎన్నేన్నో. మేం ఆ
రోజుల్లో బినాకా టూత్ పేస్టంటె ఇష్టపడటానికి కారణం. పేస్ట్ బాక్సులో ఒక్కోసారి ఒక్కో
జంతువుల బొమ్మల్ని పెట్టెవాళ్ళు. కొంతకాలం TRANSFER PICTURES పెట్టే వారు.
ఆ రోజుల్లో బినాకా అంత ప్రాచూర్యాణ్ణి పొందటానికి కారణం, రేడియో సిలోన్లో ప్రతి భుధ
వారం రాత్రి 8 గంటలకు శ్రీ అమీన్ సయానీ నిర్వహించే హిందీ సినిమాల బినాకా గీత్
మాల. ఆ ప్రోగ్రాం కోసం ఎప్పుడు భుధవారం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే
వారు. ఇక టూత్పేస్టుల ప్రకటనలు తమాషాగా ఉంటున్నాయి. పిల్లవాణ్ణీ డెంటిస్ట్ దగ్గరకు
తీసుకెళ్ళిన తండ్రిని ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారు అని అడిగితే "చవకరకం" అని అమా
యకంగా ముఖంపెట్టి జవాబివ్వడం,, అమ్మాయి, అబ్బాయి దగ్గరగా రా,దగ్గరగా రా అని
పాడుతూ పిలిచే క్లోజప్ ప్రకటన ఛూసారుగా. ఇప్పూడు కాల్గేట్ వాళ్ళు ఈటీవీలో పాడుతా
తీయగా ని స్పాన్సార్ చేస్తున్నారు.
చివరిగా మొట్టమొట్టదట టూత్బ్రష్ ని కొన్నదేవరో తెలియదుగాని, కనుక్కోన్నది
మాత్రం 1780 లో వియం ఆడిస్ అనే పెద్దమనిషట. బినాకా టూత్ పేస్ట్ తో నే సేకరించిన
బొమ్మలు చూడండి. ఆ నాటి అమీన్ సయాని బినాకా గీత్ మాలా కాసెట్ HMV వారు
విడుదల చేసారు.
టూత్పేస్టుల్లో ఎర్రవి,నీలంవి, చారలవి, పారదర్శకం వీ ఇలా ఎన్నోరకాలు.ఈప్పుడెమో
పిల్లలకూ ప్రత్యేకంగా వస్తున్నాయి. ఇలా ఎన్నో వ్యాపార చిట్కాలు !!

Sunday, July 18, 2010

అలనాటి టైప్ రైటర్ ఇక అగుపించదా ? !




ఇంతకుముందు మనం ఏ ఆఫీసుకు వెళ్లినా టైపు రైటర్ చేసే టిక్ టిక్ శబ్దాలు
వినిపిస్తుండేవి. ఇక ఆ టైపు నేర్పటానికి ప్రతి వీధికి ఒక ఇన్స్టిట్యూట్ అగుపించేది.
కాల క్రమాన కంప్యూటర్లు ప్రవేశించాక టైపు మిషన్లు అగుపించడం దాదాపు మానే
సాయి.ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు ఉండేవాడు. ఇప్పుడో ప్రతి బల్ల
మీదా కంప్యూటర్లే ! కావలిసిన మాటర్ని టైపు చేసి సులువుగా సేవ్ చేసుకొనే
సదుపాయం కలిగింది. మరో విషయం టైపు రైటర్ అనగానే సాధారణంగా అమ్మాయిలే
టైపిస్టులుగా ఉండేవారు. మీకు "పెళ్ళినాటి ప్రమాణాలు" సినిమా గుర్తుందా. అందులో
రాజసులోచన టైపిస్టు. ఆ అమ్మాయిని ఇష్టపడే ఇద్దరు ముసలి గుమాస్తాలు అల్లు,
చదలవాడ కుటుంబరావులు చేసే కోతి చేష్టలు భలే నవ్వులు కురిపిస్తాయి.1868లో
క్రిష్టఫర్ లాతమ్ షోల్స్ మొట్టమొదటి టైపు రైటర్ కనుక్కొన్నాడు.తరువాత అతని నుంచి
రెమింగ్టన్ కంపెనీ రైట్స్ సంపాదించి ఉత్పత్తిని ప్రారంభించింది. టైపు రైటర్ని ఉపయోగించిన
ప్రముఖ రచయితలు మార్కట్వైన్,లియో టాల్స్టాయ్.. తమ రచనలకు టైపు రైటర్నే
ఉపయోగించే వారట. కొత్తది రాగానే పాతది కనుమరుగవటం సాధారణమే. కానీ OLD
IS GOLD అని మన పెద్దలమాటను గౌరవిస్తూ మీ దగ్గర ఓ వేళ పాత టైపు మిషన్ ఉంటె
పారేయకండి. పాత తరం గుర్తుగా జాగ్రత్త చేయండి. నా దగ్గర ఆ నాటి పాత టైపు మిషను
ఇంకా వుంది. ఇలా టైపు రైటర్ గురించి మీతో చెప్పటానికి కారణం ఈ మధ్య బొంబాయి
TIMES OF INDIA పత్రికలో DEATH OF THE TYPEWRITER అన్న ఆర్టికల్
చదివి, రాజమండ్రి కి తిరిగి రాగానే నా టైపు రైటర్ని ఆప్యాయంగా మరోసారి తనివి తీరా
చూసుకున్నాను.




!

Friday, July 09, 2010

బాలుతో పాడుతా తీయగా అంటున్న అ(బా)పురూపరమణీయం

నవ్వుల జల్లులు కురిపిస్తున్న ఈ రమణీయుణ్ణి, బాపురే అనిపిస్తూ చిత్రగీతలని గీస్తున్న
యువ జంటని గుర్తుపట్టారా ! ఈ ఇద్దరబ్బాయిలూ అశేషాభిమానుల గుండెల్లో
నిత్యయవ్వనులుగా నిలచిన బాపూరమణీయులు !! ఇప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు
మరో బాలు(డు)గారితో ఈటీవీ ’పాడుతా తీయగా’ ప్రేక్షక శ్రోతలకు వీ(క)నులను రమణీ
యం చేయబోతున్నారు. ఇంకేం, ఈ నెల 12వ తేదీ సోమవారం రాత్రి 9-30 గంటలకు
ప్రసారం అవుతున్న బాలు(పూ) రమణీయం అనే "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని
తప్పక చూడండి. బాపు చిత్రాల్లోని (అదే నండీ సినిమాల్లోని) క(ర)మణీయ పాటలను
!ఆస్వాదించండి!

Wednesday, July 07, 2010

ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచుకమ్మ!!


ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచ్చుకమ్మ!!

ఆంధ్రప్రదేష్ లో చాలా నగరాల్లోని పిల్లలకు పిచ్చుకలంటే ఏమిటో తెలియదు.
అలనాటి డైనొసార్ల లాగ కనుమరుగైఫోయాయి. కాని, ఈ ముంబాయి మహా
నగరంలో మాత్రం ప్రతి రోజూ పిచ్చుకలు ప్రత్యక్షమవుతూ కనువిందుకలిగిస్తు
న్నాయి! బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చి గెంతులేస్తూ చిరు ఎండ లో
పడిన గ్రిల్ల్ నీడను ముక్కుతో పొడుస్తుంటే తన చిన్నారి ముక్కుతో ముగ్గు
లేస్తున్నట్లు అనిపించింది ! వెంటనే నా కమేరాలో ఆ పిచ్చుకమ్మ కళానైపుణ్యాన్ని
దాచేశా!

Tuesday, July 06, 2010

బాబోయ్ ! ఈ రోజులు కాదు, ఆ రోజులే బాగున్నాయ్!!




ఒక్కొక్కప్పుడు మనం ఈ కాలంలో పుట్టివుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది. కానీ ఈ నాటి
చిన్నారుల కష్టాలు (వాళ్ళ నాన్నల,అమ్మల దృష్ఠిలో కాకపోవచ్చు) చూస్తుంటే మనం (మా వయసు
వాళ్ళ మాట సుమా నే చెప్పేది) ఈ కాలంలో పూట్టకపోవడమే దేముడిచ్చిన వరమెమోననిపిస్తుంది.
మా రోజుల్లో ఇప్పటిలా ఇంగ్లీష్ కాన్వెంట్లు లేక పోవచ్చు. మంచి చదువు చెప్పే బడులుండేవి. టీచర్లు
వ్యక్తిగత శ్రర్ధ తీసుకొనేవారు. అప్పుడు ఆ స్కూళ్లల్లో చదివిన వాళ్ళు గొప్ప డాక్టర్లయ్యారు,ఇంజనీర్లయ్యారు,
టీచర్లు,ప్రొఫెసర్లయ్యారు. నేను చదివిన మా రాజమండ్రి శ్రీ రామచంద్రా సిటీ హైస్కూల్లో 1956 SSLC
బాచ్ క్లాసులో అందరం పాసయ్యాము. మాకు ప్రతి ఆదివారం ఉదయం ఇంగ్లీష్ ప్రయవేట్ క్లాసు పెట్టే
వారు. లెఖ్ఖల మాస్టారు ప్రతి రోజూ ధీరమ్స్ అన్ని ప్రతి ఒక్కరిచేత ఐదు సార్లు ఇంపొజిషన్ వ్రాయించి
ఉదయాన్నే ఆయన టేబిల్ మీద ఉంచమనే వారు.అందుచేత లెఖ్ఖల్లో మొద్దబ్బాయి నైన నాకూ కంఠతా
వచ్చేవి. పరిక్షలవగానే శెలవులిచ్చేవారు. శెలవుళ్ళో మా బామ్మగారి ఊరు బాపట్లకి వేళ్ళేవాళ్ళం.ఏదీ
ఇప్పటి పిల్లలకు విశ్రాంతి ఎక్కడ? వాళ్ళు డిగ్రీ లేక పోతే ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యెదాకా చదువే
చదువు.
బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఓనెల గడప టానికి వచ్చిన మాకు,మా మనవడు చి" కౌస్థుభ్ ను
(వాడికి నిండా మూడేళ్ళు లేవు) ఉదయం ఆరింటికే నిద్రలేపి స్నానాలు పానాలు బలవంతంగా పూర్తి
చేయించి యూనిఫాం, మెళ్ళో ఓ బిళ్ళ ( అదే నండి, ఫొటో గట్రా) తగిలించి, వీపు వెనుక ఓ బ్యాగు,అందులో
ఓ రైన్కోటు, టిఫిన్ బాక్సు,వాటర్ బాటిల్ వగైరా ఉంచి, 7.30 కల్లా వచ్చే స్కూల్ బస్లో(తోసి)ఎక్కించి
మావాడు పని చేసే మలాడ్ లో ఉన్న ఆఫీస్ కు ఉరుకులూ పరుగులతో బయలుదేరటం చూస్తూంటే
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మాకు అలవాటై పోయింది,మీరేం వర్రీ కాకండి అంటాడు. ఈ సంధర్భంలో
నాకు నే చదివిన పాత చందమామలోని కధ జ్ణాపకం వస్తుంది. ఆ కధలో తండ్రి చెట్టుక్రింద నీడలో కూర్చుని
ఉంటే కొడుకు మిట్టమధ్యహ్నం ఇల్లు నేస్తుంటాడు.ఎండగా ఉంది కాసేపు దిగరా అంటె కొడుకు వినిపించు
కోడు. అప్పుడు తండ్రి ఏడాది మనవణ్ణి తీసుకొచ్చి ఎండలో కూర్చోపెడతాడు. వెంటనే కొడుకు దిగి వచ్చి
అదేమిటి పిళ్ళాణ్ణి ఎండలో ఉంచారు అంటాడు కోపంగా.ఇప్పుడు తెలిసిందా తండ్రి ప్రేమంటే ఏమిటో అని
తండ్రి జవాబిస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళైనా మనకు (మాకు) చిన్నవాళ్ళే కదండీ.

Friday, July 02, 2010

నవ్వుల పుస్తకం : "స్వాతి" బాపు కార్టూన్లు




"స్వాతి" వార పత్రికలో వారం వారం పంచ రత్నాల లాంటి పంచ రంగుల కార్టూన్లను
శ్రీ బాపు అందిస్తున్నారు.గతంలో వచ్చిన300 కార్టూన్లను ఋషి బుక్ హౌస్ వారు
మంచి ఆర్ట్ పేపర్ మీద రంగుల్లోగట్టి అట్టతో ’అట్ట’ హాసంగా అచ్చొత్తారు. మనకు ఏం
తోచనప్పుడూ, బోర్ కొట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేకుండా బయట వర్షం
కురుస్తున్నప్పుడు ( ఐనా వర్షం బయటగాక ఇంట్లో కురుస్తుందా ) సరదాగా పదే
పదే చూసి ( ఆ అందమైన బొమ్మలు చూసినా చాలు) చదివి నవ్వుకోవచ్చు. ఈ బాపు
గారి కార్టూన్లు ఒట్టి సంసార పక్షంవి, శృంగార పక్షంవి,,దేముళ్ళు దేవతలవీ, ఆ నాటి ఈ
నాటి కవులవి. రాజులవి, రాజకీ(చ)య నాయకులవీ,డాక్టర్లవి వాళ్ల పేషంట్లవీ, కారులూ,
కళాకారులవీ, గుళ్ళూ వాటి పూజారులు వాళ్ళ భార్యలవీ ( బాపు గారు గుళ్ళను ఎంత
అందంగా వేశారో), జంతువులూ, వాటి సంసారాలవి మనకు ప్రతి పేజీలోనూ
అగుపడి ( పేజీ ఒకే రంగుల బొమ్మే నండి) నవ్వుతూ పలకరిస్తాయి.
రిమోట్ నొక్కగానే మాయమైపోయే టీవీ ( పే.15), ఇంటిల్లిపాదీ టివికి అతుక్కుపోతే,
తన క్లాసు పుస్తకాలకు అతుక్కుపోయిన చంటాణ్ణి చూసి తెగ బెంగ పడిపోతున్న అమ్మ
( పే 35), కోడలి మూగనోము గురించి సంబరపడిపోతున్న అత్త (పే 57),ఇంటికి వచ్చిన
అతిధులు ఎంతకీ కదలకపోతే ఇది తమ ఇళ్ళు కాదేమో తామే వాళ్ళింటికి వచ్చామేమో
అని అనుమాన పడుతున్న భర్త ( పే157),తన రూముకు వచ్చిన స్నేహితురాలితో " ఆ
విక్కీ గాడితో పార్కుకు వెళ్ళావేమిటే" అంటున్న అమ్మడు( పే261) .ఈ కార్టూన్ చూడగానే
బాపు గారి భావం మీకు వెంటనే స్ఫురిస్తే మీరు మంచి శృంగార పురుషులన్నమాటే.!! ఇలా
ఒకటేమిటి ప్రతి కార్టూనూ ఓ ఆణిముత్యమే!మీ దగ్గర ఈ నవ్వుల రంగుల కార్టూన్ పుస్తకం
లేకపోతే ఇప్పుడే తీసు"కొనండి" !!