Friday, July 02, 2010

నవ్వుల పుస్తకం : "స్వాతి" బాపు కార్టూన్లు




"స్వాతి" వార పత్రికలో వారం వారం పంచ రత్నాల లాంటి పంచ రంగుల కార్టూన్లను
శ్రీ బాపు అందిస్తున్నారు.గతంలో వచ్చిన300 కార్టూన్లను ఋషి బుక్ హౌస్ వారు
మంచి ఆర్ట్ పేపర్ మీద రంగుల్లోగట్టి అట్టతో ’అట్ట’ హాసంగా అచ్చొత్తారు. మనకు ఏం
తోచనప్పుడూ, బోర్ కొట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేకుండా బయట వర్షం
కురుస్తున్నప్పుడు ( ఐనా వర్షం బయటగాక ఇంట్లో కురుస్తుందా ) సరదాగా పదే
పదే చూసి ( ఆ అందమైన బొమ్మలు చూసినా చాలు) చదివి నవ్వుకోవచ్చు. ఈ బాపు
గారి కార్టూన్లు ఒట్టి సంసార పక్షంవి, శృంగార పక్షంవి,,దేముళ్ళు దేవతలవీ, ఆ నాటి ఈ
నాటి కవులవి. రాజులవి, రాజకీ(చ)య నాయకులవీ,డాక్టర్లవి వాళ్ల పేషంట్లవీ, కారులూ,
కళాకారులవీ, గుళ్ళూ వాటి పూజారులు వాళ్ళ భార్యలవీ ( బాపు గారు గుళ్ళను ఎంత
అందంగా వేశారో), జంతువులూ, వాటి సంసారాలవి మనకు ప్రతి పేజీలోనూ
అగుపడి ( పేజీ ఒకే రంగుల బొమ్మే నండి) నవ్వుతూ పలకరిస్తాయి.
రిమోట్ నొక్కగానే మాయమైపోయే టీవీ ( పే.15), ఇంటిల్లిపాదీ టివికి అతుక్కుపోతే,
తన క్లాసు పుస్తకాలకు అతుక్కుపోయిన చంటాణ్ణి చూసి తెగ బెంగ పడిపోతున్న అమ్మ
( పే 35), కోడలి మూగనోము గురించి సంబరపడిపోతున్న అత్త (పే 57),ఇంటికి వచ్చిన
అతిధులు ఎంతకీ కదలకపోతే ఇది తమ ఇళ్ళు కాదేమో తామే వాళ్ళింటికి వచ్చామేమో
అని అనుమాన పడుతున్న భర్త ( పే157),తన రూముకు వచ్చిన స్నేహితురాలితో " ఆ
విక్కీ గాడితో పార్కుకు వెళ్ళావేమిటే" అంటున్న అమ్మడు( పే261) .ఈ కార్టూన్ చూడగానే
బాపు గారి భావం మీకు వెంటనే స్ఫురిస్తే మీరు మంచి శృంగార పురుషులన్నమాటే.!! ఇలా
ఒకటేమిటి ప్రతి కార్టూనూ ఓ ఆణిముత్యమే!మీ దగ్గర ఈ నవ్వుల రంగుల కార్టూన్ పుస్తకం
లేకపోతే ఇప్పుడే తీసు"కొనండి" !!

1 comment:

  1. మీ బ్లాగు చాలా బోల్డు అందంగా ఉంది

    ReplyDelete