Tuesday, July 06, 2010

బాబోయ్ ! ఈ రోజులు కాదు, ఆ రోజులే బాగున్నాయ్!!




ఒక్కొక్కప్పుడు మనం ఈ కాలంలో పుట్టివుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది. కానీ ఈ నాటి
చిన్నారుల కష్టాలు (వాళ్ళ నాన్నల,అమ్మల దృష్ఠిలో కాకపోవచ్చు) చూస్తుంటే మనం (మా వయసు
వాళ్ళ మాట సుమా నే చెప్పేది) ఈ కాలంలో పూట్టకపోవడమే దేముడిచ్చిన వరమెమోననిపిస్తుంది.
మా రోజుల్లో ఇప్పటిలా ఇంగ్లీష్ కాన్వెంట్లు లేక పోవచ్చు. మంచి చదువు చెప్పే బడులుండేవి. టీచర్లు
వ్యక్తిగత శ్రర్ధ తీసుకొనేవారు. అప్పుడు ఆ స్కూళ్లల్లో చదివిన వాళ్ళు గొప్ప డాక్టర్లయ్యారు,ఇంజనీర్లయ్యారు,
టీచర్లు,ప్రొఫెసర్లయ్యారు. నేను చదివిన మా రాజమండ్రి శ్రీ రామచంద్రా సిటీ హైస్కూల్లో 1956 SSLC
బాచ్ క్లాసులో అందరం పాసయ్యాము. మాకు ప్రతి ఆదివారం ఉదయం ఇంగ్లీష్ ప్రయవేట్ క్లాసు పెట్టే
వారు. లెఖ్ఖల మాస్టారు ప్రతి రోజూ ధీరమ్స్ అన్ని ప్రతి ఒక్కరిచేత ఐదు సార్లు ఇంపొజిషన్ వ్రాయించి
ఉదయాన్నే ఆయన టేబిల్ మీద ఉంచమనే వారు.అందుచేత లెఖ్ఖల్లో మొద్దబ్బాయి నైన నాకూ కంఠతా
వచ్చేవి. పరిక్షలవగానే శెలవులిచ్చేవారు. శెలవుళ్ళో మా బామ్మగారి ఊరు బాపట్లకి వేళ్ళేవాళ్ళం.ఏదీ
ఇప్పటి పిల్లలకు విశ్రాంతి ఎక్కడ? వాళ్ళు డిగ్రీ లేక పోతే ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యెదాకా చదువే
చదువు.
బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఓనెల గడప టానికి వచ్చిన మాకు,మా మనవడు చి" కౌస్థుభ్ ను
(వాడికి నిండా మూడేళ్ళు లేవు) ఉదయం ఆరింటికే నిద్రలేపి స్నానాలు పానాలు బలవంతంగా పూర్తి
చేయించి యూనిఫాం, మెళ్ళో ఓ బిళ్ళ ( అదే నండి, ఫొటో గట్రా) తగిలించి, వీపు వెనుక ఓ బ్యాగు,అందులో
ఓ రైన్కోటు, టిఫిన్ బాక్సు,వాటర్ బాటిల్ వగైరా ఉంచి, 7.30 కల్లా వచ్చే స్కూల్ బస్లో(తోసి)ఎక్కించి
మావాడు పని చేసే మలాడ్ లో ఉన్న ఆఫీస్ కు ఉరుకులూ పరుగులతో బయలుదేరటం చూస్తూంటే
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మాకు అలవాటై పోయింది,మీరేం వర్రీ కాకండి అంటాడు. ఈ సంధర్భంలో
నాకు నే చదివిన పాత చందమామలోని కధ జ్ణాపకం వస్తుంది. ఆ కధలో తండ్రి చెట్టుక్రింద నీడలో కూర్చుని
ఉంటే కొడుకు మిట్టమధ్యహ్నం ఇల్లు నేస్తుంటాడు.ఎండగా ఉంది కాసేపు దిగరా అంటె కొడుకు వినిపించు
కోడు. అప్పుడు తండ్రి ఏడాది మనవణ్ణి తీసుకొచ్చి ఎండలో కూర్చోపెడతాడు. వెంటనే కొడుకు దిగి వచ్చి
అదేమిటి పిళ్ళాణ్ణి ఎండలో ఉంచారు అంటాడు కోపంగా.ఇప్పుడు తెలిసిందా తండ్రి ప్రేమంటే ఏమిటో అని
తండ్రి జవాబిస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళైనా మనకు (మాకు) చిన్నవాళ్ళే కదండీ.

3 comments:

  1. మీకు ఆ రోజుల్లో ఎంతో శ్రద్ద తో చాలా,చాలా తక్కువ డబ్బులకి చదువు చెప్పిన టిచర్ల ఇంటికి ఒకసారి వెళ్లి ఎమైనా బహుమతి ఇస్తె వారు చాలా సంతోషిస్తారు. స్వంత ఊరికి వేళ్లినపొపుడు కనీసం మనం వారిని గుర్తు పేట్టుకొని ఒకసారి పలకరించినా చాలు. వీలైతె మీరు కాని మీ అబ్బయి కాని ఆ పనిచేయండి. నేను మా ఊరెళ్లినప్పుడు అలా చేస్తాను.

    ReplyDelete
  2. అవునండీ. నిజమే. చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  3. మిగతా విషయాలు ఎలా వున్నా ఈ కాలం చదువులకన్నా ఆ కాలం చాకిరేవులే మిన్న . ఉతుకుడే ఉతుకుడు పాపం పిల్లల్ని చూస్తే జాలేస్తుంది కానీ ఏం చెయ్యగలం చెప్పండి . ఏ ఎండకా గొడుకు పట్టక తప్పదుకదా .
    అన్నటు మీ మనవడు భలే ముద్దుగా వున్నాడు

    ReplyDelete