Thursday, October 14, 2010

మేలుపలుకుల మేలుకొలుపులు


శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపుగారి వర్ణ చిత్రాలతో
తమిళం లో వున్న తిరుప్పావై దివ్యప్రబంధం తెలుగులోనికి
అందంగా తెనిగించారు. ఆ అందాల మేలుకొలుపులో సిరినోము
అనే ముందు మాటలో రమణ గారు వ్రాసిన కొన్ని మాటలను
మీ ముందు వుంచుతున్నాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"కొండంత దేవుడికి గోరంత పత్రి చాలు - అది భక్తితో ఇస్తేనే.
వేదవేదాంతాలు అర్ధపరమార్ధాలూ మంత్ర తంత్రాలూ తెలిసిన
ఎంత జ్ఞాని అయినా భక్తి లేకుండా కొండంత పత్రీ పూలూ
గుమ్మరించినా అవి గోరంత కూడా స్వామికి చేరవు-చాలవు.
ఈశ్వర స్పృహలేని జ్ఞానం మేఘాలమధ్య ఇరుక్కున్న సూర్య
చంద్రుల వంటివి.కొరగాని వెలుగు, అట్టి జ్ఞానానికి అహంకారమనే
చత్వారం వస్తుంది".
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
కలియుగంలోని శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి-ద్వాపరంలోని
రేపల్లె గొల్లభామగా తనని తాను భావించుకుంది. తమ మధ్యనే
తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం,రాత్రి
వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన
భావరాగానురాగాల పారిజాతాల మాల ఈ తిరిప్పావై.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రమణగారు ఇంకా ఇలా అంటారు, "ప్రసిద్ధగాయని ఎం.ఎల్.
వసంతకుమారి ఈ పాశురాలను గ్రామఫోను రికార్డులుగా
ఇచ్చారు ( 78 ఆర్.పి.యం).అప్పట్లో ఈపి,ఎల్పీ (ఎక్స్ టెండెడ్ ప్లే,
లాంగ్ ప్లే} రికార్డులు కూడా రాలేదు.టేపులు అంతకన్నా లేవు.
మైలాపూరులో బాపు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి
కోవెల దగ్గరకు తెల్లవారు జామున నాలుగింటికి వెళ్ళి నిలబడితే
ఈ పాశురాలు నాలుగైదు (న్యాయంగా రోజుకు ఒకటే) పెట్టేవారు.
హాయిగా మెత్తగా స్తోత్రగానం లాగ వుండేది ఆవిడ పాట. నేను
అనుకున్న అల్లరి తనం లేకున్నా- ఏదో గొప్ప పాట వింటున్నా
మన్న ఆనందంతో భక్తితో అవి విని వెళ్ళిపోయేవాడిని. పాటలో
సంగతికీ పాటల సంగతికీ కొంతయినా పొంతన కుదిరేది"
ఆ పాటల మీద ఇష్టం,ఆయన చేత తేట తెలుగులో మనకు
ఆ పాశురాలు అందటం మనం చేసుకొన్న అదృష్ఠం.
చివరిగా శ్రీ ముళ్లపూడి ఇలా అంటారు:
" ఇదీ జరిగింది-ఇది నేను వ్రాసిందికాదు-
శ్రీ అండాళ్ తల్లి అనుగ్రహించింది,ధన్యోస్మి"
ప్రతి ఒక్కరు చదివి స్వంతం చేసుకోవలసిన ఈ అందాల
పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్, విజయవాడ వారు ప్రచురించారు.
వివరాలకు:e-mail: emescobooks@yahoo.com
web:emescobooks.com

Wednesday, October 13, 2010

మా ఇంట్లో ఆపాతమధురాల పాట కచేరీలు!!



. గత మూడేళ్ళుగా అనారోగ్యంతో మూలన పడ్ద నా ఫిలిప్స్ రికార్డ్ ప్లేయర్ని
ఇక్కడి ఫిలిప్స్ కంపెనీ డాక్టరు కిషణ్ జాయిన్ చేసుకొని అన్ని టెస్టులూ
చేసి పెదవి విరిచారు. బాగుకానందుకు నాకన్నా ఆయనే చాలా విచారించాడు.
బెంగలూరు నుంచి "మన తెలుగు చందమామ" , "సాహిత్యాభిమాని" శ్రీ శివరామ
ప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయనకు ఈ విషయం చెబితే బాగవకపోవడం
వుండదు ,దాని తాలూకు కండెన్సరు తప్పక దొరుకుతుందని నన్ను ఓదార్చారు.
ఈ విషయం వైజాగులోని మా బావగారికి చెబితే ఇక్కడ ప్రయత్నిద్దామంటే
పేషెంట్ ను వైజాగుపంపించాను. అక్కడ శ్రీ షణ్ముఖరావు గారనే టీవీఇంజనీర్
చూసి తిరిగి సంఫూర్ణ ఆరోగ్యవంతునిగా చేసిచ్చారు. ఇప్పుడు ప్రతి రోజూ మా
ఇంట్లో సంగీత కచేరీలే! యమ్మెస్.సుబ్బులక్ష్మి,యం.యల్.వసంతకుమారి,
పాలువాయి భానుమతి, చిట్టిబాబు, ద్వారం వెంకట స్వామినాయుడు , యస్.
జానకి వీళ్ళంతా తమ అమృతగానంతో, వాయిద్యాలతో వీనుల విందు చేస్తున్నారు.
శ్రీ సి.నారాయణరెడ్డి గారు "కర్పూరవసంతరాయలు" కవితా గానం చేసిన యల్పీ
వింటుంటే అయన మన ఎదురుగా కూర్చొని చదువుతున్న మధురానుభూతి
కలుగుతుంది. శ్రీమతి భానుమతి యల్పీ లో "స్వర్గసీమ" చిత్రంలోని "ఒహో,
ఒహో పావురుమా"," "ఓ తపోధనా"తో బాటూ,"విప్రనారాయణ"లోని "సావిరహే",
"రారా నా స్వామి రారా" లే. కాకుండాసన్నిజాజి తీవలోయ్, నగుమోము
గనలేని మొదలైన పాటలుఎన్ని సార్లు విన్నా విసుగురాదు.అలానే యస్.జానకి
యల్ఫీలో నీ లీల పాడెద (సన్నాయితో పోటీగా),గున్నమామిడి, నీలిమేఘాలలో,
పగలె వెన్నెల మొదలయిన పాటలున్నాయి. శ్రీ పి.బి.శ్రీనివాస్ యల్ఫీలొ శ్రీహయ
గ్రీవశ్తోత్రమ్, శ్రీ పాందురంగ అష్ఠకం మొదలైన శ్తోత్రాలు పది వున్నాయి.
. >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
నా దగ్గరవున్న స్టీరియోఫోనిక్ సౌండ్ డిమాన్ స్ట్రేషన్ యల్పీలో రకరకాల సౌండ్
ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో రెండు రైళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో వెలుతున్నప్పటి
సౌండ్, టేబిల్ టెన్నీస్ ఆడుతుంటే రెండు స్పీకర్లలోబంతి కుడి ఎడమలకు
వేస్తున్నపటి సౌండు విటుంటే మన ఎదురుగా ఆడుతున్నట్లే అనిపిస్తుంది.
నా సంతోషాన్నిఆత్మీయులైన మీ అందరితో పంచుకుంటున్నాను..ఇరవై ఎనిమేదేళ్ళ
క్రితం రికార్డ్ ప్లేయర్ కొన్న ఆనాటి బిల్లు ( 3-11-82) కూడా మీరు చూడొచ్చు!!

Tuesday, October 12, 2010

గెడ్దం కబుర్లు

.
గెడ్దాలగురించి కొంచెం చెప్పాలనివుంది. హాస్యబ్రహ్మ
జ్యంధ్యాలగారి ఓ సినిమాలో ఈ డైలాగుంటుంది. పంజాబ్
వెళ్ళి బార్బర్ షాపెట్టినట్టు అని. మరో విషయం మీకు
తెలుసా, సిక్కయినా, శిఖ్ఖయినా గెడ్డం పెంచుతారు.
ఈ మధ్యనే మా హాసం మితృడు హనుమంతరావు
సకుటుంబంగా కాశీ వెళ్ళి సిక్కయ్యాడు. హిందువుగా
వెళ్ళి శిఖ్ఖయి వాచ్చారన్నమాట అన్నాను. పూర్వం
ఋషులందరికీ గెడ్డాలు, మీసాలు తప్పక వుండేవి.
ఎక్కడో అరణ్యాలలో ముక్కుమూసుకొని తపస్సు చేసు
కొనే వారికి మీసాలు,గెడ్డాలు పెరగక మానవు గదా!
ఇప్పటీకీ కొందరు నిష్టగా ఆచారాలు పాటించేవారు
గెడ్డం చేసుకోవడానికి వారం వర్జ్యం పాటిస్తుంటారు.
. అప్పటి రోజుల్లో ఇప్పటి లా ఉద్యోగాలు చేసే
అవసరం అంతగా లేక పోవటం చేత గెడ్డాలు పెంచు
కున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ రోజుల్లో మాసిన గెడ్డంతో
ఆఫీసుకు వెళితే అదోలా చూస్తారు. కొందరు మొగాళ్ళకు
గెడ్డమే అందం.ఆరుద్ర గారు తన "ఇంటింటి పజ్యాలు"లో
మగాడి గెడ్డం గురించి ఇలా వ్రాశారు.
" రోజూ గీసుకోని మగాడి గెడ్డం
మోజున్న సరసానికొస్తుందా అడ్డం ?"
ఆరుద్ర అనుభవంమీదే చెప్పుంటారు. ఏ మంటే ఆయనా
గెడ్డం పెంచేవారని మీకు తెలుసుగా! నాకు స్టూడెంట్ గా
వున్నప్పుడు ఓ సందేహం వచ్చేది. శ్రీరాముల వారు,
లక్ష్మణ స్వామి అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు క్లీన్
షేవ్ తో అగుపించేవారుకదా, ఎలాగా అని. ఆ విషయాన్ని
మా నాన్నగారిని అడిగితే బాణం ములుకుల్ని ,ఇప్పటి మన
బ్లేడుల్లా ఉపయోగించివుంటారు అని సమాధానం చెప్పారు.
నిజమే కావొచ్చు గదా?! ఇక గెడ్దం తో వుండే ప్రముఖులు
దేశ విదేశాల్లో ఎంతోమంది వున్నారు. అదేమిటొ సైంటిస్టులకు,
ప్రొఫెసర్లకు తప్పక గెడ్డం వుండి తీరుతుంది. చార్లెస్ డార్విన్,
అబ్రహంలింక్లన్,రవీంద్రనాధ్ ఠాగూర్ ఇలా ఎందరొ! మన గత
తెలుగు సినిమాల్లో హీరో మారువేషం కోసం ఓ గెడ్డం పెట్టు
కొనే వాడు. అదేం విచిత్రమో విలన్, హీరోయిన్ ,మరెవరూ
కూడా హీరోను గుర్తుపట్టరు.!! అర్జనుడుకూడా గెడ్డం పెట్టుకొనే
మారు వేషంలో సుభద్రను కలుస్తాడు. సినిమాల్లో,నాటకాల్లో
గెడ్డంవేషాలువేసేవారికి ఓ ప్రత్యేక గమ్ తో గెడ్డాలు, మీసాలు
అతికిస్తారట. "మాయాబజార్" తమిళ వెర్షన్ లో బలరాముడు
పాత్రధారికి ఆ గమ్ ఎలర్జీ అవటం వల్ల గెడ్డం లేకుండానే
అగుపిస్తాడట!!
ఇక గెడ్డాల మీద నానుడులూ వున్నాయి. "అడ్డాలు నాడు
పిల్లలు కాని, గెడ్డాలు దాకా కాదుకదా" అనేది ఒకటి. ఇప్పటి
యువ హీరోలు చిరు గెడ్డం ( చిరంజీవి గెడ్డం కాదు) తోనే అగు
పిస్తున్నారు. అదో ఫాషన్ ఈ కాలంలో.ఇలా గెడ్డాల గురించి
వ్రాయాలంటే ఎంతైనా రాయొచ్చు.పూర్తయేటప్పటికిమనకు
గెడ్డాలు మీసాలూ పెరగటం ఖాయం.ఆ భయం చేతే ఫుల్ స్టాప్
పెట్టేస్తున్నాను.



Monday, October 11, 2010

సీనియర్సార్!! మన సీయస్సార్ !!



సియస్సార్ అనే చిలకలపూడి సీతారామాంజనేయులు నటించిన
మొదటి సినిమాకే ఐదు వేలు పారితోషికంగా తీసుకొన్న గొప్ప
నటుడు. ఆ రోజుల్లో సినిమాలన్నీ కొల్హాపూర్ లోనె తీసే
వారు. ఆయన కృష్ణుడిగా నటించిన "ద్రౌపదీ వస్త్రాపహరణం"
చిత్రానికి మొదట వేసుకొన్న బడ్జెట్ ఎనభైవేల రూపాయలైతే
చివరకు అది లక్షాఇరవైవేల రూపాయలయిందట. ఆయన
స్వరం లోఓ రకమైన ప్రత్యేకత వుంది. నాటకాల్లో ఆయన
పద్యం చదివితే ఒన్సుమోర్లతో హాలు నిండి పోయేది. తరువాత
సినిమాల్లో కృష్ణుడిగా పద్యం ఆలాపించే దృశ్యం రాగానే నాటకాల్లో
లాగ ప్రేక్షకులు ఒన్సు మోర్ అని అరిస్తే హాల్లోని ఆపరేటర్లు రీళ్ళను
వెనక్కీ తిప్పి మళ్ళీ వేసేవారట. "కన్యాశుల్కం" సినిమాలో
మధురవాణి పాత్ర ( సావిత్రి ) తో సీయస్సార్ నటన మరువ
లెనిది. "లొట్టిపిట్టలు" అన్న మాటకు సావిత్రి విరగబడి నవ్వటం
అప్పుడు సీయస్సార్ నటన అద్భుతం. "మాయాబజార్" చిత్రంలో
ఆయన పోషించిన శకుని మామ పాత్ర, "దేవదాసు"లొ సావిత్రి
భర్తగా "దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అన్న నటన,ఇలా
ప్రతి సినిమాలో దేనికదే మరపురానివి. . 11-07-1907
జన్మించిన ఈ మహానటుడు, 8-10-1963 న కీర్తిశెషులయ్యారు.
సీయస్సార్ హాస్యాన్నే కాదు దుష్టపాత్రలనూ అనితరసాధ్యంగా
పోషించారు. మద్రాసులో పాండీబజారులో తన బ్యూక్ కారులో
వచ్చి సినీజనాలతో కబుర్లాడేవారట.
బాపు గారు తన కార్ట్యూన్లలో సియస్సార్ గురించి ఇలా అంటారు:
జీవన్నాటక రంగంపై
నటరంగంపైన తరంగంపై
ముత్తరాల పెద్దంతరాలపై
ముక్కుమాటలే ముద్దుబాటగా
మారక ఆగే సీనియర్సార్-
ఆయన ’సీయస్సారు’ చైర్మన్ పాండీబజారు......
( ఈ చిన్న రచనకు శీర్షిక, కార్ట్యూను బాపుగారినుంచి సంగ్రహించా.
మా బాపు గారికి నమోవాకాలు)

Sunday, October 10, 2010

నవ్వుల జాలీ బాయ్!ఆలీ!!


మా రాజమండ్రి నవ్వుల రాజు ఆలీ !
పరిమళాల నవ్వుల పువ్వులు పంచే ఓ తోటమాలీ!!
నీ కామెడీ మా మనసుకెంతో జాలీ !!
కలకాలం నీ నవ్వులు మాకు ఇలానే పంచాలీ!!
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న మా ఆలీకి శుభాశీస్సులు
తెలియజేస్తూ ఆలీ గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను.
మా చిన్నారి ఆలీ హాస్యనటుడిగా ఎదిగాడంటే మేమంతా ఎంతో
ఆనందిస్తున్నాము. మొదటి సినిమా "పునాదిరాళ్ళు" లో ఓ చిన్న
వేషంతో సినిమాల్లో గట్టి పునాదిని ఏర్పరుచుకొన్నాడు మన ఆలీ.
"సిరిసిరిమువ్వ" హిందీ వర్షన్ రాజమండ్రిలో షూటింగ్ జరిగినప్పుడు
మా రాజమండ్రి అమ్మాయి జయప్రద పుట్టినరోజు అప్సర ఆడిటోరియం
లో జరిగింది.ఆ నాటి కార్యక్రమంలో దర్శకుడు శ్రీ విశ్వనాధ్ గారితో
బాటు హీరో రిషికపూర్,శశికళ మొదలైన హిందీ నటీనటులు కూడా
పాల్గొన్నారు.ఆ కార్యక్రమాన్ని మా మిత్రుడు , నటుడు, ఆంధ్రాకిషోర్
గా పేరుపొందినగాయకుడు శ్రీపాద జిత్ మోహన్మిత్రా సారధ్యంలో జరిగింది.
ఆ సభలో చిన్నారి ఆలీ, మొహమ్మూద్ డ్యాన్స్ చేసి అందరి మెప్పూ
పొందాడు. ఆలీ నాన్న గారు కష్టజీవి.టైలరింగ్ చేస్తూ నలుగురు ఆడ
పిల్లలను, అబ్బాయి ఆలీని పోషించారు. సినిమాల్లో అంచలంచలుగా
పెరిగి ఆలీ ప్రయోజకుడయ్యాడు.తల్లి దండ్రులను హైదరాబాదు తీసు
కువెళ్ళాడు. అక్కాచెల్లెళ్ళకు పెళ్ళీల్లు జరిపించాడు. నిర్మాత అచ్చిరెడ్డి
"యమలీల" చిత్రం లో ఆలీకి హీరో వేషం ఇచ్చి పొత్సహించారు. ఆలీ
తెర మీద కనిపించగానే ప్రేక్షకుల ముఖంనవ్వుల్తో చేటంతవుతుంది.
ఎన్న చేటన్నా, అక్కుంబక్కుం అంటూ వింత ప్రయోగాలు చేసినా అది
ఆలీకే చెల్లింది. ఇంత ఉన్నత స్ఠితికి ఎదిగినా ఆలీ ఇంకా అనుకువగానే
వుంటాడు.అదే అతనికి,అతని కుటుంబానికి శ్రీరామ రక్ష. అన్నట్టు
ఈ రోజు తేదీ కూడా ప్రత్యేకమే! గమనించారా! 10-10-10 !!!

Saturday, October 09, 2010

పక్షి దాచిన జాబు (1953) చందమామ కధ!



"చందమామ"లో సాధారణంగా ఎటువంటి కధలు మనం
చదువుతాం.రాజకుమారులు, మాంత్రికులు,దేవకన్యలూ,
ఎగిరే గుర్రాలు ఇలా మనల్ని మరోవింతలోకాలకు తీసు
కొని వెళ్ళే కధలు. సాంఘిక కధలు, ఆసలు అగుపించవు.
ఐనా 1953 మార్చి సంచికలో "పక్షి దాచిన జాబు"అనే
సాంఘిక కధ, వి.నారాయణమ్మ గారు వ్రాసింది ప్రచురించ
బడింది. ఈ కధ ప్రారంభమే ఇలా సాగుతుంది!
"మద్రాసు,త్యాగరాయనగరులో రత్నం,సీతాపతి,అని
యిద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు.చిన్నప్పటి
నుంచి ప్రాణస్నేహితులుగా పెరిగారు"
క్లుప్తంగా కధ ఏమిటంటే ఓ నాడు ఈ ఇద్దరూ బజారులో
చిత్రంగా దెబ్బలాడు కొంటారు. మరు నాడు సీతాపతి నెత్తురు
మడుగులో చనిపోయి అగుపిస్తాడు. అందరూ రత్నాన్ని
అనుమానిస్తారు.పోలీసులు రత్నాన్ని అదుపులోకి తీసు
కొంటారు. ఈ లోగా ఆ ఊరి గుడి గోపురం పైకిఎక్కి ఆట
లాడు కొంటున్న పిల్లల్లొ ఒకడికి గుడి గూటిలో ఓ ఉత్తరం
అగుపిస్తే దాన్ని తన తండ్రికి చూపిస్తాడు.అందులో సీతాపతి
తను చెడువ్యసనాలకు బానిసైనానని, స్నేహితుడు రత్నం ఎంత
చెప్పినా వినలేదని, అప్పుల్లో కూరుకుపోయిన తను ఆత్మ
హత్య చేసుకొంటున్నాని వుంటుంది.అది అతని దస్తూరీ
అని నిర్ణయించి రత్నాన్ని విడుదల చేస్తారు.ఇదీ "పక్షి
దాచిన జాబు" కధ. ఇలా "చందమామ"లో ఓ సోషల్ కధ
అబ్బాయిలు పాంటు ,ఇన్ షర్టులతో అగుపించడం ఆరోజుల్లో
మాకు వింతగా తోచింది.అటు తరువాత అలాటి కధలు
మళ్ళీ మాకు మన చందమామలో అగుపించలెదు.ఈ రోజు
1953 నాటి నా పాత చందమామ వాల్యూమ్ చూస్తుంటే
ఈ కధ అగుపించి నా భావాలు మీతో పంచుకోవాలనిపించింది.

Friday, October 08, 2010

బాలల సినిమా - బాలానందం


పిల్లల సినిమాలు తెలుగులో ఎక్కువ రావడం లేదు అంటారు
కానీ ఏ నాడో "భక్తధృవ" అనే పౌరాణిక సినిమా పూర్తిగా బాలల
తొ నిర్మించారట. 1954 లో పూర్తిగా "బాలానందం"పేరుతో బాలలతో
మూడు కధలతో ప్రకాశ్ ప్రొడక్షన్ బేనరుపై "రాజయోగం",
"బూరెలమూకుడు", "కొంటె క్రిస్టయ్య" పేరిట ఒక్కోకధ గంట
వుండేటట్లు నిర్మించారు. దీని నిర్మాత దర్శకుడు ఒక నాటి
హీరో ఐన కోవెలమూడి సూర్య ప్రకాశరావు. ఈయనే సూపర్
హిట్ మూవీ "ప్రేమనగర్" చిత్ర దర్శకుడు, డైరెక్టర్ రాఘవేంద్ర
రావు గారి తండ్రి.. "బాల" పత్రిక సంపాదకులు, రేడియో అన్నయ్య,
అక్కయ్యలు గా పేరుపొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి
దంపతుల సారధ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది.ఇందులోని
పిల్లలంతా బడికి వెళ్ళే బాలలు, బాలానంద సంఘ బాలలే!
1952 లో వచ్చిన విజయావారి" పెళ్ళి చేసి చూడు" సినిమాలో
బాలనటులుగా పేరుపొందిన మాస్టర్ కుందు,కందామోహన్
(ఈయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన కందా
మోహన్ I.A.S) ఈ చిత్రం లో నటించారు. బాలానందం పేరుతో
వచ్చిన ఈ సినిమాలోని మూడుకధలు మూడు విభిన్న కధలు.
ఇందులోని రాజయోగం కధ .చిలుక శాపవిముక్తి పొందడం,లాంటి
కధాంశంతొ పిల్లలకు ఆసక్తికరమైన జానపద కధ.ఇందులో హీరోగా
రేలంగి గారి అబ్బాయి సత్యనారాయణబాబు నటించాడు.ఈ మూడు
సినిమా కధలలోని ఎనిమిది పాటలను రాఘవరావుదంపతులు,
ఆరుద్ర రచించారు.ఈ సినిమాలోని "పళ్ళోయమ్మ పళ్ళు" పాటకు
నటించినది, ఆ నాటి బాల తార నిడదవోలు జోగాబాయి.ఈమె ప్రసిద్ధ
నటి జయసుధ తల్లిగారు!. తెలుగు వారి దౌర్భాగ్యం ఏమోకాని(తోటి
తెలుగువాళ్ళు నన్ను క్షమించాలి) ఈ సినిమా మళ్ళీ విడుదల
అవటంగాని, విసీడీల రూపంలో విడుదలవటం గాని జరగలేదు..
పాత హింది చిత్రాల సిడీలు మంచి క్వాలిటీతో దొరుకుతుంటే మన
సినిమాలు దొరకటంలెదు సరికదా, దొరికినవి ఐనా క్వాలిటి బాగుండటం
లెదు.ఈ సినిమా రిలీజయినప్పుడు నా వయసు 13 ఏళ్ళు! పెద్దయ్యాక
ఆ సినిమా మా పిల్లలకు చూపించలేక పోయానని ఇప్పటికీ బాధ
పడుతుంటాను. ఇందులోని బొమ్మలు భరాగో గారి "మరోనూట
పదహార్లు"సౌజన్యంతో, మీ ముందు వుంచుతున్నాను.