Thursday, October 14, 2010

మేలుపలుకుల మేలుకొలుపులు


శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపుగారి వర్ణ చిత్రాలతో
తమిళం లో వున్న తిరుప్పావై దివ్యప్రబంధం తెలుగులోనికి
అందంగా తెనిగించారు. ఆ అందాల మేలుకొలుపులో సిరినోము
అనే ముందు మాటలో రమణ గారు వ్రాసిన కొన్ని మాటలను
మీ ముందు వుంచుతున్నాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"కొండంత దేవుడికి గోరంత పత్రి చాలు - అది భక్తితో ఇస్తేనే.
వేదవేదాంతాలు అర్ధపరమార్ధాలూ మంత్ర తంత్రాలూ తెలిసిన
ఎంత జ్ఞాని అయినా భక్తి లేకుండా కొండంత పత్రీ పూలూ
గుమ్మరించినా అవి గోరంత కూడా స్వామికి చేరవు-చాలవు.
ఈశ్వర స్పృహలేని జ్ఞానం మేఘాలమధ్య ఇరుక్కున్న సూర్య
చంద్రుల వంటివి.కొరగాని వెలుగు, అట్టి జ్ఞానానికి అహంకారమనే
చత్వారం వస్తుంది".
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
కలియుగంలోని శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి-ద్వాపరంలోని
రేపల్లె గొల్లభామగా తనని తాను భావించుకుంది. తమ మధ్యనే
తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం,రాత్రి
వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన
భావరాగానురాగాల పారిజాతాల మాల ఈ తిరిప్పావై.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రమణగారు ఇంకా ఇలా అంటారు, "ప్రసిద్ధగాయని ఎం.ఎల్.
వసంతకుమారి ఈ పాశురాలను గ్రామఫోను రికార్డులుగా
ఇచ్చారు ( 78 ఆర్.పి.యం).అప్పట్లో ఈపి,ఎల్పీ (ఎక్స్ టెండెడ్ ప్లే,
లాంగ్ ప్లే} రికార్డులు కూడా రాలేదు.టేపులు అంతకన్నా లేవు.
మైలాపూరులో బాపు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి
కోవెల దగ్గరకు తెల్లవారు జామున నాలుగింటికి వెళ్ళి నిలబడితే
ఈ పాశురాలు నాలుగైదు (న్యాయంగా రోజుకు ఒకటే) పెట్టేవారు.
హాయిగా మెత్తగా స్తోత్రగానం లాగ వుండేది ఆవిడ పాట. నేను
అనుకున్న అల్లరి తనం లేకున్నా- ఏదో గొప్ప పాట వింటున్నా
మన్న ఆనందంతో భక్తితో అవి విని వెళ్ళిపోయేవాడిని. పాటలో
సంగతికీ పాటల సంగతికీ కొంతయినా పొంతన కుదిరేది"
ఆ పాటల మీద ఇష్టం,ఆయన చేత తేట తెలుగులో మనకు
ఆ పాశురాలు అందటం మనం చేసుకొన్న అదృష్ఠం.
చివరిగా శ్రీ ముళ్లపూడి ఇలా అంటారు:
" ఇదీ జరిగింది-ఇది నేను వ్రాసిందికాదు-
శ్రీ అండాళ్ తల్లి అనుగ్రహించింది,ధన్యోస్మి"
ప్రతి ఒక్కరు చదివి స్వంతం చేసుకోవలసిన ఈ అందాల
పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్, విజయవాడ వారు ప్రచురించారు.
వివరాలకు:e-mail: emescobooks@yahoo.com
web:emescobooks.com

2 comments:

  1. ఈ పుస్తకం 2009 లో నెట్లో ఎక్కడో, ఎవరో పి.డి.ఎఫ్ చేసి పెట్టేసారండోయి.....ఆ సైటు సంగతీ కబురూ, కాకరకాయ ఇప్పుడు తెలీదు కానీ, నేను "దింపుడు" కళ్ళం చేసిపారేసి కలర్లో ప్రింటు కూడా తీసుకున్నా....ఆ మధురమైన పాలు కలిపిన "కాపీ" వాసన ఇంకా తగులుతోంది ముక్కులకి.....

    ReplyDelete
  2. ఎవరైనా డౌన్లోడ్ చేసుకో దలుచుకుంటే ఇదిగో లింక్...
    http://www.archive.org/download/Tiruppavai-MullapudiBapu/tiruppavai-tel-bapu-without_pics.pdf
    బాపు గారి బొమ్మలు లేవు దానిలో..
    కానీ 'కాపీ' వాసన కన్నా బాపు గారి బొమ్మలతో నిండైన కొత్త పుస్తకం వాసన ఇంకా చాలా బాగుంది.
    - http://radhemadhavi.blogspot.com/

    ReplyDelete