Saturday, December 18, 2010

రచయిత జర్నలిస్ట్ శ్రీ నండూరి రామమోహనరావు




1950-60 శకాలలో ఆంధ్రవారపత్రిక పాఠకులకు శ్రీ నండూరి రామమోహనరావు
పేరు తెలియని వారుండరు. ఆ రోజుల్లో శ్రీ నండూరి ఆంధ్రవారపత్రికలో పిల్లల
కోసం రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " కాంచనద్వీపం" (TREASURE ISLAND)
మార్క్ ట్వేన్ "టామ్ సాయర్", హకల్ బెరీ ఫిన్", "రాజూ పేద " ,"విచిత్రవ్యక్తి "
(The Myysterious Stranger) అనువదించారు. తెలుగు మీడియంలో
చదువుకొన్న మేము అలా ప్రశిద్ధ ఆంగ్ల నవలలను తెలుగులో చదివే అవకాశం .
కలిగింది. ఆయన అనువాదం కూడా మరో భాష నుంచి తెనిగించినట్లు కాకుండా
తెలుగులో స్వయంగా వ్రాసిన రచనలానే వుండేది. ఆయన విశ్వాత్ముల
నరసింహమూర్తి గారు చిత్రించిన పంచతంత్రం బొమ్మల కధలకు, అటు
తరువాత బాపు గారు వేసిన "అసంప్రేక్ష్యకారిత్యం" బొమ్మల కధలకు
గేయ రచన చేశారు. దురదృష్టవశాత్తు నా దగ్గర అప్పటి ఫంచతంత్రం
బొమ్మల కధల పుస్తకం ( ఆంధ్రగ్రంధమాల ప్రచురణ) ఎవరో సంగ్రహించారు.
ఐనా మిత్రలాభం లో లేడి వేటగాడి వలలో చిక్కినప్పుడు మితృడు వాయసం
పాత్రకు " మేతకోసమై వలలో పడెనే పాపం పసివాడు" అంటూ శ్రీ నండూరి
వ్రాసిన గేయం ఇంకా నాకు గుర్తుంది..శ్రీ నండూరి ఖగోళ భౌతిక శాస్త్ర రచన
"విశ్వరూపం", మానవ పరిణామ శస్త్రగ్రంధం "నరావతారం" రచించారు.
ఆంధ్రజ్యొతి దిన పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు సంకలన రూపంగా
వెలువడ్డాయి. శ్రీ నండూరి రామమోహనరావుగారు కృష్ణా జిల్లా ఆరుగొలనులో
1927, ఏప్రియలు 24 న జన్మించారు. నూజివీడు, మచిలీపట్నాలలో హైస్కూల్
చదువు, రాజమండ్రిలో కాలేజీ చదువు పూర్తి చేశారు. 1948 జనవరి నుండి
1960 జూన్ వరకు ఆంధ్రవారపత్రిక అటుతరువాత ఆంధ్రజ్యోతి పత్రికలలో
పనిచేశారు. అమెరికా, రష్యాలలో పర్యటించారు. శ్రీ రామమోహనరావు గారి
సోదరి శ్రీదేవిగారిని శ్రీ ముళ్లపూడి వివాహమాడారు. శ్రీ రామమోహనరావు గారికి
మీ అందరి తరఫున నమస్సుమాంజలి !

Friday, December 17, 2010

పుట్టినరోజు


"మీ పుట్టిన రోజు ఎప్పుడండీ?" అని అడిగితే " ప్రతి ఏడాదీ !" అన్నాడట ఓ చమత్కారరావు.
నిన్న ( 15-12-10) మన బాపుగారి పుట్టిన రోజునే మన బ్లాగరు ఫణిబాబుగారి పుట్టిన రోజు
కూడా ! నా పుట్టిన రోజు ముళ్లపూడి వారి పుట్టిన రోజుకు ఒక నెల ముందు , 10 సంవత్సరాల
వెనుక! అంటే ఆయన పుట్టింది 28-జూన్1931, నేను పుట్టింది 28-మే,1941 !. ప్చ్! అలా
మిస్సయ్యాను. ఐతేనేం విశ్వనట చక్రవర్తి , తెలుగువారు అనే వారు వున్నారనిదేశానికి చాటి చెప్పిన
మన నందమూరి తారక రామారావుగారి పుట్టిన రోజూ , నా పుట్టిన రోజూ తేదీ, నెల ఒకటే
అయినందుకు అదో తుత్తి ! ప్రఖ్యాత హాస్య నాటక రచయిత (ఆయన రచించిన కీర్తిశేషులు
నాటకం తోనే రావు గోపాలరావు మురారి పాత్రలో ప్రశిద్ధి పొందారు)భమిడిపాటి రాధాకృష్ణ తెలుగులో
మనపూర్తిపేరు వ్రాసిస్తే మన పుట్టిన తేదీ చెప్పేవారు. అలా ఒక సారి NTR కూడా తన పూర్తి పేరు
( నందమూరి తారక రామారావు ) అని వ్రాసిస్తే అసలైనజన్మతేదీ రాలేదట! మీరు ఈ
విషయంలో తప్పారు కదా అని ఎన్టీయార్ అంటే నా లెఖ్ఖ సరైనదే, మీ పేరే ఎక్కడో తప్పు.
మీరు పుట్టిన ఊర్లో కనుక్కోండి అన్నారు రాధాకృష్ణ. ఎంత మొండి వాడైనా, NTR ఆయన
పుట్టిన ఊర్లో రికార్డులు పరిశీలిస్తే ఆయన పేరు నందమూరి తారక రామారావు చౌదరి అని
రికార్డయి వుందట. ఆ పూర్తి పేరుతో చూస్తే అయన పుట్టిన తేదీ , నెల, సంవత్సరము సరిగా
వచ్చిందట. శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ తెలుగు అక్షరాలన్నిటికి వత్తులతో సహా వేరువేరు
సంఖ్యలను ఇస్తూ కొన్ని లక్షల సంఖ్యలను కూర్చారు. ఉదాహరణకు "శాస్త్రి" అన్న పేరుకు
"శ" కు ఒక సంఖ్య దీర్ఘానికి ఒక సంఖ్య "స", "సి", ర,తవత్తుకు, ఇలా వేరు వేరు సంఖ్యలను
వ్రాసుకున్నారన్నమాట. ఆయన 5000 సంవత్సరాల "భమిడిపాటి కాలెండర్" అన్న
పుస్తకాన్ని వ్రాశారు. శ్రీ భమిడిపాటి ఎన్నో తెలుగు చిత్రాలకు కధ, సంభాషణలను వ్రాసారు.
కొంతకాలం ఆయన రాజమండ్రి S.R.City High Scool ల్లో మాస్టారుగా పనిచేసినప్పుడు
నేను ఆయన స్టూడెంట్ గా చదువుకొనే అదృష్టం కలిగింది. ఈ కధంతా పుట్టినరోజుల కధా
కమామిషుల గురించి చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది.
ఇక్కడి ఫొటొ శ్రీ భమిడిపాటి ఫణిబాబు , శ్రీమతి లక్ష్మి గార్లు బాపు గారిని చెన్నైలొ
కలిసి నప్పటిది.ఫణిబాబుగారికి మన బ్లాగందరి తరఫున మరో సారి జన్మదిన శుభాకాంక్షలు!
పుట్టిన రోజులపై ఆరుద్ర తమ ఇంటింటి పజ్యాల్లో ఏమన్నారో ఓ సారి చిత్తగించండి.
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>
ఇంగ్లండును పరిపాలించే రాణులూ రాజులు
ఎంచక్కా జరుపుకోంటారు ఏడాదికి రెండు పుట్టింరోజులు
ఒకటి నిజంగానే పుట్టిన్రోజు
ఇంకోటి లాంచనాలు పాటించటానికి పెట్టిన రివాజు
నాకూ ఉన్నాయి అలాగే రెండు జనమదినాలు
నేనూ చేసుకొందామనుకుంటాను ఉత్సవాలు
ఒకటి ఇంగ్లీషు తారీఖువారిది
ఇంకోటి తెలుగు పంచాంగం వారిది
అవి జ్ఞాపకం వస్తాయి శ్రీమతి, నా పూబోటికి
అవి జరిగిపోయిన మూడోనాటికి
<><><><><><><><><><><><><><><><><>

Thursday, December 16, 2010

నా " గందరగోళం" సీరియల్ నవల


ఆమావాస్యరాత్రి! రాత్రి పన్నెండయింది. కుమారి తన భర్త కోసం ఆతృతతో బాల్కనీలో
నిలబడిఎదురుచూస్తున్నది. వెన్నెల నీడలో తోటలోని ఆశోక చెట్ల నీడలు దయ్యల్లా
బాల్కనీ గోడల పై పడి భయం వేస్తున్నది. గాలికి కదిలే ఆ చెట్ల నీడలు మరింత
భీభత్సంగా వున్నాయి. ఇంతలో కరెంటు పోయింది. హాల్లో సెల్ ఫోన్ మ్రోగింది. కుమారి
ఆ చీకట్లోనే స్విచ్ వెదికి లైటెసింది. టేబుల్ పైనున్న సెల్ తీసి హలో అంది. అవతలనుంచి
భయంకరమైన నవ్వు కోమలంగా వినిపించింది. భయంతో ఫొన్ క్రెడిల్ పై వుంచేసింది.
క్రింద టామీ కుయ్యో మంటు ఏడుస్తున్నది. పైనుంచి చూస్తే పక్క జట్కా వాడి గుర్రం
టామీనీ తన కొమ్ములతో కుమ్మివేస్తున్నది. ఇంతలో ఓ చల్లని చేయి భుజం మీద
పడింది. కుమారి కేవ్వుమని అరుస్తూ బాల్కనీలోకి పరిగెట్టింది. అసలే మండిపోతున్న
సూర్యుడి వేడికి బాల్కనీ నేల చుర్రుమని కుమారి పాదాలను చుర్రుమనిపించాయి.
ఆ కటిక చీకట్లో బాల్కనీ రెయిలింగ్ పైన పొడవైన ఆకారం నవ్వుతూ కనిపించింది.
ఈ సారి మరోసారి కెవ్వుమని అరవబోయింది. దూరంగా గోదావరినది, బ్రిడ్జి మీద
చార్మీనార్ ఎక్స్ ప్రెస్ వేగంగా పోతున్నది. వెనుకవైపు సముద్ర కెరటాల ఘోష వల్ల
ఏం వినిపించక కనిపించక అంతా గందరగోళం గా వుంది. బాల్కనీ రెయిలింగ్ మీద ఓ
పొడవైన మరుగుజ్జు జుట్టు విరబోసుకొని మళ్ళీ నిలుచునుంది. మరో సారి కెవ్వుమని........
తరువాయి వచ్చే ఏడాది ఇక్కడే ఎప్పుడో ఎక్కడో , భయం భయంగా ఎదురు చూస్తుండండి.
.
<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మొదటిసారిగా వ్రాస్తున్న ఈ నవల శైలి, కధ చెప్పేతీరు అద్భుతంగా వుంది కదండీ.
ఇంకేమి, పెన్నులో ఇంకయిపోయే దాకా నే భయంకరమైన భీభత్సమైన కధలు
వ్రాసేస్తా! కానీ మా శ్రీమతి పద్మ మాత్రంఈ నవల గంద్రగోళం గా వుందన్నది.
తను ఇలా వ్రాయలేనని జెలసీ తో అలా అన్నది కాని నవల పెరే "గందరగోళం" కదా?!
!

<><><><><><><><><>oOo<><><><><><><><>
కార్టూన్ బాపు గారి "కొంటె బొమ్మల బాపు " వాల్యూమ్ -2 సౌజన్యంతో
.

Wednesday, December 15, 2010

ఈ రోజు బాపుగారికి రెండేళ్ళు !!





*

అదేనండి , 15 డిసెంబరు 2010 మన బాపు గారికి రెండేళ్ళు (అంటే రమణ
గారి చమత్కార మాటల్లో 77 అన్నమాట.) ఆయన 1945 " బాల" లో బొమ్మలు
( ఇక్కడ బాపు చిన్నప్పుడు "బాల"లో గీసిన బొమ్మ చూడొచ్చు) గీయటం ప్రారంభించి
ఈరోజు అందాల బొమ్మాయిల సృస్ఠికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత ,గీతలు రెండూ
అపురూపంగా మారిపోతాయనీ, తెలుగు జాతి ఖ్యాతి "సీతాకళ్యాణం" తీసిన బొమ్మ
ద్వారా ఖండాంతరాలలో మారు మ్రోగుతుందనీ, ఆయన అక్షరాలు కంప్యూటర్
ఫాంటులుగా విశేష ఆదరణ పొందుతాయనీ, ఆయన వ్రాసిన " అందాల అ ఆ లు"
మాస్కో" రాదుగా" ప్రచురణాలయం పుస్తక రూపంలో ప్రచురిస్తుందనీ,తెలుగువారు ఊహించి
వుండరు.
ఆయన మంచి కధారచయిత కూడా! 1957 లో శ్రీ బాపు "మబ్బూ వానా-
మల్లె వాసనా-" అనే కధను లక్ష్మినారాయణ పేరిట వ్రాసారు.
)<<<<<<<<<<<<<<<<<౦.>>>>>>>>>>>>>>>>>>>>>(
అందాల బాపు రేఖలు
తరం తరం నిరంతరం కురిపిస్తున్నాయి నవ్వుల జల్లులు !!
బాపు అందాల లిపి తెలుగు తల్లికి కూర్చిన సుమ మాలలు !
కుంచె అనే మంత్ర దండంతో అమ్మాయిలను అందాల బొమ్మాయిలుగా మార్చే
చి (మం)త్రాల మాంత్రికుడు !!
తెలుగింటి ముంగిట నిత్యం ఆ బొమ్మాయిలు తీర్చుతున్నాయి " ముత్యాల ముగ్గులు "!
ఆయన సృష్ఠించిన అబ్బాయిలంతా ఆ బొమ్మాయిలకు "అందాల రాముళ్ళే!"
అరవై ఏళ్ళుగా తరగని అభిమానులే అందుకు " సాక్షి "!
పొగడ్తలకు పొంగిపోని "బుద్ధిమంతుడు " !!
ఆయన ఇష్ఠ దైవం దేశవిదేశాల్లో జరుపుకున్నాడు ఘనంగా "సీతాకళ్యాణం " !!
ఆయన్తో " స్నేహం " కడు " రమణీ"యం !!
నాటికీ నేటికీ, ఏ నాటికీ నవ్వించి కవ్వించే బాపు బొమ్మలకు లేదు సరి సాటి !!
బాపూ గారూ,
మీ బొమ్మలంటే నాకెంతో కసి !!
ఆ బొమ్మల్ని చూసి చూడగానే చింపేస్తా !!
ఆ పై అంటించేస్తా !!
కలకాలం నా ఆల్బమ్స్ లో దాచేస్తా !!
హాపీ బర్త్ డే టూ యూ !!


Tuesday, December 14, 2010

చాయాగ్రాహకుడు, దర్శక నిర్మాత, బి.ఎస్.రంగా






కమేరామాన్, దర్శకుడు, విక్రమ్ ఫిలిమ్స్ అధిపతి శ్రీ బిందినగబవాలే శ్రీనివాస్
అయ్యంగార్ తన 93వ ఏట చెన్నైలో కన్నుమూశారన్న వార్త "తెనాలి రామకృష్ణ"
"అమరశిల్పి జక్కన" చిత్రాల అభిమాన ప్రేక్షకులకు బాధాకరమైన వార్త. ఎన్టీఆర్,
ఏయన్నార్, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు
ఆయన దర్శకత్వం లో నటించారు. "లైలామజ్ఞు", "దేవదాస్" లాంటి చిత్రాలకు
ఆయన చాయాచిత్ర దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలకు ప్రభుత్వ బహు
మతులు పొందాయి. "తెనాలి రామకృష్ణ" లోని పాటలు, పద్యాలు, "అమరశిల్పి
జక్కన" చిత్రం లోని "ఈ నల్లని రాలలో" పాటలు మర్చిపోగలమా?! "
శ్రీ బి.ఎస్.రంగా శ్రర్ధాంజలి ఘటిస్తూ.......,

Monday, December 13, 2010

శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యానికి 60 ఏళ్ళు !


1950 జూన్లో మొదటి సారిగా ప్రచురించబడ్డ శ్రీశ్రీ "మహాప్రస్ఠానం" ఈ ఏడాది
60 సంవత్సరాలు పూర్తి చేసుకొని షష్టి పూర్తి చేసుకొంటున్నది ! తెలుగులో
ఇప్పటికి 30 సార్లు పునర్ముద్రణకు నోచుకొన్న పుస్తకం ఇదే కావొచ్చు.
మహప్రస్థానం పుస్తకానికి "యోగ్యతాపత్రం" పేరిట ముందు మాటను ప్రఖ్యాత
రచయిత చలం జూలై 17, 1940 లోనే వ్రాశారు. కాని పుస్తకం విడుదలయింది
పదేళ్ళ తరువాత ! ఇందులోని ప్రతి కవిత వేగంగా సాగిపోతుంది. కమ్యూనిజానికి
ఆకర్షితులైన వాళ్ళే కాకుండా , ప్రతి ఒక్కరు ఈ కవితలను అమితంగా ఇష్టపడ్డారు.
తన కవితలను శ్రిశ్రీ తన మితృడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితమిచ్చారు.
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు,
పదండి త్రోసుకు !
పోదాం, పోదాం పైపైకి ! అంటూ పాఠకుల్ని ప్రతి కవితా ముందుకు త్రోసుకొని
పోతుంది. పాఠక హృదయాల్లో శ్రీశ్రీ చిరంజీవి! శ్రీశ్రీ ఈ కవితల్ని"Three cheers
for Man" పేరిట స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి 1956లో ప్రచురించారు.

Sunday, December 12, 2010

నిద్ర పోరా తమ్ముడా!



రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా,
డబ్బు జబ్బు చేసినవాళ్ళకీ, నిద్ర పట్టదు. కొందరు ఆ నిద్రకోసం నిద్ర మాత్రలు
వాడుతుంటారు. ఆకలి రుచెరెగదు , నిద్ర సుఖమెరుగదు అంటారు కదా! బాగా
పని చేసాక గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకొని పడు
కున్నా మనకు ఒకోసారి నిద్ర రానే రాదు. అదే చూడండి, ఆరుబయట కాయ
కష్టం చేసుకొనే వాళ్ళు రోడ్డు ప్రక్కనున్న ఇసుక గుట్టమీద, కంకరరాళ్ళమీద
పడుకున్నా ఇట్టె సుఖంగా నిద్రపోతారు. నాకు పుస్తకం చదివుతుంటే నిద్ర రాదు
గానీ టీవీ చూస్తుంటె మాత్రం భలే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర వస్తే పోయి పడుకో
రాదా అని శ్రీమతి అంటే మంచం మీదకు చేరగానే చస్తే నిద్ర పట్టదు. కొంతమంది
ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లోనిద్ర పోతుంటారు.
" రాత్రంతా నిద్రలేదు సార్" అని ఆఫీసరుతో గుమస్తా గుర్నాధం అంటే "ఏవిటీ?
నువ్వు ఇంట్లోకూడా నిద్ర పోతావా? ! " అని ఆశ్సర్య పోయాడట ఆఫీసర్ ఆనంద
రావు. నిద్ర మీద నిద్ర పట్టక మేధావులు మేలుకొని ఆ టైములో నిద్ర మీద కొన్ని
నానుడులు చెప్పారు!
" నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?"
" నిద్ర పోయినవాణ్ణి లేప వచ్చు కానీ మేలుకున్న వాణ్ణి ఎవరూ లేపలేరు "
" నిద్రపోయిన వాడి కాళ్ళకు మొక్కినట్లు"
ఇక సినిమాల్లోనూ నిద్ర మీద ఎన్నో మంచి పాటలొఛ్ఛాయి. లతామంగేష్కర్
తెలుగులో సంతానం చిత్రంలో పాడిన తొలి పాట,’" నిదురపోరా తమ్ముడా!,నిదురలోన
గతమునంతా నిముషమైనా మరిచిపోరా " వింటుంటే అలా నిద్రలోకి జారిపోతాం!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "రాజమకుటం" చిత్రానికి వ్రాసిన " సడిసేయ కో గాలి! సడిసేయ
బోకే! బడిలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే ", ఆత్రేయ "మూగమనసులు" చిత్రానికి
వ్రాసిన " పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా", సినారె
"ధనమా-దైవమా" చిత్రానికి వ్రాసిన " నీ మది చల్లగా స్వామీ నిదురపో,దేవుని నీడలో
వేదన మరచిపో-నీ మది చల్లగా,, "జీవనజ్యోతి" చిత్రానికి " ముద్దుల మా బాబు నిద్ద
రోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు.." ,"సూత్రధారులు" చిత్రం లో ఆయనే
వ్రాసిన " జోలాజోలమ్మ జోలా, జేజేలా జోల"ఇవి కొన్ని నిద్ర పాటలకు ఉదాహరణలు..
కొందరు వాళ్ళు చెయ్యాలనుకున్న పని పూర్తయేదాకా నిద్ర పోమంటారు. నారా
చంద్రబాబు నాయుడు గారు ఉద్యొగులతో "నే నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను"
అంటూ వుండే వారు. ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి వన వాసం నుంచి వచ్చేదాకా నిద్ర
పోతూ నే వున్నదట! ఇక నిద్ర పొతే ఒక పట్టాన లేవని వాళ్ళను కుంభకర్ణ నిద్ర
అంటారు. పరీక్షల రోజుల్లో నిద్ర రాకుండా వుండటానికి టీ తాగుతూ నిద్ర ఆపుకుంటూ
వుంటారు. నిద్ర గురించి రాస్తుంటె నిద్ర ముంచు కొస్తున్నది. నిద్ర మత్తు వదలటానికి
కొన్ని నిద్ర జోకులు చెప్పుకుందామా మరి !

>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<

కుంభకర్ణుడితో రాక్షసులు - " ఏమండోయ్, నిదుర లేవండోయ్"
<><><><><><><><><><><>
" అదేమిటొయ్-ఈ మధ్య బొత్తిగా మరీ అలా గుర్రు పెడుతున్నావు ?"
" నాకిలాగే వచ్చు, నచ్చకపోతే వినకు."
<><><><><><><><><><><><><>
ఒకావిడ డాక్టరు దగ్గరికి వెళ్ళి " మావారికి కలవరింతలండీ, చంపేస్తున్నారు" అంది
" మందిస్తాను పట్టుకెళ్ళండి అవే పోతాయి..."
" అబ్బే పోవడానికివ్వకండి. కాస్త స్పష్టంగా మాట తెలిసేలా కలవరించడానికి
మందివ్వండి.... ఆ పిల్ల పేరు తెలీటం లేదు"
<><><><><><><><><><><><><><><>
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో