"మీ పుట్టిన రోజు ఎప్పుడండీ?" అని అడిగితే " ప్రతి ఏడాదీ !" అన్నాడట ఓ చమత్కారరావు.
నిన్న ( 15-12-10) మన బాపుగారి పుట్టిన రోజునే మన బ్లాగరు ఫణిబాబుగారి పుట్టిన రోజు
కూడా ! నా పుట్టిన రోజు ముళ్లపూడి వారి పుట్టిన రోజుకు ఒక నెల ముందు , 10 సంవత్సరాల
వెనుక! అంటే ఆయన పుట్టింది 28-జూన్1931, నేను పుట్టింది 28-మే,1941 !. ప్చ్! అలా
మిస్సయ్యాను. ఐతేనేం విశ్వనట చక్రవర్తి , తెలుగువారు అనే వారు వున్నారనిదేశానికి చాటి చెప్పిన
మన నందమూరి తారక రామారావుగారి పుట్టిన రోజూ , నా పుట్టిన రోజూ తేదీ, నెల ఒకటే
అయినందుకు అదో తుత్తి ! ప్రఖ్యాత హాస్య నాటక రచయిత (ఆయన రచించిన కీర్తిశేషులు
నాటకం తోనే రావు గోపాలరావు మురారి పాత్రలో ప్రశిద్ధి పొందారు)భమిడిపాటి రాధాకృష్ణ తెలుగులో
మనపూర్తిపేరు వ్రాసిస్తే మన పుట్టిన తేదీ చెప్పేవారు. అలా ఒక సారి NTR కూడా తన పూర్తి పేరు
( నందమూరి తారక రామారావు ) అని వ్రాసిస్తే అసలైనజన్మతేదీ రాలేదట! మీరు ఈ
విషయంలో తప్పారు కదా అని ఎన్టీయార్ అంటే నా లెఖ్ఖ సరైనదే, మీ పేరే ఎక్కడో తప్పు.
మీరు పుట్టిన ఊర్లో కనుక్కోండి అన్నారు రాధాకృష్ణ. ఎంత మొండి వాడైనా, NTR ఆయన
పుట్టిన ఊర్లో రికార్డులు పరిశీలిస్తే ఆయన పేరు నందమూరి తారక రామారావు చౌదరి అని
రికార్డయి వుందట. ఆ పూర్తి పేరుతో చూస్తే అయన పుట్టిన తేదీ , నెల, సంవత్సరము సరిగా
వచ్చిందట. శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ తెలుగు అక్షరాలన్నిటికి వత్తులతో సహా వేరువేరు
సంఖ్యలను ఇస్తూ కొన్ని లక్షల సంఖ్యలను కూర్చారు. ఉదాహరణకు "శాస్త్రి" అన్న పేరుకు
"శ" కు ఒక సంఖ్య దీర్ఘానికి ఒక సంఖ్య "స", "సి", ర,తవత్తుకు, ఇలా వేరు వేరు సంఖ్యలను
వ్రాసుకున్నారన్నమాట. ఆయన 5000 సంవత్సరాల "భమిడిపాటి కాలెండర్" అన్న
పుస్తకాన్ని వ్రాశారు. శ్రీ భమిడిపాటి ఎన్నో తెలుగు చిత్రాలకు కధ, సంభాషణలను వ్రాసారు.
కొంతకాలం ఆయన రాజమండ్రి S.R.City High Scool ల్లో మాస్టారుగా పనిచేసినప్పుడు
నేను ఆయన స్టూడెంట్ గా చదువుకొనే అదృష్టం కలిగింది. ఈ కధంతా పుట్టినరోజుల కధా
కమామిషుల గురించి చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది.
ఇక్కడి ఫొటొ శ్రీ భమిడిపాటి ఫణిబాబు , శ్రీమతి లక్ష్మి గార్లు బాపు గారిని చెన్నైలొ
కలిసి నప్పటిది.ఫణిబాబుగారికి మన బ్లాగందరి తరఫున మరో సారి జన్మదిన శుభాకాంక్షలు!
పుట్టిన రోజులపై ఆరుద్ర తమ ఇంటింటి పజ్యాల్లో ఏమన్నారో ఓ సారి చిత్తగించండి.
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>
ఇంగ్లండును పరిపాలించే రాణులూ రాజులు
ఎంచక్కా జరుపుకోంటారు ఏడాదికి రెండు పుట్టింరోజులు
ఒకటి నిజంగానే పుట్టిన్రోజు
ఇంకోటి లాంచనాలు పాటించటానికి పెట్టిన రివాజు
నాకూ ఉన్నాయి అలాగే రెండు జనమదినాలు
నేనూ చేసుకొందామనుకుంటాను ఉత్సవాలు
ఒకటి ఇంగ్లీషు తారీఖువారిది
ఇంకోటి తెలుగు పంచాంగం వారిది
అవి జ్ఞాపకం వస్తాయి శ్రీమతి, నా పూబోటికి
అవి జరిగిపోయిన మూడోనాటికి
<><><><><><><><><><><><><><><><><>
హ్మ్! బాగుందండీ..ఐతే మీరు నాలాగే రెండు పుట్టినరోజులు జరుపుకుంటారన్నమాట...
ReplyDeleteచాలా బాగున్నాయి మీరిచ్చిన వివరాలు.
ReplyDeleteప్రత్యేకించి ఆ పేరును బట్టి పుట్టినరోజు చెప్పే పెద్దమనిషిని గుఱించిన విషయం చాలా బాగుంది. అలాంటి వారిని ఎప్పుడైనా కలిస్తేబాగుండును అనిపిస్తుంది.
రాకేశ్వరరావు గారూ, భమిడిపాటి రాధాకృష్ణగారు సెప్టెంబరు 4, 2007 న రాజమండ్రి లొ పరమందించారు. . ఆయన తనడైరీలో సెప్టెంబరు నాలుగోతేదీ ని అడ్డంగా ముందుగా కొట్టేసి తన మరణాన్ని ముందే తెలియజేశారు.అంతకు ముందు ఆయన్నీ నే కలసి మొదటి వారంలో మళ్ళీ కలుస్తానండీ,అంటే అప్పూడు నువ్వు నన్ను కలవడం కుదరదయ్యా, ఈ లోగా ఓ సారి రా అంటే ఆయన ఊరికి వేళుతున్నారేమో అనుకున్నాను.
ReplyDeleteభమిడిపాటి రాధాకృష్ణ మాస్టారు
కృష్ణాష్టమి రోజున ముహూర్తం పెట్టుకొని మరీ వెళ్ళిపోయారు !
మమ్మల్ని ఏడిపిస్తూ, ఆ కొంటె దేముడ్ని నవ్వించడానికి కాబోలు!!
"పల్లేటూరి బావ"కే కాదు, "కాలేజీబుల్లోడు"లాంటి
వందకు పైగా సిన్మాలకు మాటలు నేర్పిన నేర్పరి !!
మీ నాటకాలు "అంతాఇంతే"కాదు సుమా!
అవి తెలుగు నాటకాలకు "పేటెంట్ మందులు"
మీ మాటలతో పలికికించారు హాస్యాలు !
తెలుగు అక్షరాలకు లక్షల్లో లెక్కలు కట్టి, చెప్పారు జోస్యాలు !!
మీ ఐదు వేల ఏండ్ల కేలండర్
ఈనాటికి ఏనాటికి మరువలేని వండర్!
సురేఖ. గురువుగార్ని స్మరిస్తూ
చాలా మంచి విషయాలు చెప్పారు. Thanks!
ReplyDelete