అరిచే కుక్కలు కరవవు అని అంటారుగాని ఆ నానుడిమీద విశ్వాసం
లేక కంగారు పడవలసి వస్తున్నది. ఇప్పుడు శునకరాజులు, రాణులు
రోడ్లమీదే కాదు టీవీ ఆన్ చేయగానే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయ్ !
కుక్కలు అనకుండా జాగిలాలు , శునకాలు అంటూ పెద్ద మాటలు వ్రాయ
టానికి కారణం, వాటిని కుక్కలు అంటే వాటికి కోపమొస్తుందో లేదో
తెలియదుకానీ పెంచుకొనేవాళ్ళకు తప్పక కోపం వస్తుంది. మా ఇంట్లో
కూడా వళ్లంతా జుట్టుతో టిబెటెన్ జాతి కుక్క (సారీ దాని పేరు " నిక్కీ " )
వుండేది. దాన్ని ఎవరైనా కుక్క అంటే మా పెద్దమ్మాయి మాధురికి
కోపం వచ్చేది. అలాటప్పుడు, రోజులు బాగాలేనప్పుడు వాటిని కుక్కలు
అని పిలిస్తే కోపం వచ్చి పీకి పెట్టవూ?! ఆ డాగులు కరిస్తే ఇక వళ్లంతా
గాయాల డాగులే !
కుక్కలు కరిస్తే సర్కారీ ఆసుపత్రుల్లో మందులు లేవుట ! కుక్కకాటుకి
చెప్పుదెబ్బ అన్నారు కాబట్టి ఆ ఆసుపత్రుల దగ్గర మందులు లేకున్నా
ఓ చెప్పుల దుకాణం అస్మదీయులచేత తెరిపిస్తే వ్యాపారం భేషుగ్గా వుంటుంది!
కొందరు రాజకీయనాయకులు మేము కాపలా కుక్కలం వాసన పట్టేస్తాం
అంటుంటారు. బహుశ అవి డబ్బుల మూటల వాసన కావొచ్చు. కుక్కలకన్నా
ఇలాటి వాళ్ళుంటేనే అసలు ప్రమాదం!
ఇక కొందరు కుక్కల్ని పెంచుకుంటారు కాని వాటి పై శ్రర్ధ చూపించరు.
సకాలంలో వాటికి వాక్సిన్ వేయించాలి. మన ఇంటికి కొత్తవాళ్ళు, పిల్లలు
వచ్చినప్పుడు వాటిని కట్టి వుంచాలి. పిల్లలకు లాగానే వాటికీ డిసిప్లిన్
నేర్పాలి. మనం వళ్ళొ ఎక్కించుకుంటున్నాం కదా అని అతిధుల వళ్ళొకి
చేరకుండా ఛూడాలి. భయపడుతున్న వాళ్ళను అదేం చేయదు అంటూ
చెప్పటం కన్నా అలాటివి జరగకుండా ఛూడాలి. ఇక వీధుల్లోకి వెళ్ళేటప్పుడు
పిల్లల్ని చేయ్యి పట్టుకొని దగ్గరగా నడిపించుకొని తీసుకుని వెళ్ళాలి.
కుక్క బతుకు అంటారుకాని చాలా కుక్కలు రాజభోగాలు అనుభవిస్తాయి.
ఓ అమెరికా ప్రెసిడెంటు గారి కుక్కలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో
విమానంలో వెళుతుండేవి ! మరో విషయం, ప్రఖ్యాత గ్రామఫోన్ కంపెనీకి
వ్యాపార చిహ్నంగా నిప్పర్ అన్న పేరుగల కుక్క ప్రఖ్యాతి పొందింది. ఫ్రాన్సిస్
బర్రాడ్ అనే చిత్రకారుడు 1900 లో గ్రామఫోనులో వస్తున్నగాత్రాన్ని ఆత్యంత
శ్రర్ధతో వింటున్న నిప్పర్ అనే కుక్క ను ఓసారి గమనించి రంగుల
చిత్రంగా కాన్వాస్ మీద సృష్టించాడు. కుక్కలు తమ యజమానులపై చూపించే
విశ్వాసం మీద ఎన్నెన్నొ కధలున్నాయి. వాటికీ బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి.
రోడ్ల మీద నానా చెత్తా పడేయటం వల్లే వీధుల వెంట ఇలా స్ట్రే డాగ్స్ ఎక్కువవు
తున్నాయి. వాటికి స్టెరిలైజేషన్ చేయించాలి. అలా వాటి సంఖ్యను నిరోధించాలి..
ప్రభుత్వ హాస్పటల్స్ లో వాక్సిన్ అందుబాటులో వుండేటట్లు ప్రభుత్వం శ్రర్ధ
తీసుకోవాలి. ఇప్పటి రాజకీయనాయకులకు నువ్వు కుక్కవి, కాదు నువ్వే
పిచ్చికుక్కవి అని ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజాపాలనను కుక్కలు చింపిన
విస్తరిగా మార్చకుండా వుంటే కుక్కలకే కాదు జనాలకు మంచిరోజులొస్తాయి.
No comments:
Post a Comment