Wednesday, June 15, 2011

ప్ర శ్నలు = జవాబులు

ప్రజలమైన మనకు నిత్య జీవితంలో ఎన్నో ప్రశ్నలు! కొన్నిటికి జవాబులు దొరుకుతాయి !
మరికొన్నిటికేమో జవాబే దొరకక పోవచ్చు. చదువుకొనే రోజుల్లో పరీక్షల్లో ప్రశ్నలు, తరువాత
ఉద్యోగంలో చేరేటానికి ఇంటర్వూ పేరిట ప్రశ్నలు ! ప్రశ్నలను సందేహాలనికూడా అంటారు.
అసలు ఈ ప్రశ్నలు ఇప్పటివా ? పురాణాల్లోకూడా యక్ష ప్రశ్నల పేరున అగుపిస్తాయి. ఇక
మనం చందమామలో చదివిన భేతాళ కధల్లోని ప్రశ్నలు తెలుసుగా. అందులో శవంలోని
భేతాళుడు విక్రమాదిత్యుడికి కధలు చెబుతూ చివరో ప్రశ్న వేసి జవాబు తెలిసీ చెప్పక
పోయావో నీ బుర్ర వెయ్యి చెక్కలవుతుందంటూ బ్లాక్మయిల్ కూడా చేస్తుంటాడు.
మన నిజ జీవితంలో కూడా ఇలా ప్రశ్నలు వేసి మన ప్రాణాలు తీసే భేతాళులు ఎదరవుతూ
వుంటారు. వాళ్ళకు అన్నీ సందేహాలే.! ఒకాయన అగుపించి నప్పుడళ్ళా "ఏవిటీ! రిటైరయి
పోయారా? " అంటూ అదుగుతుంటాడు. నేనూ " రెటైరయ్యా, కానీ ఇంకా పొలే " అంటూ
జవాబిస్తుంటాను. మనం రైల్లోనో , బస్సులోనో బయలుదేరగానే మన ముక్కూ మొఖం
తెలియని వాడుకూడా మనం ఎక్కడికి ఎందుకు వెళుతున్నామో అక్కడ ఎన్ని రోజులు
అఘోరిస్తామో ఇలా అన్ని విషయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇలాటి వాళ్ల నుంచి
తప్పించుకోడానికి వెంటనే రీడర్స్ డైజెస్ట్ తీసుకొని ( ఇదైతే సాధారణంగా ఎవరూ అడగరు)
అందులో మునిగి పోతాను.



ప్రశ్నలు, జవాబులూ అన్నవీ అన్నివేళాలా ఇబ్బందికరం అనలేము. పత్రికలలో ఇంతకు
ముందు ఈ శీర్షిక తప్పక వుండేది. బాబూరావ్ పటేల్ సంపాదకత్వంలో చాలా ఏళ్ళక్రితం
వెలువడిన ఇంగ్లీషు సినిమా పత్రిక లో ఆయన నిర్వహించిన ప్రశ్నలు-జవాబులు పాఠకుల
విశేష ఆదరణ పొందింది. ఆయన చమత్కార జవాబుల కోసమే ఆ పత్రికను కొనేవారు. నాకు
బాగా గుర్తు. what is family planning ? అని ఒక పాఠకుడు అడిగిన ఓ ప్రశ్నకు బాబూరావ్
పటేల్ జవాబు : Heating the stove without cooking ! అని. ఇలానే ఫిల్మ్ ఫేర్ పత్రికలో
ఐ.యస్.జోహర్ జవాబులిచ్చేవారు. అటుతరువాత శతృఘ్నసిన్హా జావాబులిచ్చారు. మన తెలుగు
పత్రిక సినిమారంగంలో జీవీజీ ( గడియారం వేణుగోపాలకృష్ణ) , ఆంధ్రప్రభ వీక్లీలో మాలతీ చందూర్
ప్రశ్నలు-సమాధానాలు వీశేష ఆదరణ పొందాయి. ప్రఖ్యాత నాటక రచయిత కీ.శే. ఎన్నార్ నంది
నవ్వులు పువ్వులు హాస్య పత్రికలో జవాబులు బాగుండేవి. ఒక పాఠకుడు " మిమ్మల్ని కాల్చేసి
పార్టీ చేద్దామనుకుంటున్నాను " అని వ్రాస్తే నందిగారి జవాబు " ఎప్పుడు, మండేనాడా ! " అని !!


శ్రీ జంధ్యాల "బావా బావా పన్నీరు" సిన్మాలో ప్రశ్నలు జవాబులతో హాస్యాన్ని పండించారు.
చిత్తగించండి :
అయ్యా ! తాగడానికేమన్నా తీసుకురమ్మంటారా ?
ఆ..తీసుకురా..
కాఫీ తీసుకురానాండయ్యా.. టీ తీసుకురానా ?
కాఫీ తీసుకురారా.
ఒహొ....స్ట్రాంగా ఉండాలయ్యా..లైట్ గానా ?
స్ట్రాంగాన్నే తీసుకురా
ఒహొ..షుగరు ఉండాలంటారా, వద్దంటారా ?
వద్దురా..తండ్రీ వద్దురా..నువ్వెళ్లరా
ఓహొ..గ్లాసులో తీసుకురానండయ్యా, కప్పులోనా ?
గంగాళంలో తీసుకురారా దరిద్రపు కుంకా, అందులో స్నానం చేస్తా., అహాహా..ఓహొహొ
అంటూ సబ్బురుద్దుకుంటూ స్నానం చేస్తా, కుమ్మరి పురుగు టైపులో నా బుర్ర తొలి
చేస్తున్నావు కదరా నువ్వు. ఫో ఇక్కణ్ణించి.
ఒహొ..బయటకు వెళ్ళమంటారయ్యా...లోపలికా...?
ఒరే వెళ్ళు...వెళ్ళు

ఇలా ప్రశ్నలనుంచీ హాస్యం పుట్టించారు హాస్య బ్రహ్మ జంధ్యాల.
ఇక్కడి బొమ్మలు శ్రీ సురేంద్ర ( ది హిండూ ), చందమామ శంకర్ శౌజన్యంతో...

1 comment:

  1. "అంతెందుకు..? ఇదిచాలు కదా...!!" అని ప్రశ్నించే ప్రతీ వాడినీ సమాధాన పరచడానికి పూనుకొంటే చివరికి ఏమైందో చిత్తగించండి..!!
    ఒకడు చేపలు అమ్మే దుకాణం కొత్తగా పెట్టి బయట బోర్డు ఇలా పెట్టించాడు.."ఇక్కడ తాజా చేపలు అమ్మబడును.."
    ఒక ఆసామి వచ్చి బోర్డు చూసి.. "అబ్బాయ్..చేపలు ఎవడైనా తాజావే అమ్ముతాడు. నువ్వు ప్రత్యేకంగా 'తాజా' అని రాస్తే నిజంగా కావేమో అనుకుంటారు. మరి 'తాజా' ఎందుకు??" అని అడుగుతాడు. నిజమే కదా అని.. 'తాజా' చెరిపేస్తాడు. మిగిలింది " ఇక్కడ చేపలు అమ్మబడును.."
    ఇంకొకతనొస్తాడు "అబ్బీ..చేపలు అమ్మేది ఇక్కడే కదా అప్పుడు ఇంకా 'ఇక్కడ' ఎందుకు??" అంటాడు. సర్లేమ్మని 'ఇక్కడ' చెరిపేస్తాడు. మిగిలింది ."చేపలు అమ్మబడును.."
    మరొక వ్యక్తి వచ్చి " నువ్వేమీ ఉచితంగా ఇవ్వవనీ..కొనుక్కోవాలని మాకు తెలుసు. ఇంకా 'అమ్మబడును' ఎందుకూ..??" అంటే.. 'అంతేకదా కదా..!' అనుకోని మనవాడు 'అమ్మబడును' కూడా చెరిపేస్తాడు. మొత్తానికి బోర్డుమీద "చేపలు" మిగిలింది.
    ఇంతలో అటుగా వెళ్తున్నఒక పెద్దావిడ.."నీ చేపల కంపు బజారు చివరికి వస్తోంది. మళ్ళీ 'చేపలు' అని రాయాలి కూడానా..?" అంటుంది ముక్కు మూసుకొంటూ..!
    మనవాడికి తిక్కరేగి అదికూడా చెరిపేసి ఖాళీ బోర్డు వంక చూసి 'అమ్మయ్య' అనుకుంటాడు.
    అప్పుడే షాపుకొచ్చినతను "అదేమిటయ్యా..బోర్డు అలా ఖాళీగా పెట్టేబదులూ నువ్వేమిటి అమ్ముతున్నావో రాయోచ్చుకడా..!" అంటాడు కళ్ళజోడు సవరించుకొంటూ..
    ఇంక ఇప్పుడెం చెయ్యాలో తోచక తలపట్టుకోవడం మళ్ళీ మనవాడి వంతయ్యింది.
    ఏదైనా అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. కాదంటారా..!!

    ReplyDelete