Friday, June 24, 2011

ఏమీ "పాలు" బోక ఇలా క్షీరాభిషేకం చేశాను !!

మనకు పాలిస్తున్న వాళ్ళు, ఆవు , గేదెలతో బాటు రాజకీయ నాయకులూ వున్నారు !!
. అందుకే కాబోలు వాళ్ళళ్ళో కొంతమంది గడ్డి తింటుంటారు ! అలానే వాళ్ళకి పాలు
బాగా అందుబాటులో వుండటం వల్ల వీధికి ఒక్కటి వున్న వాళ్ళ నాయకుల విగ్రహాలకు
ఏదో ఒంకన పాలాభిషేకం చేసి కాకిరెట్టలను కడుగుతుంటారు.

పూర్వం పాలు ఆవు పాలని, గేదె పాలని వుండేవి. ఇప్పుడేమో సైకిల్ (మోటార్ బైక్ ) పాలు,
పాకెట్ పాలూ వస్తున్నాయ్. ఒకాయన చమత్కరించాడు. "మీరు ఆవు పాలా, గేదె పాలా
ఏది వాడుతారు అంటే తెలియదు, మేం సైకిల్ పాలు వాడుతున్నాము" అన్నాడు.
ఈ మధ్య ఒకరు మీరు అలా డైరీ పాకెట్ పాలు కొనకండి. అందులో నానా రకాల పాలు
కలుస్తాయి.అందుకే మేం సైకిల్ పాలు కొంటున్నాం అన్నాడు. పాపం ఆ అమాయకుడికి
తెలియదు. సైకిల్ పాల వాళ్ళు డైరీ పాలమ్మే షాపుల దగ్గర పాకేట్లు కొనేసి వాటిని బిందెల్లో
నింపేసుసుకొని అక్కడే వున్న కార్పొరేషన్ కొళాయి నీళ్ళు సగం కలిపి అమ్మేస్తున్నారని.!! ఇలా
మోసాల "పాల" బడుతున్నట్లు వాళ్ళకు తెలియదు కదా!!
మనని "పాలి"స్తున్నవారికి తెల్లావుల కంటే నల్లావులే ఇష్టం! నల్లావులయితేనేం తెల్లపాలే
ఇస్తాయికదా. ఆ విషయం మన నాయకులకు ఉగ్గు "పాల"తోనే బాగా ఒంట పట్టించుకున్నారు!
ఈనాడు శ్రీ శ్రీధర్ తెల్లావును నల్లావుగా మార్చుతున్న రాజకీయుణ్ణి తన కార్టూన్లో భలేగా
ఛూపించారు.

తెల్లనివన్నీ పాలనుకోకోయ్ అన్నారు. అందుకే అందులో కాస్త గులాబి సిరప్ కలిపేసి మా ఊర్లో
రోజ్ మిల్క్ పేరీట నడి రోడ్లో యమ బిసినెస్ చేస్తున్నాడో వ్యాపారి. ఆడ మొగా పిల్లల్తో సహా రోడ్డు
కడ్డంగా నిలబడి ఆ పాలు ఎగబడి కొని తాగేస్తుంటారు. అలానే మిల్క్ షేకులు ! రంగు మారితే
తెల్ల పాలకు అదో ప్రత్యేకత వస్తుంది.

హంసలు పాలను నీళ్ళను వేరు చేస్తాయని చెబుతారు. అంటే పాలు తాగేసి నీళ్ళు మనకు
మిగులుస్తాయన్నమాట! ప్రతి చోట నీళ్ల కొరతవున్న చోట్ల ఇలా హంసలను పెంచుకుంటే
ఇక నీళ్ళకొరత వుండదు కదా ? !అలా కాకుండా నీళ్ళన్ని తాగేసి పాలను వుంచితే అదో చిక్కు !
విష్ణుమూర్తి పాలసముద్రం మీద పవలిస్తాడట. మేం చిన్నప్పుడు గోదావరి అంతా అలా పాలుగా
మారిపొతే హాయిగా పంపుల్లోంచి పాలొస్తాయి కదా అని. ఏం రాయాలో "పాలు"బోక ఈ సోదిలో
మిమ్మల్నీ "పాలు" పంచుకొనేటట్లు చేశాను. క్షమించండి ! నీళ్ల ముంచినా పాల ముంచినా
మీదే భారం !!
కార్టూన్లు ఈనాడు శ్రీ శ్రీధర్, కొంటెబొమ్మల బాపు-2 సౌజన్యంతో

3 comments:

  1. pch.. yem cheppanu? maatalu..raathalu ravadam ledhu..paalupoka..ilaa..

    ReplyDelete
  2. ఏవ్హీ పాలుబోవడం లేదు! :)
    చాలా బాగా రాశారు, బొమ్మలు కూడా.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete