Thursday, October 13, 2011

విమానాలు= వి మానవతులు !!



ఒకప్పుడు విమానాలు సామాన్యూడికి అందుబాటులో ( ఎక్కడో పైన ఎగిరేవి గొప్పోళ్లకు
మాత్రం అందుబాటులా వుంటాయా?!) వుండేవికాదు గానీ ఇప్పుడు రైల్టిక్కెట్లు (రైలు టిక్కెట్ల
కోసం ఇక్కట్లు ఎక్కువై) దొరకటం అంత సులువు కాకపోవటం వల్ల అందరూ విమానాల
వైపు పరుగెడుతున్నారు. అసలు విమానాలను కనుక్కొన్నది రైటు సోదరులని అంటారు
కానీ అది రైటుకాదని నా అనుమానం. ఏమంటే మన పురాణాల కాలం నుంచే విమానాలు,
(పుష్పకవిమానాలు, ఇవి ఇప్పుడుంటే అంతులేకుండా టిక్కెట్లు ఎంచక్కా అమ్ముకోవచ్చు)!
వుండేవి. రామాయణకాలంలో జెట్లూ వుండేవి, అదేనండి మీరు రామాయణంలో జటాయువు
గురించి చదవలే! ఇప్పటి విమానాల్లో మనకి అన్ని సదుపాయాలూ చూడటానికి ఉన్న వనితలను
ఎయిర్ హోస్టెస్స్ లంటారు. అచ్చతెలుగులో విమానవతులు అని పిలవాలన్నమాట. నిజ జీవితంలో
ఎయిర్ హోస్టెస్ ఐన కాంచన ( దర్శకుడు శ్రీధర్ విమానప్రయాణంలో చూశాక) "కాదలిక్క నేరమిల్లై"
లో నాయకిగా నటించి సినిమాతారగా మారిపోయింది. అలానే నటి వాణిశ్రీ" ప్రేమనగర్" సినిమాలో
ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించింది.
విమానాల మీద ప్రయాణమే కాదు ఎన్నెన్నో జోకులూ, కార్టూన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు
చూస్తున్న కార్టూన్ బ్రిటిష్ వార పత్రిక TIT BITS ( 1950) సంచికలోనిది.
ఈ కార్టూన్ రైల్వే జంక్షన్లలో రైళ్ళు మారేటట్లు విమానాలు మారుతే ఎలా వుంటుందో అనే సరదా
ఊహతో వేసింది..

అలానే అమ్మాయి మెడలో విమానం బొమ్మ లాకెట్ పై నేను గీసిన చిలిపికార్టూన్. ఈ నా కార్టూన్
చూసి ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారు తన్ అభిప్రాయాన్నెంత చిలిపిగా చెప్పారో చూడండి.!!
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తమ "కోతికొమ్మచ్చి"లో విమాన సాహస యాత్ర గురించి ఇలా
చెప్పారు. "అప్పట్లో హిందూ పేపరు వారు మెద్రాసు-హైద్రాబాదు విమాన సర్వీసు నడిపేవారు....
అది తెల్లవారుఝామున మెద్రాసులో మూడుగంటలకు హిందూ డెయిలీ, స్పోర్ట్స్ మెన్ వీక్లీ
పత్రికలు వేసుకొని హైద్రాబాదు వెళ్ళి అక్కడ ఓ పెద్ద లోడ్ దించేది. అక్కడనుంచి విజయవాడకి
షార్ట్ హాల్ హాప్, అక్కడ మిగతా పేపర్లు దించేవారు. అక్కడినుంచి బండి ఖాళీ కాబట్టి ఐదుగురు
పాసెంజర్లను ఎక్కించుకొనేవారు. టిక్కెట్ విజయవాడ నించి మెడ్రాసుకు నలభైఐదు రూపాయలు.
ప్రయాణం కూడా నలభైఐదు నిముషాలే... సుఖాలు మరిగిన పాసెంజర్లు ఎక్కడానికి జంకేవారు-
నాలాటివాళ్ళు సాహసించేవాళ్ళు-ఇది ప్లేను-చవక కాబట్టీ."
శ్రీ ముళ్లపూడి విమానం పై చెప్పిన ఓ జోకు:
ఒక నేలయ్యగారు తొలిసారి విమానం ఎక్కారు ఢిల్లీకి. ఇంజను హోరెత్తగానే కిటికీలోంచి
చూచి కెవ్వుమన్నాడు.
"అయ్య బాబోయ్, అప్పుడే ఎంతెత్తు కెగిరిపోయామో చూడండి, చూడండి, కిందని ఆ జనం
చీమలబారులా ఎలా కనిపిస్తున్నారో ?" అన్నాడు.
"అయ్యా, విమానం ఇంకా పైకి లేవలేదు. మీరు చూసేది జనం కాదు, నిజంగానే చీమలబారు"
అన్నాడు పక్కాయన.

1 comment:

  1. అప్పారావు గారు నమో నమః మీ ప్రొఫైల్ చూశాక మీకు నాకు చాల దగ్గర అనిపించింది(మాది కూడా తూ గో జిల్లాయేలెండి). మీరే స్వయంగా కార్టూన్లు ఇంత బాగా వెయ్యగలుగుతున్నారంటే ఆహా! మరి పత్రికలకెందుకు పంపడం లేదండి! రమణ బాపు గార్ల అభిమానులమంతా ఒక సంఘం గా ఏర్పడితే బావుంటుందేమో ప్రయత్నం చేద్దాం మాష్టారూ!
    gksraja@gmail.com
    gksraja.blogspot.com

    ReplyDelete