Friday, October 28, 2011

నా సొంత గోడు !!



ఎవరైనా సుఖంగా, ఆనందంగా వుంటే సంతోషించడం మంచి లక్షణం ! కానీ
అదేమిటో ఈ మధ్య కొంతమంది కష్టాలూ నష్టాలూ పడుతుంటే నాకు చాలా
ఆనందంగా వుంటున్నది. వయసు పెరిగిన కొద్దీ వీడికి ఇదేం బుద్ధిరా బాబూ
అనుకుంటున్నారా?! ఏవిటో ఈ మధ్య నేను బయటకు వెళ్ళటమే బాగా తగ్గిం
చాను. కారణం తోటి మానవులు వాళ్ళ ప్రవర్తన చాలా చిరాకు కలిగించడమే!
ఇలా కదలకుండా ఇంట్లో కూర్చోడం చేత నాకు బద్ధకం పెరిగింది! ఎదో వంట్లో
తేడాగా అనిపిస్తున్నది. ప్రతి రోజూ ఉదయం మా ఇంటికి వచ్చినాతో పుస్తకాలు,
పత్రికలతో కాలక్షేపం చేసే మా డాక్టరు మితృలు రాఘవమూర్తిగారితో వళ్ళు
రెపేరుకు( ఈ మాట శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు, ఆయనకు కాస్త వళ్ళు
నలతగా వున్నప్పుడు ఫోనులో నాతో అనే వారు) వచ్చినట్లు వుందండి అంటే
హాస్పటల్కు రండి అని బిపి, సుగరూ ఉన్నాయేమో అని చూసి అంతా నార్మల్
గా వుంది మునపటిలా బయటికి వెళ్ళి వస్తుండండి" అని అన్నారు. సరేనని
స్కూటర్ మీద బయలుదేరి రోడ్దెక్కగానే ఎదురుగా యమస్పీడుగా బైకుమీద
ఓ మెడవంకరగాడు వస్తూ నన్ను గుద్దేయబోయి, తమాయించుకున్నాడు గాని
వాడి మెడసందులో వున్న ఖరీదైన సెల్లు మాత్రం ఎగిరి అంతదూరంలో రోడ్డు
మీదపడి తునాతునకలైంది. చాలా మంది జనాలు మూగి ఆ ముక్కలు దయతో
ఏరుకొచ్చి సానుభూతి చూపించడం మొదలెట్టారు. మీరు ఏమైనా అను కోండినాకు
మాత్రం తెగ ఆనందం వేసింది. కాలం ఎంతో విలువైనదిగా , ఒక్క క్షణం వృధా
చేయనివాళ్ళలా ఇలా స్ఫీడుగా వెళ్తూ సెల్లు మీద సొల్లు కబుర్లు చెప్పుకొనే ఇలాటి
జులాయిగాళ్ళకి ఇలాటి శాస్తి జరిగి తీరాలిసిందే !
ఈ వేళ వార్తలు వింటుంటే ( ఈ రోజు పేపర్లన్నిటికీ శెలవు కాబట్టి న్యూస్ చానళ్ళు
చూడటం తప్పలేదు) కాకినాడలో వేలమంది జనాలు పోస్టాఫీసులో 50 రూపాయలతో
పొదుపు ఖాతాలు ప్రారంభించడానికి క్యూలో ఉదయం ఏడు గంటలనుంచే నిలబడ్డారన్న
వార్త వింతగా తోచింది. జగన్, గాలి, సత్యసాయి ట్రస్టుల డబ్బు నంతా ఇలా ఓపెన్చేసిన
ఖాతాల్లో 50,60, వేల పైగా ప్రజలకు జమచేస్తారని ఎవడో తలకు మాసినవాడు ప్రచారం
చేస్తే ఈ మూఢ జనులు తమ పనులు మానుకొని ఖాతాలు తెరిచారట! కోప్పడకండీ
మనకు ఇలాటి మూఢజనాలున్నారు కాబట్టే మనకు ఇలాటి దోపిడీ ప్రభుత్వాలు వస్తు
న్నాయి. బంగారం మెరుగు పెడతామని ఎవడో వస్తే వాడికి ఇచ్చేస్తుంటారు. బంగారం
ధరలు మండిపోతూ వెలిగిపోతుంటే చవగ్గా బంగారం అమ్ముతామంటే ఎగబడి కాకి
బంగారం కొనేసే జనాలు ఇంకా వున్నారు. తేరగా వస్తుందంటే ఇలా డబ్బుకు ఆశపడుతున్న
వాళ్లల్లో బాగా డబ్బు చేసిన వాళ్ళూ, చదువుకున్న వాళ్ళు వుండటం మన దౌర్భాగ్యం
చాలామంది బైకులు డ్రైవ్ చేస్తున్నారుకానీ వాళ్ళకు నడపటమే కాదు, కనీసం పార్కింగ్
చేయటం రాదు. మా ఇంటికెదురుగా వున్న హాస్పటల్కువచ్చే వాళ్ళు గేటు కెదురుగా
అడ్డదిడ్డంగా పార్కు చేస్తుంటారు. పెద్దవాళ్ళు, పేషెంట్స్ వాటి మధ్య నుంచి లోపలికి వెళ్ళడం
ఎంత కష్టమో వీళ్ళకి అవసరం లేదు. ఇక మన స్కూటర్ పార్క్ చేసి వెళ్ళిరాగానే దానికి
అడ్డంగా పెట్టే వాళ్ళుకొందరైతే, మన స్కూటర్ మీద కూర్చొని దర్జాగా కబుర్లు చెప్పుకొనే
వాళ్ళూ మరికొందరు. ఇలాటి నడవడి చూస్తుంటే నాకు మాత్రం( మా ఆవిడ మాత్రం
మీకెందుకు ! మీ బోధలు వాళ్లకెందుకు ! అనవసర గోడవలకు దిగకండీ అంటుంది)
చిర్రెత్తుకు వస్తుంది. పోను పోను, మరింకెంత ఘోరంగా తయారవుతుందోనని నా బెంగ.
ఈ అన్యాయాలను చూస్తూ టెన్షన్ పడకుండా వుండాలంటే ఇంట్లో హాయిగా పుస్తకాల
మధ్య కూర్చొని కాలక్షేపం చేయడమే ఆరోగ్యానికి మంచిదనిపిస్తుంది.మళ్ళీ కొత్త పుస్త
కాలకోసం బైటకు వెళ్లక తప్పదు కాదా ! అందుకే పోస్టులో తెప్పించుకుంటున్నాను.
ఇంట్లోకి కూరలు, తదిరవస్తువులకోసం రిలయన్సు మార్ట్ కు వెళితే అన్నీ అక్కడే
దొరుకుతాయి కాబట్టి, పార్కింగ్ బాధలూ వుండవనుకుంటే, మన కార్టులో వున్న
మనం కొనుక్కున్న వస్తువులను తీసి ఇది ఏ కౌంటరులో వున్నదని మనల్ని
అడిగేవాళ్ళు కొందరైతే , మనకు అడ్డంగా నిలబడి కదలకుండా కబుర్లు చెప్పుకొనే
వాళ్ళు మరికొందరు!. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి (?) చెందినా జనాల్లో మార్పు
రాకపోవడం బాధాకరం ! ఏదో చాదస్తంగా వ్రాసానా! నాకు వయసు పైబడినకొద్ది చాదస్తం
పెరుగుతున్నదంటున్నది, నా శ్రీమతి. ఆవిడకేమో వయసు తగ్గుతున్నట్లు!
సెల్లు బైకు కార్టూన్కు మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారికి కృతజ్ఞతలు

1 comment: