Wednesday, December 29, 2010

రాగ భావాల సరళి పింగళి


పింగళి నాగేంద్రరావుగారి పేరు గుర్తు రాగానే ఆయన విజయ చిత్రాలకు
కూర్చిన అద్భుత సంభాషణలు, గీతాలకు కూర్చిన కమనీయ భావాలు
మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. పాతాళభైరవి చిత్రానికి మాంత్రికుడికి
ఆయన వ్రాసిన సంభాషణలు యస్వీ రంగారావుకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు
అందజేశాయి. "సాహసం శాయరా దీంగరి" అని తోటరాముడితో అనడం,అలానే
రాణీగారి తమ్ముడి పాత్ర ధరించిన రేలంగితో ’తప్పు తప్పు’ అన్న ఊతపదం
పలికించడం ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆయన
వాడిన శబ్ద ప్రయోగాలు మరే రచయితకు సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది.
ఇక మాయాబజార్ చిత్రంలో ఆయన ప్రయోగించిన ’అలమలం’,’కవచమిది
కవచమిది పరమం పవిత్రం’,’తాతాపాదులవారు’,గోంగూర-శాకంబరీ దేవి
ప్రసాదం’ ఇలా ఒకటేమిటి ఎన్నేన్నో ప్రయోగాలు కోకొల్లలు.
పాటలలో "జగదేకవీరుని కధ" చిత్రంలో
"జలకాలాటలలో-కలకల పాటలలో
ఏమి హాయిలే హలా, అహ-ఏమి హాయిలే హలా"
అన్న పాటలో "హలా" అన్న ప్రయోగాన్ని పింగళి చేశారు. "హలా" అంటే
సంస్కృతంలో చెలీ అని అర్ధమట. ఈ శబ్దాన్ని శాకుంతలం నాటికలో
కాళిదాసు వాడాడట. కీరవాణి రాగంలో స్వరపరచిన ఈ గీతాన్ని,పి.లీల,
సుశీల,సరోజిని, రాజరత్నం చతుర్గళ గీతంగా పాడారు. చతురస్రగతిలో
సాగిన ఈ పాటకు పియానో పై అందించిన రిధమ్ కార్డ్స్ మరింత సొగసును
చేకూర్చాయి..
పింగళి వారు సినిమాలకు ముందు మంచి నాటక రచయిత.
ఆయన కలంనుండి వెలువడిన నాటకాలు, జేబున్నీసా,వింధ్యరాణి, మేవాడ్
రాజ్య పతనం, గమ్మత్తు చావు, పాషాణి, నారాజు,క్షాత్రహిందు,ఒకే కుటుంబం,
కవి సామ్రాట్.. శాయి గారి సంపాదకత్వంలో వెలువడే ఇంటింటి పత్రిక
రచన డిసెంబరు సంచిక పింగళివారి నాటకాలు ప్రత్యేక రచనను
( ఇంద్రగంటి శ్రీకాంతశర్మ) ప్రచురించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకొంది.
లాహిరి లాహిరి లాహిరిలో పేరిట రెండు భాగాలుగా పింగళి గీతాలకు
సచిత్ర వ్యాఖ్యానం డా"వి.వి.రామారావు రాయగా క్రియేటివ్ లింక్స్ వారిచే
పుస్తక రూపంలో వెలువడింది.
పింగళి వారి జయంతి ఈ నాడు. ఆయనకు అభిమానులందరి తర్ఫున
అంజలి ఘటిస్తూ...

Tuesday, December 28, 2010

కాళీపట్నం రామారావు రచనలు


కారాగా పేరుగాంచిన శ్రీ కాళీపట్నం రామారావు గారి రచనలు మనసు ఫౌండేషన్
వారు చంద్రగారు గీసిన ముఖచిత్రం తో ప్రచురించారు. ఆయన శ్రికాకుళం లో
కధానిలయం స్థాపించారు. ఈ సంపుటిలో 493 పేజీలొని "కాళీపట్నం రామారావు
నేపధ్యం 2000" ను యధాతధంగా మీ ముందు వుంచుతున్నాను.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>
1997 ఫిబ్రవరి 22న కధానిలయం పుట్టింది. అప్పటినుంచి కధానిలయమే
కారామాస్టారూ, కారామాస్టారే కధానిలయం అయింది. ఆయన 75వ యేట
మొదలయిన ఈ పరిశోధనా గ్రంధాలయం ప్రతి యేటా ఫిబ్రవరి రెండవ శని,
ఆది వారాలలో పుట్టినరోజు సమావేశాలు జరుగుతుంటాయి. ఏడాది
పొడవునా దేశవిదేశాలనుంచి సాహిత్యాభిమానులు వస్తుంటారు.స్థానిక
రాజకీయ ప్రముఖులు సందర్శిస్తుంటారు. మీడియావారు కధానిలయం
విశేషాలు జనానికి తెలియబరచడానికి వస్తుంటారు.
ఈ సందర్శకులతో వ్యవహరించటం రామారావు జీవితంలో ఒక
ముఖ్య భాగం. కధానిలయం కోసం పుస్తకాలు, పత్రికలు సేకరించటానికి
రాష్ట్రం నలుమూలలకు తిరగడం మరో ముఖ్యభాగం. సేకరించిన వాటిని
రిజిస్టర్ చేయడమూ, వివరాలను వెతుక్కోటానికి అనువుగా పుస్తకాలలోకి
ఎక్కించటమూ అవసరమైన వారికి సమాచారాన్ని అందించడమూ వంటి
దినవారి కార్యక్రమం మరొక ముఖ్యభాగం.
ఈ పనులన్నింటిలోనూ ట్రస్టు మెంబర్లయిన .బి.వి.ఏ.రామారావునాయుడు
యగళ్ళ రామకృష్ణ, దాసరి రామచంద్రరావు,ఎన్.రమణమూర్తి వంటి వారి
సహకారం లభిస్తుంది. శ్రీకాకుళ సాహితి అన్ని విధాలా అండదండలు
అందిస్తుంది.
ఇన్నేళ్ళ కృషి ఫలితంగా
కధా నిలయానికి 12 లక్షల కార్పస్ ఫండ్ సమకూరింది. 7000 వరకూ
పుస్తకాలు, 15-20 వేల పత్రికలు లభించాయి.తెలుగు అకాడమీతో కలిసి
కధానిలయం "కధాకోశం" అనే కధల సూచిని తీసుకురాగగింది.
అయితే
1990లో మొదలయిన భారతదేశ ఆర్ధిక సంస్కరణలు ఫలితాలు
ప్రపంచీకరణ ప్రభావంగా దేశ ప్రజల దైనందిన జీవితాలలో అనేక మార్పులు
వచ్చాయి. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంపట్ల నిర్లక్ష్యం, రియల్ ఎస్టేట్
లో ధరలు రెండింతలు మూడింతలు అవటం ,సాంప్రదాయకవృత్తుల నాశనం,
కొత్త వృత్తులు ఏర్పడటం వంటి విషయాల మీద మేధావులు ఆలోచనలు
కేంద్రీకృతమవసాగాయి. వీటన్నింటి ప్రభావం తెలుగు సాహిత్యంలో వస్తురూపంలో
కనబడసాగింది.
ఈ విషయాలమీద యజ్ఞం రాసిన కారా మాస్టారు ఏమనుకుంటున్నారన్న
కుతుహలం మీడియా ఇంటర్యూలలో వ్యక్తమయింది. అటువంటి అనేక ఇంటర్యూలు
వ్యాసాలు ఈ భాగంలో జేరాయి. 1999లో వెలువడిన కాళీపట్నం రామారావు
రచనలలో అలభ్యమైనవి ఈ భాగంలో దొరికిన మేరకు చేర్చడం జరిగింది. అందులో
"అర్ధం కాని మానవ గాధ" ( 1947లో ప్రచురితం) అనే కధ ఒకటి. రచయితగా
సామాజిక సంవేదనాశీలిగా రామారావుగారిని కొంచెం పట్టిచ్చే కధ "అన్నెమ్మ
నాయురాలు" అప్పులతో జరిగే అభివృద్ధి పట్ల రామారావు వైముఖ్యం ఈ కధలో
వ్యక్తమయింది.
వ్యక్తిగత జీవితంలో
భార్య అనారోగ్యం, పెద్దవాళ్ళవుతున్న పిల్లల వాళ్ళ సంతానాల సమస్యలు,
సన్నిహిత మితృలు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటి వారిని కోల్పోవడం,
పైబడుతున్న ముదిమి వంటి వాటి మధ్య రామారావు మాస్టారు కధానిలయం
అభివృద్ధి కోసం పడుతున్న శ్రమ గమనించిన ఎవరికైనా జీవనోత్సాహం
కలిగిస్తూనే ఉంటుంది. రాచకొండ విశ్వనాధశాస్త్రి సమగ్రరచనల సంపుటం
"రచనాసాగరం" పంపిణీలో ఆయన సాఫల్యం వారి జీవనోత్సాహానికి ఒక
చక్కని ఉదాహరణ. అనేక సంస్ఠలు ఈ మధ్యకాలంలో వారికి సన్మానాలు
చేశాయి.పురస్కారం అందించాయి.లోక్నాయక్ పురస్కారం ప్రముఖమైన వాటిల్లో
ఒకటి.
ఏమైనా-
కధారచయిత రామారావుగారు సాహితీ సృజనకి సమయాన్ని కేటాయించక
పోవటం "సాహిత్యద్రోహం"గా ఆయన రచనాభిమానులు భావిస్తూనేవున్నారు.
కాళీపట్నం రామారావు రచనలు (మనసు ఫౌండేషన్ సౌజన్యంతో)
మనసు ఫౌండేషన్, 2584, second Stage, Kumara Swamy Layout,
BANGALORE- 560 078 -Phone: 09845575455

Monday, December 27, 2010

నర్తన యజ్ఞాలు




హైదరాబాదులో వివిధ వయసులవారు "ధిల్లానా" నాట్యాన్ని ఏకకాలంలో
2800 మంది నృత్య కళాకారులు అభినయించి గిన్నిస్ సంస్థనుంచి
ప్రపంచ రికార్డు ను అందుకొన్నారు. ఈ వార్త చదివిన తరువాత మా
రాజమండ్రిలో గత పాతికేళ్ళనుండి విజయవంతంగా నిర్వహిస్తున్న
డా" సప్పా దుర్గాప్రసాద్ గారి నటరాజ నృత్య నికేతన్ గురించి మీతో
చెప్పాలనిపించింది
కృతయుగంలో ఆరాధన సంస్కృతిలో హిందూ దేవతలు అందరూ
నాత్యకళాకోవిదులు . ఆది దంపతులైన శివపార్వతులు
నాట్యానికి ఆదిస్వరూపులు. వినాయకుడు,కుమారస్వామి, మొదలైన
దైవస్వరూపులతో బాటు యక్ష,గంధర్వ, కిన్నెర, కింపురుష,మునిగణ,
ప్రమదగణాలు, అప్సరలు అందరూ నాట్యమాడినవారే. అలాగే వాల్మీకి
రామాయణంలో శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధయాగంలో లవకుశలూ
రామాయణ గానం చేస్తూ నాట్యమాడినట్లు మనం చదివాము. ఇక
ద్వాపర యుగంలో బాలకృష్ణుడు కాళీయుని పడగలపై నాట్యమాడిన
ఘట్టం మనకు తెలుసుకదా!
1997 సంవత్సరంలో తొలిసారిగా జనవరి12 వతేదీన రాజమండ్రి
టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటలనుండి రాత్రి 12 గంటల
వరకు 108 నృత్య కళాకారులచే "నర్తనయజ్ఞం" శ్రీ సప్పా దుర్గాప్రసాద్
నిర్వహించారు. 2002లో శిల్పారామంలో 118 కళాకారులతో యజ్ఞ
నర్తనాలు,2003 లో మూడవ నృత్య యజ్ఞం తిరిగి రాజమండ్రిలో
నగర ప్రముఖుల పాల్గొన్న కార్యక్రమంలో 136 నృత్యకారులచే
నిర్వహించబడి 2004 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గా నమోదయింది..
రాజమండ్రిలో శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద
నిర్మించిన ఆలయ నృత్య కళావనం వివిధ నృత్య భంగిమల శిల్పాలతో
సందర్శకులను అలరిస్తుంది.

Saturday, December 25, 2010

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి






రాజమండ్రి సమీపంలోనున్న రావులపాలెంకు 26 కిలోమీటర్ల దూరం లో ఈ
క్షేత్రం వుంది. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా
ప్రసిద్ధి చెందాడు. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఈ స్వామిని పూజిస్తే ఆ
కార్యం జయప్రదం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. గౌతమీ,వృద్ధ
గౌతమీ గోదావరీ ప్రాంతంలో చల్లని కొబ్బరి తోటలమధ్య ఈ ఆలయం
నిర్మించబడింది. విశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో ఈ దేవాళయంలో
క్షేత్రస్వామి శ్రీ విఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు
సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా వుంటాయి. కానీ ఇక్కడి స్వామి
దక్షిణముఖంగా వుంటాడు. ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారాలున్న గృహాలకు
ఎటువంటి విఘ్నాలు వుండవని నమ్మకం. రెండు గోపురాలు,సింహద్వారాలతో
అలరారే ఈ దేవాళయం దక్షిణ సింహద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చును.
ఈ దేవాళయం ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి శ్రీ విఘ్నేశ్వరాలయం ప్రక్కనే
ప్రతిష్టించబడింది. క్షేత్రపాలకుడైన శ్రీకాల భైరవశ్వామిని కూడా ప్రతిష్టించారు. ఈ
క్షేత్రంలో స్వామి స్వయంభూ అవటము వలన నిత్యం శక్తి ప్రస్ఫుటమవుతుంది.
ఈ దేవాళయాన్ని దర్శించాలంటే రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా
అయినవిల్లి వెళ్ళాలి. రాజమండ్రి నుంచి రూటు, రావులపాలెం-బోడిపాలెం
వంతెన-వానపల్లి-అయినవల్లి.......60 కిలోమీటరులు. ప్రతీ విద్యార్ధి పరీక్షలలో
మంచి ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వినూత్న పద్ధతిలో లక్షపెన్నులతో
స్వామివారికి అభిషేకం జరిపించి పెన్నులను ఉచితంగా విద్యార్ధులకు అంద
జేస్తుంటారు ! ఈ వెబ్ సైటు ద్వారా మరిన్ని ఆలయ వివరాలు తెలుసుకోండి.
visit:www.ainavillivighneswara.com.
బొంబాయినుంచి మా అబ్బాయి, కోడలు, మా రెండో అమ్మాయి నాలుగు
రోజుల క్రితం వచ్చినప్పుడు మరొసారి విఘ్నేశ్వరస్వామిని దర్శించుకున్నాం.

Wednesday, December 22, 2010

గణితంతో తధిగణితో !!



చిన్న వయసులోనే గణితంలో కీర్తి ప్రతిష్టలను పొందిన గొప్ప వ్యక్తి
శ్రీనివాస రామానుజం పుట్టిన రోజు డిసెంబరు 22, 1887. ఆయన
తమిళనాడులోని "ఈరోడ్" లో జన్మించారు. ఆయన తండ్రి ఓ వస్త్ర
దుకాణం ( కుంభకోణం) లో గుమాస్తా పని చేసి కుటుంబాన్ని
పోషించారు. పేద కుటుంబం లో పుట్టినా గణిత శాస్త్రంలో ఎన్నో
పరిశోధనలు చేసిన ఆయన ప్రతిభను చూసి విదేశీయులు సైతం
ఆశ్చర్యపోయారు !1914లో లండన్లోని జి.హెచ్.హార్టీ ఆహ్వానం
మీద అక్కడికి వెళ్ళి, కొత్త సిద్ధాంతాలపై పరిశోధనలు చేసి కేంబ్రిడ్జ్
విశ్వ విద్యాలయం నుంచి బి.ఏ. గౌరవ పట్టాను తీసుకున్నారు.
విశ్రాంతి లేకుండా చేసిన పరిశోధనల వల్ల ఆరోగ్యం దెబ్బతిని
క్షయ వ్యాధితో 1920 లో స్వర్గస్తుడయ్యారు.ఆయన జయంతి రోజున
శ్రీనివాస రామానుజం కు నివాళులు .

)<<<<<<<<<<<<<,oOo>>>>>>>>>>>>(

సాధారణంగా లెఖ్కలంటే చాలమందికి భయం. నిజానికి
మనం పరీక్షలలో వ్రాసే సరైనజవాబులకు నూటికి నూరు మార్కులు
వచ్చేది లెక్కల్లోనే! మాధ్స్ కూడా సరదాగా, ఇంత సులువా అనేట్లు
మా రాజమండ్రి లోని వ్యాపారవేక్త శ్రీ గమిని రంగయ్యగారు కృషి
చేస్తున్నారు. ఆయన GAMINI TOYDOM అనే పేరుతో వ్యాపారం
నిర్వహిస్తున్నారు. Mcom., పట్టభద్రుడయిన శ్రీ రంగయ్యకు లెఖ్ఖలంటే
అభిమానం. ఒక వైపు వ్యాపారన్ని కొన సాగిస్తూనే Gem Techniques
పేరిట freelance mathematician గా పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ
పాఠశాలలోనే కాకుండా , ఇతర రాష్ట్రాలలో కూడా స్కూలు విద్యార్ధులకు
లెఖ్ఖలలో సులువు పద్ధతులు వాళ్ళు సులువుగా అర్ధం చేసుకోవడానికే
కాకుండా, గుర్తు పెట్టుకొనేటట్లు విపులంగా చెబుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు.
విద్యార్ధులకు ఆయన చెప్పే సులువైన పద్ధతులకు ఓ ఉదాహరణ:-....

TRIPLE AGE MULTIPLICATION
మీ స్నేహితుల వయసు ఎవరిదైనా 3367 చేత గుణించి వచ్చిన
సంఖ్యను తిరిగి 3 చేత గుణిస్తే వాళ్ళ వయసు మూడు సారులు
తిరిగి వస్తుంది ! ప్రయత్నించి చూడండి.

<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>

3367 3367 3367
X6 X16 X66
_____ _____ _____
20202 53872 22222
X3 X3 X3
______ _____ ______
060606 161616 666666
_______ ______ _______

శ్రీ గమిని రంగయ్య SPARKLE OF WONDER MATHS పేరుతో
ఓ పుస్తకాన్ని ఇలాటి గమ్మత్తు లెఖ్ఖలతో ప్రచురించారు. శ్రీ రామానుజం
జయంతిని సంధర్భంగా శ్రి గమిని రంగయ్యగారికి శుభాభినందనలు.



Monday, December 20, 2010

సలహాల్రావ్ సమాధానాలు !!

ఒకటో ప్రశ్న : పేనుపాలెం నుంచిశ్రీమతి మాతాశ్రీగారు తమ కుమారీశ్రీకి తలలో పేలు
విపరీతంగా చేరాయని,ఎన్నోరకాల షాంపూలు, మందుల హేరాయిల్లు
వాడినా పోవటంలేదనీ, మంచి సలహా చెప్పమని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : మాతశ్రీ గారు వాడల్సిన అసలైన మందు నే చెబ్తా! మీరు వెంటనే
బ్రాందీగానీ,విస్కీగానీ తీసుకొని, తీసుకొని అంటే లోపలికి కాదు, దోసిట్లో
తీసుకునన్న మాట, కుమారీశ్రీ తలకు బాగా పట్టించండి. తరువాత
గండ్ర ఇసుక ఆ జుట్టులో బాగా చల్లండి. ఇప్పుడు మీరు తలకు రాసిన
బ్రాందీ ఆ పేలు బాగా త్రాగేసి మత్తు తలకెక్కి, కిక్కెక్కి అక్కడి ఇసుక
రేణువులు తీసి ఒకదానితో ఒకటి తగువులాడుకుంటూ కొట్టుకుంటూ
చచ్చినట్లు చస్తాయి. ఇంకేం ఇప్పుడే మందుల షాపుకు ( మీ వీధి చివరే
మీ కుటుంబ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు) పరిగెట్టండి.
రెండోప్రశ్న : పొదుపులూరి నుంచి పి.సి.నారయ్యగారు, వారు అమెరికా వెళ్ళిరావాలని
అనుకుంటున్నారట. బోల్డు డబ్బు ఖర్చవుతుందని బెంగగా వుందట.
ఖర్చు ఎంతవుతుందో చెబితే ఆలోచిస్తారట.!
సలహాల్రావ్: పి.సి.నారయ్యగారూ బెంగ పడకండి. ఒక్క పైసాఖర్చుకాదు. నిజమండీ,
వేళ్ళి రావాలని అనుకోడానికేం ఖర్చు కాదండి. బెంగపడకుండా అను
కుంటూనే వుండండి.
మూడోప్రశ్న: కోదాడనుంచి కొత్త కోడలు కోమలిగారు తను అత్తవారింట్లో పాలు ఎంత
జాగ్రత్తగా కాచినా పాలు విరిగి పోతున్నాయట. పాలు విరిగినప్పుడల్లా
అత్తగారు నోరు మూత పడకుండా తిడుతున్నారని, అత్తగారి నోరు
విప్పకుండా, పాలు విరగ కుండా వుండే మార్గం చెప్పండని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : కోమలిగారూ, ఇలా చూడండి ! ఈ సారి పాలు కాచేటప్పుడు అందులో రెండు
టీ స్పూన్ల ఫ్లెవికాల్ కలపుతుండండి. పాలు విరగవు. ఓ వేళ సరదాపడి
విరిగినా అందులో మీరు కలిపిన ఫ్లెవికాల్ వల్ల వెంటనే అతుక్కుపోతాయి.
తరవాత ఓ గ్లాసు పాలను మీ అత్తగారికి ప్రేమతో ఇచ్చారంటే ఆ పాలు
త్రాగిన అత్తగారు ఇక నోరు తెరిస్తే ఒట్టు!
నాల్గోప్రశ్న: పెన్నులూరినుంచి నవలల దస్తూరీబాయిగారు, తను ఎన్ని కధలు,నవలలు
వ్రాసి పత్రికలకు పంపినా ఒక్కటీ అచ్చవటం లేదట. ఇంత కాలం మామూలుగా
కుడిచేత్తో వ్రాస్తున్నానని, ఇకనుండి ఎడమ చేత్తో వ్రాస్తే పడే అవకాశం వుందా
అని, పంపిన కధలు తిరిగి రాకుండా వుండే ఉపాయం కూడా చెప్పమంటున్నారు.
సలహల్రావ్ : అమ్మా, దస్తూరీబాయి గారూ, మీరు కుడిచేత్తో వ్రాసినా, ఎడమచెత్తో వ్రాసినా
ఫలితం వుండదండి. మీరో మాంచి బాల్పాయింట్ పెన్నో, సిరా పెన్నో కొనుక్కొని
దానితో వ్రాయండి! మీ రచనలు తిరిగి రాకుండా వుండాలంటే స్టాంపులతో
కవరును జత చేయకండి. మీ కధ చస్తే తిరిగిరాదు.గ్యారంటీ !!
ఐదోప్రశ్న: ఆరోగ్యవరం నుంచి కత్తుల కోతలరావుగారు ఇలా వ్రాస్తున్నారు.
ఆయన ఇప్పటివరకూ 116 పైగా ఆపరేషన్లు చేయించుకొన్నారట! ఆయనకు ఇలా ఎక్కువ ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ టేబుల్ మీదే కాకుండా గిన్నేస్ బుక్కులో కూడా ఎక్కాలని వుందట. కానీ ఆపరేషన్లు చేసే ఆయన డాక్టర్లు ప్రతిసారి కోసి కుట్టడానికి విసుగు పుడుతుంది బాబోయ్ అంటున్నారట. సలహా చెప్పమని వ్రాస్తున్నారు.
సలహాల్రావ్ : ఈ సారి ఆపరేషను చేసినప్పుడు సర్జన్ గారిని ఓ మాంచి ఇంపోర్టెడ్ జిప్ కుట్టేయమనండి! మీ పొట్టను ఓపెన్ చేయడం, మూసేయడం చాలా సులువవుతుంది. డాక్టరు ఒప్పుకోక పోతే మీ పాంట్లు కుట్టే టైలర్ చేత జిప్పు కుట్టించుకోండి!!
ఆరో ప్రశ్న: వార్తలు తెలుసుకోవడానికి న్యూస్ పేపరు బెస్టా, టీవీ బెస్టా చెప్పమని డిష్ బాదు నుండి టీవీ.రావుగారు అడుగుతున్నారండీ.
సలహాల్రావ్ : టీవీ.రావుగారూ, టీవీ కన్నా పేపరే నయమండి. కరెంట్ పోతే టివీ వార్తలు చూడలేము.అదే ఏ ఈనాడు పేపరో ఐతే కరెంట్ పోగానే హాయిగా దాన్తో విసురుకోవచ్చు.!!
ఏడో ప్రశ్న : తోటల పుష్పగారు తనకు పూలమొక్కలంటే అమిత ప్రేమనీ, కానీ కుండీలలోని
మొక్కల ఆకులకు పురుగులు చేరి మొగ్గలు రాలి పోతున్నాయని, ఎన్ని రకాల
పురుగుల మందులు వాడినా అవి మరింత ఎక్కువవుతున్నాయని ఏడుస్తూ
వ్రాస్తున్నారండీ.
సలహల్రావ్ : చూశారా గమ్మత్తు! ఇది నే జవాబివ్వబోయే ఏడో ప్రశ్న, మొక్కలపై ప్రేమున్న
మీకు ఏడుపు రావడం సహజమే! పురుగుమందులు వాడితే పురుగులెలాచస్తాయండి? బాతురూములు కడిగే ఆసిడ్ రెండు మగ్గుల్లో తీసుకొని ఓ బకెట్ నీళ్లల్లో కలపండి. మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు పూలకుండీలలో పోయండి..దెబ్బకు ఆకులు మలమలా మాడి రాలిపోతాయి. పురుగులకు తినడానికి ఆకుల తిండి లేక ఆకలితో దెబ్బకి చస్తాయి.
ఎనిమిదోప్రశ్న :కేశవరం నుండి శ్రీమతి కేశవర్ధిని గారు ఎంత మంచి నూనెలు వాడినా తలదువ్వు
కొన్నప్పుడల్లా జుట్టు విపరీతంగా రాలి పోతున్నదని, రాలిపోకుండా సలహా చెప్ప
మంటున్నారు.
సలహల్రావ్ : ఇదో రాలిపోయే కేసన్నమాట! కేశవర్ధినిగారూ, మీరు తల దువ్వుకొనేటప్పుడు ఓ
అట్టపెట్టె తీసుకొని అందులో రాలిన మీ జుట్టును వేసుకుంటే మీ రాలిన జుట్టు ఎక్కడికీ
పోదు.
(మా "హాసం క్లబ్" కార్యక్రమంలో నేనూ, మితృడు దినవహి హనుమంతరావు ప్రదర్శించిన స్కిట్)

Sunday, December 19, 2010

టామ్ సాయర్ ప్రపంచయాత్ర ( టామ్ సాయర్ ఎబ్రాడ్ )


శ్రీ నండూరి రామమోహనరావు గారి ఆంగ్లనవలానువాదం గురించి నిన్న
నేను చెప్పిన విషయాలకు మన బ్లాగరు మితృలనుంచి మంచి స్పందన
వచ్చింది. సుజాతగారు టామ్ సాయర్ ప్రపంచయాత్ర గురించి గుర్తు చేశారు.
హాసం ప్రచురణలు ప్రచురించిన ఆ పుస్తకంలో శ్రీ నండూరి రామమోహనరావు
ముందు మాటగా చెప్పిన ""రచయిత మాట" మీ కోసం .
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఒకప్పుడు మనతో బాగా సన్నిహితంగా వుండి, తర్వాత ఏళ్ళతరబడి కనబడకుండా
పోయిన చిన్ననాటి స్నేహితుడు హఠాత్తుగా ఏ రోడ్డుమీదో ఎదురుపడితే ఎలా వుంటుంది?
సరిగా అలాగే అయింది నా పరిస్ఠితి. చాలాకాలంగా నేను రాశాననే జ్ఞాపకం కూడా
మిగలకుండా పోయిన "టామ్సాయర్ ప్రపంచయాత్ర" అనువాద నవలను సీరియల్ గా
ప్రచురించిన ఆంధ్రవార పత్రిక కటింగ్స్ ను తాను ఒక చోట సంపాదించానని మిత్రులు
శ్రీ ఎమ్భియస్ ప్రసాద్ కొన్నాళ్ల క్రిందట చెప్పగానే వృద్దాప్యం వల్ల ఓపిక లేక ఎగిరి
గంతు వెయ్యలేదు గాని, మానసికంగా అంత పనీ చేశాను.
ఏనాటి మాట ? "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" సీరియల్ ప్రచురణ 1955లో
జరిగిందని ప్రసాద్ గారు చెప్పారు. మొత్తంపై ఒక" లాంగ్ లాస్ట్ ఫ్రెండ్" మళ్ళీ
కనిపించినట్టయింది. ఆ రోజుల్లోనే ఒక సారి పుస్తకరూపంలో వచ్చింది కూడా.
నెమ్మదినెమ్మదిగా అదీ అంతర్ధానమై పోయింది. కొంతకాలం దానికోసం వెంపర్లాడాను,
కాని ఫలితం లేక వూరుకున్నాను. ఇన్నాళ్ల తరవాత ప్రసాద్ గారికి అది దొరకడం
దాన్ని తమ "హాసం" ప్రచురణలలో ఒకటిగా ప్రచురించడానికి ఆయన నిశ్చయించడం
ఎంతో సంతోషంగా వుంది.. ఇందుకు ఆయనకీ, ప్రచురణకర్త శ్రీ వరప్రసాదరెడ్డి గారికీ
నా ధన్యవాదాలు.
మార్క ట్వేన్ నవలల నా అనువాదాలు గడచిన 50-60 ఏళ్ళలో ఏడెనిమిది
సార్లయినా పునర్ముద్రణ జరిగి వుంటాయి. నన్ను ఇప్పటికీ కొందరు వృద్ధులు
( ప్రముఖులు కూడా ) టామ్సాయర్,హకల్బేరీఫిన్,రాజూ పేదా నవలల అనువాదకుడిగానే
ప్రశంసా పూర్వకంగా గుర్తు పెట్టుకోవడం, ఇతరులతో చెప్పడం తరచుగా జరుగుతూ
వుంటుంది. అదికూడా ఈ "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" పునర్ముద్రణ పట్ల నేను
ఉత్సుకత చూపించడానికి ఒక కారణం.ఏమైనా చాలాకాలంగా అలభ్యమై, ఇప్పుడు
పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం పూర్వపు నా మార్కట్వైన్ ఇతర అనువాదాల
లాగానే పాఠకాదరణ పొందగలదని ఆశిస్తున్నాను.
విజయవాడ
ఫిబ్రవరి, 2006 నండూరి రామమోహనరావు