పింగళి నాగేంద్రరావుగారి పేరు గుర్తు రాగానే ఆయన విజయ చిత్రాలకు
కూర్చిన అద్భుత సంభాషణలు, గీతాలకు కూర్చిన కమనీయ భావాలు
మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. పాతాళభైరవి చిత్రానికి మాంత్రికుడికి
ఆయన వ్రాసిన సంభాషణలు యస్వీ రంగారావుకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు
అందజేశాయి. "సాహసం శాయరా దీంగరి" అని తోటరాముడితో అనడం,అలానే
రాణీగారి తమ్ముడి పాత్ర ధరించిన రేలంగితో ’తప్పు తప్పు’ అన్న ఊతపదం
పలికించడం ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆయన
వాడిన శబ్ద ప్రయోగాలు మరే రచయితకు సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది.
ఇక మాయాబజార్ చిత్రంలో ఆయన ప్రయోగించిన ’అలమలం’,’కవచమిది
కవచమిది పరమం పవిత్రం’,’తాతాపాదులవారు’,గోంగూర-శాకంబరీ దేవి
ప్రసాదం’ ఇలా ఒకటేమిటి ఎన్నేన్నో ప్రయోగాలు కోకొల్లలు.
పాటలలో "జగదేకవీరుని కధ" చిత్రంలో
"జలకాలాటలలో-కలకల పాటలలో
ఏమి హాయిలే హలా, అహ-ఏమి హాయిలే హలా"
అన్న పాటలో "హలా" అన్న ప్రయోగాన్ని పింగళి చేశారు. "హలా" అంటే
సంస్కృతంలో చెలీ అని అర్ధమట. ఈ శబ్దాన్ని శాకుంతలం నాటికలో
కాళిదాసు వాడాడట. కీరవాణి రాగంలో స్వరపరచిన ఈ గీతాన్ని,పి.లీల,
సుశీల,సరోజిని, రాజరత్నం చతుర్గళ గీతంగా పాడారు. చతురస్రగతిలో
సాగిన ఈ పాటకు పియానో పై అందించిన రిధమ్ కార్డ్స్ మరింత సొగసును
చేకూర్చాయి..
పింగళి వారు సినిమాలకు ముందు మంచి నాటక రచయిత.
ఆయన కలంనుండి వెలువడిన నాటకాలు, జేబున్నీసా,వింధ్యరాణి, మేవాడ్
రాజ్య పతనం, గమ్మత్తు చావు, పాషాణి, నారాజు,క్షాత్రహిందు,ఒకే కుటుంబం,
కవి సామ్రాట్.. శాయి గారి సంపాదకత్వంలో వెలువడే ఇంటింటి పత్రిక
రచన డిసెంబరు సంచిక పింగళివారి నాటకాలు ప్రత్యేక రచనను
( ఇంద్రగంటి శ్రీకాంతశర్మ) ప్రచురించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకొంది.
లాహిరి లాహిరి లాహిరిలో పేరిట రెండు భాగాలుగా పింగళి గీతాలకు
సచిత్ర వ్యాఖ్యానం డా"వి.వి.రామారావు రాయగా క్రియేటివ్ లింక్స్ వారిచే
పుస్తక రూపంలో వెలువడింది.
పింగళి వారి జయంతి ఈ నాడు. ఆయనకు అభిమానులందరి తర్ఫున
అంజలి ఘటిస్తూ...
పింగళి వారికి సహస్రవందనసుమాన్జలులు
ReplyDelete