Tuesday, July 06, 2010

బాబోయ్ ! ఈ రోజులు కాదు, ఆ రోజులే బాగున్నాయ్!!




ఒక్కొక్కప్పుడు మనం ఈ కాలంలో పుట్టివుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది. కానీ ఈ నాటి
చిన్నారుల కష్టాలు (వాళ్ళ నాన్నల,అమ్మల దృష్ఠిలో కాకపోవచ్చు) చూస్తుంటే మనం (మా వయసు
వాళ్ళ మాట సుమా నే చెప్పేది) ఈ కాలంలో పూట్టకపోవడమే దేముడిచ్చిన వరమెమోననిపిస్తుంది.
మా రోజుల్లో ఇప్పటిలా ఇంగ్లీష్ కాన్వెంట్లు లేక పోవచ్చు. మంచి చదువు చెప్పే బడులుండేవి. టీచర్లు
వ్యక్తిగత శ్రర్ధ తీసుకొనేవారు. అప్పుడు ఆ స్కూళ్లల్లో చదివిన వాళ్ళు గొప్ప డాక్టర్లయ్యారు,ఇంజనీర్లయ్యారు,
టీచర్లు,ప్రొఫెసర్లయ్యారు. నేను చదివిన మా రాజమండ్రి శ్రీ రామచంద్రా సిటీ హైస్కూల్లో 1956 SSLC
బాచ్ క్లాసులో అందరం పాసయ్యాము. మాకు ప్రతి ఆదివారం ఉదయం ఇంగ్లీష్ ప్రయవేట్ క్లాసు పెట్టే
వారు. లెఖ్ఖల మాస్టారు ప్రతి రోజూ ధీరమ్స్ అన్ని ప్రతి ఒక్కరిచేత ఐదు సార్లు ఇంపొజిషన్ వ్రాయించి
ఉదయాన్నే ఆయన టేబిల్ మీద ఉంచమనే వారు.అందుచేత లెఖ్ఖల్లో మొద్దబ్బాయి నైన నాకూ కంఠతా
వచ్చేవి. పరిక్షలవగానే శెలవులిచ్చేవారు. శెలవుళ్ళో మా బామ్మగారి ఊరు బాపట్లకి వేళ్ళేవాళ్ళం.ఏదీ
ఇప్పటి పిల్లలకు విశ్రాంతి ఎక్కడ? వాళ్ళు డిగ్రీ లేక పోతే ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యెదాకా చదువే
చదువు.
బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఓనెల గడప టానికి వచ్చిన మాకు,మా మనవడు చి" కౌస్థుభ్ ను
(వాడికి నిండా మూడేళ్ళు లేవు) ఉదయం ఆరింటికే నిద్రలేపి స్నానాలు పానాలు బలవంతంగా పూర్తి
చేయించి యూనిఫాం, మెళ్ళో ఓ బిళ్ళ ( అదే నండి, ఫొటో గట్రా) తగిలించి, వీపు వెనుక ఓ బ్యాగు,అందులో
ఓ రైన్కోటు, టిఫిన్ బాక్సు,వాటర్ బాటిల్ వగైరా ఉంచి, 7.30 కల్లా వచ్చే స్కూల్ బస్లో(తోసి)ఎక్కించి
మావాడు పని చేసే మలాడ్ లో ఉన్న ఆఫీస్ కు ఉరుకులూ పరుగులతో బయలుదేరటం చూస్తూంటే
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మాకు అలవాటై పోయింది,మీరేం వర్రీ కాకండి అంటాడు. ఈ సంధర్భంలో
నాకు నే చదివిన పాత చందమామలోని కధ జ్ణాపకం వస్తుంది. ఆ కధలో తండ్రి చెట్టుక్రింద నీడలో కూర్చుని
ఉంటే కొడుకు మిట్టమధ్యహ్నం ఇల్లు నేస్తుంటాడు.ఎండగా ఉంది కాసేపు దిగరా అంటె కొడుకు వినిపించు
కోడు. అప్పుడు తండ్రి ఏడాది మనవణ్ణి తీసుకొచ్చి ఎండలో కూర్చోపెడతాడు. వెంటనే కొడుకు దిగి వచ్చి
అదేమిటి పిళ్ళాణ్ణి ఎండలో ఉంచారు అంటాడు కోపంగా.ఇప్పుడు తెలిసిందా తండ్రి ప్రేమంటే ఏమిటో అని
తండ్రి జవాబిస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళైనా మనకు (మాకు) చిన్నవాళ్ళే కదండీ.

Friday, July 02, 2010

నవ్వుల పుస్తకం : "స్వాతి" బాపు కార్టూన్లు




"స్వాతి" వార పత్రికలో వారం వారం పంచ రత్నాల లాంటి పంచ రంగుల కార్టూన్లను
శ్రీ బాపు అందిస్తున్నారు.గతంలో వచ్చిన300 కార్టూన్లను ఋషి బుక్ హౌస్ వారు
మంచి ఆర్ట్ పేపర్ మీద రంగుల్లోగట్టి అట్టతో ’అట్ట’ హాసంగా అచ్చొత్తారు. మనకు ఏం
తోచనప్పుడూ, బోర్ కొట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేకుండా బయట వర్షం
కురుస్తున్నప్పుడు ( ఐనా వర్షం బయటగాక ఇంట్లో కురుస్తుందా ) సరదాగా పదే
పదే చూసి ( ఆ అందమైన బొమ్మలు చూసినా చాలు) చదివి నవ్వుకోవచ్చు. ఈ బాపు
గారి కార్టూన్లు ఒట్టి సంసార పక్షంవి, శృంగార పక్షంవి,,దేముళ్ళు దేవతలవీ, ఆ నాటి ఈ
నాటి కవులవి. రాజులవి, రాజకీ(చ)య నాయకులవీ,డాక్టర్లవి వాళ్ల పేషంట్లవీ, కారులూ,
కళాకారులవీ, గుళ్ళూ వాటి పూజారులు వాళ్ళ భార్యలవీ ( బాపు గారు గుళ్ళను ఎంత
అందంగా వేశారో), జంతువులూ, వాటి సంసారాలవి మనకు ప్రతి పేజీలోనూ
అగుపడి ( పేజీ ఒకే రంగుల బొమ్మే నండి) నవ్వుతూ పలకరిస్తాయి.
రిమోట్ నొక్కగానే మాయమైపోయే టీవీ ( పే.15), ఇంటిల్లిపాదీ టివికి అతుక్కుపోతే,
తన క్లాసు పుస్తకాలకు అతుక్కుపోయిన చంటాణ్ణి చూసి తెగ బెంగ పడిపోతున్న అమ్మ
( పే 35), కోడలి మూగనోము గురించి సంబరపడిపోతున్న అత్త (పే 57),ఇంటికి వచ్చిన
అతిధులు ఎంతకీ కదలకపోతే ఇది తమ ఇళ్ళు కాదేమో తామే వాళ్ళింటికి వచ్చామేమో
అని అనుమాన పడుతున్న భర్త ( పే157),తన రూముకు వచ్చిన స్నేహితురాలితో " ఆ
విక్కీ గాడితో పార్కుకు వెళ్ళావేమిటే" అంటున్న అమ్మడు( పే261) .ఈ కార్టూన్ చూడగానే
బాపు గారి భావం మీకు వెంటనే స్ఫురిస్తే మీరు మంచి శృంగార పురుషులన్నమాటే.!! ఇలా
ఒకటేమిటి ప్రతి కార్టూనూ ఓ ఆణిముత్యమే!మీ దగ్గర ఈ నవ్వుల రంగుల కార్టూన్ పుస్తకం
లేకపోతే ఇప్పుడే తీసు"కొనండి" !!

Monday, June 28, 2010

ఒరేయ్! బురుగూ ! ఇవ్వాళ మన నవ్వుల ముళ్లపూడి వారి పుట్టిన రోజురోయ్!!

ఈ రోజు మన బుడుగు పుట్టిన రోజురోయ్ !!

జూన్ 28, 1931 న రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో ఉన్న( ఇప్పుడు అక్కడ గార్డెన్స్ ఏవీ కనిపించవులెండి, ఏమంటే
ఇప్పుడవన్నీ "ఆల్ కట్ గార్డెన్స్") లేడీస్ హాస్పటల్లో ఓ చిన్నారి "బుడుగు" పుట్టాడు. ఆ బుడుగే పెరిగి పెద్దవాడై
మాటల చమత్ ’కారాల’తో నవ్వుల జల్లులు కురిపుస్తున్నారు. ఆయనే శ్రీ ముళ్లపూడి వెంకట రమణ. ఋణాలందహరి,
రాధాగోపాళం, గిరీశం లెక్చర్లు లాంటి అమోఘమైన రచనలతో అశేష పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు. చిన్ననాడే
బాపుగారు తోడై రమణ అంటే బాపు, బాపు అంటె రమణ అని స్నేహం అనె పదానికి స్మతి చిహ్ణం గా నిలచింది. ఆంధ్ర
వారపత్రికలో '56-57లలో వెలువడిన బుడుగు చిచ్చులపిడుగు తో చిన్నారులకు సహితం ప్రేమ పత్రులయ్యారు.
" దాగుడు మూతలు" లాంటి హాస్య చిత్రానికే కాకుండా "ఆలయ మణి" తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన
"గుడిగంటలు" చితానికి అద్భుతమైన సంభాషణలు వ్రాసి మాటల రచయితగా కూడా పేరు పొందారు. ఆంధ్ర వార పత్రికలో
ఆయన వ్రాసిన సినిమా సమీక్షలు ఆలోచింపజేసేవిగా ఉండేవి. "సువర్ణసుందరి" చిత్రానికి సమీక్ష వ్రాస్తూ ఒక చోట
ఇలా అంటారు. "ఇ.వీ.సరోజ వేషంలో పార్వతీ దేవి" ఇక్కడి రమణ గారి చమత్కారం చూశారుగా!. నిర్మాతగా మారి,
శ్రీ బాపుతో అందాలరాముడు లాంటి ఆణిముత్యాలను అందించారు. ఆత్రేయతో కలసి మూగ మనసులుకు మాటలు
నేర్పారు. ప్రేమించిచూడు మొ" చిత్రాలకు పాటలు వ్రాశారు. శ్రీ రామోజీరావు నిర్మించిన శ్రీ భాగవతం చిత్రానికి మాటలు,
కొన్ని పాటలు వ్రాశారు. "స్వాతి" వార పత్రికలో ఆయన వ్రాసిన తన ఆత్మీయ కధతో ఈ నాటి పాఠకులకూ దగ్గరయ్యారు.
ఈ నాటి యువలోకం తమకు ఎదురయ్యే కస్టాలను నస్టాలను ధైర్యంగా ఎలా ఎదుర్కో వచ్చో తను వ్రాసిన "కోతికొమ్మచ్చి"
ద్వారా చూపించారు. కోతికొమ్మచ్చి మొదటి భాగం విడుదలైన నెలలోనే 3 ముద్రణలను అందుకోవడం అరుదైన విషయం.
శ్రీ ముళ్లపూడి రచనలన్నిటినీ శ్రీ యమ్బీయస్.ప్రసాద్ గారి సంపాదకత్వంలో 8 సంపుటాలుగా విశాలాంధ్ర ప్రచురణాలయం
ప్రచురించింది. ఈ నాటి పాఠకులకు ఆ నాటి ఆయన రచనలను చదివే అవకాశం ఈ పుస్తక ప్రచురణలవల్ల కలిగింది. మరో
విశేషం ’కోతొకొమ్మచ్చి’ శ్రీ యస్పీ.బాలుగారి మధుర స్వరం తో సీడీల రూపంలో వెలువడ్డాయి!ఆయన చెప్పే కధల్లో జంతు
జాలం కూడా వాటి భాషల్లోనే మాట్లాడతాయి. కాకులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. వాటికి పాపం "రెక్కాడితేగాని
దొక్కాడదట.! చీమలేమో "పుట్ట"దీసి (అంటే మన భాషలో "కొంపదీసి"అన్నమాట) అంటాయి. ఇలా ఎన్నెన్నో భాషలు!
ఈ భాషలన్నీ మీరు నేర్చుకోవాలంటే ’ఋణాలందహరి" చదవాల్సిందే ! ఈ 28 తో ఆయన 80 లో ప్రవేశిస్తున్నా నిజానికి
ఆయన 8 ఏళ్ళ "బుడుగే"! ఆయనకు మనందరి తర్ఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన మరిన్ని రచనలతో
పాఠకలోకాన్ని అలరిస్త్తారని ఆశిస్తూ............. యమ్వీ.అప్పారావు(సురేఖ) నవీ ముంబాయి..




Wednesday, June 23, 2010

ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు


ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
మంచి కధలు వ్రా(తీ)యటంలో పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ తన కొత్త
పుస్తకం "వంశీకి నచ్చిన కధలు" పేరిట విడుదలచేశారు. రచయితగా ఆయన కధలు,"మా
పసర్లపూడి కధలు","మా దిగువ గోదావరి కధలు" చదివిన పాఠకులు ఇందులో తనతో బాటు
ప్రముఖరచయితల 50 కధలను తప్పక మెచ్చుకుంటారు. ఇందులోని ప్రతి కధా దేనికదే ఆణి
ముత్యమే! దయ్యాల కధలు, దయ్యాల లాంటి మనుషుల కధలు మనల్ని కదలిస్తాయి.శ్రీ వంశీ
తను ఎన్నుకున్న కధలతో మనను పరవిశింప జేస్తారు. "నల్ల సుశీల" అన్న ఆయన స్వంత
కధలో ఓ వర్ణన చదివితే సినిమా తెరపైలా ఆ ద్రుశ్శ్యం మన కళ్ళెదుట అగుపిస్తుంది. ఉదాహరణకు
"ఆ రోజు
పసుపురంగు పిట్ట ఒకటి టిల్లచెట్ల గుబుర్లలోకి దూరి చిగుళ్ళని మాత్రమే రుచిగా తింటోంది.
నేలమీద పడున్న పచ్చి తాటాకు మీదికి చేరిన రెండు ఎర్రతొండలు దెబ్బలాడుకుంటున్నాయి.
కొండ దిగువున మేస్తున్న గేదె వీపు మీద వాలిన కాకి నిశ్శబ్దంగా కూర్చుంది. గాలికి వూగుతున్న
సొలప చెట్టు ఆకు మీదికి జేరిన రామచిలక కిందికి జారిపోకుండా కాళ్ళతో పట్టుకుంది. గంతులేస్తూ
పరిగెత్తుతున్న చిన్న గొర్రెపిల్లని ఎలాగయినా పట్టుకోవాలని వెనకాలే పరిగెడుతున్నాడు కొండ
ముసలాడు."
చదువుతుంటే మనం అక్కడే వున్నట్టుగా అనిపించడంలేదూ!
ఇంత మంచి కధలకు శ్రీ బాపు బొమ్మలు మరింత అందాన్ని అందించాయి. ఈ 50 కధలూ
మనకు రూ.200/-లకే అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.

Monday, June 21, 2010

లంచావతారాలు





లంచమనెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే ఒప్పు
ఓ కూనలమ్మా!
అన్నారు శ్రీ ఆరుద్ర.

అప్పుడప్పుడూ మనం లంచావతారాలను వల వేసి పట్టుకున్నారని పేపర్లలో టీవీల్లో చదువుతుంటాము,చూస్తుంటాము. కళ్ళ ఎదుట నిత్యం అగుపించే దానికి ఇలా వల వేసి పట్టు కోవలసిన అవసరం వుందా అనిపిస్తుంది. లంచగాళ్ళపై ఎన్నో సినిమాలు దాదాపు అన్ని భాషల్లో వచ్చాయి. వాటికి విపరీతమైన ప్రజాదరణ లభించాయి. లంచం తీసుకొనే మహానుభావులు కూడా ఆ సినిమాలను కుటుంబ సమేతంగా చూసి ( సినిమా హాళ్ళలో ఉచితంగానే సుమా) హీరో లంచగొండి విలన్లను చితకబాదినప్పుడు చప్పట్లు కొట్టి కేరింతలు కొడతారు. ఐనా సినిమా అయిపోయాక ఏ మాత్రం మార్పు వస్తుందా? రానే రాదు. మరునాడు షరా మామూలే. మామ్మూల్లు మాములే! మరో విషయం మనం మన పిల్లలకు ఉగ్గుపాలతోనే ఈ లంచాలను నేర్పుతున్నామేమో అనిపిస్తుంటుంది.నువ్వు ఆ పని చేసి పెడితే నీకో బొమ్మ లెకపోతే ఓ చాక్లెట్ కొనిపెడతా అనో మరోటొ ఆశ చూపిస్తాం. ఇంట్లో పనికి సాయం చేయడం ఓ భాధ్యత అని ఎంతమంది తల్లితండ్రులు గుర్తిస్తున్నారు.ఓ సంఘటన ఈ సంధర్భంలోమీతో పంచుకుంటున్నాను. మా మితృడి షాపుకు వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి వచ్చి" మీరు ఠాగూర్ సినిమా చూసారా? చాలా బాగా తీసాడు కదండీ " అంటూమాట్లాడటం మొదలెట్టాడు. వెంటనే నా స్నేహితుడు కౌంటర్ నుంచి ఓ ఐదు వందల నోటు తీసి అతని
చేతిలో పెట్టాడు. ఎలా వచ్చాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు."ఇదేమిటి అలా డబ్బు ఇచ్చావు " అని
ఆశ్చర్యంగా నే నడిగితే "అదంతే, అతనో ఉద్యోగి. నెలనెలా షాపులకు వెళ్లి మామూళ్ళు కలెక్ట్ చేసుకుంటాడు"
అని జవాబివ్వగానే "ఔరా!"అని నే నోరెళ్ళబెట్టా.

Sunday, June 20, 2010

ఈ రోజే కాదు ప్రతి రోజూ గుర్తు వచ్చే మా నాన్నారు !

మీ ఇంట్లో ఎవరంటే నీకు ఇష్టం అని అడిగితే నేను ఈనాటికీ నాన్న అనే చెబుతాను.
మా నాన్నగారు మాతో ఓ స్నేహితుడిగానే మెలిగేవారు. అలానే ఆయన అంటే ఓ
విధమైన భయం కూడా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి
వచ్చేటప్పటికి రాత్రి చాలా ఆలశ్యమయేది. ఆయన కోసం నిద్రపోకుండా నేనూ,అక్క
సరోజిని మేలుకొని ఉండేవాళ్ళం.చెల్లి కస్తూరి మాత్రం నిద్రపోయేది. ఎంత రాత్రైనా ఓ
కొత్త పుస్తకం చదివి గాని నిద్రపోయేవారు కాదు. ఆదివారం వచ్చిందంటె మాకు
పండుగ రోజే! నాన్నగారు సండే స్టాండర్డ్ పేపర్ ( ఇందియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో
ఆదివారం మాత్రం ఆ పేరుతో వచ్చేది)లోని కామిక్స్ చదివి వినిపించేవారు. అందులో
మజీషియన్ మాండ్రేక్, బ్రింగింఅప్ ఫాదర్, లిటిల్ కింగ్ రంగుల కామిక్స్ వచ్చేవి. టిట్
బిట్స్, శంకర్స్ వీక్లీ, ఫిల్మిండియా, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, ఆంధ్ర పత్రిక వీక్లీ, మడ్రాస్ మైల్,
చందమామ,బాల పత్రికలను కొనే వారు. అలా ఆయన నాకు పుస్తకాలమీద,పత్రికల
మీద అభిరుచిని పెంచారు. సినిమాలు ఎలా తీస్తారు, కార్టూన్ సినిమాలు ఎలా తయా
రవుతాయి లాంటి విషయాలను చెప్పేవారు. ఆదివారం మార్నింగ్ షోలకు ఇంగ్లీష్
సినిమాలకు తీసుకొనివెళ్ళెవారు. మైయిన్ సినిమా ముందు చూపించే మిక్కీ మౌస్
కార్టూన్లకోసం సంబరపడెవాళ్ళం. మా ఇంట్లో పెద్ద హెచ్యమ్వీ గ్రామఫోన్ ఉండేది.
1948లో స్టీవర్ట్వార్నెర్ అనే అమెరికెన్ రేడియో కొన్నారు.అప్పుడు గ్రామఫోన్ అమ్మే
శారు.ఇంట్లో నేనొక్కడినే ఏడ్చాను. రేడియోలో ఐతే పిల్లల ప్రోగ్రాములు వస్తాయి అని
నాన్నగారు నన్ను ఓదార్చడం ఇంకా గుర్తుంది. తరువాత నే ఉద్యోగం లో చేరాక
స్టీరియో రికార్డు ప్లేయర్ కొంటె నాన్న గారు ఎంతో సంతోషించారు. ఆయన చేతిలో
ఎప్పుడూ రీడర్స్ డైజెస్ట్ పత్రిక ఉండేది. 1944 నుంచి ఆ పత్రికను ఆయన కొనే వారు.
ఇప్పుడు నేను అయన అలవాటును కొనసాగిస్తున్నందుకు ఆనందం గా వుంది.
నాన్న గారు నాకు ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. ఏ నాడూ ఏ వస్తువునయినా
అరువుగా తీసుకోవద్దని. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని. అప్పుడే మనకు విలువ
గౌరవం ,మనం ఉద్యోగంలొఉన్నా లేకపోయినా ఉంటుందనే వారు. మా నాన్న గారు తన 81
ఏట దివంగతులైనప్పుడు, ఆయణ్ణి కడసారి చూడాలని వచ్చిన ఓ ప్రముఖుడు శ్మశాన
వాటికకు వచ్చి మమ్మల్ని తన కారు లొ ఇంట్లో దిగపెట్టారు. అప్పుడు మా నాన్నగారు
చెప్పిన మాటలోనిజం తెలిసింది. శెలవు రోజుల్లో నాన్న మమ్మల్ని గోదావరి రైల్వే స్టేషన్కు
తీసుకొని వెళ్ళి ప్లాట్ఫారం చివర గోదావరి బ్రిడ్జ్ వరకు తీసుకొని వెళ్ళేవారు. అక్కడ బ్రిడ్జ్
పై కాపలా ఉండే రిజర్వ్ పోలీసులు నాన్నగారిని చూసి సల్యూట్ చేస్తే మాకు చాలా గర్వంగా
ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళు మీకెలా తెలుసు అని అక్కయ్య అడిగితే మా బాంక్ రిజర్వ్
బాంక్ కి పాత నోట్లు పంపేటప్పుడు సెక్యూరిటీగా వస్తూవుంటారు అని చెబితే అదంతా ఓ
వింతగా ఉండేది. మా నాన్నగారి పేరు మట్టెగుంట వెంకట సుబ్బారావు. ఆయన ఆనాటి
ఇంపీరియల్ బాంకు లో చేరి (1955 లో స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా గా మారింది) 1959లో
రిటైర్ అయ్యారు. నాన్నగారికి క్లబ్బులకువెళ్ళడం, సిగరెట్లు లాంటి అలవాట్లు లేవు. తీరిక
దొరికితే మాతోనే గడిపేవారు. అలాటి మంచినాన్నను ఇచ్చినందుకు భగవానునికి నమో
వాకాలు అర్పిస్తూ నాన్నలందరికీఈ రోజు జేజేలు!

Sunday, June 13, 2010

సైలెంట్ కార్టూన్లను మాటలు లే(రా)ని నవ్వించే చిత్రాలు





సైలెంట్ కార్టూన్ అను మూగ కార్టూనులు
అసలు కార్టూన్లంటే చూడగానే నవ్వొచ్చేవే అసలు సిసలు నవ్వుల బొమ్మలు. మనం ఏ భాష
వాళ్లమైనా ఓ కార్టూనిస్టు వేసిన బొమ్మచూడగానే అర్ధమై పోవాలి. అలాటి కార్టూన్లనే సైలెంట్ కార్టూన్లంటారు.
ప్రఖ్యాత కార్టూనిస్ట్ మితృలు శ్రీ జయదేవ్ బాబు గారు సైలెంట్ కార్టూన్ పేర ఓ సైటె నడుపుతున్నారు.
నాకు సైలేంట్ కార్టూన్లంటే నే ఇష్టం. నేను 1958 లో ఆంధ్ర వార పత్రికలో వేసిన మొదటి కార్టూన్
సైలేంట్ కార్టూనే. ఇలా సైలెంట్ కార్టూన్లే కాకుండా కామిక్స్ కూడా సైలెంట్ వి ఉన్నాయి. అందులో
’లిటిల్ కింగ్’ అనే కామిక్స్ మా చిన్నతనంలో "సండే స్టాండర్డ్" లో ప్రతి ఆదివారం వచ్చేది. ప్రఖ్యాత
మరాఠి కార్టూనిస్ట్ దాదాపు అన్నీ సైలెంట్ కార్టూన్లే గీసారు. ఆయన కార్టూన్లలో కొన్ని మీకు నా బ్లాగులో
ఇంతకముందు పరిచయం చేశాను. మాటలు ఉన్నాకార్టూన్లలో రెండు బొమ్మలు
ఉంటే అందులో ఓ బొమ్మే మాటలాడితే బాగుంటుంది. మిగతా భావం బొమ్మ ద్వారా అగుపించాలి.
" టిఫిన్ చేద్దుగాని రారా, అంటే ఇలా అనుకోలేదు" అన్న నే గీసిన కార్టూన్లో ఇంటికి టిఫిన్ చేద్దామని
వచ్చిన ఫ్రెండ్తో పిండి రుబ్బిస్తున్నతన స్నేహితుడితో అన్న పై మాటల ద్వారా భావం అర్ధమవుతుంది.
ఇలాటి ఒకే వాక్యంతో కార్టూన్లను పండించడంలో శ్రీ బాపు, శ్రీ జయదేవ్, శ్రీ సరసి,బాబు లను ప్రముఖంగా
చెప్పుకోవాలి. రెండు బొమ్మలు ఒకరి ప్రక్క ఒకరిని వేసి ఇద్దరి పైనా మాటలు వ్రాస్తే అది బొమ్మతో
ఉన్న జోకవుతుంది కాని మంచి కార్టూనవదు. ఇల్లాటి కార్టూన్ల ఐడియాలు నాతో బాటు సోదర కార్టూ
నిస్టులందరికీ పుష్కలంగా రావాలని కోరుకుంటూ..........