Thursday, November 04, 2010

షడ్రుచులు-2




జ్యోతి గారికి పోటిగా నేను షడ్రుచులు వ్రాయటం మొదలెట్టాననినిమీరను
కుంటె మీరు ప(త)ప్పులోకాలేసినట్టే!.నాకు వండిన వంటలు ఆరగించడంలో
ప్రావీణ్యం వుందిగానీ తయారుచేయడంలో ఏ మాత్రం అనుభవంలేదు.
కానీ కూరలను తరగడంలో నేను చాలా నేర్పరిని. నా శ్రీమతికి కత్తిపీటతో
తప్ప చాకుతో తరగడం రాదు. కాని నాకు మాత్రం చాకుతో అన్ని
రకాల కూరలను తరగడమంటే చాలా ఇష్టం.అందుకే ప్రతి రోజుకూరలను
తరిగి వంటలో సాయం చేస్తాను. తరగందే కూరలు వండటం కుదరదు
కనుక, ఏ కూరైనా బాగుందంటే నేనే మూలకారకుణ్ణి అని అంటుంటాను.
నాకు వంటరాదు కాని చాలా మంది మగవాళ్ళు వంట చేయడంలో
అనుభవజ్ఞులే. అందుకే కదా "నలభీమ పాకం" అని అంటారు కాని,నిజంగా
రోజూ వంట వార్పూతో కష్టించే ఆడవాళ్ళ పేరుతో ఏ పాకం పేరుపొందలెదు!
బాపుగారికార్టూన్లలో చాలామంది మొగవాళ్ళు ఇంట్లో వంట చేసి నవ్విస్తుంటారు.
అప్పుడప్పుడూ ఇంట్లో మగవాళ్ళకు వంట చేయవలసివచ్చినప్పుడు వంట
చేశాము అని చెప్పకుండా ,ఈ రోజు చెయ్యికాల్చుకున్నాని చెబుతారు!
ఏమైనా ఈ రోజుల్లో వంట చాలా సులువైపోయింది. రోట్లో పచ్చల్లు, పప్పులు
రుబ్బవలసిన పనే లేదు. అన్నిటికీ మిక్సీలొచ్చాయి. రోట్లో రుబ్బిన కంది
పచ్చడి రుచి మిక్సీలో చేస్తే చస్తే రాదు. ఇప్పుడు కారం కూడా రెడీమేడ్ గా
దొరుకుతున్నది. పూర్వం ఆవకాయల కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో
రోకళ్ళ చప్పుళ్ళు వినిపించేవి. రెండు రోకళ్ళు ఒక దాని తరువాత ఒకటి
తగలకుండా రొట్లో పైకి క్రిందికీ రైథమ్ గా కదులుతుంటే మాకది వింతగా
తోచేది. కారం కోరొస్తున్నా అక్కడే కూర్చొని చూసేవాళ్ళం. ఆ కాలంలో
వంటలు వండటం కూడా భారీగా వుండేది. ఫెళ్ళిళ్లకు, మరేకార్యానికైనా
గాడిపొయ్యి త్రవ్వేవాళ్ళు. ఒకే సారి నాలుగైదు పెద్ద గుండిగలు పెట్టి
వంటలు చేసేవారు.ఇంటి పెరట్లో ఖాళీ స్థలం వుండేది కనుక మట్టిని
తవ్వి గాడిపొయ్యి ఏర్పాటుచేయడానికి వీలుండేది. వంటశాల
భలే సందడిగా వుండేది. ఇప్పుడేమో కాటరింగ్ వచ్చేసింది. ఎవరెవరో
ఎక్కడెక్కడొ చేసి తీసుకువస్తున్నారు. పచ్చని అరటి ఆకులు బదులు,
మెరుపు కాగితాలు అతికించిన అట్ట కంచాలొచ్చాయి.హాయిగా బంతిలో
కూర్చొని విందు చేయడం కాకుండా కంచాలు పట్టుకొని క్యూలో నిలబడి
జైళ్ళల్లో ఖైదీల్లా వేయించుకోవడం.! రాబోయే కాలం లో పొట్లాలు కట్టి
వరద భాధితులకు పంచినట్లు పంచినా ఆశ్చర్యపడనవసరం లెదు.
ఇకతిండి మీద జోకులూ ,సామెతలూ,ప్రభోదాలు మన తెలుగులో
చాలా వున్నాయి...
* తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు
* కూటికోసమే కోటి విద్యలు
* అప్పుచేసి పప్పు కూడు
* ఇంగువ కట్టిన గుడ్డ
*అన్నం చొరవే గాని అక్షరం చొరవలేదు
*అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది; ఏమీలేని విస్తరి
ఎగిరెగిరి పడుతుంది
*అన్నమైతేనేమిరా? సున్నమైతే నేమిరా ? ఈ పాడు పొట్టకు
అన్నమే వేతామురా
*పప్పుచారు అడుగుది - పరమాన్నం పైపైది రుచి..ఇలా ఎన్నో
గురజాడ అప్పారావు గారన్నారు,"తిండిగలిగితె కండగలదోయ్"
ఇంగ్లీష్ లోకూడా ఓ మంచి మాట ఉంది;
EAT TO LIVE BUT NOT LIVE TO EAT.
తిండికీ మరో అర్ధం మన వాళ్ళు చెప్పారు. లంచాలు బొక్కేవాళ్ళను
"వాడు చాలా తినమరిగాడు" అని!
ముక్తాయింపుగా ముళ్లపూడి వారి జోకులు!నవ్వితే నవ్వండి!
(మాకభ్యంతరం లేదు)
*చిరాగ్గా వున్న భర్తని పరాగ్గా వున్న భార్య పిలిచి
"ఈపూట అరటికాయొండనా,వంకాయొండనా?" అంది.
" నా తలకాయ వండు."
" ఆవపెట్టి వండనా? వేయించమంటారా?"
>>>>>>>>>>>>>>>>>>>>>
* సుబ్బారావుగారు పకపక నవ్వి"ఏమయ్యా,ఇదెప్పట్నించి?
నీ కంచం నువ్వే కడుక్కోడం?"అన్నాడు.
"అబ్బే ఎన్నడూ లేదు!" అన్నాడు చక్రవర్తి.
"ఆ, ఇందాక నా కళ్లతో నేను చూస్తినే"
"పిచ్చివాడా, అది నాది కాదోయ్, మా ఆవిడ తిన్న కంచం"
అన్నాడు చక్రవర్తి విరగబడి నవ్వుతూ.
<<<<<<<<<<<<<<<<<<<<<<<
కూరల చిట్కా: (కొనే టప్పుడు,వండే టప్పుడు కాదు):ఈ సారి మాల్ లో కూరలు
తీసుకొనేటప్పుడు, ప్లాస్టిక్ కవరును చేతికి గ్లవ్ లాగ తొడుక్కొని పచ్చి మిరప
లాంటివి గుప్పిడిలో తీసుకొని తిరిగి కవరును రివర్స్ చేస్తే అవన్నీ కవరులోకి
చేరతాయి! మీ చేతికి మట్టంటకుండాఓ పనై పోతుంది,బాబూ!!
ఇక్కడ నవ్విస్తున్న కార్టూన్లు ఇంకెవ్వరివి? మిమ్మల్ని నవ్వించి
కవ్వించే శ్రీ బాపు గారి "బాపు కార్టూన్లు ,సంపుటి ఒకటి లోనివి!
మా బాపుగారికి కృతజ్ఞలతో... ..

2 comments:

  1. అప్పారావు గారూ !
    మంచి విషయాలు అందిస్తున్నారు. ధన్యవాదాలు.
    మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
    - శి. రా. రావు
    శిరాకదంబం

    ReplyDelete
  2. రావు గారు,
    శుభోదయం. మీ అభిమానానికి ధన్యవాదాలు.
    మీ ఇంటిల్లిపాదికీ మా అందరి శుభాశీస్సులు

    ReplyDelete