Tuesday, November 09, 2010

పుస్తకాలయం

నాకు లాగానే మా మితృలు శ్రీ జోశ్యుల రామశర్మగారు
(జోరాశర్మ) పుస్తక ప్రియులు. కవితలూ వ్రాస్తారు. బియస్
యన్ ఎల్ లో ఉన్నత ఉద్యోగి. ఆయన పుస్తకాలమీద గల
అపారమైన ప్రేమాభిమానాలతో " మా ఇంటి పుస్తకాలయం"
పేరిట ఓ కవితను వ్రాశారు. నాకు నచ్చిన ఆ కవితను మీ
అందరి ముందు వుంచుతున్నాను.
<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>
మా ఇంటి పుస్తకాలయం
మా ఇంటి షోకేసు
బొమ్మల కొలువు కాదు
పుస్తకాలకు నెలవు,
పేరేడ్ గ్రౌండు____
ఆ అలమరా దగ్గర నడుస్తుంటే
సుశిక్షిత సైనికులు నిటారుగా నిలబడి
కవాతు చేస్తున్నట్లుంటుంది
ఒక కొనగోటి సైగకు
ఒక పుస్తక సైనికుడు ముందుకొచ్చి
నాకు సైనిక వందనం చేస్తాడు.
అనాఘ్రాత పుష్పంలా
అట్ట నలగని పుస్తకం అందంగా
కనిపిస్తుంది నాకు
కొత్త పుస్తకం దొరికితే
ఇవాళ కొత్త మితృడు మా యింటికొచ్చినట్లే!
ఆత్మీయతా సరాగాల
చిరు సంతకాలతో
కవిమిత్రులిచ్చిన పుస్తకాలు
పుస్తకం తెరవగానే సంతకం కింది తేదీనాటి
జ్ఞాపకాల్లోకి లాక్కెళతాయి
పుస్తకం మూసేసినా
ఆ పరిమళాలు వెంటాడుతుంటాయి!
నే కూడ బెట్టుకొన్న పుస్తకాల ఆస్తి
నే ఋణపడి కట్టుకొన్న ఇంటి కన్నా గొప్పది.
ఇంకా చెప్పాలంటే
నన్ను కొనుక్కున్న ఆలికన్నా గొప్పది___
నిజం చెబుతున్నాను
నేను చాలా పుస్తకాలు వాయిదాల పద్ధతిలొ కొనుక్కున్నాను
కనీసం వాయిదా పద్ధతిలో అయినా
చదవ లేక పోతున్నాను___
కొని చదవకుండా దాచుకొన్న పుస్తకాలు
నిజాం నవాబు కట్టుకొని ఉంచిన
అంత:పుర బురఖా స్త్రీల్లా కనిపిస్తాయి
అందుకే ఓ బెంగ నన్నెప్పుడూ
వెంటాడుతుంది
దానికి మా ఆవిడ తోడవుతుంది
"ఇవన్నీ ఇంకెప్పుడు చదువుతారు?"
అని ఓ తుపాకీ ప్రశ్న గురిపెడుతుంది
పుస్తకాల్ని విసుక్కుంటే
నా ప్రాణం విలవిల లాడుతుంది
అడ్డం వచ్చిన పుస్తకాలన్నీ
అటకెక్కించమంటే
మా ఆవిడే నాకుఅడ్డమని పిస్తుంది
పుస్తకానికి అమర్యాద జరిగితే
నే సహించలేను
"ఓసి అమాయకురాలా!
పుస్తకం
నీ పుస్తెల తాడంత పవిత్రమే!"
అని దెబ్బలాడాలనిపిస్తుంది___
ఇవ్వాళ టీవీ వచ్చి
పుస్తకానికి సవతై కూర్చుంది
నా షోకేసు పక్కన టీవీ
పవిత్రాలయం పక్కన
బార్ అండ్ రెస్టారెంట్ లా తగలడింది
దీని "ఠీవీ" మండ
ఇంటిల్లి పాదినీ
కంట్రోలు చేస్తుంది____
నా చేతికొచ్చిన సమీక్షా గ్రంధం
నా ఆశీస్సులు కోరే
దీర్ఘ సుమంగళి__
నేను పుస్తక ప్రియుల్ని ప్రేమిస్తాను
చిలకాగోరింకాల్లా మెలిగే భార్యాభర్తల్ని
"పెన్నూ పుస్తకంలా కలిసి పొండర్రా" అంటూ
ఓ మంచి పుస్తకం బహుకరిస్తాను.
వాళ్ళ ముందు గది
సద్గ్రంధాల జీవనది కావాలని
ఆశిర్వదిస్తాను_________ జోరాశర్మ
ఆ పుస్తకాల ముందు గది నాది. రోజూ పుస్తకాల
దుమ్మును దులుపుతూ, నా కెక్కడ డస్ట్ ఎలర్జీ
వస్తుందోనని జాగ్రత్త తీసుకొంటున్న మా శ్రీమతి
పద్మకు, ఈ కవితను నా బ్లాగులో
వుంచడానికి పెద్ద మనసుతో అంగీకరించిన మితృలు
జోరాశర్మ గారికి కృతజ్ఞతలు.

2 comments:

  1. పుస్తక ప్రియుల బాధలన్నీ విశ్వవ్యాప్తంగా ఒకటేనన్నమాట ! ఇంత మంచి కవిత ను రాసినందుకు ముందు జోరా శర్మ గారికి ..మీ బ్లాగులో పెట్టి మాకందించి నందుకు మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. చాలా బావుంది. శ్రీ శర్మగారికి అభినందనలు

    ReplyDelete