Sunday, November 07, 2010

ఎడా పెడార్ధాలమాటలు!!



కొన్ని మాటలకు ,అడిగే ప్రశ్నలకు అర్ధాలూ, పెడార్ధాలూ
వుంటుంటాయి. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఏ
షాపింగ్ మాల్లోనో కుటుంబ సమేతంగా అగుపించాడను
కోండి. వెంటనే మన నోటి నుంచి వచ్చే ప్రశ్న"కులాసాగా
వున్నారా?!" అనడుగుతాం.
కులాసాగా లేకపోతే అలా సంతోషంగా షాపింగ్కు పిల్లా పాపల్తో
రాడుకదా? ఇక సినిమాకు వెడితే ఇంటర్మిషన్ లో తెలిసిన
వ్యక్తి మనని చూడగానే "సినిమాకు వచ్చారా?" అని తప్పక
అడుగుతాడు. "కాదు, ఇంటర్వెల్ ల్లో టీలమ్ముకుందామని"
అని జవాబివ్వాలని మనసులో అనిపించినా,ఓ పిచ్చి నవ్వు
నవ్వి "ఆ, మీరూ సినిమాకు వచ్చారా?" తెలియకుండానే
అనేస్తాం! ఇక రైల్వే స్టేషన్లో కనిపించగానే "ఊరికేనా?" అని
అడిగితే "అవును, ఊరికే, కాని ఊరికే కాదు, డబ్బిచ్చి టిక్కెట్టు
కొనే" అని జవాబివ్వొచ్చు!
ఇక కొందరు సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తరచు
వాడే మాట "ఇక పోతే" "భలానా అప్పారావుగారు చాలాగొప్ప
వారు. వారు, ఇక పోతే, ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు.ఇక
పోతే....." ఇలా పోతే అలా సాగిపోతుంది.
కొన్ని మాటలకు అర్ధాలూ వేరుగా వుంటుంటాయి.
" మీ ఇంట్లో కూరేంచేశారు?" అనడిగితే ఓ కొంటెమ్మగారు "ఏం
చేస్తాం.బోల్డు డబ్బేట్టికొన్నవి.తిన్నాం" అని జవాబిస్తుంది!
"మీ కార్టూన్లేవైనా పడుతుంటాయా?" అని కార్టూనిస్టునడిగితే
" తిప్పి పంపినవి మా పోస్ట్మాన్ విసిరితే మా హల్లో పడుతుంటాయి"
అని జవాబుతో నవ్వించొచ్చు. అలాటి మాటలనుంచే కార్టూన్లకు
ఐడియాలు పుట్టుకొస్తుంటాయి. "మావారు రోజూ టయరయి పోయి
ఆఫీసు నుంచొస్తారు" అని నా శ్రీమతితో స్నేహితురాలు చెబుతుంటే
"టైరయి" పోయి రావడం మీద ఐడియా వచ్చి ఓ మనిషికి తల
బదులు కారు టయర్ వేసి కార్టూన్ గీస్తే అది చాలా ఏళ్ళ క్రితం
"స్వాతి"లో పడింది.కాదు కాదు అచ్చయింది. ఇంకొందరు ప్రతి మాట
ముందు "పాపం" అని వాడుతుంటారు. "పాపం వాళ్ళమ్మాయికి,
పెళ్ళి కుదిరింది, పాపం ఆవిడకు బాబు పుట్టాడు" ఇలాఅన్నమాట!
ఇంకొకరు ప్రతి విషయానికి "మీ దయవల్ల" అనటం అలవాటు.కాని
కొన్ని సందర్భాలలో ఆ మాట ఉపయోగించడం కొంచెం ఎబ్బెట్టుగా
ఇబ్బందిగా వుంటుంది. వాళ్ళకు మంచి ఉద్యోగమొచ్చినా,అబ్బాయి
పుట్టినా "అంతా మీ దయవల్ల" అంటుంటారు. మరొకరు మంచికీ
చెడుకీ "దిక్కుమాలిన" అనే మాటను వాళ్లకు అదేం దిక్కుమాలిన
అలవాటోగాని ప్రయోగిస్తుంటారు. "దిక్కుమాలిన సినిమాకు టిక్కెట్లు
దొరకవేమో అనుకున్నామా, దిక్కుమాలింది మా ఆవిడకు తెలిసిన
ఆవిడ టిక్కెట్లు ఇచ్చింది.దిక్కుమాలింది ,ఆ సినిమా బాగావుందండోయ్"
అంటారు. ఇలా ఎడా పెడార్ధాల మాటలు మాట్లాడే ఆడవారి,మొగవారి
మాటలకు అర్ధాలే వేరులే!!
.
.

No comments:

Post a Comment