Monday, February 21, 2011

అమ్మ భాష



నేడు మతృభాషా దినోత్సవం!
ఏదో ఒకనాడు ఈ కాన్వెంట్ చదువుల పిల్లలు మిమ్మల్ని అడగొచ్చు!
"డాడీ , అమ్మంటే ఎవరూ ?" అని !!
మనకేమో మన పిల్లలు తెలుగు మాట్లాడితే నామోషీ !
వాళ్ళ నోటంట మమ్మీ, డాడీ అనొస్తే మనకెంతో ఖుషీ !!
"డాడీ" అన్న మాట తన మనవళ్ల నోట విన్న ఓ తాత
పోనీలే మన చిన్నారి ఇలా ఐనా తెలుగులో "డ" గుణింతం
చెబుతున్నాడని సంబరబడ్దాడట !!

మన తెలుగువాళ్ళ దౌర్భాగ్యం మనం మన తెలుగువాళ్ళని మెచ్చుకోం.
తెలుగులో మాట్లాడుకోం. తెలుగు పుస్తకాలు చదవం.పిల్లలకు తెలుగు
ఇంట్లోనైనా నేర్పం. ఇంగ్లీషు చందమామనే కొని పెడతాం. కనీసం వాళ్లకు
తెలుగు చందమామ కధలను మనమేనా చదివి వినిపించం. ఈమధ్యే
ఓ అబ్బాయి మాఇంట్లో చందమామను చూసి ఇదేం మాగ్ అంకుల్
అంటూ అడిగాడు. మీ పిల్లల పత్రిక చందమామ అన్నాను. "వాట్,
ఆ పేరుతో తెలుగులో ఇప్పుడు వస్తుందా?!! "అంటూ ఆశ్చర్య పడ్డాడు.
బాబూ, అసలు ఇది మన తెలుగులోనె పుట్టింది. తరువాత ఇంగ్లీషులో
వచ్చింది అన్నాను. ఒక విషయం లో మాత్రం నేను సంతోషించిన
విషయం , నాగిరెడ్డి, చక్రపాణి తమ చందమామకు ఇంగ్లీష్ లో కూడా
చందమామ అన్న పేరునే ఉంచారు. ఇప్పటి తరం వారైతే " అంకుల్
మూన్" అని పేరు పెట్టేవారేమో !!
బాపు గారు తమ అందాల అక్షరాలతో "అందాల అఆలు" అన్న
పుస్తకాన్ని అందమైన రంగుల బొమ్మల్తో వ్రాస్తే ఆ పుస్తకాన్ని మాకు
తెలుగు రాదుగ అనకుండా, "రాదుగ" ప్రచురణాలయం, మాస్కో వారు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున ప్రచురించడం కొస మెరుపు.
మనం తెలుగు వాళ్లతో తెలుగులోనే మాట్లాడుదాం! తెలుగు పుస్తకాలూ
(ఇంగ్లీషుతో బాటు) తీసు "కొని" చదువుదాం !! మన తెలుగువాళ్ళమని
గర్వంగా ప్రపంచానికి చాటుదాం !!

4 comments:

  1. ఈ పుస్తకం గురించి ఇక్కడ రాసుకున్నాను.
    http://balasahityam.blogspot.com/search?updated-max=2010-05-26T08%3A06%3A00-07%3A00&max-results=7

    అ ఆ లతో ఆగిపోకుండా ఇంకా బోలెడు పుస్తకాలు బాపూ గారి లాంటి వారు తెస్తారని ఆశిద్దాం.
    కొందామనుకునే వారూ, కొనే వారూ కూడా ఉన్నారు. రాయాలనుకునే వారూ ఉన్నారనీ, ప్రచురించి ప్రచారం చెయ్యాలనుకునే వారు రావాల్ని ఆశిద్దాం.

    ReplyDelete
  2. "హల్లో సర్, ఆన్ టెల్గు మీ పోస్ట్ సో నైస్. ఈ జనరేషన్ చిల్డ్రన్ కి టెల్గు లో స్పీక్ షెయ్యడం కాదు కదా టెల్గు లెటర్స్ ఐడెంటిఫై షెయ్యడం కూడా టెలీదు. అషలు కొన్ని ఇయర్స్ కి టెల్గు అవర్ మదర్ టంగ్ అన్న విష్యం మర్షిపోతారేమో."

    మీ టపాకి కొన్నేళ్ళ తరువాత ఇలాంటి స్పందన వచ్చినా రావచ్చు :)

    మాతృ భాషా దినోత్సవం ఈ ఆంగ్ల మోజులో పడి మృత భాషా దినోత్సవం కాకూడదని కోరుకుంటూ మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. ఈ పుస్తకంతోనే మా పాప తెలుగు అక్షరాలు దిద్దింది.ఇవాళ్టి రోజున ఏడేళ్ళ ఆమె తెలుగు పేపరు రాగానే చదివి, ఈనాడు ఆదివారం సంచికలో క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తిచేస్తోందంటే.,.పర్లేదు..నేను మరీ అన్యాయంగా పెంచట్లేదు

    ReplyDelete
  4. నేటి తల్లిదండ్రులలో ముందు మార్పు రావాలి .
    అప్పుడే "తేనే తెలుగు తియ్యదనం ఎప్పుడూ
    తగ్గదు.తగ్గరాదు "

    ReplyDelete