Tuesday, February 22, 2011

" నా టీవీ" సినిమా వార్తలు


కొత్తగా మొదలెట్టిన " నా టీవీ " లో సినిమా వార్తలు చదువుతున్నది నేను,
వింటున్నది మీరే ! తలగీతలు లేకుండా వెంఠనే మీ కన్నుల్లో గుచ్చుతూ,
చెవుల్లో జోరుగా జోరీగలా రొద పెట్టడమే మా వాతల, సారీ వార్తల ప్రత్యేకత.
ఆహా ఒహో ఫిలింస్ తమ చిత్రం "నీనా" విడుదలయి పోయిన సంధర్భంలో
విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో తండ్రి, అక్క, తమ్ముడు
మాట్లాడుతూ ఇది మహత్తర కుటుంబ చిత్రమని చెప్పారు. దర్శకులు శ్రీ
అయోమయం ఇది చాలా అర్ధంకాని కధా చిత్రమని దీన్ని మొదటిసారి చూసి
కధను చెప్పగలిగేవారు ఎవరైనా వుంటే తమ స్వంత ఖర్చులతో రాజధానికి
వచ్చి కధ వివరిస్తే నేల టిక్కెట్లు రెండు బహుమతిగా అందజేస్తామని, తిరిగి
వెళ్ళాక చిత్రం ఇంకా ఆడుతుంటే మరోసారి చూసి మరోవిధంగా కధ వివరిస్తే
మరో బహుమతి వుంటుందని తెలియజేసారు. నిర్మాత మాట్లాడుతూ హాల్లళ్ళొ
సగం జనం నిండుతుంటే గిట్టని వాళ్ళు, ధియేటర్లు సగం మాత్రమే నిండుతున్నాయని
దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేశంగా అన్నారు.
ఈ చిత్రం చూసి ప్రభావితుడైన ఓ ఎనభైఏళ్ళ పెద్దమనిషి నవయవ్వన మాత్రలు
ఓ వంద ఆబగా మింగి గుర్రు పెట్టి నిద్ర పోయాడనీ, ఉదయం భార్య లేపితే " ఊ
నేనివాళ బలికిపోనూ" అంటూ గారాలు పోయాడని, ఇది ఈ సినిమా గొప్పతనమనీ
కాలరు ఎగరేయబోయి, తను వేసుకొన్నది లాల్చి కనుక సారీ చెప్పారు. ఇక సినిమా
హీరో మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వాళ్ళే చూస్తున్నారు అని చెప్పగా "కొంటె
కోణంగి" పత్రికా విలేఖరి " ఎవరు? ఆపరేటర్లు, గేటు కీపర్లా" అని అడిగితే, ఏం వాళ్ళు
మాత్రం ప్రేక్షకులు కారా అంటూ కారాలు మిరియాలూ నూరుతూ కోపంతో డాన్సు
చేశారు.
ఛీచా ప్రొడక్షన్సు నిర్మిస్తున్న హర్రర్ చిత్రం ప్రారంభిస్తున్న సంధర్బంగా ప్రెస్ మీట్
ఏర్పాటు చేస్తూ తమ చిత్రానికి "చూస్తే చస్తావ్" గా పేరు పెట్టామని, నాయకిగా ఏదో
దేశం అమ్మాయిని ఎన్నుకున్నామని, ఆవిడ పేరు గుర్తులేదని, ప్రక్కనే ఆమె వున్నా
అడిగి మీకు చెబుదామంటే యూనిట్ లో ఎవరికీ ఆమె భాష రాదని వాపోయారు. ఈ
చిత్రం ఆడియో విడుదల క్రొత్త పంధాలో చేస్తున్నామని, మార్కెట్లోకి మొదట బ్లాంక్
సిడీలు విడుదలచేస్తామని, దీని వల్ల పైరసీని అద్భుతంగా అరికట్టవచ్చనీ తెలిపారు.
చిత్రం విడుదలయాక ఆ సిన్మా చూసిన వాళ్ళుంటే ఆ బ్లాంక్ సిడీని వాళ్ళ ఆఫీసు
ఎడ్రసు తెలుసుకొని తీసుకొని వస్తే తమ సంగీత దర్శకులు కాకాని పిచ్చేశ్వరరావు
(కాపిరావు) గారు సరసమైన రేటుకు కాపీ చేసి ఇస్తారని, ఇదివరలో ఆయనకు దొంగ
సిడీలు రికార్డు చేసే వ్యాపారం వుండటంవల్ల ఇందులో ఎంతో అనుభవం గడించారని
తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు పైరసీ దారులకు ఓ శుభవార్త! పైరసీ పై ముఖ్యమంత్రి
ఢిల్లీకి ఆఖరు సారి వెళ్ళి వచ్చాక ఒక నిర్ణయం హైకమాండుతో చెప్పి తీసుకుంటారని
ఈ రోజు అసెంబ్లీ లో తెలియజేశారు. పైరసీపై మంచి నిర్ణయం తెచ్చేదానికి , ఇచ్చెదానికి
కట్టుబడి వున్నామని ఆయన అన్నదానికి పైరసీదారులు హర్షం తెలియజేశారు.
ఇంతటితో ఈ వాతలు ఇక మీకు చాలు! ఉంఠా! నిద్రొస్తుంది!! ఠా! ఠా!! వీడుకోలు!!
గుడ్ బై ఇంక షెలవు!!
( మా హాసం క్లబ్ కార్యక్రమంలో నే వ్రాసి చదివిన తమాషా వార్తలు)

4 comments:

  1. మీ వాతలు చాలబగున్నాయి.

    ReplyDelete
  2. (పైన రాసిన సుధ ఎవరో నాకు తెలీదు)

    సురేఖగారూ...
    చాలాబాగా రాసారండీ.....మనసారా నవ్వుకున్నాం.పరాయిభాష హీరోయిన్ పేరు గుర్తురాకపోవడం...సినిమా కథ వివరిస్తే నేల టిక్కెట్లు బహుమతి...బావున్నాయి మీ వాతలు...అదే మీటీవీ వార్తలు..అవునూ...టీవీ స్క్రీన్ మీద మీ బొమ్మ ఎలా రప్పించారు చెబ్దురూ..

    ReplyDelete
  3. సుధగారు,ధన్యవాదాలండి.photofacefun.com ద్వారా మీ(మా)
    ముఖారవిందాన్నిఅలా ఎక్కడైనా పెట్టైవచ్చు.!!ఇప్పుడే ట్రై చెయ్యండి.

    ReplyDelete
  4. yenno rojula taruvata eeroju telugu Satire ku machu tunaka laanti article chadava galigaanu. Now on I will look forward to read your article every day to get a FRESH start of the day.

    ReplyDelete