Wednesday, February 23, 2011

ప్రయాణం ప్రమోదానికా ? ప్రమాదానికా ?



ఉదయాన్నే పేపరు చూడగానే భయంకరమైన వార్తలు ! కీ"శే" భమిడిపాటి
రాధాకృష్ణ గారు ( ప్రఖ్యాత నాటక, సినీ హాస్య రచయిత) మాటలు జ్ఝాపకం
వస్తాయి. "ఏమండీ పదకొండు దాటింది ఇంకా స్నానం అవలేదా మేస్టారూ"
అంటె , " పేపర్లో చదివేవన్నీ చావు కబుర్లే కదా, అన్నీ చదివి, ఒకేసారి
స్నానానికి వెళ్ళేటప్పటికి ఇలా లేటవుతున్నది" అని నవ్వుతూ అనేవారు..
ఈ రోజు హిందూ పేపర్లో పడిన పైన మీరు చూస్తున్న ఫొటో ఛూడగానే
నిజంగా వళ్ళు ఒక్కసారిగా జలదరించింది. పుష్పకవిమానంలా మొత్తం
కుటుంబమంతా అలా ఆ బైక్ పై వెళుతుంటే ఆ బైక్ ను చూసి జాలి వేసింది.
వాళ్ళేమో ఏ మాత్రం జాలిలేకుండా జాలీగావిహరిస్తున్నారు. ఓ వేళ ఏ ప్రమాదమైనా
జరిగితే ? ఆటోలో వెళితే డబ్బులవుతాయని ఇలా బైక్ మీద ప్రయాణం చేస్తే
అనుకోనిది జరిగితే హాస్పటల్ ఖర్చులు ఇంతకంటే ఎక్కువ కావడమే కాదు,
శారీరక, మానసిక బాధకూడా వుంటుంది కదా? అందుకే మన పెద్దలు ఇలాంటి
వాళ్ళని చూసే లోభికి మూడింతల నష్టం అన్న సామెతను చెప్పారు.
వార్తాపత్రికల్లో రోజూ ప్రమాదాల కధలు చదువుతూ, టీవీల్లో వార్తలు చూస్తూ
ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్ధం కాదు. పార్కింగ్ లైనుకు కొంచెం ముందు పార్క్
చేస్తే హడావిడీ చేసే మన పోలీసు శాఖ ఇలాటి విషయాల్లో ఎందుకు శ్రర్ధ వహించదో?
బైకుల మీద వీళ్ళ విన్యాసాలు రోజూ చుస్తూ జనాలకు సర్కస్ మీద మోజు
అందుకే పాపం తగ్గిపోయింది !
ఇక బైకులకు నంబరు ప్లేట్లు ఎవేవో పేర్లతో వుంటాయి. మొదట్లో కాస్త హడావిడి
చేసిన మన ఘనత వహించిన ప్రభుత్వం వారు మళ్ళీ కామ్ అయిపోయారు!
నేనుఈ బైకువిన్యాసాలపై స్థానిక దిన పత్రిక "సమాచారం" లో వ్రాసి గీసిన ఓ కార్ట్యూన్:
ఈనాడు ఫ్యాషన్ బైక్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరికి !
దీనిపై స్వారీ మాత్రం ముగ్గురికి !!
దూసుకుపోయే వేగానికి లేదు కదా ఏ మాత్రం సెన్స్ !
జనానికి మాత్రం గుండెలదిరే న్యూసెన్స్ !
ఉన్నా లేకున్నా ఒకటే లైసెన్స్ !!
వింటారా "తల" కోసం వాడమంటే ఓ హెల్మెట్ !
బుర్ర లేని వాళ్ళకెందుకులే , పోయేదేముంది,
ఆ బుర్రంతా కాదా "టులెట్" !!

1 comment:

  1. మంచి మాట చెప్పారండి. ఇలాగే వెళ్ళి, యాక్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకన్న ఒక కుటుంబ యజమాని గురించి నాకు తెలుసు. అయితే అదృష్టవశాత్తూ వాహనంపైనున్న మిగిలిన కుటుంబసభ్యులకు ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు.

    ReplyDelete