Tuesday, March 08, 2011

బొమ్మల కధలు





విదేశాల్లో బొమ్మల కధల పుస్తకాల్లు కోకొల్లలు. డిసీ కామిక్స్ లాంటి
ఎన్నెన్నో బొమ్మల కధల పుస్తకాలు అక్కడి పిల్లలను, పెద్దలను విశేషంగా
ఆకర్షించాయి. అవే పుస్తకాలు మన దేశంలోనూ దిగుమతిఅయ్యాయి.
ఆకధలన్నీ సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి కధలు! ఆ తరువాత
ఆ కధలే సినిమలుగానూ వచ్చాయి. మన దేశంలోని పిల్లలు ఆ బొమ్మల
కధలను చదవడానికే ఎక్కువ ఇష్టపడటం మొదలెట్టారు. విదేశాల్లో
కూడా పిల్లలు వాటితో బాటు క్లాసిక్స్ ను కూడా చదివే అలవాటు
చేయడానికి క్లాసిక్స్ ఇల్లస్ట్రేటెడ్ పేరిట ప్రసిద్ధ రచయితల కౌంట్ ఆఫ మాంటో
క్రిస్టో, టేల్ ఆఫ్ టు సిటీస్ మొదలయిన కధలను బొమ్మలు కధల రూపంలో
ప్రచురించడం మొదలయింది. మన భారతదేశ సంస్కృతిని, గాధలను మన
పిల్లలకు తెలియ చెప్పడానికి అనంత్ పాయ్ అమరచిత్ర కధల పేరిట
పౌరాణిక, చారిత్రక గాధలను బొమ్మలు కధలుగా ప్రచురించి , పిల్లలను
మన దేశకధల వైపు ఆకర్షింప జేశారు. ఆయనే టింకిల్ పేరిట మాస పత్రికను
వివిధ విషయాలపై బొమ్మల కధలతో ప్రారంభించారు. కొంతకాలం టింకిల్
తెలుగులోనూ వచ్చేది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన పిల్లలు తెలుగు
పుస్తకాలు చదివితే మనకు నామోషీ కాబట్టి కొనడం మానేశాం. అందుచేత
టింకిల్ తెలుగు ప్రచురణ ఆగిపోయింది. పిల్లల కోసం ఇంతటి మంచి పుస్తకాలను
తీసుకొనివచ్చిన అనంత్ పాయ్ మన బుడుగు రమణ గారు దిగవంతులైన రోజునే
అస్తమించడం విచారకరమైన వార్త.
ఆంధ్ర వార పత్రిక 1950 లలో పంచతంత్రం కధలను విశ్వాత్ముల నర
సింహమూర్తి గారిచే బొమ్మల కధలుగా ప్రచురించింది. ఆ బొమ్మల కధలకు
శ్రీ నండూరి రామమోహనరావుగారు గేయాలరూపంలో రచన చేశారు. ఆ పుస్తక
రూపంలో వెలువడిన ఆ పంచతంత్రం బొమ్మలకధ నేను నమ్మి అరువిచ్చి పొగొట్టుకున్న
చాలా పుస్తకాల్లో అదొకటి. అందులొ నాకింకా గుర్తు. మిత్రలాభం కధలో
లేడి వేటగాడి వలలో పడినప్పుడు, రామమోహనరావుగారు ఆ బొమ్మ పైన ఇలా
వ్రాశారు. "మేత కోసమై వలలో పడినే పాపం పసివాడు" అని ! విశ్వాత్ముల నరసింహ
మూర్తిగారు దివగంతులైతే శ్రీ బాపు మిగతా పంచతంత్రమ్ కధలను వేశారు. ఆంధ్ర
వారపత్రికలో బాపుగారు "బంగారం-సింగారం", "లంకెబిందెలు" మొదలయిన బొమ్మల
కధలను వేశారు. "గలివర్ ట్రావెల్స్" ను రంగుల్లో బాపుగారు బొమ్మల కధగా గీయగా
చందమామ లో ప్రచురించబడింది. బాపు గారి బొమ్మల కధలన్నిటినీ ఒకే చోట
చదివే అవకాశం వాహిని బుక్ ట్రస్ట్ వారు "ముళ్లపూడి వెంకటరమణ -బాపు బొమ్మల
కధలు పేరిట ప్రచురించారు.

2 comments:

  1. Dear AppaRao garu..! Namasthe..You have given very good information.

    ReplyDelete
  2. 'పులిని కలుసుకోండి ' అనే బొమ్మల కథ లొ ఎంత ప్రొఫెషలినజం కనబడుతుందొ... కాంపొజిషన్, కమాండింగ్ ఇన్ ఫిగర్ సమ పాళ్ళ్లల్లొ వున్న చిత్రకారులు ఈయన శ్రీ ప్రదీప్ సాతే.. మీ పోస్ట్ చదివాకా ఆయన గురించి వెతికా ,పెద్ద సమాచారమేమి దొరక లేదు . ఇది తప్ప
    Pradeep Sathe, involved in the famous works such as Gamraj, Kalia the Crow, Angara, Dara, Aditya etc. and a no. of ACK specials with Mr.Anant Pai..
    Just like another legend, Mr.Ram Waeerkar, Mr.Sathe had a sudden death with no news and headlines.. Is this Indian Comic Book Industry?? Where we forget the ones who contributed the most??

    ReplyDelete