Sunday, March 27, 2011

మంచివాడి మీద ఒక పద్యం



వెక్కిరిస్తూనే జీవితాన్ని
చక్కదిద్దే వాడా !
తెలుగు తనానికి వెలుగు తనం
జోడించిన ప్రోడా !
రెండు గీతల్లో పన్నెండు కావ్యాలు
ధ్వనించిన ఋషీ !*
నువ్వంటే మాకు కుషీ !
నువ్వు పెట్టిన ఒరవళ్ళు
నీతరం ద్దిద్దుతున్నందుకు
తెలుగుదేశపు గోడలే సాక్ష్యం
నువ్వు తిట్టిన దీవనలు
మూడు పువ్వులు - ముప్ఫయ్యారు పళ్ళయినందుకు
తెలుగు వీక్లీల పేజీలు తార్కాణం
గుండెలకు కితకితలు పెడుతూ
మనస్సులు ఉతికే మనిషీ !
మేమంటే మాకు నామోషీ
( మానవుడు తప్పుచేయని దోషి )
----- ఆరుద్ర

1974 ఫిబ్రవరిలో రాజమండ్రి విక్రమహాలులో బాపుగారి చిత్రకళా
ప్రదర్శన జరిగింది. ఆ సంధర్బంలో విడుదలయిన సావనీర్లో బాపు
గారిపై ఆరుద్ర వ్రాసిన పై రచన ప్రచురించారు
ఇంకా ఆ పుస్తకంలో శ్రి ఎమ్వీయల్ బాపుగారి గురించి ఇలా చెప్పారు.
ఎవరి గీత ఎలా వుంటుందో దైవం తప్ప ఎవరూ చెప్పలేరు. కానీ బాపు
గీత బావుంటుందని మనందరిచేతా చెప్పించి బాపు మనందరికీ
దైవత్వాన్ని ప్రసాదించాడు.
సుఖ దు:ఖాదిక ద్వంద్వాతీతమైన
మనస్తత్వం
ఒకరిఒరవడి కాదగిన
వ్యక్తిత్వం
కలిగినవాడు బాపు
నిరంతరం శ్రమించడం
పనిలోనే విశ్రమించడం
మనసారా నవ్వగలగడం
నవ్వించ గలగల గలగడం
అతను పొందిన వరం
బాపు గొప్పవాడనడానికి మనం ఎవరం ?
తెలుగువారం -
ఏనాటికైనా ఒక వెలుగు వెలుగువారం !
బాపు అభిమానులందరికీ నచ్చుతుందని ఆశిస్తూ........
* శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు బాపుగారి గురించి చెబుతూ" ఆయన
దేముని చిత్రాలు గీసేటప్పూడు ఋషిగా మారిపోతారు"అన్నారు. అందుకేనేమో
ఆరుద్ర "ఋషీ"అన్నపదాన్ని అప్పుడె ఉపయోగించారు.!!

3 comments:

  1. "మా బాపు" గురించి,చక్కని,అపూర్వమైన,అందరికీ దొరకని అమూల్య విషయాలు సేకరించి పెట్టినందుకు మీకు నా అభినందనలు.

    ReplyDelete
  2. ఈ మహా మంచివాడి మీద పద్యం బావుందండీ. స్పష్టమైన అంత్య ప్రాసల ఆరుద్ర ముద్ర బావుంది.

    "ఎవరి గీత ఎలా వుంటుందో దైవం తప్ప ఎవరూ చెప్పలేరు. కానీ బాపు గీత బావుంటుందని మనందరిచేతా చెప్పించి బాపు మనందరికీ
    దైవత్వాన్ని ప్రసాదించాడు." శ్రీ ఎమ్వీయల్ గారి ఈ మాటలు ఇంకా బావున్నాయి.

    బాపు గారి విశేషాలు అందించడం లో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపించారు

    @ సో మా ర్క గారు
    "మా" కాదండీ "మన"

    ReplyDelete
  3. ఆదివారం మనం నిర్వహించిన హాసం క్లబ్ కార్యక్రమ విశేషాల వివరణ బాగుంది...
    రమణ గారిపై గల అభిమానంతో హాసాభిమానులు వచ్చి సభను
    నవ్వులప్రదం చేసారు.
    ఈ 76వ కార్యక్రమము మన హాసం క్లబ్, రాజమండ్రికి (2004-2011)
    ఎనిమిదవ పుట్టిన రోజు. అనుకోకుండా ఇది 'రమణీ'(రమణ+ఈ)యంగా
    జరగడం కడు రమణీయం కదా?
    -----దినవహి వేం.హ.రావు.

    ReplyDelete