Wednesday, March 23, 2011

"జూబిలీబాయ్ !" జిందాబాద్ !!-ముందుమాట చెప్పిన శ్రీ ముళ్లపూడి




కన్యాశుల్కం చదవడం, భమిడిపాటిని చూడడం వాడడం, బారిస్టరు పార్వతీశంతో
నడవడం, వుడ్ హౌస్ వరడ్-ప్లే-గ్రౌండ్సులో చెడుగుడు ఆడడం, లా రలెండ్ హార్డీ,
చాప్లిన్ లూ, మార్క్స్ బ్రదర్సూ చూడడం మాయిద్దరికీ యిష్టం.
సోగ్గా నడిచే బొమ్మాయిల వెనకాలే నడుస్తూ వాళ్ళ నడుముల మీద నాట్యమాడే
జడగంటా రావాలకు తాళం వెయ్యడం ఇంకా ఇష్టం.వాళ్ళ వెనకాలే నడిచేవాళ్ళం కాబట్టి
మొహాలు కనబడావు గదా! అందుకని వాళ్ళకు ఎదురుగా వస్తున్న మొహాలు చూస్తూ
-అమ్మాయిల అందాలను అంచనా కట్టడం అదో సరదా; ఆ కుర్రాళ్ళు వీళ్ళనే చూస్తూ
పేడకళ్లల్లో కాళ్ళేసి బోర్లా గీర్లా పడటం చూసి నవ్వడం మరింత సరదా. వీటన్నిటినీ మించి
ఇంకో సరదా ఉంది.
చక్కహా పెసరట్టుప్మా లాగించి, కాఫీ తాగేసి నోట్లో వక్కపొడి వేసుకొని-కాలు మీద
కాలు వేసుకొని వెల్లకిలాపడుకొని సిగరెట్టు కాలుస్తూ....ఇవన్నీమామూలే ... పొగపీలుస్తూ
చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం-అల్టిమేట్ జాయ్! దీనికి తోడు వెనకనించి-విన-
బడే-గులాం పాట, చిన్నప్పటి రాజేశ్వరరావు బాలసరస్వతి పాటలు అల్టిమేటున్నర.అలా
వందలు వేలూ చూశాం.
భారతిలో "త.రా " ( తలిశెట్టి రామారావుగారి ప్రబంధకన్య) తరవాత తరతరానికీ
ఎదిగే పెరిగే కార్టూన్ లు లక్షోపలక్షలు... ఎందరో మహానుభావుకులు ఎన్నోవేసేశారు; మరి
ఈతరంవారికేం మిగిల్చారు అని జాలిపడుతూ వీపు నిమరబోయాం - వీపు బదులు పిక్కలు
అందాయి. అంటే-జాలిపడే స్థితికాదు; అసూయ పడేస్థాయికి ఎదిగారు; ఎదుగుతున్నారు.
కొత్త కొత్త గీతలూ రాతలూ జోకులూ బావిలో నీరులా వూరుతూనే ఉన్నాయి. కొత్త వాళ్ళు
వేస్తునే వున్నారు. అది తరగని గని-అలాగే సూ-రేఖార్టూన్స్ కూడా. అంత హాయిగానూ
వున్నాయి. ఆయన రాతా గీతా మిళాయించారు. రాత మీద గీత - రాతలేకుండా గీతా....
ఎన్నో నవ్వులు గుబాళించాయి. బాంకాఫీసరుగా డబ్బుని అప్పులిచ్చి పుచ్చుకున్న
అప్పారావుగారు - ఇవి మాత్రం ఎక్కడా అప్పు చేయకుండానే లా- గీయించేశారు.
టైరై-పోయారు-కార్టూన్లు పడ్డాయి, మందురాయడం-టిఫిను చెయ్యడం లాటి మామూలు
మాటల్లోంచి ఎడా-పెడా-ర్ధాలు తీసి- కుంచెడేసి నవ్వులు పిండుతారు.
వెయిటర్ ఎవడూ? వడ్డించేవాడా? తినేవాడా? టిఫినుచేసేవాడెవడు తినేవాడా?
వండేవాడా?
కాల్చుకు తింటున్నావని చిలగడదుంప మొర్రో అంటే- వేపుకుతింటున్నావని
బంగాళాదుంప కుయ్యో అందిట....
50 ఏళ్ళ నవ్వుల పంటతో గోల్డెన్ జూబ్లీవిందు అందిస్తున్న శ్రీ అప్పారావుగారికి
శతమానం భవతి.
-------ముళ్లపూడి వెంకట రమణ.
నాపై ఎంతో అభిమానంతో ( అప్పారావంటే అయనకు నిజంగా ఎంతో ప్రేమ) నే అడగగానే
ముందుమాటను వ్రాసి పంపించారు. తరువాత మరోటి వ్రాసి " ఇంతకుముందు పంపినది
అందినా దాని బదులు ఇదే వాడండి " అంటూ పైన నేను మీ ముందుంచినది వ్రాశారు.
వెంకటరమణగారు స్వదస్తూరితో వ్రాసిన మొదటి పేజీకూడా ఇక్కడ వుంచుతున్నాను.
ఈ నెల 27వ తేదీ ఆదివారం స్ఠానిక గౌతమీ గ్రంధాలయంలో మా "హాసం క్లబ్"
ముళ్లపూడి రమణీయం పేరిట ఆయన జోకులు, చిత్రాలలోని పాటలతో రెండు గంటల
కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నాము.

1 comment:

  1. మేం కూడా మా విజీవాడ 'హాసం' క్లబ్ తరపున ఎం.కమలకాంత్ గారి నిర్వహణ లొ 19-3-2011 న మాకున్న ఫన్నిహితులతో 'రమణ సభ ' జరిపాం. వారిమాటలు, పాటలు రికలబోసుకున్నాం. మీ సభ కూడా హాపీ గా సాగాలని ఆశిస్తూ ..

    ReplyDelete