అమ్మ అన్నపదం ఎంతో మధురమైన పదం! అమ్మను తలచు కోవడానికి
ప్రత్యేకంగా ఏడాదికి ఒకరోజును ఎన్నుకోడం మన సాంప్రదాయం కాదు !
అమ్మ ప్రతి క్షణం మన ముందూ వెనుకా వుంటూనే వుంటుంది. మా అమ్మ
ఫొటోలను మీకు ఇక్కడ వరుసగా చూపిస్తున్నాను.
మా అమ్మగారి దగ్గర కంటే నాన్నగారి దగ్గరే మాకు చనువెక్కువ. ఏమంటే
అమ్మ మేము తప్పుగా మాట్లాడినా,(వస్తది,పోతది లాటి మాటలు) విపరీతంగా
కోప్పడెది. ఆమె వల్లే ఎవరైనా పెద్దవాళ్లతో ఎట్లా మాట్లాడాలో, తోటివాళ్లతో ఎలా
స్నేహంగా వుండాలో నేర్చుకున్నాము. ఆదివారం మధ్యాహ్నం రేడియోలో
వచ్చే రేడియో అన్నయ్య, అక్కయ్య పిల్లల కార్యక్రమాలను వినడానికి వచ్చే
పక్కింటి పిల్లలకు ప్రత్యేకించి చేసిన పిండి వంటలను (ముఖ్యంగా మైసూర్
పాక్ ,లడ్డు చేయటంలో అమ్మ స్పెషలిస్ట్) పెట్టేది.
అమ్మకు పుస్తకాలు పత్రికలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆంధ్ర వార పత్రికలో
వచ్చే ప్రఖ్యాత ఇంగ్లీషు నవల అనువాద సీరియల్సు చదివేది. "కౌంట్ ఆఫ్ మాంట్
క్రిష్టో" ( శ్రీ సూరంపూడి సీతారాం అనువాదం) పుస్తకరూపంలో వచ్చాక ఆ నవల
కొని ఎక్కువ సార్లు చదివేది. ఆకధను ప్రక్కింటి స్నేహితులకు (ఇరుగుపొరుగులు)
సంక్షిప్తంగా చెబుతుండేది. ఈనాటికీ అమ్మ కొన్న ఆ నవల నా లైబ్రరీలో అమ్మ
గుర్తుగా పదిలంగా వుంది.
మనసుకవి ఆత్రేయ గారు అమ్మ గురించి ఓ పాటలో ఇట్లా అంటారు...
అమ్మ వంటిది
అంత మంచిది
అమ్మ ఒక్కటే !
అయ్యైనా జేజైనా
అమ్మ పిమ్మటే.........
అమ్మను అనుక్షణం తలుస్తూ మన అమ్మలందరికీ జేజేలు !!
nice your blog,,,,
ReplyDeletevisit our blog at http://uhooi.blogspot.com/