Tuesday, May 24, 2011

" ఐస్ " వాటర్ అను కన్నీటి ఏడుపు కధ !

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు ఆత్రేయ. కన్నీళ్లను ఇంగ్లీషులో
" టియర్స్" అని అంటారుగానీ, ఏడిస్తే, నవ్వితే వచ్చే ఆ కన్నీళ్ళు కళ్ళనుంచే
వస్తాయి కాబట్టి " ఐస్ " వాటర్ అని అంటే కాస్త హాస్సెంగా వుంటుంది కదా?
కన్నీళ్ళ రుచి ఉప్పగా వుండటానికి కారణాన్ని ప్రఖ్యాత రచయిత జనార్దన
మహర్షిగారు తన " వెన్నముద్దలు " పుస్తకంలో సరదాగా ఇలా చెప్పారు.
"ఎన్ని చేపల
ఏడుపో...
సముద్రం ఉప్పు..!
మరోచోట ఇలా అన్నారు :
"ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట ?
పక్కింటోడు
ఎదిగిపోయాడట !!



భార్యాభర్తలు సినిమాలో ఓ డైలాగు, " ఏడ్చే మొగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మ
కూడదు" ఇక పిల్లలు, పెళ్ళాలు తమ కోర్కెలు తీర్చుకోడానికి ఏడ్పు మంత్రం
చదువుతారని!. పిల్లల విషయంలో మాత్రం దీనికి కారణం అమ్మా నాన్నలే! ఇక
ఈ కాలంలో ఆడవాళ్ళు అలా "ఐస్" వాటర్ కురిపించి చీరలో, నగలో భర్తలచేత
కొనిపించుకోవటం లేదు. భర్తలే వాళ్ళు ఇంట్లో తమకు, పిల్లలకు చేసే సేవలకే
"ఐస"యిపోయి వారి కోరికలు తీరుస్తున్నారు. కానీ పిల్లలకు ఏడిస్తే తమ పనులు
సాధించుకోవచ్చు అన్న అలవాటును పెద్దలు చెస్తే చివరకు వాళ్ళే ఏడుపు ముఖం
పెట్టాల్సి వస్తుంది. " ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు"
అని బుజ్జి పాపాయిలను ఆటపాటలతో మరిపించవచ్చు కానీ పెద్దపిల్లలను ఏడ్చి
నప్పుడల్లా చంకనెక్కించుకొంటే నడుమునొప్పితో ఏడవలసి వస్తుంది. ముఖ్యంగా
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వున్న బొమ్మో మరోటో కావాలని ఏడుపు
లంకించుకోవటం ఆ ఇంటివారికీ, మనకూ ఇబ్బందే! బుజ్జిపాపాయిల ఏడుపు
ఉంగా ఉంగా అంటూ విన సొంపుగానే వుంటుంది.అదీకాక వాళ్ళు ఎంత ఏడిస్తే
ఊపిరితిత్తులకు అంత బలమనే మన పెద్దలు " బాలానాం రోదనం బలం " అన్నారు!
ఇక కొందరు వాళ్ళకు ఏ బాధలు లేకపోయినా ఎదుటివాళ్లని చూసి ఏడుస్తునే
వుంటారు ఎదుటవాడి అబ్బాయికో అమ్మాయికో మంచి మార్కులొచ్చి మెడిసనులోనో
ఇంజనీరింగ్ లోనో సీటొస్తే " ఆ ఊరికే సంబరపడిపోతున్నాడు.రేపు ఫీజులు కట్టేటప్పుడు
తెలుస్తుంది " అంటూ ఏడుస్తుంటారు. మా హాసంక్లబ్ కార్యక్రమాలకు ఏనాడూ రాని
ఓ పెద్దమనిషి "మీరు హాలు సగానికిపైగా జనాలువచ్చారన్నారు, సగంహాలు ఖాళీట
గదా" అని ఓ వెకిలి ఏడుపునవ్వు నవ్వుతుంటాడు. ఇది అతనికి ప్రతిసారి అలవాటైన
ఏడుపు.

ముళ్లపూడి రమణగారి "బుడుగు" బుజ్జిపాపాయిల ఏడుపు గురించి ఇలా చెప్తాడు.
"చిన్ని పాపాయికి కోపంవస్తే వాడు కేరుకేరుమని, యాయా అని ఘట్టిగా చాలాసేపు
చెప్తాడన్నమాట.!" ఇంకా ఏడుపు గురించి బుడుగు బోల్డు సంగతులు చెప్పాడు.
"ఏడిస్తే బామ్మ రూపాయిస్తుంది. ఇక లావుపాటి పక్కింటి పిన్నిగారు ఉందా,.వాళ్ళ
మగుడు దానికి ప్రెవేటు చెప్పేస్తాడా, అప్పుడేమో అది యిలా యేడుస్తూ బామ్మ
దగ్గరకి వస్తుందా, బామ్మేమో యేడవకమ్మా అని దానికి కాఫీ యిస్తుంది". అంటే
ఏడుపువల్ల కొన్ని సమయాల్లో లాభాలున్నాయని మన బుడుగు చెప్తాడు.

రాజకీయనాయకుల్ని కవ్వించి ఏడ్పించే కార్టూన్లు మనల్ని మాత్రం నవ్విస్తాయి.
అంటే వాళ్ళేడుస్తుంటే మనం నవ్వుతామన్నమాట! అంకెల్లో ఏడు సంఖ్య అంటే
చాలామంది ఇష్టపడరు. దేన్నైనా లెక్కపెట్టేటప్పుడు ఏడు సంఖ్యరాగానే ఆరున్నొక్కటి
అంటారు. ఏడిస్తే వాడు ఆరున్నొక్కరాగం తీశాడు అంటారు. మన అమితంగా
అభిమానించేవారికి ఏదైనా దుఖం, కష్టం కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తుంది.
అందుకే ఇలాటి సంధర్భాలలో ఏడుస్తున్నవారిని ఏడవనివ్వమంటారు. అలా ఏడిస్తే
మనసు తేలిక పడుతూందని, రోగ నిరోధక వ్యవస్త మెరుగు పడుతుందని చెబుతారు.
బాధకలిగినప్పుడు ఏడ్చేది మానవులు మాత్రమే! మిగతా జంతుజాలం వాటికి వచ్చిన
శారీరక బాధలను మరోవిధంగా , అరుపుల ద్వారా తెలియపరుస్తాయికానీ కన్నీళ్ళు
కార్చవు. అంతేకాదు తోటి జంతువులు బాగుంటే మన మానవుల్లా అవి ఏడవవు!!
(కన్నీళ్ళ కార్టూన్లతో మనని నవ్వించిన బాపుగారికి కృతజ్ఞతలతో)

1 comment:

  1. I guess you are indirectly commenting on people participating on .... yathra

    ReplyDelete