మరీ అల్లరి చేసే పిల్లల్ని కోతిమూక అంటాం. ఏవియస్ కోతిమూక
పేరిట ఓ సినిమాయే తీసేశాడు. కొందరు పెద్దమనుషుల నడవిడిక
చూస్తుంటే పిల్లల అల్లరికన్నా, కోతులు చేసే గోల కన్నా ఘోరంగా
వుంటుంది. నిజానికి కోతులు ఆ చెట్టుమీద నుంచి ఈ చెట్టుమీదకీ
ఆ కొమ్మ నుంచి పైకీ , కిందికీ సందడిగా దూకుతూ మంచి వినోదాన్నే
కలిగిస్తాయి. ఈ నాడు వచ్చే సినిమాల్లోని కొందరు హాస్యగాళ్ళ(క్షమించాలి),
నాయకీ నాయకుల కంటే కోతి గెంతులే మంచి వినోదాన్ని కలిగిస్తాయి కదూ?!
కోతులు కొమ్మల మీద చేసే విన్యాస్యాల్నే కోతికొమ్మచ్చి లంటారు.
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు కోతికొమ్మచ్చి పేరిట రాసుకున్న తమ
ఆత్మ కధ, ఇంకోతి కొమ్మచ్చిగా రెండోభాగం కూడా విడుదలై విశేష పాఠక
ఆదరణపొందింది. రాబోయే జూన్ 28 నాటికి రమణగారి పుట్టిన రోజుకు మరో
కోతి కొమ్మచ్చి మన ముందుకు "ముక్కోతి కొమ్మచ్చి"గా మనముందుకు
హాసం బుక్స్ ద్వారా రాబోతున్నది. ఇక అమెరికాలో తెలుగొచ్చి చదవటం
రాని మన తెలుగు వాళ్లకోసం యస్పీ.బాలు ,శ్రీ వరప్రసాదరెడ్డి గారల గాత్రంతో
వినే కోతికొమ్మచ్చులు విడుదలయ్యాయి.
రామాయణంలో సీతాన్వేషణలో వానరసేన ఎంత ప్రాముఖ్యం వహించిందో
మనకు తెలుసుగా! సీతాదేవిని కనుగొని ఆ విషయం హనుమంతుడు
తెలియజేయగానే యువరాజు అంగదుడు వానరులకు మధువనంలోకి
ప్రవేశానికి అనుమతించాక వనంలోని తేనె నంతా తాగినంత తాగి మిగతా
తేనెను ఒలకబోసి ఆ మధువు మత్తులో నానా గోలా చేస్తారు వానరులు.
అంటే అంగదుడు తన సేవకులకు గొప్ప పార్టీ ఇచ్చాడన్నమాట. అందు
వల్లనేమో తాచెడ్డ కోతి వనమెల్లా చెరచింది అన్న నానుడి వచ్చిందేమో1
ఇక మన వానరమితృలపై ఎన్నెన్నో సామెతలున్నాయి. కోతికి కొబ్బరి
కాయ దొరికినట్టు, కొండమీద కోతి ఇలా! జున్నుముక్కను పంచుకోడంలో
తగవులు పడి తీర్పుకోసం కోతి దగ్గరకెళ్ళిన పిల్లులకధను మనం చిన్నప్పుడు
చదువుకున్నాం ! దీన్నే మార్జాల మర్కటన్యాయం అంటారు. జంగిల్ బుక్
కధలో కోతులు వాటి రాజ్యంలో మౌగ్లీని అల్లరి పెట్టిన తీరు తెలుసుకదా!
మనం కోతులనుంచే పుట్టామని డార్విన్ సిద్ధాంతం చెబుతున్నది. వాటికి
మనకు చాలా పోలికలున్నాయి. ముఖ్యంగా చెవులు చూడండి. అచ్చు మనకి
లాగానే వుంటాయి. పిల్లలు పెద్దలు కూడా ఎక్కడ కోతులు అగుపడ్డా కోతుల్లా
ఎగబడి చూస్తారు. కవ్విస్తారు ! శ్రీ బాపు గారు జూలో కోతులు లావాటి పిన్ని
గారిని చూసి కిచకిచలాడుకోవటం ఎంత చక్కగా వేసారో ఛుశారుగా! కోతి తెలివికి
మొసలి-కోతి కధ ఒక ఉదాహరణ.
"మల్లీశ్వరి" లో భానుమతి పాడిన కోతీబావకు పెళ్ళంట అన్న పాట
విన్నారుగా!
ఇక కోతి కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం! మరీ ఎక్కువైతే కోతిపుండు
బ్రహ్మరాక్షసి అవుతుంది !
No comments:
Post a Comment