1963 మార్చి 29 వతేదీన విడుదలయిన లలితాశివజ్యోతి ఫిల్మ్స్ వారి
" లవకుశ " నిర్మాణానికి నాలుగేళ్ళ పైగా సమయం పట్టింది. ఆర్ధిక
ఇబ్బందులతోబాటు నిర్మాణంలో వుండగా దర్శకులు సి.పుల్లయ్య
దివంగతులుకాగా ఆయన కుమారుడు సి.యస్.రావు పూర్తిచేశారు.
కధా, మాటలు సదాశివబ్రహ్మం వ్రాయగా పాటలను సముద్రాల,సదా
శివబ్రహ్మం, కొసరాజు అందించారు. ఘంటసాల కూర్చిన సంగీతం
అత్యంత ప్రజాదరణ పొందింది. లవకుశ పాత్రధారులు వివిధ సీన్లలో
ఆకారాల్లో వయసు తెచ్చిన మార్పులతో ఒక్కోసారి ముందు సీన్లలో
తరువాత దృశ్యాలలో కనిపించినా పెక్షకులు అవేవీ పట్టించుకోకుండా
చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చారు. టిక్కెట్టు ధర రూపాయి
పావలా (పై తరగతి) వున్న నాడే "లవకుశ" కోటిరూపాయలు పైగా
వసూలు చేసి చరిత్ర సృష్టించింది పూర్తి గేవాకలర్ లో "లవకుశ "
చిత్రీకరణను కమెరామెన్ పి.యల్.రాయ్ నిర్వహించారు.
ఇప్పుడు 48 ఏళ్ళ తరువాత నిర్మాత శ్రీ యలమంచిలి సాయిబాబా
అదే కధను" శ్రీరామరాజ్యం " పేరిట శ్రీ బాపు దర్శకత్వంలో, శ్రీ ముళ్లపూడి
వెంకట రమణ కధ మాటలతో 22-11-2010 ఉదయం 10 గంటలకు
నాచారమ్ రామకృష్ణా స్టూడియోస్ లో పూజతో ప్రారంభించి ఏడాదిలోగా
చిత్ర నిర్మాణం పూర్తిచేసి విడుదల చేయటం విశేషం. శ్రీ బాపు చిత్రాన్ని
అద్భుత కళాఖండంగా మలచారు. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ
చిత్రం మరపురాని గుర్తుగా నిలచిపోతుంది.
ఇళయరాజా , జొన్నవిత్తులగీతాలకు కూర్చిన సంగీతం, హంగేరియన్ వాద్య
బృందంతో కూర్చిన నేపధ్యసంగీతం శ్రీరామరాజ్యం కి మరింత విలువను
పెంచింది. సీత పాత్రలో నయనతార నటన నయనానందకరంగా వుంది.
ఆమెకు గాత్రధారణ చేసిన సునీత నయనతార నటనకు నిండుతానాన్ని
ఇచ్చింది. బాలకృష్ణ శ్రీరాముడిగా కొన్ని దృశ్యాలలో శ్రీ రామారావులా
అగుపించారు. అక్కినేని వాల్మీకిగా నటనలోనూ, సంభాషణలు పలికే
తీరులోనూ తనకు తానే సాటి అని మరో సారి నిరూపించు కున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగులు, సాంకేతికపరంగా వాడిన
గ్రాఫిక్స్ చాలాబాగున్నాయి శ్రీ రామారావు భుజం పై నిజం పుట్టుమచ్చ
వుంటే ఇందులో బాలకృష్ణ భుజంపై పెట్టుమచ్చను వుంచడం ఓ విశేషం!
లవకుశలు చిన్న పాపాయిలుగా వున్నప్పుడు ఊయలగా తీగలతో
ఊయల తయారుచేయించడం, ఆశ్రమ దృశ్యాలు, జలపాతాలు, అందమైన
ముని కుటీరాలు, గ్రాఫిక్ లో చూపించిన లేళ్ళు, నెమళ్ళు ఒకటేమిటి
అన్నీ కమనీయ దృశ్యాలే. వాల్మీకి లవకుశలతో రామాయణం గురించి
ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించడం వాళ్ళు రామాయణ పాత్రల గొప్పతనం
చెప్పటం ఈతరం పిల్లలకు రామాయణం గురించి తెలుసుకొనడానికి
మంచి సదావకాశం. తెలుగువారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఇలాటి
మంచి చిత్రం చూపించాల్సిన అవసరం ఎంతైనావుంది. ఒకటే తీరని లోటు.
రమణగారు ఈచిత్రాన్ని చూసివుంటే ఎంత ఆనందించేవారో అని తలచు
కుంటే ఏదో చెప్పరాని బాధ. ఆయన ఆశీస్సులు ఈ చిత్రానికి, నిర్మించిన
నిర్మాత, సాంకేతకనిపుణలకు, నటీనటులకు సర్వదా తప్పక వుంటాయి.
అప్పారావు గారూ !
ReplyDeleteఆప్పటి ' లవకుశ ' ప్రకటన. విశేషాలు అందిస్తూ వాటిని ఇప్పటి బాపు గారి సృష్టితో పోలుస్తూ రాసిన మీకు ధన్యవాదాలు.