Monday, April 04, 2011

ఉగాది - పన్చాంగం-ఉగాది పచ్చడి !!


ఉగాది వచ్చిందంటే పలురుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం మన ఆచార
సంప్రదాయాలు. 1963 ఉగాది "జ్యోతి" సంచికతో బాటు అనుబంధంగా జ్యోతి
పన్చాంగం పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చారు. ఆ పంచాంగాన్ని రచించింది, యం
బ్రహ్మశ్రీ శ్రీ మజ్జోక్కుల వినోదార్య సిద్ధాన్తి: అద్వితీయ పుత్రేణ వికటానందశాస్త్రిణా
ప్రణీతం అని చెప్పారు. ఈ పంచాంగం వెల ఓ జ్యోతి కాపీట !
కొన్ని మెచ్చు తునకలు:
యముడు పశుపాలకుడగుటవల్ల పాలు తక్కువ; తస్మాత్ నీళ్ళు ఎక్కువ.
రెండు కుంచముల వర్షము, కరువులో అధిక మాసము వచ్చును.
ఇలా వినోదమస్తు అంటూ సాగిపోతుంది. ఇందులో బల్లి పాటుకు ఫలితాలు
కూడా వున్నాయి. సాంపిలుగా ఒకటి చిత్తగించండి.
మన కాలు క్రింద పడినచో: అదే చస్తుంది.
జ్యోతిలో పఠాభిగారు తమ "పన్" చాంగమును కూడా చెప్పారు.
1. పనిపాటలన్న నాకయిష్టము
పాటలు వ్రాయుట నాపని
2. పూర్వకాలాల్లో మానహాని
ప్రాణహానికి కారణభూతం.
ఈనాడు ప్రాణహానికి హేతువు
విమానహాని.
3. చిన్మయానందం కొందరికి
జిన్ మయానందం అనేకులకు
4.బంగారాన్ని స్మగుల్చేసేది
చాలామంది హేమాహేమీలు
5 ఉద్యోగులలో రెండు రకాలవారున్నారు.
చేసేవారు కొందరు
కాజేసే వారు కొందరు.
<><><><><><><><>
ఇలా జోకులాడుతూ నవ్విస్తూ బాపు, రమణ, రావి కొండలరావు,ఆరుద్ర,
నండురి రామమోహనరావు, విఏకే.రంగారావులు ప్రతి నెలా ప్రతి పేజీ
ఓ జోకులాష్టమిలా పాఠకులకు అందించారు.
ఉష్ణోగ్రత ఉగాదినుంచి క్రమంక్రమంగా పెరుతుంది.ఆనాటి నుంచి ముఖ్యంగా
మామిడి చిగుళ్ళుతొడిగి కొత్త కాయలకాయడం మొదలవుతుంది.వేప చెట్లు
పూతపూస్తాయి.కొత్త చెరుకు గడలు వస్తాయి.కొత్త బెల్లం తయారవుతుంది.
వీటన్నిటితో తయారు చేసిన ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మంచిదని మన
పెద్దలు నిర్ణయించారు.ఇవన్నీ కలగలిపిన ఉగాది పచ్చడి తీపి చేదు, పులుపు
రుచులతో మనం ఆ ఏడదంతా ఎదుర్కొనే మంచి చెడ్దలనూ సూచిస్తుంది.
ఈ ఉగాది పేరు ఖరనామమైనా మీ ఇంటిల్లిపాదికీ శుభకరమవ్వాలని
కోరుకుంటూ...... చివరగా ఓ చిరు నవ్వు:
" అదేంటి అప్పారావ్? సుబ్బారావు అంత మంచి జోకేస్తే మెమంతా తెగ
నవ్వేం కదా! మరి నువ్వు నవ్వలేదేం?"
"వాడంటే నాకు వళ్ళు మంట. ఇంటికెళ్ళి నవ్వుకుంటా!"
<><><><><><><>
జ్యోతిలోని ఇవ్వన్నీ కాపీ రైటు చేయబడినవి. అనగా కాపీ చేయుటకు మనకు
రైటు , అనగా హక్కు గలదు. ఇది ముళ్లపూడి వెంకటరమణగారి చమత్కారం!!

3 comments:

  1. మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    - శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

    ReplyDelete
  2. రమణ గారి రచనల్లో....

    సీగాన పెసూనాంబ తీపి
    బుడుగ్గాడి అల్లరి పులుపు
    మేస్టారి ప్రైవేటు వగరు
    బామ్మ తిట్లు ఖారం
    బాబాయి లవ్వు ఉప్పన

    (ఏంటీ చేదు గురించి వెతుకుతున్నారా? మన మధ్య రమణ గారు లేకపోవడం జీర్ణించుకోలేని "చేదే" కదండీ :( )

    ReplyDelete
  3. శంకర్ గారు, మీరు చెప్పింది నూరుపాళ్ళ నిజం. కనీసం నెలకు రెండు సార్లయినా
    ఆయన ఫోనులో మాట్లాడే వారు. ఆయన లేనిని లోటు ఎలా పూరించగలం? ఆయన
    మాటల మాజిక్కులను అనుక్షణం తలచుకుంటుంటే రమణగారు మన మధ్యనే
    ఉంటారు!

    ReplyDelete