Monday, April 11, 2011

రాజమండ్రి నవ్వుల రాజు మా అప్పలరాజు!!





ఎవరీ అప్పలరాజనుకుంటున్నారా? ఇంకెవరండీ, బాపురమణల "అందాలరాముడు"
లో అల్లు రామలింగయ్యగారిని "తీతా, తీతా" అంటూ అల్లరి పెట్టే అప్పుల అప్పారావు,
రాజబాబు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. సినిమాల్లోకి వచ్చాక
రాజబాబుగా పేరెట్టేసుకొని టాప్ కమేడియన్ గా ఎదిగిపోయి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో
చోటు సంపాదించేసుకొన్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బుతో డబ్బు చేసుకోకుండా
మా రాజమండ్రి సమీపంలోని కోరుకొండలో జూనియర్ కాలేజీ స్థాపనకు భూరి విరాళాన్ని
అంద జేశాడు. ఇప్పుడక్కడ ఆయన పేర రాజబాబు జూనియర్ కాలేజీ వుంది. రాజమండ్రి
లోని పారిశుద్ధశ్రామికుల కోసం గృహాలు నిర్మించాడు.ఇంకా ఎన్నెన్నో గుప్త దానాలు
చేసిన ఈ మంచి నవ్వులరాజు 75 వ పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ "మా" అద్యక్షులు
శ్రీ మురళీమోహన్ కృషితో ఈ నెల 9 తేదీ రాజబాబు విగ్రహాన్ని గోదవరి ఒడ్డునగల గౌతమీ
నందనవనంలో శ్రి దాసరి నారాయణ్రావుగారి చేత అవిష్కరించబడింది. ఆరోజు సాయంత్రం
ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్సులో "హాస్యస్వర్ణోత్సవం" పేరిట 75 మంది తెలుగు చిత్రసీమ హాస్యనటీ
నటులకు సత్కారం జరిగింది. ఒకే చోట ఇంతమంది సినీహాస్య నటులు, నటీమణులు చేరి
తమ స్కిట్స్ తో అభిమానులను మూడు గంటల సేపు నవ్వులజల్లులలో తడిపారు.
అంతకు ముందు వరుణదేముడు తన స్నేహితుడు పవనుడితో సహా వచ్చి హడావిడీ
చేసి "ఇక మీరు నవ్వుల్లో తడవండి "అంటూ వెళ్ళాడు. మల్లికార్జున్, మనో "వేదంలా ఘోషించే
గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి" అన్న పాటను, సరదా సరదా సిగరెట్టు అనే
హాస్య గీతాన్ని ఖుషీ మురళి ,అంజనా సౌమ్య పాడగా , ప్రార్ధనా గీతాన్నిగోపికాపూర్ణిమ
భక్తిరసంగా ఆలపించారు." చినుకు చినుకు అందెలతో చిటపటమని" అంటూ ఆశాసైనీతో
శ్రీ బాబూ మోహన్ నాట్యం చేసి అబిమానులని ఆశ్చర్యంతో ముంచారు. శ్రీ ఏవీయస్ సభను
ఆద్యంతం నవ్వులతొ తన ప్రతిభను జోడించి నిర్వహించారు.
చివరగా ఇంతటి హాస్యోత్సవాన్ని భారీగా ఏర్పాటు చేసిన శ్రీ మురళీ మోహన్ గారిని
మా "హాసం క్లబ్" తరఫున నేనూ, మితృడు హనుమంతరావు మొమెన్టో, శాలువాతో
సత్కరించాము. ఈ కార్యక్రమాన్ని "మాటీవీ" వారు చిత్రీకరించారు కాబట్టి త్వరలో అందరూ
చూసే అవకాశం కలుగుతుంది.

1 comment: