Thursday, April 14, 2011

ఎడ్రెస్సులు లేని డ్రెస్సులు !!





ఆడైనా మొగైనా వాళ్ళు ధరించిన దుస్తులనుబట్టి ప్రాంతం,ఆచార వ్యవహారాలు
మొదలైన విషయాలు తెలిసేది. ఈకాలంలో వేసుకొంటున్న డ్రెస్సును బట్టి వాళ్ళ ఎడ్రెస్సు
(ప్రాంతం) తెలుసుకోవడం కష్టమే. మన అమ్మాయిలంతా కుమారి, శ్రీమతులు కూడా
పంజాబీ డ్రెస్సులేవేసుకుంటున్నారు. లంగాలూ,ఓణీలూ ఎప్పుడో మర్చి పోయారు.కానీ
పంజాబీ అమ్మాయిలు మాత్రం వాళ్ళ పంజాబీ డ్రెస్సునే వేసుకుంటారు. మరో విశేష
మేమిటంటె వాటిపై వేసుకొనే మాచింగ్ చున్నీలను గొంతు మీద వేసుకోవడం ఓ ఫాషన్!
మళ్ళీ అదెందుకు దండగ, చెప్పండి. ఆ చున్నీ కొనకపోతే హాయిగా డబ్బులు కలసి
వస్తాయి కదూ?! అలాటి డ్రెస్సే ఇప్పుడు అబ్బాయిలూ వేసుకోవడం లేటెస్ట్ ఫాషన్. కానీ
అబ్బాయిలు మాత్రం చున్నీ( ఇంకేదైనా పేరుందేమో) పూర్తిగా ఉత్తరీయం లాగ వేసు
కుంటున్నారు. రోజురోజుకూ ఫాషన్లు మారిపోతున్నాయి. మా చిన్నతనంలో బుష్కోట్లు
ఫాషన్. అదే తరువాత పాంటుతో కలిపి సఫారీలు అంటూ వచ్చాయి.కొంతకాలం బెల్
బాటమ్ పాంట్లు వచ్చాయి. బాగా పూర్వం పాంట్లకు చివర ఫోల్డింగ్ వుండెది. మొగవాళ్లకు,
ఆడవాళ్ళను డ్రెస్సును బట్టి గుర్తుపట్టడం ఈ రోజుల్లో కష్టం.అమ్మాయిలు జుట్టు కట్ చేసు
కొని షర్టులు, జీన్స్ పాంట్లు వేసుకుంటున్నారు. అలా టప్పుడు వెనకనుంచి ఆడో, మొగో
ఎలా చెప్తాం చెప్పండి. ముళ్లపూడివారి బుడుగు రెండు జడలమ్మాయిల గురించి ఇలా
అంటాడు."ఈ జడలమ్మాయీ అంతే. రెండుజడలు కదూ. ఓటి ముందుకీ ఓటి వెనక్కీ
వేసుకుంటుంది.అందుకని వొస్తుందో పోతుందో తెలీదుగదా దూరానికి" అంచేత వెనక
నుంచి చెప్పడం చాలా ఇబ్బందే!! పూర్వం ముస్లిమ్ సోదరులు లాంగ్ కోటూ, తలకు
ఎర్రని టోపీ పెట్టుకొనే వారు. కాని ఇప్పుడు అలా సాంప్రదాయ దుస్తులు ధరించేవారు
చాలా తక్కువ.కానీ ఈ స్పీడ్ యుగంలో లంగా ఓణీలూ, చీరలకన్నా ఈ పంజాబీ డ్రెస్సులే
నయమనిపిస్తుంది. బయటకు వెడితే స్త్రీలవి ఉరుకులూ పరుగుల జీవితాలే. వేగంగా
పరిగెట్టి బస్సో, లోకల్ రైలో ఎక్కాలంటే చీరలతో ఇబ్బంది. అలానే టూ వీలర్స్ పై వెళ్ళే
అమ్మాయిలకీ ఈ డ్రెస్సే సౌకర్యంగా వుంటుంది. కానీ గుళ్ళకో, పేరంటానికో వెళ్ళేటప్పుడు
మాత్రం వయసుకు తగ్గట్టు చీరో, పరికిణీ, ఓణీయో కట్టుకుంటేనే బాగుంటుంది..
లంగా ఓణీల్లోని ఈ అందాల బొమ్మాయిలు బాపు గారి నుంచి అప్పుతెచ్చేసు
కున్నాను.ఇంకా ఆయనకు తెలియదనుకోండి!!

No comments:

Post a Comment