Thursday, April 07, 2011

గొడుగుల గొడవ






ఈ రోజుల్లో రాజకీయనాయకులు పరిస్థితులను బట్టి ఏ ఎండకా గొడుగు పట్టే
వాళ్ళే ఎక్కువయ్యారు. ఎండలు మండి పోతున్నప్పుడు నీ గొడుగుల గొడవ
ఏవి టని కోప్పడకండి. గొడుగుకు ఎండైతే నేమి వానైతే నేమి. తల చుర్రుమంటే
కాస్త నీడనిచ్చేది పాపం ఆ గొడుగే కదండీ. ఇంగ్లీషులో గొడుగును అంబ్రెల్లా
అంటారు. ఈ నాటి కాన్వెంట్ పిల్లలకు అంబ్రెల్లా అంటేనే తెలుస్తుంది. లాటిన్ భాషలో
అంబెల్లా అంటే గుండ్రటి ఆకారంలోనున్న పువ్వు అని అర్ధం అంబ్రా అంటే నీడ
అని అర్ధం, ఇలా రెండు మాటలు చెట్టాపట్టాలేసుకొని అంబ్రెల్లా అయిందన్నమాట!
అసలు కొందరికి గొడుగు హస్తభూషణం. అంతెందుకు స్కూలు మాస్టారు వేషం
వెయ్యాలంటే ఓ నల్లకోటు, నెత్తినో తలపాగా, చంకనో గొడుగు ఉండాల్సిందే!
చూడుడు: "ప్రేమించి చూడు" చిత్రములో తెలుగు మాస్టారిగా శ్రీరావి కొండలరావు
పాత్ర.. ఇక గొడుగుకు పౌరాణిక కాలం నుంచి ప్రాముఖ్యం వుంది. దశావతారాలలో
వామనావతారంలో వామనుడు గొడుగేసుకునే వస్తాడు.భుజాన గొడుగుతో ముద్దొ
స్తుంటాడు బాపు గారి శ్రీ భాగవతం సీరియల్లో లాగ. కాని అది తాటాకు తో చేసిన
చత్రం అన్న మాట. దేముళ్ళకు గొడుగులుంటాయి. విష్ణుమూర్తికి ఆదిశేషుడు
నీడనిస్తూ పడగ పడుతాడు తను తల్పంగా మారుతూ. బాలకృష్ణున్ని గంపలో
పెట్టుకొని వసుదేవుడు వానలో నదిని దాటుతున్నప్పుడు ఆ ఆదిశేషుడు తన
పడగతో గొడుగు పట్టాడు. పెళ్ళిల్లల్లో వరుడు కాశీ యాత్రకు వెలుతున్నప్పుడు
గొడుగు వుండాల్సిందే.ఇప్పుడు ఎన్నెన్నో రకాల గొడుగులు.రంగురంగులివీ,
బటన్ నొక్కగానే తెరుచుకొనేవి, మడత పెట్టి హాండ్ బ్యాగుల్లో.పెట్టుకొనేవి,
హాండిల్లేకుండా తలకు తగిలించుకొనేవి, గుండ్రంగా కాకుండా నలుపలకలవి
ఎన్ని రకాలో! మొట్టమొదట గొడుగులను తయారుచేసే ఈ కళను గుర్తించినది
చైనావాళ్ళే..వెదురు, మల్బరీ కాగితంతో మొట్టమొదట చైనా వాళ్ళు తయారు
చేశారు. చైనా, జపాన్, ధాయిలాండ్ దేశాల్లో ఈ గొడుగుల తయారీ ఓ అందమైన
హస్తకళ. సర్కస్ లలో తీగ మీద నడిచే అమ్మాయిల చేతుల్లో ఈ రకం గొడుగులే
చూస్తాం. మహాభారత కాలం లో రధాలకు పైన గొడుగులు వుండేవి. అంబ్రెల్లాకు
పారాసాల్స్ అనే పేరు కూడా వుంది. లాటిన్ భాషలో సాల్ అంటే సూర్యుడు
అని అర్ధం. యూరొపియన్లు ఎండకు వాడే వాటిని పారాసాల్స్ అని, వానకు వాడే
వాటిని అంబ్రెల్లా లని పిలుస్తారట! సినిమాల్లో వానపాటలున్నట్లే గొడుగు పాటలూ
చూపించిన ఘనత రాజకపూర్ కు దక్కుతుంది."ప్యార్ హువా...ఇకరార్ హువా"
అన్న పాట విన్నప్పుడల్లా నర్గీస్, రాజ్ కపూర్ లే గుర్తొస్తారు. ధాయిలాండ్ లో ఏటా
గొడుగుల పండుగ జరుగు తుందట. అన్ని దేశాల్లో కన్నా ఇంగ్లాండులొనే గొడుగుల
వాడకం ఎక్కువట. బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో గొడుగు తెరిస్తే అపశకునంగా భావిస్తారట.
కుక్క గొడుగులని విపరితంగా పెరుగుతాయి. వాటినే ముష్రూమ్స్ అంటారు. వాటిలో
ఆహారంగా తినతగ్గవి కూడా వున్నాయి.వృక్షశాస్త్రంలో వీటిని లైఖెన్స్ గా విభజించారు.
గొడుగు ఆకారంలో వుండటంవల్ల గొడుగులనొచ్చుకాని ముందర "కుక్క" అన్న పదాన్ని
ఎందుకు చేర్చారో?! వివిధ గ్రూపుల వ్యక్తుల్ని ఒకే చోటకు చేర్చడాన్ని ఒకే గొడుగు క్రిందకు
తేవడమని అంటారు.గొడుగుల్లో ఆడగొడుగులు, మొగ గొడుగులూ వుంటాయి! బుల్లి
ఆడ పిల్ల గొడుగులు, బుడుగు గొడుగులూ వుంటాయి.
చివరగా గొడుగు మీద కురుస్తున్న రెండు జోకులు::
" ఒకే గొడుగులో ఐదుగురు కుర్రాలు వెడుతున్నారు. అందులో ఎవరు
తడుస్తారు?"
"ఎవ్వరూ తడవరు?"
"ఏం ?"
" అప్పుడు వాన కురవటంలేదు!"
<><><><><><>
"నీ గొడుగు పోయిందని నీకెప్పుడు తెలిసింది?"
"వాన వెలిసింది కదా గొడుగు మూద్దామని చూస్తే
చేతిలోగొడుగు లెదు!"
:) :)<><><><><><>:):):):)
UMBRELLA Shop కార్టూన్ 62 ఏళ్ళ నాటి బ్రిటిష్ వార పత్రిక TIT-BITS
లోనిది. బుడుగు తలకి గుండు వాడి గొడుగు తగిలితే వాడి బుర్రకి ప్రవేటు
చెప్పడానికి పాపం వాడు " అయ్యో బుడుగూ దెబ్బతగిలిందా" అంటూ బుడుగును
ఎత్తుకొని ముద్దులాడితే వాడి బుర్ర మీద ఓ జెల్లకాయ ఇచ్చుకొన్న బుడుగు
కధను రమణగారు అందంగా చెబితే మరింత అందంగా బాపు గారు బొమ్మ
గీశారు.ఈ బొమ్మ "బుడుగు" సౌజన్యంతో.

No comments:

Post a Comment