Sunday, April 10, 2011

నా ఆ పాత (ట) మధురాలు !!




కొత్తో వింత , పాతో రోత అంటారు మనవాళ్ళు ! కానీ అది తప్పని ఎన్నో విషయాల్లో
నిజమయింది. పాత పాటలు, పాత మనుషులు వాళ్ల మమతలూ, పాత సినిమాల్లో
నటులు, శ్రావ్యమైన వారి స్వరం, నాటి చిత్రాల్లోని పాటలూ, మాటలూ, హాస్యం, ఆనాటి
చిత్రకారులు ( ఉ: రవివర్మ) అన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఆ స్వర్ణయుగం ఎప్పటికీ నూతనమే!
రాతి రోట్లో చేసిన కందిపచ్చడి రుచి మిక్సీలో చేసిన పచ్చడితో ఏనాటికైనా సాటి వస్తుందా?
రాచ్చిప్పలో చేసిన పులుసు రుచి, బొగ్గుల కుంపటి పై మెల్లగా గోధుమరంగులో కాగిన పాల
రుచి ఓ సారి గుర్తు చేసుకోండి. లేక పొతే అమ్మనో, అమ్మమ్మనో ఓ సారి అడిగి చూడండి.
ఇలా ఎన్నేన్నో!
అప్పటి మనుషుల ఆప్యాయత ఇప్పుడు చూడగలుగుతున్నామా? అంతా కుత్రిమం!
ఎదుటపడినప్పుడు ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు లేక పొతే మనల్ని ఎప్పుడూ చూడనట్లు
నటిస్తారు. నాకు ఈ మధ్యనే అలాటి అనుభవమే ఎదురయింది! ఓ హాస్య పత్రిక సంపాదకుడు
నా కార్టూన్లు వేసుకున్నడు, తన పత్రికలోస్వయంగావచ్చి నా పరిచయం వేశాడు. ఈ మధ్య
రాజమండ్రిలో ఓ ఆధ్యాత్మిక సభలో అగుపిస్తే నే పలకరిస్తే నన్నెప్పుడూ చూడనట్టు తెలియనట్టు
ప్రవర్తించాడు. అదే బాపురమణగార్లను మొట్టమొదటిసారిగా 2005లో నేను కలసినప్పుడు
వారితో ఎంతో కాలం నుంచి పరిచయం వున్నట్లు మాట్లాడారు!
. రమణగారైతే నెలకు రెండు సార్లయినా తప్పక ఫోను చేసేవారు!!
. ఆ సంస్కారం ఇప్పటి వాళ్ళు కొందరికి మాత్రమేలేదు.
ఈ కొత్త తరం వాళ్ళంతా అలాటి వాళ్ళేఅనలేం. ఇంకా కొందరున్నారు. స్నేహానికి విలువ
నిచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు వేసవి సెలవులకు ఐఎల్టీడీ కంపెనీనీలో ఉన్నతోద్యోగం
చేస్తున్న మా మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బంగళాలో వున్న ఐస్ మిషన్
( మేమప్పుడు ప్రిజ్ ను అలానే పిలిచేవాళ్ళం.) కరెంటుతో కాకుండా ఓ చిన్న కిరసనాయిల్
దీపంతో పనిచేసేది. ప్ర్రిడ్జ్ అడుగున ఓ డ్రాయరు వుండేది.దాన్ని బయటకు లాగి అందులో
వున్న ఒత్తి దీపం వెలిగించి లోపలికి త్రోసేవారు. లోపల వున్న ఆ దీపం వెలుగు తున్నదీ
లేనిదీ అగుపించడానికి ముందు భాగంలో ఓ అద్దముండేది.అందులో ఆ దీపం ప్రతిబింబం
అగుపించేటట్లు ఏర్పాటు చేశారు. ఆ విషయం గుర్తుకొస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. మా పిల్లలకు
ఆ సంగతి చెబితే నమ్మేవారు కాదు. ఈనాడు పాటలు వినడానికి కాంపాక్ట్ డిస్కులూ ,అవీ
వచ్చాయికాని అంతకుముందు పెద్ద స్పూల్స్ ఉన్న టేప్ రికార్డుప్లేయర్లుండేవి. తరువాత
చిన్న కాసెట్ టేపులొచ్చాయి. వీటన్నిటికన్నా పూర్వం కరెంటుతో పనిలేకుండా కీ తో
తిరిగే గ్రామఫోనులు ( వీటి పై 78 RPM రికార్డులు ఒక వైపు ఒకపాట, రెండవ వైపు మరో
పాట వుండేవి) వుండేవి. చక్కని శబ్దంతో పాటలు వినిపిస్తుంటే అదో విచిత్రం! ఇప్పుడు
మా ఇంటికి వచ్చే పిల్లలకు ఆ గ్రామఫోను వినిపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. బాలన్నయ్య
బాలానందం రికార్డు "పొట్టిబావ-చిట్టి మరదలు" పాట ఆ గ్రామఫోనులో విని ఎంతో
ఆనందిస్తారు. ఆ గ్రామఫోనుల తరువాత ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్లేయర్సు వచ్చాయి. ఇందులో
దాదాపు ఓ అరడజను పైగా పాటలను ( LP RECORDS) స్టీరియోలో వినవచ్చు.
టైపు రైటర్సు పోయి ఇప్పుడు అంతా కంప్యూటర్సు ద్వారానె టైపు చేసుకుంటున్నాం.
అంతకు ముందు వీధికి ఒకటైనా టైపు నేర్పే ఇన్సి స్టీట్యూట్ లు వుండేవి! ఇక సినిమాలు
తెలుపు నలుపు నుంచి రంగులు, సినిమాస్కోప్, 70 ఏమ్మేమ్ము, 3 D, DTS ఇలా
ఎన్నెన్నో మార్పులు. ఫిల్మ్ కెమేరాలు పోయి డిజిటల్ కెమేరాలోచ్చాయి సెల్ ఫోనులొచ్చాయి.
ఐనా లాండ్ ఫోను లో మాట్లాడుతున్న హాయి నాకు ఆ సెల్ఫోనులో కనిపించదు.
మార్పు మనకు అవసరమే కానీ ఆ నాటి పాత వస్తువులనూ మనం మర్చిపోకూడదు.
మన ముందు తరం వాళ్ళకి గతం గురించి కూడా గుర్తు చేయాలిసిన భాధ్యత మన మీద
కూడా వున్నదని నేను నమ్ముతాను.అందుకే ఆనాటి గుర్తుగా ఇంకా కొన్ని వస్తువులు
నా దగ్గర పదిలంగా, పనిచేస్తూనే వున్నాయి!.ఇక్కడ మీరు చూస్తున్న ఆస్ట్రిచ్ (నిప్పుకోడి
బొమ్మ) నిజానికి ఒక సిరాబుడ్డి. ఆ బొమ్మ రెక్క పైకి తీస్తే సిరాపోసుకోడానికి గిన్నెలాటిది
ఉంది. కలం పెట్టుకోడానికి క్రింద చిన్న స్టాండు కూడావుంది.

No comments:

Post a Comment