Sunday, September 05, 2010

అలెగ్జాండర్ డ్యుమా రచన కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో





నవలాకారుడుగా ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ డ్యుమా ఫ్రాన్స్ లో
1802 జూలై 24వ తేదిన జన్మించాడు. ఈయన తండ్రి, తాతలు
సైన్యంలో జీవితాన్ని గడిపారు. డ్యూమా 1870 డిసెంబరు 5వ
తేదిన స్వర్గస్తుడయ్యాడు.కొద్దిపాటి చదువు మాత్రమే చదివిన
డ్యూమా ఒక న్యాయవాది కార్యాలయంలో గుమాస్తాగా పని
చేశాడు. నాటక రచన ప్రారంభించి కొద్దికాలం లోనే విశేషమైన
ఖ్యాతి సంపాదించాడు.విక్టర్ హ్యూగో, విన్నేల మితృడయ్యాడు.
రాజవంశీయుడైన ఆర్లియన్స్ రాజు సహాయంతో రాజభవనం
లో లైబ్రేరియన్ ఉద్యోగాన్ని పొందాడు.అప్పటినుంచే కధారచన
మొదలు పెట్టాడు. అగస్టీ మాకెట్ తో కలసి "మస్కటీర్స్" నవల
రచించాడు. ఫియరెంటోనో, మాకెట్ల సహాయంతో" కౌంట్ ఆఫ్ మాంట్
క్రిస్టో" నవల రచించాడు.డ్యూమా కల్పనాశక్తికి ఈ నవల ఓ తార్కాణం.
ఈ నవలను 1950 లో ఆంధ్రసచిత్ర వార పత్రికలో అనువదించి
సీరియల్ గా ప్రచురించారు. ఈ నవలను సూరంపూడి సీతారామ్
గారు అద్భుతంగా అనువందించారు. ఆ రోజుల్లొ ఆంధ్ర వార పత్రిక
ప్రఖ్యాత ఆంగ్ల రచయితల నవలలను తెలుగులో అనువాదం చేసి
ప్రచురించేవారు. మా అమ్మగారు చదివింది ఐదో తరగతి ఐనా ఈ
అనువాదాల ద్వారా మార్కట్వైన్, విక్టర్ హ్యూగో లాంటి ప్రముఖ
రచనలన్నీ చదవగలిగే అవకాశం ఆవిడకు కలిగింది. ఆంధ్ర పత్రిక
ప్రచురణ సంస్ద "ఆంధ్ర గ్రంధ మాల" ద్వారా ఈ నవలలను పుస్తక
రూపంలో పాఠకులకు అందించారు. "కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో"
నవల రెండు భాగాలుగా ఒక్కొక్క భాగం దాదాపు 380 పేజీలతో
1951 లో వెలువడింది. మా అమ్మగారు సితాలక్ష్మి అని చేసిన
సంతకంతో ఆ పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర పదిలంగా వున్నాయి!!
ఆ నవల ఇలా ప్రారంభమవుతుంది...

" 1815వ సంవత్సరం, ఫిబ్రవరి 24, ’ఫరావో- నౌక మార్సేల్స్
రేవు ప్రవేశిస్తున్నది. నోటర్ డామ్ గోపుర శిఖరం అనుమతి
సంకేతమిచ్చింది.నౌక స్మిర్నా,ట్రియస్ట్, నేపుల్స్ నగరాలు
చూసుకొని వస్తున్నది"
దీనికి మాతృక ఇంగ్లీషులో ఇలా వుంటుంది.
On the 24th of February, 1815, the lookout of
Notre-Dame de la Garde signalled the three-master,
the Pharaon, from Smyrna, Trieste, and Naples.
తెలుగులో శ్రీ సూరంపూడి సీతారాం గారు ఎంత చక్కగా
అనువందించారో చూడండి !!కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో నవల బొమ్మల
కధల (COMICS) గా రంగుల్లో క్లాసిక్స్ ఇల్లస్ట్రేటెడ్ ప్రచురించారు.

1 comment:

  1. నేను బహుశా ఎనిమిదో తరగతిలో ఉండగా మీరు చెబుతున్న తెలుగు అనువాదం - అట్టలూ, కొన్ని పేజీలూ చిరిగిపోయినది, రెండు భాగాలుగా ఉన్నది, అప్పటికే చాలా పాతబడిపోయిన కాగితాలతో ఉన్నది - చదివాను. అంతే ఆ కథతో ప్రేమలో పడిపోయాను.
    అప్పణ్ణించీ కనీసం ఆంగ్లంలో కనీసం అరడజను వర్షన్లు చదివి ఉంటాను.
    One of the best novels of all time.

    ReplyDelete