Wednesday, September 01, 2010

కెమిస్టులు, డ్రగ్గిస్టులు , పెగ్గిస్టులు



డ్రగ్గిస్టులు,పెగ్గిస్టులు,రంగిస్టులు
.మన టీవీ న్యూస్ చానళ్ళకు ఓ సెన్సేషనల్ వార్త దొరికిందంటె
ఇక మన ఖర్మకాలిందన్నమాటే !.మరో కొంప ముంచే వార్త
( అదేనండి, వానలో, వరదలో, వాగులో) బయట పడే వరకూ
మరో రెండ్రోజులు ఆ వార్తనే కిందకూ పైకీ ఎడాపేడా చూపించేస్తూ
వాయించేస్తారు. ఈ మధ్యే మన సినిమాలోకంలో డ్రగ్గిస్టుల కధ
బయట పడింది. ఇదేదో సినిమా వాళ్ళొక్కరే చేస్తున్నట్లు ఒకటె
ప్రచారం. ఐనా ఇప్పుడు డ్రగ్గు అన్న మాటకు మా చెడ్డ పేరొచ్చింది
కాని, మా చిన్నప్పుడు మేం చదువుకొనే రోజుల్లో ప్రతి మందుల
( అదేనండీ నిఝం మందుల షాపే) షాపు బోర్డు మీద వాళ్ళ పేరుతో
బాటు కింద కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అని వ్రాసి వుండేది! ఇప్పుడేమో
ఇంగ్లీష్ మందుల షాపు అని వుంటుంది. ఓ మితృడు సరదాగా
జోకేశాడు. " ఇదేమిటి? వాళ్ళకు తెలుగురాదేమిటి, పాపం మరి
ఇంగ్లీషు రాని వాడేట్లా కొనుక్కుంటాడూ" అని. "అందుకేగా డాక్టర్లు
మందుల చీటీలు ఇంగ్లీషులో వ్రాస్తారు" అని మరొ ఆయన జవాబు!
ఇంకో గమ్మత్తు గమనించారా?! డాక్టర్ గారి చీటీ మీద పైన "ఉ.మ.
సా.రా" అని కూడా వుంటుంది. మందు(ల) చీటీ కాబట్టి "ఉమసారా"
అని వుంటుందని మరొకరు చమత్కరించారు. సరే ఇక ఈ డ్రగ్గుల
కెమిస్టుల దగ్గరకు వెళదాం.ఐనా డ్రగ్గిస్టులెవరూ (బాగా డబ్బు చేసిన
వాళ్ళె కదా) డబ్బులెక్కువై ప్లబ్బిగ్గా పబ్బులకెళ్ళి డ్రగ్గులు ఎంజాయి
చేస్తున్నారు. అసలు ఈ డ్రగ్గులు దేశంలోకి తెస్తున్న వాళ్లను ఏర్పోర్టు
ల దగ్గరే పట్టుకుంటె ఈ గొడవలే వుండవుకదా? ఇప్పుడు ప్లబ్లి గ్గా
ఏ పని చేయడానికైనా ఎవరూ సిగ్గుపడటం లే! అంతెందుకు మా చిన్న
తనంలో ( అదిగో సియస్సార్ అదేదో పాత సినిమాలో " ఆ రోజుల్లో మేం
కాలేజీలో చదివే ..." అన్నడయలాగు గుర్తొస్తొంది కదూ) తలకు వేసు
కొనే రంగు కొనుక్కోవాలంటెనే సందేహించేవారు. ఎక్కడో ఎవ్వరో
రంగు వేసుకొన్న వాళ్ళు అరుదుగా అగుపించేవారు. ఇప్పుడో ప్రతి
వాడూ తల మాసినవాడే! మా స్టేట్ బ్యాంకులో రాయుడుగారని
మంచి పెర్సనాలిటి ( పెద్ద మీసాలతో) గల ఆఫీసరు ( ఆయనా రిటైర్
అయ్యారు) సరదాగా మాట్లాడే వారు." ఏమండీ,చాలా మంది కలరు
వేస్తున్నారు, మీరూ వెయ్యొచ్చుకదా" అంటే, "తలకు రంగేస్తే బస్సుల్లో
అమ్మాయిల సీట్లప్రక్క ఖాలీ వున్నా కూర్చొనివ్వరు, అదే తెల్ల జుట్టుంటే
వాళ్ళే ధైర్యంగా పిలిచి సీటిస్తారు" అనే వారు. ఐనా ఎంత రంగు వేస్తే
మాత్రం మన ముఖారవిందం చూస్తే తెలియదా? జుట్టు నెరసిన వాళ్ళని
చూస్తే ఓ రకమైన పెద్దరికం కనిపిస్తుంది. కాని మానవ నైజమో, బల
హీనతో తెలియదు కాని, ఇంట్లో మనవలూ, మనవరాల్లూ వున్నా,
బయటివాళ్ళు "తాత గారూ", అని పిలిస్తే ఏ(అ) దోలా వుంటుంది!
సరే ఇప్పటికే చాలాకాలాతీతమైంది.ముగించే ముందు ఓ మంచి
ముళ్లపూడి వెంకట రమణగారి జోకు చిత్తగించండి.
తొంభైయేళ్ళ లక్షాధికారికి తొమ్మిదో మనువుమీద మనసయింది.
కంటికి నదరైన బాల వితంతువు కనబడింది.పురోహితుడిని పిలి
పించాడు.
" యాజులుగారూ! ఆ పిల్లని చేసుకొంటె బావుణ్ణనిపిస్తుందండీ.
వయసు కాస్త తగ్గించి ఏభైయేళ్ళని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా?"
అన్నాడు.
"అయ్యా! మీరు లక్షాధిపతులు గనుక తప్పక ఒప్పుకుంటుంది.
ఇహ వయస్సంటారా?తగ్గించి చెప్పడంకన్న,ఉన్న తొంభైకీ ఇంకో
నాలుగు కలిపి చెబితే మంచిది.వెంటనే ఒప్పేసుకొని రెపే ముహూర్తం
పెట్టమంటుంది"
మరోమాటండోయ్! డాక్టర్ల చీటీమీద వుండే ఉ.మ.సా.రా అంటే అర్ధం
తెలుసుగా! ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం,రాత్రి నాలుగు పూటలా
మందేసుకోవాలన్నమాట! సరైన డోసు పడకబోతే డబ్బు వదులుతుంది
కాని, జబ్బు వదలదు కదా !ఇంటిఇల్లాలు పుట్టింటికి, బాటిల్లు నట్టింటికి
చేరుతున్న ఈ కార్టూను బాపు గారిది!

1 comment:

  1. పొద్దునే ఉప్మా-పెసరట్టులాంటి టిఫిన్ పెట్టారు. దానిలో కార్టూన్ జీడిపప్పు లాంటిదైతే ... జోక్ అల్లం చెట్నీ లాంటిది. బాగుంది

    ReplyDelete