Thursday, September 23, 2010

సాక్షి


కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు
1913 లొ కొంతకాలం అటుతరువాత 1920 లో
"సాక్షి" పేరిట వ్యాసాలను "ఆంధ్రపత్రిక" సారస్వ
తానుబంధంలో ప్రతి వారం ప్రచురించేవారు.
అవన్నీ సంపుటాల రూపం లో సుప్రసిద్ధ
ప్రచురుణ సంస్ఠ వావిళ్ల రామస్వామి శాస్త్రులు
వారి ద్వారా ప్రకటించబడ్డాక,, విజయవాడ,
అభినందన పబ్లిషర్స్ వారిచే 2006లో 265
పేజీలతో ఒకే వాల్యూమ్ గా బాపు గారు గీసిన
ముఖ చిత్రం తో వెలువడింది. ఆనాడు శ్రీ పానుగంటి
తమ "సాక్షి" వ్యాస పరంపరలో చెప్పిన వ్యంగ్య
భరితమైన విషయాలన్నీ ఈ నాటి కాలానికీ వర్తిస్తాయి!
ఆ కాలంలోనే తెలుగు మాట్లాడటానికి ఇష్ట పడని
వారిని ఆయన "సాక్షి" లో ఉతికి ఆరేసారు. ఆయన
ఏమన్నారో చూడండి.
"మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన
నున్నదా?...ఈతరాని కప్ప ఏ దేశమందైనా
నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ
చచ్చినదనుట కేమైనా సందేహమా? ఆంధ్ర
దేశమున బుట్టిన పక్షులైన నవవరతశ్రవణమున
నాంధ్రమున మాటలాడుచుండగా-అయ్యయో
మనుజుడే అంత మనుజుడే-ఆంధ్రమాతాపితలకు
బుట్టిన వాడే-ఆంధ్రదేశీయవాయు నీరాహార
పారణ మొనర్చినవాడే-అధమాధమాఱు
సంవత్సరముల యీడు వఱకైన ఆంధ్రమున
మాట లాడినవాడే-అట్టివా డాంగ్లేయ భాష
నభ్యసించినంత మాత్రమున నిప్పుడాంధ్రమున
మాటలాడ లేకుండునా-" అని:
"సాక్షి" లో "జంఘాల శాస్త్రి" అనే పాత్ర ద్వారా సంఘ
దురాచారాలమీద,అనాచారాలమీద,మూఢ విశ్వా
సాల మీద విమర్శలు చేయించారు.
కొంచెం గ్రాంధికంలో వున్న ఈ "సాక్షి" అద్భుత
వ్యాసాల్ని ఈ కాలం యువ పాఠకులకోసం ఇప్పటి
తెలుగు లో సంక్షీప్తకరించి ప్రచురిస్తే మరింత ప్రాచూర్యం
పొందుతుందని తలుస్తాను. ప్రతి పుస్తక ప్రియుడు
తప్పక తీసు"కొని" చదువ వలసిన మంచి పుస్తకం
ఈ "సాక్షి".

8 comments:

  1. చాలా అద్భుతమైన వ్యాసాలు. కాని ఇనప గుగ్గిళ్ళవంటి మాటలతో వ్రాసి సామాన్య పాఠకులకు దూరమయ్యాయి సాక్షి వ్యాస సంపుటులు. ఆ వ్యాసాలన్నిటిని ప్రస్తుత వాడుక తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురిస్తే, ఆ వ్యాసాల గొప్పతనం, ఈ నాటి సమాజానికి కూడ అన్వయించ తగ్గ నిజాలను ఇప్పటి పాఠకు ఆస్వాదించగలుగుతారు. లేకపోతే, ప్రాచీన కావ్యాలలాగే, కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది. ఆ వ్యాసాలు వ్రాసిన చక్కటి శైలి చెడకుండా తెలుగులోకి తర్జుమా చెయ్యగల రచయితలు పూనుకుని ఆ పనిచేసిపెడితే, మన సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు.

    ReplyDelete
  2. సాక్షి వ్యాసాలలోని ఆకర్షణ అందులోని గ్రాంథికశైలే. అవి సామాన్యపాఠకుల నుద్దేశించి వ్రాసినవి కావు కనుక సమస్య లేదు.

    ReplyDelete
  3. చౌదరిగారూ, నమస్తే.

    సామాన్య పాఠకులు, పండిత పాఠకులు అని విడగొట్టి, కంకర్రాళ్ళ లాంటి పదప్రయోగాలు చేసి వ్రాశారు కాబట్టే అలనాటి మన తెలుగు సాహిత్యంలో ఎక్కువ భాగం "పండితులకు" మాత్రమే పరిమితమయ్యింది. సమాజంలో ఉన్న రక రకాల జాడ్యాలను ఎత్తి చూపిస్తూ వ్రాసిన పానుగంటివారి వ్యాసాలు అద్భుతం. ఈ జాడ్యాలన్ని కూడ గ్రాంధికం అర్ధమయ్యేవారిలోనే ఉన్నాయని, అందుకనే పానుగంటివారు అటువంటి భాషలో వ్రాశారని మీ అభిప్రయామా. ఎందుకు అంటే, మీ వ్యాఖ్యలో . , "....."సామాన్యపాఠకుల నుద్దేశించి వ్రాసినవి కావు కనుక సమస్య లేదు....." అని వ్రాశారు. అందుకనేనా సామాన్యులకు తెలియకపోయినా సమస్యలేదు అంటున్నారు. బాగున్నది. మీతో ఏకీభవిస్తాను.

    వ్రాసినది అందరికీ తెలియాలండీ, ఏదొ మోడరన్ ఆర్ట్ లాగ చేసి, ఇది అర్ధం కానివాళ్ళకు కళా దృష్టిలేదు అనుకుంటే అవి ఎక్కడికి పోతాయో మనకు తెలియనిది కాదు.

    ReplyDelete
  4. నాకు చెప్పండి. ఫర్వాలేదు. నేనేకీభవిస్తా. కానీ కీర్తిశేషులైన పానుగంటిగారికి చెప్పడం సాధ్యమా ? ఆయన ఎట్టి పరిస్థితుల్లోను వ్యావహారికవాది కాదు.

    అర్థం కావడంలో కూడా స్టేజిలూ, దశలూ మెట్లూ ఉన్నాయి. అందులో రకాలున్నాయి. ఆ రకాలలో భాష స్థాయి, భావస్థాయి, పరిణతిస్థాయి, దేశ-కాల-సందర్భం, రచయిత యొక్క వక్తవ్యాంశం, ఉద్దిష్టశైలి మొదలైన అనేక Dimensions ఉన్నాయి. వీటిలో ఏది అర్థం కాకపోయినా రచయిత మనకు అర్థం కాడు, అటువంటప్పుడు కేవలం భాష ఒక్కటి చూపించి "ఇది అర్థం కాలేదు" అనడం సమంజసం కాదు. నేర్చుకున్నకొద్దీ అవగాహన పెరుగుతుంది. పాఠకుడు ఒక గ్రంథం ద్వారా తనభావస్థాయినే కాక భాషాస్థాయిని కూడా పెంచుకోవాలి. అది అతని బాధ్యత. నిజానికి రెండూ అవినాభావసంబంధం గలవి. అంతేతప్ప"ఇదే రాయి. ఇలాగే రాయి." అని పాఠకుడు రచయితని శాసించజాలడు. ఎందుకంటే అది రచయిత యొక్క creative freedom.

    అందుకే అంటున్నాను, సాక్షి వ్యాసాలలోని అసలైన ఆకర్షణ అందులోని గ్రాంథికశైలే అని. ఎందుకంటే రచయిత ఏరికోరి ఆ శైలిలోనే వ్రాశారు గనుక. వాటిని ఆ శైలిలోనే చదవాలి. ఎందుకంటే అవి ఒరిజినల్ గా రూపుదిద్దుకున్న శైలి అదే గనుక. వాటిని వ్యావహారికంలోకి మార్చి చదువుకుంటే అలా మార్చినది ఒరిజినల్ రచయితగారి కంఠస్వరం అవుతుందా ? తన వ్యాసాలు చదవమని ఆయన ఎవరినీ బలవంతపెట్టలేదు కదా ?

    ReplyDelete
  5. చౌదరిగారూ. మీ స్పందనలో మీరు అన్న మాట "పాఠకుడు ఒక గ్రంథం ద్వారా తన భావస్థాయినే కాక భాషాస్థాయిని కూడా పెంచుకోవాలి. అది అతని బాధ్యత" ఈ మాటతో నెను ఏకీభవించలేను. మీరు చెప్పిన పని ఎంతమంది పాఠకులు చెయ్యగలరు. అందరు పాఠకులకీ ఈ ఓపిక/ఆసక్తి, చేతిలో సమయం, వాటికి తగినంత ధనం ఉండాలి కదా. నేను పానుగంటి వారిని ఏ మాత్రం విమర్శించటంలేదు, వారికి వీలైన భాషలో వారు అద్భుతమైన విషయాలు, చక్కటి శైలిలో వ్రాశారు. అవి ఈనాటి వారికి చేరకపోతే, రచయిత శ్రమ వృధానే కదా. నేను చెప్పేది ఒక్కటే, కాలక్రమేణా భాషలో అనేక మార్పులు వస్తాయి. అటువంటి పరిణామ క్రమంలో పూర్వపు భాష, ఇప్పటివారికి అర్ధం కాదు. ఇది మన ఒక్క తెలుగులోనే కాదు ఆంగ్లంతో కలిపి అన్ని భాషలలోనూ జరుగుతున్నదే.

    మన తెలుగులో, కవిత్రయం పూనుకుని మహా భారతాన్ని ఆంధ్రీకరించకపోతే ఎలా ఉండేది. ప్రతి వాళ్ళూ సంస్కృతమే నేర్చుకుని వ్యాసుల వారు వ్రాసింది వారి మనస్సుతో అర్ధం చేసుకొండి, లేకపోతే వదిలెయ్యండి, వ్యాసులవారికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని తిక్కన, నన్నయ్య, ఎర్రాప్రగడ గార్లు ఊరుకుని ఉంటే? విశ్వనాథ వారు రామాయణాన్ని కల్ప వృక్షంగా వ్రాయమని ఎవరు అడిగారు? ఆయనేమీ సాహిత్య ఎకాడమీ బహుమతి కోసం వ్రాయలేదు. అనేక చోట్ల ఎంతో ఉత్కృష్టమైన, సామాన్య జనానికి అర్ధంచేసుకోలేని విధంగా పడి ఉన్న సాహితీ ముత్యాలను, మనకోసం కష్టించి వారు తెనుగీకరించారు. సరే, ప్రస్తుతం వారి తెలుగు కూడ అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నాం మనం నేను చెప్పేది ఏమంటే, సమాజానికి ఉపయోగపడే విషయాలు ఉన్న సాహితీ రత్నాలను, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి కాని, అవి అంతే అలాగే చదువుకోవాలి, లేకపోతే లేదు అని పిడివాదం సరి కాదు. అటువంటి వాదం వల్ల ఆ సాహితీ రత్నాలు కాలక్రమేణా కనుమరుగవుతాయి.

    ఎన్నెన్నో అద్భుత గ్రంధాలను చక్కటి తెలుగులో అనువదించటం జరిగింది. అనువాద ప్రక్రియలో సత్తా ఉండాలేకాని, సాక్షి వ్యాసాలను సామాన్య ప్రజలకు అర్ధమయ్యేట్టుగా మారుస్తూనే, మీరు బాధ పడే కవిహృదయానికి, శైలికి చేటు కలగకుండా వ్రాయటానికి మనకెందరో సమర్ధులున్నారు. ఆ పని అటువంటి "సమర్ధుల" చేత చేయిస్తే, ఈ వ్యాసాలు ఇలా "మడి కట్టుకుని" చదువుకోనక్కరలేదు, ఎవరైనా సరే అర్ధం చేసుకుంటూ, రచయిత చెప్తున్న విషయాలు తమ జీవన పధ్ధతితో సరిచూసుకుని, అవసరమైన చోట మార్గ నిర్దేశనానికి వాడుకోవచ్చు. ఇది నా అభిప్రాయం.

    నా దగ్గర ఉన్న సాక్షి వ్యాస సంపుటిలో ప్రతి వ్యాసానికి మొదట శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు ఆ వ్యాసంలో రచయిత ఏమి చెప్పారో వివరించారు. అంటే ప్రకాశకులు కొంత ప్రయత్నం చేశారు. అటువంటి అవసరం ఉన్నది అని గుర్తించారు. ఇక్కడ, సాక్షి వ్యాస సంపుటిని ప్రచురిస్తూ, ప్రకాశకులు ముందుగా "మా మాట" లో వ్రాసిన విషయం అప్రస్తుతం కాదనుకుంటాను. చిత్తగించండి.

    ".....విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరస ప్రస్థానం ఉన్నా, ఈ నాటి పాఠకులకి ఈ 'సాక్షీ ని చేరువ చేయాలంటే, వ్యావహారిక భాషలో ప్రతి వ్యాసం సారాంశం ముందు 'టూకీగా' అందిస్తే బాగుంటుందని తోచింది....."

    నేను అనేది ఏమంటే, పూర్తి వ్యాసాలను సామాన్య మైన వాడుక భాషలో చెప్తే, సాక్షి వ్యాసాలు మళ్ళి బహుళ ప్రాచుర్యం పొందటమేకాదు, రచయిత చెప్పదలుచుకున్నది ప్రజలలోకి వెళ్ళి, పానుగంటి వారి ఆత్మ సంతోషిస్తుంది.

    ReplyDelete
  6. అభిషెక్ చౌదరి గారు, నేను వ్రాసినా, శ్రీ శివరామ ప్రసాద్ గారు
    చెప్పినా మా కోరిక శ్రీ పానుగంటి వారి "సాక్షి" ఈ కాలం పాఠకుల
    కందరకీ అర్ధమై ఆయన రచన ఇప్పటి యువతరానికీ అందుబాటులోకి
    రావాలనే. యాభైఏళ్ళ క్రితం ఆంధ్ర వారపత్రికలో ప్రశిద్ధ ఆంగ్ల రచయితల
    నవలన్నీ తెలుగులోకి అనువాదం చేసి ధారావాహికలుగా ప్రచురించే
    వారు. మా అమ్మగారు డ్యూమాస్ వ్రాసిన "కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో"
    నవలను అలానే చదువగలిగారు. హైస్కూల్ విద్య లేని మా అమ్మ
    ఆ నవల చదివే అవకాశం వచ్చిందంటే ఆ నవలను తెలుగులో
    అనువదించడమే. తెలుగులో రావటం వలన ఆనవల తెలుగు వారికీ
    పరిచయమయింది కదా! అసలు తెలుగే మరచి పోతున్న ఈ సమయంలో
    "సాక్షి" వ్యవహారిక భాషలో వస్తే అందరూ చదువగలుగుతారని మా భావన..

    ReplyDelete
  7. మీరు సాక్షివ్యాసాల్ని వ్యావహారికంలోకి మార్చగలిగితే మార్చండి. మార్చడానికి ప్రోత్సాహమివ్వండి. నేను అభ్యంతరపెట్టను. నేనూ వ్యావహారికంలోనే వ్రాస్తున్నాను. కానీ అలా మార్చినాక అవి ఎలా దర్శనమిస్తాయో మీరే ఊహించండి. Form and Content అని రెండున్నాయి. మీరు కంటెంట్ చాలంటున్నారు. కానీ Form కూడా చాలా అవసరం. కొన్ని భావాల్ని వచనంలో చెబితేనే మంచిది. మరికొన్నిటిని పద్యంలో చెబితేనే శోభ. అలాగే కొన్ని భావాలు వ్యావహారికంలో చెబితేనే బావుంటాయి. మఱికొన్నింటిని గ్రాంథికంలో చెబితేనే హత్తుకుంటాయి. "పచ్చివ్యావహారికం పచ్చిబూతుల్లాంటిది, అది అనవసరమైన గొడవలకు దారితీస్తుంది" అని తాడేపల్లిగారొకచోట వ్రాయగా చదివాను. అంటే రాసే భాషకూ, మాట్లాడే భాషకూ మధ్య ఉద్దేశపూర్వకంగా కాస్త వ్యత్యాసం పాటించాలని ఆయన అభిప్రాయం. నా సొంత పరిశీలన-అనుభవాల దృష్ట్యా ఆయన చెప్పినదానితో నేనేకీభవిస్తాను. వ్యావహారికంలో సూటి ఉంది. కానీ అదే సమయంలో మన దృష్టికి రాని మోటు ఎలిమెంట్ కూడా ఉన్నది. అందుచేత ఎంత శిష్టవ్యావహారికమైనా అది రచయితని హుందాతనం గల ఉన్నతస్థాయివ్యక్తిగా చూపించదు.

    ReplyDelete
  8. అష్ట్లాగుటండీ!

    ఎవరు అన్నారో, లేదో తెలియని, ఎంత మాత్రం ప్రామాణికం కాని వ్యాఖ్యను ఉదహరించి మీ "వాదనే" సరి అని మీకు మీరు నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నించకండి. మీరు చెప్పిన ఆ బూతు భాష గురించి, కొమర్రాజు లక్ష్మణరావుగారు అన్నారా, విశ్వనాథ సత్యనారాయణగారు అన్నారా, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు అన్నారా లేక గిడుగు రామ్మూర్తి పంతులు గారు అన్నారా. ఎక్కడో ఎవరో అన్న వ్యాఖ్య పట్టుకువచ్చి గొప్పగా చూపిస్తున్నారే.

    మనకు తట్టిన మంచి ఆలోచనలు మన తోటి మనుషులకు తెలియ చెప్పే మానసిక స్థితి, సౌహార్ద్రత్వం ఉండాలి, ఆపైన కఠినమైన భాషలో (వ్రాసినవారికి వారి కారణాలు వారికి ఉండవచ్చు) ఉన్న అద్భుత రచనలను సామాన్య భాషలోకి తర్జుమా చేయగల "సత్తా" ఉండాలి. మీరేమీ బాధపడకండి, మనకు అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారు, "సాక్షి" వ్యాసాలను చక్కటి తెలుగులో, అందరికీ అర్ధమయ్యే రీతిలో వ్రాయగల సత్తాతో అందరికీ పానుగంటి వారి మనోగతం అర్ధమయ్యేలాగ చేసి సమాజ ఉన్నతికి దోహదం చెయ్యగలరు. ఏమో ఎవరు చెప్పగలరు, పదవీ విరమణ తరువాత నాలాంటివారే ఆ బృహత్కార్యం చేస్తారేమో, అప్పుడు పాపం ఇతర సాహితీవేత్తలు "అరెరే మనం చేయకపోతిమే" అని బాధపడతారేమో

    స్వస్థి

    ReplyDelete