రమణగారు సిన్మాలకు మాటలు వ్రాసినా పాటలు వ్రాసినా ఆసిన్మాలకు
పత్రికలకు సమీక్షలు వ్రాసినా అంతా రమణీయమే ! వెండితెర నవల
తనే వ్రాసినా అందులోనూ ఘాటైన చమత్కార బాణాలు సంధించడంలో
రమణగారికి సాటి లేరు. "వెలుగు నీడలు’ సిన్మా నవల వ్రాస్తూ చిత్రం
క్లైమాక్సులో వచ్చే పోట్లాట అతికించి వున్నట్టుందని విమర్శించారు
రమణ గారు.
"తీరా పోలీసువాళ్ళొచ్చేసరికి వాళ్ళు అణచడానికి దొమ్మీ లేకపోతే
బాగుండదు. వాళ్ళు చిన్నబుచ్చుకోవచ్చు.అందుకని రావుబహదర్ గారి
"అనధికార సాయుధబలగం"లోని అసభ్యులు-గిట్టనివాళ్ళు వీళ్ళని గూండా
లంటారు-నెమ్మదిగా , గుట్టుగా వర్కర్లలో కలిసిపోయి ఒక పాత వర్కర్ని
కొట్టారు."
మన తెలుగు సినిమాల్లో చివరలోఇలా ఫైటింగులుండి అంతా అయ్యాక
పోలీసులు రావటాన్ని పై వాఖ్యాల్లో రమణగారు సున్నితంగా ఎత్తి చూపించారు.
ప్రేమించి చూడు సినిమాలో ఆయన వ్రాసిన బుచ్చబ్బాయ్ పనికావాలోయ్
పాటలో రమణగారి మాటల చమత్కారం అగుపిస్తుంది చక్కని తెలుగు నుడి
కారం "కాసె పోసి" అనే పదం వాడుతూ అంత్యప్రాసలతో రమణీయంగా సాగి
పోతుంది.
మేడమీద మేడకట్టి
కోట్లు కూడబెట్టినట్టి కామందూ
కమాన్-కమవుట్ రాముందూ....
ఆడపిల్ల మాట మీద
ఉద్యోగాలూడగొట్టు
ఆకతాయి కామందూ-
మీసకట్టు తీసివేసి
కాసెపోసి కోకచుట్టి
గాజులేసుకొమ్మందూ.
ఇలాగే "పక్కలో బల్లెం" జానపదచిత్రంలో ఓ పాటకు ఆయన
వాడిన పదాల అందాలు చూడండి :
చినదానా-
వలచినదానా" అంటూ తన మార్కును చూపించారు.
రమణగారు మాటలు వ్రాసిన మొదటి చిత్రం "దాగుడు మూతలు" ఐనా
ముందు విడుదలయింది, "రక్తసంభంధం"! దాగుడుమూతలు సినిమాలో
పద్మనాభం పాత్ర పేరు పాపాయి. ఉన్న కొద్ది తెలివితేటలు గయ్యాలి
తల్లి సూరమ్మ కేకలతో హరీ మని అతనికి బడి పుస్తకాల్లోని పాఠాల
భాషే ఒంట బట్టింది.ఆ పాపాయికి రమణగారు వ్రాసిన మాటలు :
"తాతయ్యలకు బోల్డు ఆస్తివుండును. దాన్ని వాళ్ళు మనుమలకు
ఇచ్చెదరు. అంతవరకు మనము అమ్మడిని పెళ్ళిచేసుకోరాదు అని
అమ్మ చెప్పును" ఈ ముద్దు మాటలతోనే ఆ పాత్రను పరిచయం
చేస్తారు రమణ.
ఈ సిన్మాలో సూర్యకాంతానికి జ్వరమొస్తుంది. ఈ హాస్య సన్ని
వేశానికి రమణ గారు వ్రాసిన మాటలు పక్కున నవ్విస్తాయి.
అమ్మడు ,పాపాయి కలసి సూరమ్మకి దర్మామీటరుతో జ్వరం
చూస్తూ. "అమ్మబాబోయ్. బెజవాడంత వచ్చేసింది".
సూరమ్మ: బెజవాడేమిటే ?
అమ్మడు: అవునత్తయ్యా 118 డిగ్రీలుంది !
సూరమ్మ: అమ్మో! అయిసు బాబోయ్ అయిసు, అయినా 118 డిగ్రీలుంటే
మనుషులు బ్రతుకుతారుటే ?!
అమ్మడు " ఆ ( ! బెజవాడలో మనుషులు బతకటం లేదా ?
( ఆ రోజుల్లో బెజవాడలో ఎండాకాలం మండిపోయేదట! బెజవాడను
BLAZE WADA అని చమత్కరించేవారు)
1957 లో ఆంజలీ వారి సువర్ణసుందరి చిత్రానికి రమణగారు వ్రాసిన
సమీక్ష ఎంత చమత్కారంగా వుందో చూడండి.:
"అంజలీపిక్చర్సు వారి "సువర్ణ సుందరి" చిత్రాన్ని బాక్సాఫీసు సూత్రాల
పెద్దబాలశిక్ష అనవచ్చు! అలా అని, ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఈ సూత్రాల
కూర్పులో దర్శక నిర్మాతలు చూపిన నేర్పును మెచ్చుకోనూ వచ్చు.ఎందు
కంటే మూడున్నర మైళ్ళు పొడుగున్న ఈ చిత్రగాధలో నడుస్తున్నప్పుడు
శ్రమ,విసుగు లేకుండా దారిలో బోలుడు మజిలీలున్నాయి. భారతీయ
నృత్యాలు, బొంబాయిడాన్సులు, తెలుగు పాటలు, హిందీగీత్ లు, హాస్యం,
దేశవాళీ రెడ్ ఇండియన్ కోయవాళ్ళూ, కొట్లాటలు, అట్టల బండలూ,వెదురు
బుట్ట కొండలూ, ఇ.వి.సరోజ వేషంలో పార్వతీదేవీ,ఇంకా సురలు,అసురులూ
ఇత్యాదయః"( బాపూరమణీయం పేరిట 1990 లో బాపురమణలు ప్రచురించిన
పుస్తకం నుంచి)
"బుద్ధిమంతుడు" సినిమాలో కులాలూ గోత్రాలు గురించి తన వాదనను ప్రతి
ఒక్కరికీ అర్ధమయేటట్లు వ్రాశారు.
మాధవయ్య తన తమ్ముడు గోపి,రాధను చేసుకోవడం కులాంతర వివాహం
అవుతుందని అనుకుంటే కృష్ణుని పాత్ర చేతే జవాబు చెప్పించారు. "నువ్వు చెయ్య
టంలే వర్ణసంకరం!నా నైవేద్యం కళ్ళకద్దుకొని తింటున్నావు. నేను క్షత్రియుల
యింట పుట్టానని, గోపాలకుల యింట పెరిగానని, యెరుగవా ? మరచిపోయావా?"
ఇలాటి రమణీయాలు ఎన్నో ఎన్నెన్నో! రా(తీ)సిన కొద్దీ అంతులేని మాణిక్యాల
వాక్యాలు దొరుకుతూనే వుంటాయి !
Wonderful, sir! Thank you very much.
ReplyDeletemadhuri.
ఫేస్ బుక్ లో చూసి నేను అనుకున్నది నిజమే సర్!ముర వెం ర అనే అనుకున్నాను.
ReplyDeleteమీ టపా కూడా రమణ గారి రచన అంత రసవత్తరంగా వుంది సర్ !