Monday, August 15, 2011

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి...........


మనకు స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లయింది. ఈ అరవై నాలుగేళ్ళల్లో ఎన్నెన్నో
సాధించాం. దేశం ప్రగతి వైపు వేగంగా సాగుతున్నది. కానీ విచారించదగ్గ
విషయం, అంతే వేగంగా అవినీతి , హత్యలు, ఘొరాలు, రోడ్డు ప్రమాదాలు
ఎక్కువయ్యాయి. కారణం ప్రతి ఒక్కరికీ ఫ్రీడం అన్ని విషయాలలోను సులువు
గా దొరకటమే! ఎంతమంది డ్రయివింగ్ లైసెన్సు సక్రమంగా తీసుకున్న వాళ్ళు
వున్నారు. రోడ్డు మీద ఎడమవైపు నుంచితమ బైకులతో క్రాస్ చేసే వాళ్ళల్లో ,
యువకులే కాదున్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాదులూ వుండటం
విచారించ వలసిన విషయం. అంతేకాదు ఈనాటి యువతరానికి సుభాష్
చంద్ర బోస్ ఎవరో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరో ఎంతమందికి తెలుసు.
ఈనాడు హైద్రాబాదు మాదంటే మాదని మన తెలుగు వాళ్ళం తగవులాడు
కుంటున్నాం కాని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహస నిర్ణయాన్ని తీసు
కొని వుండకపొతే హైద్రాబాదు పరిస్థితి ఎలా వుండేదో తలచుకోవడానికే భయం
వేస్తుంది. ఏవీ ఆ మహాను భావుల విగ్రహాలు మన తరానికి చూపించి చెప్ప
టానికి.? ఇప్పుడు ప్రతి అడగుడుగునా ఈనాటి స్వార్ధపరుల విగ్రహాలే!


50 ఏళ్ళ క్రితం అన్నపూర్ణావారి "వెలుగు నీడలు" చిత్రానికి శ్రీశ్రీ వ్రాసిన గీతం
వింటుంటే అప్పటికి ఇప్పటికీ ఏమీ మార్పు లేదనిపిస్తుంది.
పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయ గీతికా II
నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం II
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా ;
కలసి సాగవోయి ప్రగతిదారులా !
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు
అలముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదురించవోయి ఈ పరిస్థితి.
పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే!
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే !
స్వార్ధ మీ అనర్ధదాయకం !
అది చంపుకొనుటె క్షేమదాయకం !
నవ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం !
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం !
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే -----
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం !
అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు !!



అరవైఏళ్ల క్రితం రాజమండ్రి గోదావరి గట్టు శ్రర్ధానంద ఘాట్ లో బోస్ విగ్రహం,.వరదలో
మునిగినప్పుడు, అప్పటి నా కోడక్ బాక్స్ కమెరాతో నే తీసిన ఫొటో.!
స్వాతంత్ర్యోద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో విదేశీ వస్తు బహిష్కరణ
దేశమంతా సాగుతున్నది. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ఓ నాయకుడు
విదేశీ సిగరెట్లు తాగుతుంటే అది గమనించిన ఓ మితృడు " ఏమిటీ పని ?"
అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. " నేను చేస్తున్నదీ అదేగా ! విదేశీ సిగరెట్లను
కసిదీరా కాల్చి పారేస్తున్నాను" అని నవ్వుతూ జవాబిచ్చాడు.

1 comment:

  1. సర్దార్ పటేల్ అంటే అమీషా పటేల్ బంధువేమో అనుకునే రోజులివి మాస్టారూ. ఇక బోస్ అంటారా అడగకపోవడమే మేలు. గాంధీ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గుర్తొచ్చే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. జైహింద్.

    ReplyDelete