Saturday, August 13, 2011

చల్ చల్ గుర్రం ! చలాకి గుర్రం !!


నాకు చిన్ననాటి నుంచి జంతువులన్నిటిలోకీ గుర్రమంటే చాలా ఇష్టం!
మా చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలన్నా, మరో చోటికి వెళ్ళాలన్నా
ఒంటెద్దు బళ్ళు ,గుర్రపు బళ్ళూ వుండేవి. గుర్రపు బళ్ళను జట్కాలనే
వారు. ఒంటెద్దుబండి కంటే జట్కా క్లాసన్నమాట! మా రాజమండ్రి
నుంచి ధవళేశ్వరం వెళ్ళటాన్కి జట్కాలే వుండేవి. నాకు బాగా గుర్తు
బండి ముందు నుంచొని ధవిళేశ్వర, ధవిళేశ్వర అంటూ అరుస్తుండే
వాళ్ళు బండి తోలే వాళ్ళు. వెనుక బరువెక్కవై బండి ముందు తేలు
తుంటే ముందుకు జరగమనే వాడు. జట్కా చక్రంలో చమ్కీ కర్ర పెడితే
వచ్చే ఓ విధమైన సౌండు వింతగా వుండేది. ఆదో రకమైన హారన్ అన్న
మాట. ముళ్ళపూడి వారి బుడుగుకు అలా జట్కా తోలడం భలే సరదా!
ఈకాలంలో కార్లున్నట్టే ఆ రోజుల్లో కొందరికి స్వంత గుర్రపు బండ్లుండేవి.
ఆ జట్కాలోపల మెత్తని పరుపు ఆనుకోడానికి అటూఇటూ మెత్తని
దిండ్లూవుండేవి.ఉండవిల్లి కోటేశ్వరరావుగారనే మా నాన్నగారి స్నేహితుడు
తన స్వంత బండిలో వచ్చేవారు. మనుషులు లాగే రిక్షాలు, అటు తరువాత
సైకిల్ రిక్షాలు వచ్చి బండ్లకు డిమాండు తగ్గింది.

గుర్రపు పందేలు, గుర్రాలతో ఆడే పోలో , ఇలా చాలా జూదాలు, క్రీడలూ
వున్నాయి. మా చిన్నతనంలో వచ్చిన "కీలుగుర్రం" సినిమా ఆ రోజుల్లో
చాలా పాప్యులర్ మూవీ. ఈ కాలం గ్రాఫిక్ యుగంపిల్లలకు గుర్రం ఎగరటం
వింతగా వుండకపోవచ్చుగాని మాకు మాత్రం అలా నాగేశ్వరరావు గుర్రం
మీద ఎగురుతుంటే భలే సరదాగా వింతగా వుండేది. మన సూర్య దేవుడి
రధానికి ఏడు గుర్రాలుంటాయని మన పౌరాణికాలు చెబుతాయి. అలానే
గుర్రం ముఖంతో వుండే తుంబురుడు మంచి గాయకుడు. ఇక హయగ్రీవ
అవతారం గురించి మీరు వినే వుంటారు. ఇక్కడ శ్రీబాపు గీసిన హయ
గ్రీవుని చిత్రం చూడండి. ఈ రోజు హయగ్రీవ జయంతి .స్కందపురాణంలో
ఇలా గుర్రపుతలతో వున్న విష్ణుమూర్తి గాధ మనం చదవుతాం.


గుర్రాలు మన ఫౌరాణిక, చారిత్రక కాలాల నుంచే ప్రశిద్ధి పొందాయి.
రామాయణకాలంలో సంతానం కోసం ఆశ్వమేధయాగం చేసినట్లు మనం
చదువుకున్నాం. అలానే మన చరిత్రలో చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్,
, వీర వనిత ఝాన్సీరాణి గుర్రాల మీదే యుద్ధాలు చేసి శత్రువు
లను చీల్చి చెండాడారు. రాణా ప్రతాప్ గుర్రం పెరే చేతక్. ఈ
పేరుమీదే బజాజ్ కంపెనీ "చేతక్" పేరిట స్కూటర్లను ప్రవేశపెట్టింది !!
ఉత్తరభారత దేశంలో పెళ్ళిళ్ళల్లో వరుడు గుర్రంమీదే ఊరేగుతాడు..

పాత గుర్రపు నాడా మనకు దారిలో దొరికితే దాన్ని గుమ్మానికి పెట్టుకుంటే
అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్ముతారు. కొందరు అమ్మాయిలు
అబ్బాయిలు రబ్బరు బాండుతో వేసుకొనే జడలని పోనీ టైల్స్ అంటారు.
ఇప్పుడు అంతగా కనిపించడం లేదు కాని చిన్న ప్పిల్లలున్న ఇళ్లల్లో ఊగే
చెక్క గుర్రాలుండేవి, ఇప్పటి రాకింగ్ చైర్లలాగ. అవిలేకపోతే పిల్లలు తాతల,
నాన్నల వీపుమీదెక్కి చల్ చల్ గుర్రం అంటూ ఇల్లంతా దేకించేవారు.
ఇప్పటిలా నడుము నొప్పులు లేవు కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని అలాఓపిగ్గా
ఆడించే వాళ్ళు. యంత్రాల శక్తిని హార్స్ పవర్ తో గుర్తిస్తారు ఇప్పటికీ
బొంబాయి లాంటి నగరాల్లో బీచ్ దగ్గర గుర్రపు బగ్గీలు అగుపిస్తాయి. కేదార్నాధ్
లాంటి యాత్రల్లో యాత్రికులను తీసుకువెళ్లడానికి గుర్రాలను ఉపయోగిస్తారు.
. 1953 లో చందమామ లో వచ్చిన "విచిత్రకవలలు" సీరియల్
కు శ్రీచిత్రా కందకం మీద నుంచి దూకుతున్న గుర్రాల చిత్రాలు ఎంత బాగా
వేశారో చూడండి. అరబ్బీ దేశం, రాజస్ఠానీ గుర్రాలు జాతి గుర్రాలుగా పేరుపొందాయి.
.


ఇక చివరగా ముళ్లపూడి వెంకటరమణగారి నవ్వితే నవ్వండి గుర్రం కధ::
రాజుగారు పరివారంతొ సహా అడవికి వేటకు బయల్దేరారు.చాలా
దూరం పోయాక వున్నట్టుండి ఆయన గుర్రానికి జబ్బు చేసి కూల
బడిపోయింది. ఆ దగ్గర్లో వున్న గ్రామంలో వాకబు చేయగా ఇద్దరు
పెద్దరైతులకి చెరో గుర్రం ఉన్నట్టు తెలిసింది. రాజుగారు వాళ్ళకి కబురు
చేయగా వాళ్ళు గుర్రాలతో సహా వచ్చారు. కాని, అవి వట్టి దండగమారి
గుర్రాలని, పరిగెత్తలేవనీ వాళ్ళు మనవి చేసుకున్నారు.
గుర్రాలివ్వటం ఇష్టం లేకనే వాళ్ళు సాకు చెబుతున్నారని రాజుగారు
గ్రహించారు..రెండుగుర్రాలకి పందెం పెట్టి ఏది బాగా పరుగెడితే అది తీసు
కుంటామన్నారు.
"లాభంలేదు ప్రభూ! వాళ్ళు గుర్రాల్ని సరిగా పరిగెత్తనివ్వరు"అన్నాడు
సేనాని రాజుగారి చెవిలో.
" మా బాగా పరిగెత్తనిస్తారు.ఒకళ్ళ గుర్రాన్ని మరొకళ్ళని ఎక్కమను"
అన్నాడు రాజు.
<<><><><><>>
అన్నట్టు ఇంకో గుర్రం మాటండోయ్ ! ప్రసిద్ధ కవి శ్రీ జషూవా గారి పూర్తి
పేరు తెలుసుగా! ఆయన పేరు శ్రీ గుర్రం జాషూవా. మన తెలుగులో
గుర్రాలపై నానుడులూ స్వారీ చేసాయి. అందులో కొన్ని..........
రౌతు కొద్దీ గుర్రం
గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదు
గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకు వెళ్ళగలమేగానీ తాగించగలమా?!!



5 comments:

  1. Waow ! చాలా బావుంది ఈ బ్లాగు గుర్రం.

    ReplyDelete
  2. చిన్నప్పటి జట్కా బండి ఎక్కించి జానపద (కీలుగుర్రం ), పౌరాణిక, చారిత్రిక, రేసు, చెక్క గుర్రాల మీదనుంచి ముళ్ళపూడి వారి బుడుగు,కథా గుర్రం మీదుగా జాషువా గారిని పలకరించి గుర్రం నానుడిలతో మమ్మల్ని గుర్రమెక్కించారు అప్పారావు గారూ ! ధన్యవాదాలు.

    ReplyDelete
  3. సుజాతగారు, రావుగారు, నా గుర్రం నచ్చినందుకు ధన్యవాదాలు! నిజంగా గుర్రమెక్కినంత ఆనందంగా వుంది.!

    ReplyDelete
  4. "జట్కా చక్రంలో చమ్కీ కర్ర పెడితే వచ్చే ఓ విధమైన సౌండు వింతగా వుండేది"
    నిజమేనండీ అదో రిథం తో ఉండేది ఆ సౌండ్.

    ఎక్కడా ఆగకుండా పంచకల్యాణిలా దౌడు తీయించారు పోస్ట్ ని. చాలా బావుంది.

    "రామాయణకాలంలో సంతానం కోసం ఆశ్వమేధయాగం చేసినట్లు మనం చదువుకున్నాం. "
    అన్నట్టో చిన్న అనుమానం రామాయణం లో సంతానం కోసం చేసింది పుత్రకామేష్టి అనుకుంటా కదండీ. ఈ అశ్వమేధ యాగం గురించి రామాయణంతో పాటు భారతం లో కూడా ప్రస్తావన ఉందనుకుంటా. బబ్రువాహన సినిమాలో చూసినట్టు గుర్తు. అది నిజంగా మూలంలో ఉందో కల్పితమో తెలియదు మరి.

    ReplyDelete
  5. దశరధుడు ఋశ్యశృంగుడికి నమస్కారము చేసి "మహత్మా,రఘువంశము పుత్ర పౌత్ర పారంపర్యము వర్ధిల్లేటందుకు
    నా చేత యజ్ఞకర్మను ఆరంభము చేయించవలెను.తాము ఋత్విజులుగా ఉండి సాంగ్రహణేష్టిని ఉపక్రమించ వలెను"
    అని ప్రార్ధించాడు. ఋశ్యశృంగుడు " అట్లాగేను.మీరు యజ్ఞోపకరణాలను అన్నిటినీ సమకూర్చుకొని ఉన్నట్లయితే
    గుర్రాన్ని వదలవచ్చును". అన్నాడు..... వాల్మీకి రామాయణము తెలుగు అనువాదం; శ్రీ శ్రీనివాస శిరోమణి.
    దీన్ని బట్టి పుత్రకామేష్టికి ముందుగా ఆశ్వమేధయాగము చేసినట్లు తెలుస్తున్నది.

    ReplyDelete